ఢిల్లీ రైతు ఉద్యమానికి ఎపి రైతు నేతల మద్దతు

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక, కార్పోరేట్ – వ్యాపార – వాణిజ్య సంస్థలకు అనుకూలమైన, ఆహార భద్రతకు గొడ్డలి పెట్టుగా పరిణమించే మూడు నూతన వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతాంగం దేశ రాజధాని డిల్లీని ముట్టడించి, జాతీయ రహదారులను దిగ్భందన చేసి, మూడు వారాలుగా సంకల్పబలంతో ఉద్యమం సాగిస్తున్నారు. దీనికి మద్ధతుగా యంసిపిఐ(యు)  ఎ.ఐ.కె.ఎఫ్.లు సంయుక్తంగా విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించిన నిరసన దీక్షను ప్రారంభిస్తూ టి లక్ష్మినారాయణ చేసిన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు.
ఎముకలు కొరికే చలిలో లక్షాలాది మంది రైతులు దేశ రాజధాని డిల్లీ మహానగరాన్ని చుట్టుముట్టి, సింగూ, టిక్రీ సరిహద్దుల్లో 20 రోజులకుపైగా జాతీయ రహదారులను (నవంబరు 23 నుంచి) ఎందుకు దిగ్భందన చేశారో సమాజం మొత్తం ఆలోచించాలి, స్పందించాలి, చారిత్రాత్మకమైన రైతాంగ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవాలి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు ఉత్ఫత్తుల వ్యాపారం & వాణిజ్యం(ప్రోత్సాహం & సహకార) చట్టం -2020, ధరల హామీ & సాగు సేవలకు సంబంధించి వ్యవసాయదారుల(శక్తీకరణ & రక్షణ) ఒప్పందాల చట్టం-2020, నిత్యావసర వస్తువుల సవరణ చట్టం-2020, మూడు చట్టాలను కలిపి చూడాలి. అప్పుడే మొత్తం సమాజంపై పడే దుష్పలితాలను పసిగట్టవచ్చు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో జూన్ లో ఆర్డినెన్సులు జారీ చేసి, సెప్టంబరులో 15-20 మధ్యలో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లుకు ప్రవేశపెట్టి, ఆమోదించి, రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించుకొని చట్టాలుగా రూపొందించడం అత్యంత గర్హనీయం.
నూతన వ్యవసాయ చట్టాల్లో ఎలాంటి మార్పులు చేసే ప్రసక్తేలేదని ఖరాకండిగా మాట్లాడిన ప్రభుత్వం రైతాంగ ఉద్యమానికి జడిసి కొన్ని అంశాలకు సంబంధించి మార్పులకు సిద్ధమేనంటూ నేడు పల్లవి మార్చింది.
పంజాబ్, హర్యానా రైతుల మధ్య విభేదాలు సృష్టించడానికి సట్లేజ్ యమున లింక్ కెనాల్ ద్వారా హర్యానా రైతులకు నీళ్ళు అందడం లేదన్న వివాదాస్పద అంశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
వందలాది వ్యవసాయ ఉత్ఫత్తులలో కేవలం 23 ఉత్ఫత్తులకే కనీస మద్ధతు ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్నది. దాన్ని కూడా పనిముట్టుగా వాడుకొంటూ అత్యధిక రైతులకు యం.ఎస్.పి. వల్ల ప్రయోజనమే లేదని, అందుకే వారు ఉద్యమంలో పాల్గొనడంలేదని ప్రచారం చేస్తున్నారు.
2005 నుంచే ఎ.పి.యం.సి.లను బీహార్ లో తొలగించారు. ఆ రాష్ట్రంలో రైతులకు మేలు జరిగిందా, నష్టం జరిగిందో దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.
వందలాది వ్యవసాయ ఉత్ఫత్తులలో కేవలం 23 ఉత్ఫత్తులకే కదా ఎం.ఎస్.పి. వర్తింపజేస్తున్నారు? అంటే మిగిలిన ఉత్ఫత్తులు స్వేచ్ఛా మార్కెట్లోనే రైతులు అమ్ముకొంటున్నారు కదా! మరి నూతన చట్టాలు ఎందుకు?
ఇతర మార్కెట్లతో వ్యవసాయ మార్కెట్లను పోల్చి చూడకూడదు. ఇది ఆహార భద్రతతో ముడిపడిన అంశం. ప్రభుత్వ పాత్ర అనివార్యం. నూతన చట్టాలు వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి.
1990 దశకం నుండి ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక సంస్మరణల పర్యవసానంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. అప్పుల ఊబిలో కూరుకపోయి, అవమానభారం – మనోవేదనతో దేశ వ్యాపితంగా లక్షలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకొన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయి.
కనీస మద్ధతు ధరను చట్టబద్ధం చేయాలన్న డిమాండ్ రైతాంగం యొక్క ప్రాథమిక హక్కు. వ్యవసాయ ఖర్చులకు 50% మొత్తాన్ని అదనంగా కలిపి కనీస మద్ధతు ధరను నిర్ణయించాలని డా.స్వామినాధన్ కమీషన్ చేసిన సిఫార్సును అమలు చేయకపోగా కనీస మద్ధతు ధర అంశాన్నే నూతన వ్యవసాయ చట్టాల్లో ప్రస్తావించక పోవడం మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల వైఖరి బహిర్గతమయ్యింది.
ఒకే దేశం – ఒకే మార్కెట్, రైతు పండించే పంటలను దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చంటూ రైతాంగాన్ని దగా చేసే మాటలు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులే 86% పైగా ఉన్నారు. 70% పైగా కౌలురైతులున్నారు. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు 30% మంది రైతులకు మించి పంట రుణాలివ్వడం లేదు. కౌలు రైతులు భూ యజమానులు కాదు కాబట్టి రుణాలు తీసుకోవడానికి అనర్హులుగా పరిగణించబడుతున్నారు. బ్యాంకుల నుండి రుణాలు పొందలేకపోతున్న రైతులు వడ్డీ వ్యాపారస్తులు, ప్రయివేటు ఆర్థిక సంస్థల నుండి అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని జీవనాధారమైన వ్యవసాయం చేస్తున్నారు. పంట చేతికి రాగానే అమ్మి అప్పులు చెల్లించాల్సిన ఒత్తిడిలో ఉండే రైతులు తమ ఉత్ఫత్తులను దేశంలో ఎక్కడికైనా రవాణా చేసి లాభసాటి ధరలకు అమ్ముకోగలరా? గడచిన మూడు దశాబ్ధాల సంస్కరణల కాలంలో మార్కెట్ శక్తుల దోపిడీకి రైతులు బలైపోతూనే ఉన్నారు. వ్యవసాయ ఉత్ఫత్తులకు గిట్టుబాటు ధరలు కాదు కదా కడకు రవాణా ఖర్చులకు కూడా ఎదురు పెట్టాల్సి దుస్థితిలో రోడ్లపై పారబోసిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అలాగే పొలాల్లోనే వదిలి వేయడమో! లేదా! తగల పెట్టడమో చేసిన ఘటనలు జరిగాయి.
ఈ పూర్వరంగంలో నూతన వ్యవసాయ చట్టాల ద్వారా కనీస మద్ధతు ధరను నిర్ణయించే వ్యవస్థను, ప్రభుత్వ మార్కెట్ల వ్యవస్థను బలహీనపరిచి, కాంట్రాక్టు వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తూ, కార్పోరేట్ శక్తులు, వ్యాపార – వాణిజ్య సంస్థల కబంధ హస్తాల్లోకి రైతాంగాన్ని బలవంతంగా నెట్టివేసే అప్రజాస్వామిక విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి బరితెగించింది.
రైతులు, వ్యాపార – వాణిజ్య సంస్థలు, వ్యక్తుల మధ్య కుదుర్చుకొనే ఒప్పందాలను న్యాయ వ్యవస్థ పరిధి నుండి తప్పించి, కార్యనిర్వాహక వ్యవస్థలో భాగమైన సబ్ డివిజినల్ అధికారి, కలెక్టర్ల పరిధి లో వివాదాలను పరిష్కరించుకోవాలని నూతన చట్టాల్లో పొందుపరచడం అత్యంత గర్హనీయం.
నేడు అమలులో ఉన్న కనీస మద్ధతు ధరల స్థానే లాభసాటి ధరల నిర్ణాయక వ్యవస్థను నెలకొల్పాలి. అన్ని వ్యవసాయ ఉత్ఫత్తులకు లాభసాటి కనీస మద్ధతు ధరలను నిర్ణయించాలి, అమలు చేయాలి. ప్రభుత్వ జోక్యం, మద్ధతు అనివార్యం. అప్పుల ఊబిలో కూరుకపోయి ఉన్న రైతాంగాన్ని రుణ విముక్తులను చేసి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి రక్షించడానికి “ఒన్ టైమ్ సెటిల్మెంట్” చేయాలి.
డిల్లీ, ముంబాయ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, రెండు తెలుగు రాష్టాలలో రైతాంగ ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించబడ్డాయి.
రైతాంగ వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించుకొని, లోపభూయిష్టంగా ఉన్న నేటి ప్రభుత్వ రంగంలోని మార్కెట్ వ్యవస్థను ప్రక్షాళన చేసి, అవినీతిరహితంగా పటిష్టవంత చేయాలి. భారత ఆహార సంస్థ(ఎఫ్.సి.ఐ.)ని బలహీనపరిచే విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి చెప్పాలి. ప్రకృతి వైఫరీత్యాల నష్టాల బారి నుండి రైతాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలి.
T Lakshminarayana
(టి లక్ష్మినారాయణ సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *