తెనాలి గురించి…

(కొడవంటిగంటి కుటుంబరావు)

1

గుంటూరు వారున్నారు,

చేబ్రోలు వారున్నారు

ఒంగోలు వారున్నారు

తెనాలి వారు లేరు.

నేనెరిగినంత మట్టుకు లేరు, రామలింగడు తప్ప.

రామలింగడి వల్ల

తెనాలికి ప్రసిద్ధి వచ్చిందా,

తెనాలి వల్ల రామలింగడు ప్రసిద్ధికి వచ్చాడా?

చెట్టుముందా,

విత్తుముందా వంటి ప్రశ్న ఇది

ఆవిషయం ఎవరూ తేల్చలేరు.

2

రెండు సికింద్రబాదులూ,

రెండు హైదరాబాదులూ

రెండు అన్నవరాలు,

రెండు పూండ్లలూ

-ఒకటే తెనాలి.

ప్రపంచమంతటికీ!

అందుకనే

రామలింగడాపేరు

ఇంటి పేరు చేసుకున్నాడేమో.

3

రామలింగడి కాలం వదలి

వర్తమానానికి వస్తే

తెనాలి చాలా విషయాలకు ప్రసిద్ధి కెక్కింది.

బియ్యానికి

కాఫీ హోటెళ్లకూ,

పత్రికల అమ్మకానికి,

దోమలకూ,

వానాకాలం బురద రోడ్లకు,

వగైరాలకు

4

తెనాలి బియ్యం లండన్లో కూడా చెప్పుకుంటారని నేను నమ్మకంగా విన్నాను.

 తెనాలి కాఫీ హోటెళ్లు జగత్ప్రఖ్యాతి గలవి.

తెనాలి చుట్టు పట్ల వారంతా

ఒక్కొక్కప్పుడు 20 మైళ్ల నుంచి కూడా

-ఉదయం పూట రైళ్ల మీద,

జట్కా బళ్ల మీద,

నడచి తెనాలిచేరుకుంటారు.

తెనాలిలో చెప్పుకోదగ్గ అయ్యర్ హోటల్ లేదు.

కాఫీ ఇవ్వడం అయ్యర్లకే చేతనవుననే అనుమానం ఎవరికైనా ఉంటే

తెనాలిపోయి కాఫీ తాగి చూడండి.

మా తెనాలి వాళ్లు

నలుగురు వచ్చి

మద్రాసులో కాఫీ హోటళ్లు ప్రారంభిస్తే

అరవాళ్లు

పంజాలు తెంచుకుని

పట్నం వదలి పారిపోతారు.

5.

తెనాలి వాళ్లు

పత్రికలు చదవడంలో కూడా ప్రథములు

ఆంధ్ర దేశం మొత్తం మీద అమ్ముడుపోయే పత్రికల సంఖ్యలో

ఏ పదోవంతో తెనాలిలో అమ్ముడుపోతుంది.

అది రామలింగడి ఆశీర్వాదం కావచ్చు

సాహితి సమితి పుట్టిన ప్రభావం కావచ్చు.

6.

తెనాలి దోమలు

దాదాపు విశాఖ పట్నం దోమలంత ఉంటై

ఒక దోమల షో పెట్టి

(బేబీ షో పెట్టినట్లు)

అందులో విశాఖ పట్నం దోమనీ,

తెనాలి దోమనీ తూకం వేస్తే

విశాఖపట్నం దోమకి

డిపాజిట్ కూడా నమ్మకం లేదు

7.

వేసవి కాలమేంటే

జ్ఞాపకం వచ్చింది

వేసవి కాలంలో మా వూరు బెజవాడ వారికి,

గుంటూరు వారికి సిమ్లా వంటిది

8.

తెనాలి నాటకాలకి,

నటులకీ ప్రసిద్ధి.

మొదటి నాట్య కళాపరిషత్తు తెనాలిలో జరిగింది.

 మిగిలిన ఆంధ్ర దేశమంతా కలసి

ఎంతమంది చిన్నా పెద్ద నటులున్నారో

తెనాల్లో అంత మంది ఉన్నారు.

అసలు ప్రతి తెనాలి వాడు వేషధారే

అంత దాకా ఎందుకు

తెనాలి నటుడు లేని టాకీ ఉందీ?

9.

నాట్యకళ

మా తెనాలి వారికంతబాగా తెలుసుకనకనే

మా తెనాల్లో పై ఊళ్ల వాళ్లు పరాభవం పొందారు.

పైనుంచి వచ్చి తెనాలి వారిని మెప్పించి పోయినవాడు

గట్టిగా లెక్కేస్తే

ఒక్క బళ్లారి రాఘవాచారి గారే.

10.

తెనాలిలో అనిర్వచనీయమయిన ఆకర్షణ ఉంది.

అది తెనాలి వాళ్ల కన్నా

పై వాళ్లకు  తెలుస్తుంది.

తెనాలి నుంచి బదిలీ అయిపోవలసి వస్తే

ఉద్యోగానికి నీళ్లొదిలిని వాళ్లున్నారు.

ఏపనిమీదో వచ్చి

తెనాలిలో వేళ్లతోసహా పాతుకు పోయిన వాళ్లున్నారు.

ఇంకే పనీలేక తెనాలిలో ఉండటమే

జీవితాశయంగా పెట్టుకున్న వాళ్లుకూడా ఉన్నారు.

ఇందులో

అంతిశయోక్తి ఏమీ లేదు

ఏబస్తీలో కన్నా తెనాల్లో నిరుద్యోగులు అధికంగా

ఉండటానికి కారణం ఈ ఆకర్షణే

తెనాలి గురించి “వెధవ తెనాలి” అంటుంటే నమ్మకండి

గవర్నర్ గిరి వచ్చినా చేయడానికి తెనాలి వాడు

తెనాలి వదలడు

11.

మరికొన్ని బస్తీల మాదిరిగా

తెనాలి అట్టే గొప్పవారిని చెప్పుకోకపోవడానికి కారణం

బుద్ధి మంతుడు సులభంగా వూహించవచ్చు.

మా తెనాలి వాళ్లం

ఇతర ఊళ్ల మాదిరిగా

ఒక వ్యక్తిని ఆరాధించి పైకెత్తం

మా చవిలి నాగేశ్వరరావుకి

మా గోవిందురాజు సుబ్బారావుకి

మా స్థానం వారికి,

మా  మాధవపెద్దికి

ఇతరులు బ్రహ్మరథం పట్టొచ్చుగాక

మేం పట్టం.

మాకు వాళ్లు

మామూలు మనుష్యులే.

వాళ్లని ఆరాధిస్తూ కూర్చుంటే

ప్రపంచ ఆరాధించే మనుషుల్ని మేమెట్లా సృష్టించగలుగుతాం?

మనుష్యుల్ని తయారు చేసి లోకం మీద వదలటం మాత్ర మే మా వంతు.

మాస్టర్ అంజిని,

బసవలింగాన్ని

పిల్లల మర్రి సుందర రామయ్యనూ

మేం తయారుచేసాం.

భీమవరపు నరసింహారావునూ,

ప్రభల సత్యన్నారాయణనూ

మేమే తయారు చేసాం.

ములుగు శివానందం గారూ

మా వాడు.

మా గొప్ప వాళ్లెవరూ

మా ఊళ్లో ఉండరు.

దేశాలు పట్టి పోతారు.

కాంచనమాలది మా ఊరే

ఆవిడా అంతే.

మూడు కాలువల నడమ నడిచేదే తెనాలి.

ఇలా ప్యారిస్ లోనూ

తెనాలిలోనే ఉంటుంది.

అందుకే

తెనాలిని

ఆంధ్రా ప్యారీస్ అంటారు.

(12.2.1941 కొడవటి రాసిన వ్యాస ప్రపంచం నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *