2020 పెద్ద గాయం చేసి వెళ్లి పోతూ ఉంది. ఈ గాయం 2021లో మానే అవకాశాల్లేవు. అంతేకాదు, మరిన్ని గాయాలవుతాయని, వచ్చేది (2021) హ్యాపీ న్యూయర్ కాదని, గడ్డుకాలమని, ముఖ్యంగా నెలజీత ఉద్యోగస్థులకు ఇంకా గడ్డకాలమని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.
సిఎంఐఇ, ఆర్ బిఐ చేసిన తాజా సర్వేలను ఉదహరిస్తూ, మధ్య తరగతి వాళ్లకు 2021 శుభవార్తలేవీ మోసుకోవరావడం లేదని చెబుతున్నారు.
ఈ సంవత్సరం మధ్య తరగతి జీవితాలమీద, అంతో ఇంతో ధనవంతులయిన మధ్య తరగతి వారి మీద కూడా బాగా దుష్ప్రభావం చూపింది.
2019 లో భారత దేశంలో సిఎంఎఇ (Centre for Monitoring Indian Economy) లెక్కల ప్రకారం 8.7 కోట్ల మంది అంటే దేశ జనాభాలో 22 శాతం మంది ఉద్యోగులు (Salaried people) ఉండేవారు.
2020 కోవిడ్ ప్రభావంతో వీరి సంఖ్య 6.8 కోట్లకు పడిపోయింది. అంటే గత ఏడెనిమిది నెలకాలంలో ప్రతి నూరు మంది ఉద్యోగులలో 21 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
కరోనా పాండెమిక్ మొదలయిన 2020 మార్చి నాటికి ఒరిజినల్ గానే పరిస్థితి బాగా లేదు. 2016 లో 100 మందికి ఉద్యోగాలుంటే 2020 మార్చినాటికి వారిలో ముగ్గురికి ఉద్యోగాలు పోయాయి.
తర్వాత కోవిడ్ వచ్చి చాలా దెబ్బతీసింది. కొందరికి ఉద్యోగాలు పోతే, మరికొందరికి జీతాలు తగ్గాయి. ఇంకొందరికి జీతాలు రెగ్యులర్ గా చెల్లించడం లేదు. దీనితో మధ్య తరగతి వాళ్లు తమ పొదుపు డబ్బులను జాగ్రత్తగా వాడుకోవడం మొదలుపెట్టారు. ఈ మేరకు ఆర్థిక కార్యకలాపాలు స్థంభించిపోయాయి.
ఉద్యోగులలో 68 శాతం మంది తాము ఎంతో కాలంగా జాగత్తగా పొదుపు చేసుకుంటూ వచ్చిన సొమ్ములను గత ఏడెనిమిది నెలలుగా ఖర్చు చేస్తూ వచ్చారు. వారి పొదుపు మొత్తాలు తరిగిపోతున్నాయి.
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) సర్వే ప్రకారం 63 శాతం మంది వినియోగదారు(Consumers)ల కుటుంబాదాయం పడిపోయింది. ఆర్ బిఐ సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతం ఈ ఏడాది ధరలు గత ఏడాది కంటే బాగాపెరిగాయని ఫిర్యాదు చేశారు.
సిఎం ఐ ఇ సర్వే ప్రకారం వినియోగదారులలో 25 నుంచి 30 శాతం మంది విలాస వస్తువులు కొనేందుకు సిద్దంగా ఉండేవారు. 2020 మే నాటికి వీరి సంఖ్య 1.25 శాతానికి పడిపోయింది. సెప్టెంబర్ లో పరిస్థితి కొంత మెరుగయి 7.4 శాతానికి చేరింది.
ఇపుడున్న దానికంటే వడ్డీ రేట్లను ఇంకా తగ్గించడం వీలుకాదని ఆర్ బిఐ స్పష్టం చేసింది. దీనివల్ల కార్పొరేట్ కంపెనీల మీద ఆర్థిక భారం పెరుగుతుంది. దీనిని తగ్గించుకునేందుకు మార్గం ఒక్కటే , మరిన్ని ఉద్యోగాలను కోసేయడం. అందువల్ల 2021 మధ్య తరగతి ప్రజలకు 2021 హ్యాపీ న్యూయర్ కాదని, గడ్డు సంవత్సరమేనని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
2021లో పెద్ద పెద్ద కరువులొస్తాయని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి సంస్థలు హెచ్చరించాయి.
“We are going to have famines of bibilical proportions in 2021” అని ఇప్పటికే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (World Food Program) అధినేత డేవిడ్ బీస్లే (David Beasley) చెప్పారు.
ఈ సారి నోబెల్ శాంతి బహుమతి ఈ సంస్థకే వచ్చింది.
2020 లోనే ఈ కరువు రావలసి ఉండింది. అయితే ప్రపంచ దేశాలన్నీ సకాలంలో స్పందించి వనరులను సమకూర్చడంతో దాని ప్రభావం కనిపించలేదు. కాని, 2021లో 2020 నాటి పరిస్థి తులు ఉండవు. దేశాలు అంతగా ఆర్థిక సాయం చేయలేకపోవచ్చు. అందువల్ల 2021 ఎదురుకానున్న పెను విషాదాన్ని తప్పించుకోలేమేమో నని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం 12 నెలలుండవచ్చు, 18 నెలల దాకానయినా ఉండవచ్చని ఆయన చెప్పారు.