-రాఘవ శర్మ
తెలుగు మాట్లాడే తీరులో రాయలసీమకు ఒక ప్రత్యేక శైలి ఉన్నది. ఈ ప్రాంతపు పలుకుబడులు, జాతీయాలు , సామెతలు, పదబంధాలు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
భాష సామాజికం కనుక, సమాజంలో వచ్చే మార్పులను బట్టి భాషలో కూడా మార్పులు సంభవిస్తాయి. భాష సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది కనుక, సమాజంలో ఉన్న కుల, మత, ప్రాంత,లింగ అంతరాలు కూడా భాషావ్యవహారంలో ప్రతిబింబిస్తాయి.
ప్రజల వ్యవహారంలో ఒక భాషలోని పదాలలోను, ఉచ్ఛారణ లోను, వాటి అర్థాలలోను ఉన్న విలక్షణత, వైవిధ్యాన్ని మాండలికాలు అంటాం. మాట్లాడే తీరు యాస కూడా మాండలికంలో భాగమే.
రాయలసీమలో జాతీయాలు ప్రాంతీయ విలక్షణ కలిగి ఉన్నాయి. గుంటూరు జల్లాలో భట్టిప్రోలు పంచాయతీ అన్నట్టుగానే రాయలసీమలో ‘తాడిప్రతి పంచాయతీ’ అంటారు. ‘సంగటో కారమో’ ‘అబ్బగంటు పోయిందా’ ‘ దొంగల్దోలు ‘ ‘ గుప్పగొట్టు ‘ ‘ ఉడ్డ జేయు’ ‘అంజేరికనంలో కుంటోడు’ వంటి జాతీయాలు వాడుకలో ఉన్నాయి. దగ్గర, కాడ,తాన, అంచున అన్న పదాలను ఒకే అర్థంతో వాడుతున్నారు.
ఇక్కడి సామెతలు ప్రాంతీయ ప్రదర్శకాలుగా ఉన్నాయి. ‘గడార్లు గాలికి పోతుంటే ఏకులు నాగతేమన్నట్టు’ ‘పచ్చర బాము పసిబిడ్డా ఒకటే’ ‘పోతే నీ ఆవులు ఎవురు మేపుతారంటే, నా తిత్తిలో దుడ్డు మేపుతుంది అనిందిట’ ‘తిరపతిలో మా గుండోణ్ణి చూశావా అన్నట్టు’ ‘ సుఖం మరిగిన గోవిందమ్మ మొగుణ్ణి అమ్ముకుని తిన్నట్టు’ ‘నాకే లేదు నాకుడు బెల్లం, నీ క్యాడ తెచ్చేది గో కుడు బెల్లం’ తోపాటు, ‘బడే సాబ్ బండీ, అల్లీ సాబ్ ఎద్దులు ఎట్లపోతేనేమి?’ వంటి ముస్లిం పేర్లతో కూడా కొన్ని సామెతలు ఉన్నాయి.
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో భాష పైకి ఒకే లా కనిపించినా, సూక్ష్మంగా ఏ జిల్లా ప్రత్యేకత ఆ జిల్లాకు ఉంది.
జిల్లా అంతటా భాష, యాస ఒకేలా ఉండదు. మాండలికాలకు కచ్చితమైన సరిహద్దుల గీతలు గీయలేం.
పొరుగు భాషల ప్రభావం వల్ల కొన్ని కొత్త పదాలు వచ్చి స్థానిక మాండలికాలుగా నిలదొక్కుకున్నాయి. కర్నూలు జిల్లా ఒక నాటి నిజాం రాజ్యానికి సరిహద్దున ఉండడం వల్ల అక్కడి అధికార భాష ఉర్దూ ప్రభావంతో ఈ జిల్లాలోని మాండలికాలు ఒక ప్రత్యేక రూపును సంతరించుకున్నాయి.
అలాగే అనంతపురం జిల్లాకు పడమటి సరిహద్దున కర్నాటక రాష్ట్రం ఉండడం వల్ల కన్నడ భాషా ప్రభావంతో కొన్ని మాండలిక ప్రత్యేకతలు ఏర్పడ్డాయి. ఈ జిల్లాలో దున్నపోతును ‘ క్వా ణ’ అని, కొడవలిని ‘ కడుగో ల్’ అని, పిడుగును ‘ గుడుగు ‘ అని, అరటి పండును ‘బాళీ పండు ‘ అని , బొరుగుల తిరగమాతను ‘ఉగ్గాణి ‘ అని, గోంగూరను ‘తుండేపల్లి ‘ అని అంటారు. ఈ జల్లా మాండలికాల్లో కన్నడ పదాలు ఇలా చోటుచేసుకున్నాయి.
చిత్తూరు జల్లా 1911లో ఏర్పడే వరకు ఈ ప్రాంతం తమిళనాడులోని ఉత్తర ఆర్కాట్ జల్లాలో భాగంగా ఉం డేది. ఈ జల్లాకు పడమట వైపున ఒక మేరకు కర్నాటక సరిహద్దు, దక్షిణ, తూర్పున తమిళనాడు సరిహద్దు ఉన్నాయి. ఇక్కడి మాండలిక వ్యవస్థపై కన్నడ భాషా ప్రభావం కంటే, తమిళ భాషా ప్రభావం ఎక్కువగా ఉంది.
చిత్తూరు జిల్లాలో పునాదిని ‘కడగాల్ ‘ అంటారు. ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని ‘ వాయాడి ‘ అంటారు. అతిగా గారాలు పోతే ‘ పెగ్గెక్కువ ‘ అంటారు. కొబ్బరి బోండాంను ‘ ఎల్నీరు కాయ ‘ అంటారు. పోటుగాడు అనడానికి ‘ పుడింగి’ అంటారు. ‘ తాంబే లు ‘ ‘లచ్చిందేవి ‘ ‘ ఎదురుంగ ‘ ‘ఎలుంగొడ్డు ‘ వంటి మాండలిక పదాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి.
అనవసరంగా ఊళ్ళు తిరగడాన్ని ‘ఊళ్లు పొరుకుతున్నాడు ‘ అంటారు. వెళ్ళడాన్ని ‘ పూ డ్సి నాడు ‘ అంటారు. చెప్పుతో అనే బదులు ‘మెట్టుతో ‘ అంటారు. తమిళ భాషా ప్రభావంతోనే ఈ జల్లాలో ‘ దా ‘ అన్న పదం ఎక్కువగా వాడుకలో ఉంది. ‘ఇప్పుడుదా వచ్చినాను ‘ ‘ దేవుడు దా కాపాడాలి ‘ ‘ఎట్టదా బతుకుతారో’
కడప జిల్లాకు తూర్పున నెల్లూరు, పడమరన అనంతపురం, ఉ్తరాన ప్రకాశం, కర్నూలు, దక్షిణాన చిత్తూరు జిల్లాలు ఉండడం వల్ల ఈ జల్లాపై పరభాషా ప్రభావం అంతగా లేదు. కడప జిల్లా రాయలసీమకు మధ్యలో ఉంది. ఇక్కడి ధ్వనుల మార్పులో విలక్షణత ఉంది. కొన్ని ప్రాచీన పదాలు ఈ జల్లాలో ఇంకా బతికే ఉన్నాయి.
డబ్బిచ్చినావా అనడానికి ‘ లెక్కిచ్చినావా ‘ అంటారు. తమాషా చేయడాన్ని ‘ ఔలేయ్ ‘ అంటారు. చాలా దిగులు పెట్టుకున్నావా అనడానికి ‘ తొద పెట్టుకున్నావా ‘ అంటారు. వర్షాలు ఎక్కువగా పడితే ‘ జోము లెక్కినాయి ‘ అని, ‘జోములెక్కి పారుతున్నాయి ‘ అని అంటారు. ‘ఎద్దును చూస్తే ముద్దొస్తుంది. ఈడ్వడం చూస్తే ఏడుపొస్తుంది ‘ అన్న సామెతలు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. చెప్పుతో అనే పదానికి బదులు ‘ మెట్టుతో ‘ అని ఇక్కడ కూడా వాడతారు.
తెలుగు వాజ్ఞ్మయంలో మూడొంతులు రాయలసీమలోఉత్పన్నమైనవే అని 1932లో ప్రతిభ మాసపత్రిక ప్రారంభ సంచిక సంపాదకీయంలో రాశారు. ఈ పత్రిక సంపాదకవర్గ సభ్యులుగా గిడుగు రామ్మూర్తి పంతులు, పంచాగ్నుల ఆదినారాయణ శా స్త్రీ, తల్లా వఝ్ఝల శివశంకర శాస్త్రి, తెలకచర్ల వెంకటరత్నం ఉన్నారు.
‘ప్రాచీన గ్రంథాలలో మనం చదివేది రాయలసీమ భాషే. గ్రాంథిక భాషాపరిణామం ఎలా ఉందో తెలుసుకోవాలంటే రాయలసీమలోని వాడుక భాషను తెలుసుకోవాలి,’ అని కూడా ఆ సంపాదకీయంలో గుర్తు చేశారు.
సాహిత్యంలో మాండలికాలు వాడకం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. పదహారవ శతాబ్దంలోనే అన్నమయ్య, ఆయన సతీమణి తిమ్మక్క, అన్నమయ్య కుమారుడు పెదతిరుమలాచార్యులు, పజ్జెనిమిదవ శతాబ్దంలో వేమన ఆనాటి రాయలసీమ మాండలికాలను విరివిగా వాడారు.
రాయలసీమ మాండలికాలు ఈ ప్రాంతపు అస్తిత్వానికి ప్రతీకగా నిలిచాయి. ఇక్కడ కథ, నవల, నాటక సాహిత్యంలో కూడా మాండలికాల వాడకం బాగా పెరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ‘ పొలి ‘ అన్న కావ్యం చిత్తూరు జిల్లా మాండలికంలోనే రాశారు. ఇది వ్యవసాయానికి సంబంధించిన కావ్యం. కోగ్ర జయసీతారాం, సడ్డిపల్లి చిదంబర్ రెడ్డి వంటి వారు కూడా కవిత్వంలో మాండలికాలను వాడారు. పులికంటి కృష్ణా రెడ్డి తన గేయాలు, కవితల్లో మాండలికానికి పట్టం కట్టారు.
చిత్తూరు జిల్లాకు చెందిన తొలి తరం కథా రచయిత కె. సభా వ్యవసాయానికి సంబంధించిన మాండలికాలను వాడితే, మదురాంతకం రాజారాం అక్క డక్కడా కొన్ని మాండలికాలను వాడారు. పులికంటి కృష్ణా రెడ్డి తన కథల్లో, కవితల్లో, పాటల్లో నే కాకుండా నాలుగ్గాళ్ళ మండపం, సీమ చిన్నోడు వంటి శీర్షికలను కూడా ఈ జిల్లా మాండలికంలో రాశారు. నిజామాద్లో స్థిరపడిన ప్పటికీ కేశవ రెడ్డి తన రచనల్లో చిత్తూరు మాండలికాన్ని వదల లేదు. తిరుపతి సమీప గ్రామాల్లో ప్రజలు ఎలా మాట్లాడతారో, ఏం మాట్లాడతారో ఏ మాత్రం మార్చకుండా అలాగే రాయడం ద్వారా నామిని సుబ్రమణ్యం నాయుడు ఈ జిల్లా మాండలికాన్ని మరింత పరివ్యాపితం చేశారు. ఎండపల్లి భారతి కూడా ఈధోరణిలోనే మదనపల్లె ప్రాంతపు దళిత వాడలో వాడే మాండలికాల్ని ఉన్నది ఉన్నట్టు రాస్తున్నారు.
ఈ జిల్లాకే చెందిన తుమ్మల రామకృష్ణ, రాసాని, సుంకోజి దేవేంద్రాచారి, పలమనేరు బాలాజి వంటి వారి రచనల్లో మాండలికం గుబాళిస్తోంది. ఒక్క మదురాంతకం నరేంద్రమాత్రం మాండలికాల జోలికి పోకుండా ఆధునిక ప్రామాణిక భాషనే తన కథ, నవల సాహిత్యంలో వాడుతున్నారు.
కడప జిల్లాకు చెందిన సొదుం జయరాం, ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి, పి.రామకృష్ణా రెడ్డి, సన్నపు రెడ్డి వెంకట్రామరెడ్డి, శశిశ్రీ వంటి వారు ఆ జిల్లా మాండలికాన్ని తమ కథల్లో వాడారు. ఎం.వి. రమణా రెడ్డి ద్రౌపది నవలలో కడప జల్లా మాండలికాన్ని వాడారు.
కర్నూలు జిల్లాకు చెందిన సుభాషిణి,పినాకపాణి, నాగప్పగారి సుందరరాజు, అనంతపురానికి చెందిన సింగమనేని నారాయణ, బండి నారాయణ స్వామి, శాంతి నారాయణ, చిలుకూరి దేవపుత్ర తదితర కథారచయితలు ఇక్కడి మాండలికాన్ని విరివిగా వాడారు. వీరంతా రాయలసీమ మాండలికానికి సాహిత్య గౌరవన్ని కల్పించారు. కథ, నవల, నాటకాల్లో సంభాషణ ఉంటుంది కనుక పాత్రోచితంగా మాండలికాలు ఒదిగిపోతాయి.
కథకుల్లో చాలా మంది మాండలికంలోనే రాస్తున్నారు. కథన శైలి, పాత్రల శైలి మాండలికంలోనే ఉండడం వల్ల ఇతర ప్రాంత పాఠకులను పెద్దగా ఆకర్షించలేక పోతోంది. అంతా మాండలికంలోనే రాయాలన్న ఉద్దేశ్యంతో నాగరిక సమాజం ఒప్పుకోని దూషణలను కూడా ఉపయోగించడం ఆధునిక సంస్కారానికి విరుద్ధం. కొందరు రచయితలు మాత్రం ఆయా సామాజిక వర్గాల పదాలను, నుడికారాలను, పలుకుబడులను పాత్రోచితంగా రాస్తూ, కథనం మాత్రం ప్రామాణిక భాషలో రాయడం వల్ల ఇతర ప్రాంత పాఠకుల చేత చదివించగలుగుతోంది.
పత్రికలు జిల్లా ఎడిషన్లను ప్రారంభించినప్పుడు స్థానిక పలుకుబడులను ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగించిన దాఖలాలు లేవు. సినిమాలలో తొలి నుంచి మాండలికాలు వాడకం తక్కువ. ఒక వేళ వాడినా కోస్తా జిల్లా మాండలికాలనే వాడుతున్నారు. తెలంగాణా, రాయలసీ మండలికాలను దుష్టపాత్రలకు మాత్రమే వాడుతున్నారు.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఫలితంగా తెలంగాణా మాండలికాలను దుష్టపాత్రలకు వాడకం తగ్గినా, రాయలసీమ మాండలికాలను మాత్రం ఇప్పటికీ కమెడియన్లకు, విలన్లకు వాడుతూనే ఉన్నారు. సినిమా వారు వ్యవహరించే తీరు పట్ల ఇప్పుడిప్పుడే వ్యతిరేకత చాపకింద నీరులా మొదలైంది.
(రాఘవ శర్మ సీనియర జర్నలిస్టు, తిరుపతి)