టిఆర్ ఎస్ పాలన మీద బిజెపి సర్వే… మూడో దాడికి వ్యూహం

దక్షిణ భారతదేశంలో కర్నాటక తర్వాత తనుకు అనుకూలంగా ఉన్న రాష్ట్రమే తెలంగాణయే అని భారతీయ జనతా పార్టీ కేంద్రం నాయకత్వం గ్రహించింది. ఈ రాష్ట్రాన్ని మరొక కర్నాటక చేసేందుకు వ్యూహం రచిస్తూ ఉంది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం, జిహెచ్ ఎంసి స్థానిక ఎన్నికల్లో ఘనవిజయం లభించడంతో తెలంగాణ మీద బిజెపి ప్రత్యేక దృష్టి పెట్టింది.నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికలు రానున్నందున రాష్ట్రమంతా టిఆర్ ఎస్ పరిస్థితి ఎలా ఉందని కనుగొనేందుకు రహస్యంగా సర్వే మొదలుపెట్టింది. దీని  మీద సీనియర్ జర్నలిస్టు సంపత్   ప్రత్యేక కథనం.
( జి. సంపత్ కుమార్)
ఇటీవలికాలంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, బల్దియా ఎన్నికల్లో బలం పుంజుకోవడంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని చెప్పవచ్చు. ఈ మేరకు ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ బలాబలాలను అంచనా వేసేందుకు పరిశీలనా బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం.
నియోజక వర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఈ బృందాలను పంపించినట్లు తెలుస్తున్నది. పరిశీలన మొత్తంగా పది రకాలుగా విభజించి సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా సెలిసింది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో వున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వున్న అనుకూలత, వ్యతిరేకత ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు అమలవుతున్నాయా… ప్రజల వద్దకు చేరుతున్నాయా..వాటిపట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే వివరాలను సైతం సేకరిస్తున్నారు.
యువకుల అభిప్రాయాన్ని ఒక విధంగా, మహిళలు, వృద్దులు, కార్మిక వర్గాలు, అసంఘటిత రంగాలలో ఎలాంటి అబిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో కూడా సర్వేలో బాగంగా వున్నట్లు సమాచారం.
బిజేపి జాతీయ పార్టీ పంపించిన బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే ఈ సర్వే జరుగుతున్నట్లు తెలిస్తున్నది.

*టిఆర్ ఎస్  ప్రభుత్వ పనితీరుపై ప్రత్యేక పరిశీలన…
*కేంద్ర పధకాల అమలుపై సమాచార సేకరణ…
 *రేవంత్ రెడ్డికి పిసిసి ఇస్తే కాంగ్రెస్ మెరుగవుతుందా…
* టిడిపి తిదితర పార్టీల మనుగడ ఎంతమేరకు వుంది…
*ఒకే వోటు, ఒకే ఎన్నికపై ప్రజల్లో స్పందన….
* నియోజక వర్గాల్లో ప్రజా స్పందన ఎవరివైపు వుంది

అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలవుతున్నాయా… సర్వేలో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న పధకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదా…లేదా…కేంద్రం పంపించిన నిదులను ఎటువైపు మల్ళిస్తున్నారనే దానిపై కూడా సమగ్ర సర్వే చేస్తున్నారు.
ఇప్పటి వరకు కేంద్రం నిదులు ఏ మేరకు విడుదల చేసింది, తెలంగాణ ప్రభుత్వం ఎంతమేరకు ఖర్చు చేసిందన్న వివరాలను కూడా సేకరిస్తుండటం గమనార్హం.
కాగా నియోజక వర్గాల్లో పార్టీల బలాబలాలపై కూడా సర్వే చేస్తున్నారు. పార్టీల వారీగా ఎంత పర్సంటేజీ వుంటుందో కూడా అంచనా వేస్తున్నారు. టిఆర్ఎస్ అధికారంలో వున్నా కూడా గత ఎన్నికల పర్సంటేజీని పరిగణలోకి తీసుకోని ప్రస్తుతం ఏవిధంగా వుందో దానిపై సమగ్ర విశ్లేషణ చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
దానితో పాటు కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏవిదంగా వుంది, ఆ పార్టీకి ఏ మేరకు బలంవుంది…. ఒక వేళ పార్టీ పగ్గాలు ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి అప్పగిస్తే ఏవిధంగా వుంటుందోననే దానిపై కూడా సర్వే చెస్తున్నట్లు తెలిసింది.
పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ  (టిడిపి) ఉనికి, కమ్యూనిస్టుల ప్రభావంపై కూడా అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏవిధంగా వుందోననేదానిపై కూడా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. గతం కంటే మెరుగైన పరిస్థితులు నెలకొన్నాయా, రానున్న రోజుల్లో పార్టీ బలపడే అవకాశాలువున్నాయా,  ప్రజలతో మమేకమై తిరుగుతున్న నాయకులెవరు…. ప్రజలు రానున్న రోజుల్లో ఎవరివైపు మొగ్గుచూపుతున్నారు అనే వివరాలను సేకరిస్తున్నారు.
అదేవిదంగా దేశవ్యాపితంగా ఒకే ఎన్నిక విధానం ప్రవేశపెడితే ఎలావుంటుంది… ప్రజల్లో ఎలాంటి స్పందనవుంటుందోననే దానిపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. ఏదిఏమైనా పదిరకాలుగా సర్వేలు నిర్వహించిన అనంతరం..సర్వేలను బట్టి అంచనా వేసి… బిజేపి జాతీయ నాయకత్వం మరింత కార్యాచరణను రూపొందించుకొని పకడ్బందీగా రంగంలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వున్న రాష్ట్ర పార్టీలో వున్న నాయకుల పట్ల ప్రజల్లో వున్న స్పందనపై కూడా ఆరా తీయడం కొసమెరుపు.
(జి సంపత్ కుమార్,  సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *