(ఘాజీపూర్ సరిహద్దు చెక్ పోస్టు దగ్గిర సాగుతున్న జాట్ రైతుల నిరసన మధ్య నుంచి ఇఫ్టూ ప్రసాద్ (పిపి) అందిస్తున్న నివేదిక)
నిన్న 18-12-2020న మూడో రోజు మూడో జాతీయ రహదారిపై రైతాంగ ముట్టడి స్థల సందర్శన కోసం ఢీల్లీ-యూపీ రాష్ట్రాల మధ్య సరిహద్దుకు వెళ్ళాము. దాని పెరు ఘజీపూర్ చెక్ పోస్టు. ఆ సరిహద్దుకు ఆవల యూపీ వైపు కిసాన్ ఉద్యమ సభావేదిక ఉంది. అక్కడకు మా బృందం చేరింది. మా వేషభాషల్ని బట్టి పొరుగు రాష్ట్రాల వాళ్ళంగా గుర్తించి అక్కడి అపరిచుతులు సైతం ఆదరించారు. ఎవరినీ మా అంతటా మేమే పరిచయం చేసుకునే అవసరం రాలేదు. (యూపీ AIKMS నాయకత్వం మాకు ఆ తర్వాత కలిసింది) వారు ఆప్యాయతతో మమ్మల్ని అక్కున చేర్చుకొని ఆదరించిన తీరు తెన్నుల్ని మరో సందర్భం లో చెప్పుకోవచ్చు.
ఆ సభలో మేము పాల్గొనే సమయంలోనే విఎం సింగ్, రాకేష్ తికాయత్ వంటి పేరొందిన యూపీ రైతు నేతల ప్రసంగాలు జరిగాయి. సభా విశేషాలు, సభలో వక్తలు, మమ్మల్ని ఆదరించిన తీరు, ఆతిధ్యం ఇచ్చిన తీరు వంటి విశేషాల్ని మిత్రులకు చెప్పడం మా ప్రధాన ఉద్దేశ్యం కాదు. పై ముట్టళ్లలో పాల్గొనే రైతుల మనోభావాలు, ఉద్యమ సరళి, రాజకీయ ప్రభావాలు వంటివి వీలైనంత మేరకు పరిశీలించి, మాకు ఏర్పడే అభిప్రాయాల్ని మిత్రుల దృష్టికి తేవడమే మా ప్రధాన ఉద్దేశ్యం. ఘజీపూర్ బోర్డర్ పాయింట్ లో ముట్టడి ప్రత్యేకతల్ని చెప్పే ఒక చిన్న ప్రయత్నం చేస్తాము.
16, 17 తేదీలలో సింఘు, టిక్రీ బోర్డర్స్ వద్ద ముట్టళ్లకూ, నిన్న చూసిన ఘజీపూర్ ముట్టడికీ మధ్య అనేక పోలికలున్నాయి. అదే సమయంలో ఒకట్రెండు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఉద్యమ ఉత్సాహం, ఐక్యతా స్ఫూర్తి, మోడీ ప్రభుత్వం మీద కసి, అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్ సంస్థల మీద ఆగ్రహం, మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేసేంత వరకూ పోరాడే దీక్ష, ఆతిధ్యభావం వంటి విభిన్న అంశాలలో పోలికలు ఉన్నాయి.
కానీ వేషభాషాలలో సంస్కృతులలో భిన్నత్వం ఉంది. సింఘు, టిక్రీ ల వద్ద ప్రధానంగా శిఖు సంస్కృతి, ఆ తర్వాత హర్యానా సంస్కృతి ఉంటే, నిన్నటి ఘజీపూర్ లో యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ సంస్కృతులు ఉన్నాయి. “భిన్నత్వంలో ఏకత్వం & ఏకత్వంలో భిన్నత్వం” అనే భారతదేశ ముద్ర కనిపించింది.
ఘాజీపూర్ ముట్టడిలో పాల్గొన్న రైతాంగ దృశ్యాన్ని చూశాక మా బృందానికి ఓ అభిప్రాయం కలిగింది. భారత దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ క్రమంగా బూర్జువా ఫాసిస్టు రాజకీయ వ్యవస్థ వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నది. ఈ పరివర్తనా కాలంలో భారత “రైతు” పాత్ర మా మనస్సుల్లో మెదిలింది.
చరిత్ర గమనంలో పైన పేర్కొన్నట్లు ఫాసిజం వైపు సాగే పరివర్తనా ప్రక్రియలో రెండు రూపాలలో అక్కడి “రైతు” ఆవిష్కృతమైన అంశం మా దృష్టిలో పడింది. ‘గత రైతు’ కూ & ‘నేటి రైతు’ కూ మధ్య తేడాని కిసాన్ ఉద్యమం స్పష్టంగా ఆవిష్కరించింది. ఈ అపురూప రాజకీయ దృశ్యం మాకు కనిపించింది. నిన్న సభ లో అటూ, ఇటూ ఉత్సాహంగా, ఉవ్విళ్లూరుతూ పరుగులు పెట్టె ఔత్సాహిక రైతు యువత మొఖాలలో పైన పేర్కొన్న ఒక అపురూప దృశ్యం మా కళ్ళకు కనిపించింది.
రేపటి భారతదేశ రాజకీయ పరివర్తన పట్ల ఆశావహ దృష్టిని కలిగించే ఈ సానుకూల అంశాన్ని నేడు మిత్రుల దృష్టికి తేవడం ఒక ముఖ్య అవశ్యక అంశంగా భావిస్తున్నాం.
2013 ఆగస్టు-సెప్టెంబర్ లలో యూపీ లోని ముజఫర్ నగర్ జిల్లాలో మత ఘర్షణలు తెలిసిందే. 60 మందికి పైగా మృతి, వందమందికి పైగా తీవ్ర క్షతగాత్రులు, 50 వేలమంది ముస్లిములు శరణార్థులు కావడం తెలిసిందే. అది బెఠీ బచావో పేరిట ఆర్.ఎస్.ఎస్. చేపట్టిన హిందుత్వ శక్తుల ప్రచారోద్యమ ఫలితమేనని కూడా తెలిసే ఉంటుంది. అవి అఖిలేష్ ప్రభుత్వ హయాంలో జరిగాయి.
ఆ తర్వాత జరిగిన శాసన సభ ఎన్నికకలో యోగి సర్కార్ గెలిచింది. పై ఘర్షణల లో నమోదు చేసిన 41 క్రిమినల్ కేసుల్లో మెజారిటీ కేసుల్ని 2017 నుండి 2019 లోక్ సభ ఎన్నికల లోపు కోర్టులు కొట్టి వేసాయి. మిగిలినవి కూడా ఇటీవల కొట్టివేశాయి. నేటికి మొత్తం 41 కేసుల్లో 40 కేసుల్ని కొట్టివేయగా ఒకేఒక్క కేసులో శిక్షలు పడ్డాయి. ఆ ఒక్క కేసు లో ముద్దాయులు ముస్లిములు కావడం గమనార్హం. ఆ కేసుల్లో విడుదలైన యువతలో జాట్ రైతాంగ కుటుంబీకుల ఎక్కువ శాతం ఉండటం గమనార్హం.
అలాంటి ప్రాంతాల్లో నాడు ఆర్.ఎస్.ఎస్. ప్రభావంతో ముస్లిం విద్వేషం వెళిగక్కిన జాట్ యువత నేడు మోడీ ప్రభుత్వ వ్యతిరేకంగా జరిగే ఘజీపూర్ ముట్టడిలో చురుగ్గా పాల్గొనడం గమనార్హం. మొత్తం జనాభాలో వారి శాతం తక్కైవే. కానీ అది సంపన్న లేదా ఎగువ మధ్య తరగతి కి చెందడం వల్ల ప్రభావిత శక్తిని కలిగి ఉంది.
పై జాట్ రైతాంగం హర్యానా, రాజస్థాన్, పంజాబ్, యూపీ (western UP) లలో ఉంది. ఈ జాట్ బెల్ట్ ఇందిరా గాంధీ నియంతృత్వ పాలనకి స్థూలం గా వ్యతిరేక పాత్ర పోషించింది. జేపీ సంపూర్ణ విప్లవంలో కూడా చురుగ్గా పాల్గొన్నది. చరణ్ సింగ్, దేవీలాల్ వంటి ప్రముఖ రాజకీయ నేతల్ని సృష్టించింది. అది కులక్ రైతాంగంగా కూడా పేరొందింది. కానీ బెఠీ బచావో వంటి భావోద్వేగ నినాదాలతో జాట్ రైతాంగంలోని యువత 2014 లోక సభ ఎన్నికలకు ముందు ముస్లిం ద్వేషంతో ఆర్.ఎస్.ఎస్. చేత తీవ్ర స్థాయి లో రెచ్చగొట్ట బడింది. వృద్ధ తరం మీమాంసలో ఉండగా యువత బీజేపీ వైపు మొగ్గి, సాంప్రదాయ మధ్యస్థ రాజకీయ వర్గాలు కూడా 2014 ఎన్నికల్లో మోడీకి అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే జాట్ రైతాంగ ప్రాంత యువత నేడు మోడీ ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాట బావుటా ఎగురవేసి ఘజీపూర్ ముట్టడిలో చురుకైన పాత్ర పోషిస్తోంది.
ఇక్కడ చెప్పదలుచుకున్న ఒక అంశం ఉంది. కేవలం మత ప్రాతిపదికన మత విద్వేషాల్ని రెచ్చగొట్టి, ఆర్.ఎస్.ఎస్. నాడు నిర్మించుకున్న రాజకీయ ప్రజా పునాది స్థిరమైనది కాదు. అది ప్రజల జీవన పోరాట క్రమంలో నిలబడేది కాదు. సరైన కాలం సరైన ఉద్యమ కార్యాచరణను వ్యూహాత్మకంగా నిర్మించ గలిగితే, ఫాసిస్టు రాజకీయ శక్తుల్ని అనివార్యమైన కొన్ని త్యాగాలు చేస్తూ, మూల్యం చెల్లిస్తూ ఓడించవచ్చును. ఈ రాజకీయ గుణాపాఠాన్ని నేటి కిసాన్ ఉద్యమం అందిస్తోంది. ఈ వెలుగులో ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు దృఢదీక్షతో పురోగమించాల్సి ఉంది.
ఫాసిస్టు రాజకీయ శక్తులు ఎదురు లేని అప్రతిహతతతో పెరుగుతున్నవనే భావన సరికాదు. అదో భయాందోళన కు దారి తీసేదిగా మారరాదు. ఒకవేళ ఆర్.ఎస్.ఎస్. ఒకసారి బలపడితే, దాన్ని ప్రజాతంత్ర శక్తులు ఇక ఎంత మాత్రం అడ్డుకోలేమనీ, తిరిగి జర్మన్ తరహా సామాజిక, రాజకీయ విధ్వంసం తర్వాతనే శాంతి, సంక్షేమం సాధ్యమనీ, అప్పటి వరకూ ఏమీ చేయలేమనే ఒక నిస్సహాయ భావన కూడా అంతర్లీనంగా కొన్ని ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తుల్లో కొద్దీ మేరకైనా ఉంది. అది నిజం కాదని వర్తమాన రైతాంగ ఉద్యమం మన కళ్లెదుటే కొన్ని రాజకీయ గుణపాతాల్ని అందిస్తోంది. ఈ స్ఫూర్తిని ఘజీపూర్ ముట్టడి నుండి పొందుదాం.