బ్యాంకుల ముందర కాదు, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి

(అనగాని సత్యప్రసాద్, టిడిపి శాసన సభ్యుడు, రేపల్లె)
అక్రమ రుణాలు ఇవ్వలేదని వైసీపీ నేతలు బ్యాంకుల ముందు చెత్త వేయడం కాదు. బీసీ నాయకులు విగ్రహాలు లేకుండా చేస్తామన్న మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి. నివాసయోగ్యం కాని ఇళ్ల స్థలాలు ఇస్తున్న జగన్ రెడ్డి, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి. రాష్ట్రంలో బీసీలను జగన్ రెడ్డి ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ అవమానించేలా వ్యవహరిస్తోంది. బీసీలంటే లెక్కలేనితనంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. పదవుల్లో బీసీలకు ఒట్టి చేతులు చూపుతున్నారు. బీసీలకు అందే సంక్షేమ పథకాలకు కోత పెట్టారు.
స్వాతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న విగ్రహంపై మంత్రి సీదిరి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థలం వివాదంలో లేదని, ఆ స్థలం తనదేనని యజమాని పాపారావు ఒప్పుకున్నారు.
ఉన్నత చదువు చదివి అబద్ధాలు ఆడటానికి అప్పలరాజుకు సిగ్గుండాలి. లచ్చన్న విగ్రహానికి పాలాభిషేకం చేసిన వైసీపీ నాయకులు అప్పల రాజు వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు.? కులం బురదలో వైసీపీ నాయకులు కొట్టిమిట్టాడుతున్నారు.

 

 

దమ్ముంటే లచ్చన్న విగ్రహం మీద అప్పలరాజు చెయ్యి వెయ్యాలి. మంత్రి పదవి వచ్చాక కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. లచ్చన్న గురించి మీకు ఏం తెలుసు అప్పల రాజు? గౌతు లచ్చన్న అంటే దేశంలోనే పేరుగాంచిన వ్యక్తి.
కానీ శ్రీకాకుళంలో పుట్టిపెరిగిన మీకు ఆయన గొప్పతనం తెలియకపోవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను విచ్చల విడిగా అనుమతి లేకుండా రాష్ట్రంలో పెట్టారు. బీసీ వర్గాలకు చెందిన నాయకుల విగ్రహాలు రాష్ట్రంలో ఉండకూడదా? అప్పల రాజు వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించకపోవడం బీసీ వర్గాలను అవమానించడమే. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ఏదైనా అయితే క్షణాల మీద స్పందించే జగన్ రెడ్డి లచ్చన్న విగ్రహాన్ని మంత్రి తీసేస్తామంటే ఎందుకు మెదలడం లేదు?
రాగద్వేషాలు, భయం పక్షపాతాలు లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తాని రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని అటకెక్కించారు. ప్రతిపక్షాలను, ప్రజలను, గిట్టని వారిని రాచి రంపాన పెడుతుంది వాస్తవం. ఇచ్చిన హామీలన్నీ ఎలా పల్టీలు కొట్టాయో కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నా గొప్ప ప్రకటనలకు మాత్రం కొదవరానివ్వడం లేదు. నేరం చేయకపోయినా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. నేరం చేసినట్లు అన్ని సాక్ష్యాలున్నా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రం కేసులుండవు.
జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారమే దళితులు, మహిళలపై దాడులు గణనీయంగా పెరిగాయి. దళిత, బీసీ, మైనార్టీలపై దాడులు చేసినా, మహిళలపై దురాగతాలకు పాల్పడినా, శిరోముండనాలు చేసినా చర్యలుండవు. దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి దాపురించింది. ఇండియన్ ఫీనల్ కోడ్[ఐపిసి]ని వైసీపీ ఫీనల్ కోడ్ గా మార్చారు. రాజ్యాంగాన్ని, దానిపై చేసిన ప్రమాణాన్ని కాలరాశారు. ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులను రాష్ట్రంలో నుజ్జు నుజ్జు చేశారు.

(అనగాని సత్యప్రసాద్, టీడీపీ శాసన సభ్యులు,రేపల్లె  నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *