ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ఎలా?

(పిళ్లా కుమారస్వామి)
నిర్ణయం అంటే ఒక పనిచేయడానికి మనం ఆలోచించి చేసే పని విధానం.నిర్ణయం సరైందా కాదా అన్నది ఆ పని చేశాకే తెలుస్తుంది.
అయితే ఆపని చేయడానికి ముందు మనం ఆ పనికి సంబంధించిన విషయాన్ని అర్థం చేసికొని అమలుచేస్తామా? లేక అమలు చేస్తూ అర్థం చేసుకొంటామా? ఇదే మన నిర్ణయం సరైందో కాదో నిర్ణయిస్తుంది.
ఒక పనికి సంబంధించిన పని గురించి పూర్తిగా అర్థం చేసికొని, విధానాన్ని ఖరారుచేయడమే సరైన నిర్ణయానికి దారితీస్తుంది. అర్థం చేసుకోవడమంటే ఆపనిని అనుకొన్న విధంగా అమలు చేస్తే జరుగే మేలును గాని కీడును గాని ముందుగా తెలుసుకోవటమే.
సమస్యలను సాధించడం, నాయకత్వం వహించడం, సమయాన్ని సద్వినియోగం చేసే విధానం, టీం వర్క్, సృజనాత్మకంగా ఆలోచించడం, ఇలాంటి వన్నీ నిర్ణయం క్యాటగిరిల్లోకి వస్తాయి.
నిర్ణయాలు రెండు రకాలుగా చేస్తూంటారు.అవి.
1.భావోద్వేగ నిర్ణయం)(Emotional Decision )
2. వివేక నిర్ణయం(Intelectual Decision )
ఆవేశంలో, ఆందోళనలో, కోపంలో తీసుకునే నిర్ణయం భావోద్వేగ నిర్ణయం. ఒక్కోసారి కొన్ని విషయాలలో సరైందే కావచ్చు. కానీ అన్ని సార్లూ ఈ నిర్ణయం సరైందిగా వుంటుందని చెప్పలేం.ఇతరులు కష్టపడుతుంటే చూసి భావోద్వేగాలకు లోనై వారికి సహాయ పడటానికి నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి నిర్ణయం వల్ల బాధ వుండదు.
ఇతరులతో వివాదంలో ఉన్న సందర్భంలో, భావోద్వేగానికిలోనై నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది ఒక్కోసారి. అప్పుడు మనం సావధానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
ఎదుటివ్యక్తి తో కోపంగా వాదన చేసేటపుడు మనం తీవ్రంగా స్పందించరాదు. ఆత్రపడకుండా కొంత సమయం తీసుకోవాలి. ఎదుటి వ్యక్తి కి తగినంత సమయం ఇవ్వాలి. అప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది.

మనం ఆలోచించి తీసికొనే నిర్ణయం వివేక నిర్ణయమవుతుంది.ఇది మనం ఒంటరిగా కాకుండా పదిమంది తో కలిసి చేయడం ద్వారా మంచి నిర్ణయం చేయడానికి వీలవుతుంది.

మన నిర్ణయం ఇతరులకు బాధ మనకు ఆనందం కలిగితే ఆ నిర్ణయం సరైంది కాదు. దీంతో సత్సంబంధములు చెడిపోతాయి. సమస్యను సామరస్యంగా మన నిర్ణయం ద్వారా పరిష్కరిస్తే మరల అలాంటి సమస్య రాకుండా చూసుకోవటం అవసరం.

సమస్య వచ్చినప్పుడు దీర్ఘంగా ఆలోచించాలి. సమస్యకు మూలాన్ని గుర్తించాలి. మూలాన్ని తీయడం లేదా సరిచేయడం అవసరం. నిత్యజీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు తగిన నిర్ణయం తీసికొని సమస్యను తాత్కాలికంగా పరిష్కరిస్తాం. దాంతో ఆ సమస్య మరల తీవ్రరూపంలో వచ్చి ఇబ్బంది పెడుతుంది. అందువల్ల సమస్య ఉత్పన్నమైనప్పుడు పూర్తి అవగాహనతో మూలాన్ని గుర్తించి, సరైన నిర్ణయం తీసుకుని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. అలాంటి నిర్ణయమే మనలో నాయకుని లక్షణాలను పెంపొందిస్తుంది.
సమస్యకు సంబంధించిన వివరాలు ఎంత ఎక్కువ ఉంటే దాని పరిష్కారం కోసం చేసే నిర్ణయం అంత బాగా ఉంటుంది.
ఒక్కోసారి మనం తక్కువ సమయంలో తక్షణ నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు విన్ విన్ పద్దతి లో నిర్ణయం చేయాలి. విన్ విన్ అంటే మనకు,ఎదుటి వారికి లాభదాయకంగా ఉండటం.
నిర్ణయాన్ని అన్ని కోణాల్లో ఆలోచించి చేయాలి. నిర్ణయం చేయడానికి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉంది.దాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించు కోవడం చాలా ఉపయోగకరం.
నిర్ణయమనేది స్వంత అనుభవాల వలన , ఇతరుల అభిప్రాయాల వలన ఏర్పడుతుంది. అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది.మన జీవిత గమ్యాలను, వాటిని సాధించుకొనే మార్గాలను మన మెదడులో ఏర్పడిన అనేక రసాయనిక చర్యల ఫలితంగా మనసు నిర్ణయం చేస్తుంది.
ఒకే చట్రంలో ఉండి ఆలోచిస్తే సరైన నిర్ణయాలు రావు. అవి మూస నిర్ణయాలు అవుతాయి. అవసరమైతే చట్రం(frame) మార్చాలి.అప్పుడు కొత్త నిర్ణయాలు వస్తాయి.
నిర్ణయం తీసుకున్న తర్వాత వాటి పర్యవసానాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి పర్యవసానాలు అంటే ఫలితాలు అనుకూలంగా ఉంటే మన నిర్ణయం సరైనది అని అర్థం ఫలితాలు వ్యతిరేకంగా ఉంటే కొన్ని నిర్ణయాలు తప్పని అర్థం.
నిర్ణయాలు తొందరగా తీసుకోకపోతే, నిర్ణయాలు సకాలంలో తీసుకోకపోతే, నిర్ణయాలు ఒక్కోసారి ఆత్రంగా తీసుకుంటే సరైన ఫలితాలను ఇవ్వవు. కొంతమంది నిర్ణయాలను వాయిదా వేస్తుంటారు. అది సరైంది కాదు. నిర్ణయాలను ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ నిర్ణయం తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మాత్రమే నిర్ణయాలు వాయిదా వేస్తే కాలమే పరిష్కరించ వచ్చు. కానీ ఆ సమస్యను ఇలా కాలానికి వదిలేయడం సరైంది కాదు.
Pilla Kumaraswamy
(కుమారస్వామి రచయిత, విమర్శకుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *