2021 నూతన సంవత్సర తొలి వారంలోనే హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కానుంది. ఇది తెలంగాణ రాష్ట్రసమితి జిహెచ్ ఎంసి ఎన్నికల వాగ్దానం. ఈ వాగ్దానాన్ని అమలుచేసేందుకు అవసరమయినఏర్పాట్లు పూర్తి చేయాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
ఈ రోజు ప్రగతి భవన్ లో పురపాలక శాఖ మంత్రి తారకరామారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జలమండలి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల నుంచి 20,000 లీటర్ల వరకు తాగు నీటి వినియోగానికి ఎలాంటి రుసుము తీసుకోమని, ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ బిల్లులో 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం కనెక్షన్లు, నీటి సరఫరాకి అవసరమైన ఏర్పాట్లు, ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన విధి విధాన రూపకల్పన పైన ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు.
ఈ ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ప్రజలకు సంపూర్ణంగా సమర్థవంతంగా వెళ్లేలా జలమండలి చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి కేటీఆర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.