పశు హృదయం తెలిసిన మా వూరి పశువుల డాక్టర్ కథ ఇది ( తిరుప‌తి జ్ఞాప‌కాలు-16)

(రాఘ‌వ శ‌ర్మ‌)
‘ రోగులు డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్ళ‌డం కాదు, డాక్ట‌ర్లే రోగుల వ‌ద్ద‌కు వెళ్ళాలి అని చాలా కాలం కిందట మనసున్న మంచి డాక్టర్ నార్మన్ బెతూన్ చెప్పాడు.
ఆ మాటలు ఆచ‌రించిన వైద్యుడు ఎవ‌రైనా ఉన్నారా? అని దుర్బిణీ వేసి వెతికినా ఎవ‌రూ క‌నిపించరు. మ‌నుషుల డాక్టర్ల మాట ఎలా ఉన్నా,మా వూరి  పశువుల డాక్టర్ సుబ్బ‌రాజు మాత్రం బెతూన్ ఆదర్శం పాటించారు.
రైతుల ఇళ్ళ‌కు వెళ్ళి మరీ ప‌శువుల‌కు వైద్యం చేసేవాడు! ఇది విన‌డానికి వింత‌గా ఉన్నా నేలంత నిజం.
అది 1980వ ద‌శ‌కం తొలి నాళ్ళు.
తిరుప‌తి శివార్ల‌లోని ఎగూరు (ఉల్లిప‌ట్టిడ), దిగూరు (ముత్యాల‌రెడ్డి ప‌ల్లె ) ల‌లో ప‌శు సంప‌ద‌ ఎక్కువ‌గా ఉండేది. మాకు కూడా ఆవులు, ఎనుములు ఉండేవి. పొద్దున్నే ప‌శువుల మంద మేత‌కు వెళుతుంటే, వీఐపీ లు వెళుతున్న‌ప్పుడు క‌నిపించే హ‌డావిడి లా అనిపించేది.
దుమ్ము రేపుకుంటూ, ప‌రుగులు తీస్తూ, ఒకదాన్ని ఒకటి కుమ్ముకుంటూ సాగిపోయేవి. చాలా సేప‌టి వ‌ర‌కు రోడ్లో వెళ్ళ‌గ‌లిగే వాళ్ళం కాదు. ఎనుములు ఎక్క‌డ కుమ్ముతాయోన‌ని కూడా భ‌య‌ప‌డి దూరంగా జ‌రిగే వాళ్ళం.
ముత్యాల‌రెడ్డి ప‌ల్లె పంచాయ‌తీ ఆఫీసు ఎదురుగా ప‌శువుల ఆస్పత్రి ఉండేది. ఆరోజుల్లో ప‌శువుల ఆస్ప‌త్రి అంటే ఒక చిన్న గ‌ది. ఆ గ‌ది నిండా మందులు, వైద్య ప‌రిక‌రాలతో పాటు ఒక రేకు కుర్చీ ఉండేది.ఆ గ‌దిలో కూర్చొడానికి చోటుండేది కాదు.
కుర్చీ బయట వేసుకుని కాసేపు కూర్చుందాం అంటే డాక్ట‌ర్‌కు కూర్చునే వ్య‌వ‌ధి ఉండేది కాదు. ఆవ‌ర‌ణ‌లో ప‌శువుల‌కు వైద్యం చేసే ట‌ప్పుడు వాటిని క‌ట్టేయ‌డానికి పైపుల‌తో చేసిన బోనులాంటిది ఉండేది.
తెల్ల‌వారితే చాలు ఆ ఆస్ప‌త్రి ముందు ప‌శువైద్యుడు సుబ్బ‌రాజు కోసం ఎన్నో ప‌శువులు ఎదురు చూస్తుండేవి. వ‌చ్చిన ప‌శువున‌ల్లా ఓపిగ్గా ప‌రీక్షించి వైద్యం చేసేవాడు.
‘ సామీ.. మా ఎనుము మేత మేయ‌డంలే. మా దూడ పార‌తా ఉంది. ఏమైందో ఏమో సామీ. పోతా పోతా అటు చూసిపో’ అని పొలానికి పోయే రైతు అంటే, సుబ్బ‌రాజు ఓపిగ్గా న‌వ్వుకుంటూ వాళ్ళింటికి వెళ్ళి చూసే వాడు.
కాంపౌండ‌ర్ చేత మందులు ఇచ్చి ఎట్లా వాడాలో చెప్పి పంపే వాడు. సుబ్బ‌రాజుకు ప‌శువులు అంటే చాలా ప్రేమ‌. రెండు పూట‌లా ఆస్ప త్రికి వ‌చ్చేవాడు. చాలా ఇష్టంగా వాటికి వైద్యం చేసేవాడు.
మిన‌ర‌ల్ మిక్చ‌ర్ వంటి స‌బ్సిడీకి ఇచ్చే దాణాల‌ను చాలా మంది లా అమ్ముకునే వాడు కాదు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఏమున్నా రైతుల‌ను పిలిచి మ‌రీ చెప్పేవాడు.
సుబ్బ‌రాజు చెప్ప‌బ‌ట్టే ఒక సారి సుబాబుల్ న‌ర్స‌రీని నేనే పెంచి ఇచ్చాను.ఒక సారి ఒక‌ పెద్ద క‌డ‌వ‌కు మొలాసిస్ ఇచ్చాడు.
సారా త‌యారీకి ఉప‌యోగించే మొలాసిస్ ఎందుకిచ్చార‌ని ఆశ్చ‌ర్య పోతున్నారు క‌దూ! మ‌నం అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ప‌చ్చ‌డి మెతుకులైనా స‌రే క‌మ్మ‌గా మ‌రో ముద్ద ఎక్కువ లాగించేస్తాం.
అలాగే మా ప‌శువుల‌కు కూడా ఎండు గ‌డ్డిపైనో, చెరుకు పిప్పి పైనో మొలాసిప్‌ను నెయ్యి లాగా చ‌ల్లితే ఆవురావురు మంటూ తినేసేవి.
నెల రోజుల‌కే అవి నిగ నిగ‌లాడుతూ వ‌చ్చాయి. పాల దిగుబ‌డి పెరిగింది. వెన్న శాత‌మూ పెరిగింది. రాయ‌ల‌సీమ వంటి ప్రాంతాల్లో ప‌శువుల‌కు ప‌చ్చిమేత ఒక స‌మ‌స్య‌.
ప‌చ్చిమేత కు ప్ర‌త్యామ్నాయంగా ఎండుగ‌డ్డి పైనో, చెరుకు పిప్పి పైనో మొలాసిస్ వేసి, దానికి మిన‌ర‌ల్ మిక్చ‌ర్ క‌లిపితే ప‌శువులు ఎలా ఉంటాయ‌ని ప‌శు పోషణలో ఒక ప‌రిశోధ‌న జ‌రిగింది.
ఈ ప‌రిశోధ‌న‌కు చిత్తూరు జిల్లాను ఎంపిక చేశారు. సంక‌ర జాతి ఆవుల పెంప‌కంలో దేశంలోనే ఈ జిల్లా మొద‌టి స్థానంలో ఉంది.
అందుకే ఈ జిల్లాను ఎంపిక చేశారు. చెర‌కు ఫ్యాక్ట‌రీల నుంచి సేక‌రించిన మొలాసిస్‌ను ప‌శువైద్యుల ద్వారా పాడి రైతుల‌కు నెల నెలా అందించారు.
ప‌శువుల డాక్ట‌ర్‌ స్వ‌యంగా గోడౌన్ కు వెళ్ళి మొలాసిస్‌ను తెచ్చి రైతుల‌కు ఇవ్వాలి. రాను పోను చార్జీలు కూడా స‌రిగా ఇచ్చేవారు కాదు. సొంత ఖ‌ర్చులు పెట్టుకుని వెళ్ళి మొలాసిస్ తేవాల్సిన తీట ఎవ‌రికి ప‌ట్టింది ? ఒక్క సుబ్బరాజుకు తప్ప!
‘ ఇస్తిన‌మ్మా వాయ‌నం అంటే పుచ్చుకుంటిన‌మ్మా వాయ‌నం’
ఇచ్చిన‌ట్టు లెక్క‌లు రాసుకునే వారు. తీసుకున్న‌ట్టు ప‌శువైద్యులు సంత‌కాలు చేసేవారు.
జిల్లాకు వ‌చ్చిన మొలాసిస్ అంతా ఒక కాంగ్రెస్ నాయ‌కుడి డెయిరీ ఫాంకు త‌ర‌లి వెళ్లేది. సుబ్బ‌రాజు పుణ్య‌మాని మా ప్రాంతంలో మాత్రం పాడి రైతుల‌కు కొన్ని నెల‌ల పాటు మొలాసిస్ అందింది. త‌రువాత మొలాసిస్ ఇవ్వ‌డం ఆగిపోయింది. చెరుకు ఫ్యాక్టరీ లలో వచ్చే మోలాసిస్ అంతా ఇలా పశువులకు పెట్టేస్తే మా గతేం కాను అనుకున్నారేమో సారా వ్యాపారులు !
మొలాసిస్ చ‌ల్లితే ప‌శువులు ఎండు గ‌డ్డి తిన‌డం లేద‌ని తేల్చారు.మొలాసిస్ ప్ర‌యోగం విఫ‌ల‌మైంద‌ని ప‌రిశోధ‌కులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు.
ఎలా విఫ‌ల‌మైంద‌నేది గ్రామా స్థాయిలో విచారించిన వారు లేరు. అసలు పాడి రైతులకు మొలాసి స్ అందుతోందా లేదా అని కనుక్కున్న నాథుడే లేడు!దున్న ఈనిందంటే దూడ‌ను గాటిలో క‌ట్టేయ‌మ‌న్న‌ట్టు ఉంది.

* * * * *

మేం ఈ ప్రాంతానికి వ‌చ్చిన కొత్త‌ల్లో ఎవ‌రికైనా జ‌బ్బు చేస్తే
రుయా ఆస్ప‌త్రికి గానీ, తిరుప‌తిలో వేరే డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు గానీ వెళ్ళాల్సి వ‌చ్చేది.
అర్హత గల డాక్టర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఏమీ లేని చోట ఆముదం మొక్కే మాహా వృక్షం.
అలాంటి సమయంలో గొల్ల‌ప‌ల్లి అయ్య‌వారు మాత్రం ఆపద్భాందవు డి లా వైద్యం చేసేవాడు. వైద్య శాస్త్రంలో ఆయన కేమీ సర్టిఫికెట్లు లేవు అనుభవం తప్ప.
సాధార‌ణ జ‌బ్బుల‌కు మంచి వైద్యం అందించేవాడు.పొట్టిగా, బ‌లంగా ఉండే మంచి మ‌నిషి.
ఆయ‌న ఇంటికి వైద్యానికి వెళితే గోడ‌ల నిండా ఆయ‌న న‌ట‌నా చాతుర్యాన్ని తెలిపే ఫొటోలు క‌నిపించేవి. ఎక్కువ‌గా పౌరాణిక పాత్ర‌ల ఫొటోలే ఉండేవి.
అనేక బ‌హుమ‌తులు గెలుచుకున్న షీల్డులు క‌నిపించేవి. మంచి వైద్యుడు, మంచి రంగ‌స్థ‌ల న‌టుడు. స్కూల్లో స‌రిగా చ‌దువుకోక పోతే పిల్ల‌ల్ని చావ కొట్టేవాడు.
ఒక విద్యార్థి జుట్టుప‌ట్టి లాగితే ఆ జ‌ట్టుకాస్తా ఆయ‌న చేతిలోకి వ‌చ్చేసింద‌ట‌! ఆయన పేరు చెబితే చాలు పిల్లలకు ఒళ్ళు వే డెక్కేది.
ఆయ‌న ద‌గ్గ‌ర చ‌దువుకున్న విద్యార్థులెవ‌రూ ప‌ద‌వ‌త‌ర‌గ‌తి దాట‌లేద‌న్న మాట ఆ రోజుల్లో బాగా వినిపించేది. అలాంటి గొల్ల‌ప‌ల్లి అయ్య‌వారికి ఉత్త‌మ ఉపాధ్యాయుడిగా అవార్డు వ‌చ్చింది.
ఆ అవార్డు తీసుకుంటున్న ఫొటో కూడా గోడ‌కు వేలాడుతూ ఉండేది.

(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)

 

 

 

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/how-the-real-estate-killed-the-lush-green-farm-lands-turned-around-tirupati/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *