మూడు ముక్కలొద్దు, అమరావతియే రాజధాని : సోము వీర్రాజు

అమరావతిలోనే రాజధాని ఉంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు.
భారతీయ కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షులు అన్నా రాంబాబు ఆధ్వర్యంలో తుళ్లూరులో ఉద్యమిస్తున్న రాజధాని ప్రాంత చిన్న, సన్నకారు రైతుల సమ్మేళనంలో పాల్గొన్న సోము వీర్రాజు వారికి హామీ ఇచ్చారు. ముందుగా రాజధాని కోసం ఏడాదిగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను అభినందించారు.
సానుభూతిని తెలిపారు. అమరావతి రాజధానిలోనే ఉండాలనేది భాజపా లక్ష్యంగా చెప్పారు. ఇందులో రెండో ఆలోచనకు తావులేదన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు 64 వేల పట్టాలివ్వాలని, మిగిలిన 9 వేల ఎకరాలు భూమిని అభివృద్ది చేయాలని డిమాండ్‌ చేశారు.ఇది భాజపా స్పష్టమైన అభిప్రాయంగా చెప్పారు.
విజయవాడలోనే పార్టీ సొంత కార్యాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ అమరావతిలోనే రాజధాని కడతానని చెప్పి దానికి విరుద్దంగా 3 రాజధానుల గురించి ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.
రూ.72,00 కోట్లు గత ప్రభుత్వం రాజధానికి ఖర్చుచేసిందన్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఇవ్వగా, అమరావతి స్మార్ట్‌సిటి కోసం రూ.800 కోట్లు, హడ్కోద్వారా రూ.4 వేల కోట్ల రుణం ఇచ్చారన్నారు. రాజధాని విషయంలో ప్రధాని మోదీ కలుగచేసుకోవాలని అంటున్నారని, ఏ విషయంలో కలుగచేసుకోవడం లేదో ప్రశ్నించినవారు చెప్పాలన్నారు.
   జగన్‌ రాజధాని తీసుకెళ్లిపోయినా ఇక్కడ మాత్రం కేంద్ర సంస్థలను ప్రధాని నిర్మిస్తూనే ఉన్నారన్నారు. కేంద్రం రూ. 1,800 కోట్లతో నిర్మించే ఎయిమ్స్‌ ఎంత అద్బుతంగా ఉందో చూడాలన్నారు. అలాగే మరో పక్క అగ్రివర్శిటీ, పక్కనే డిజైన్‌ జాతీయ విద్యాసంస్తను నిర్మిస్తుందని వీటిని రైతులు గుర్తించాలన్నారు. కనకదర్గ ఫ్లైఓవర్‌ను, బెంజిసర్కిల్‌ వద్ద రెండు ఫ్లైఓవర్లను, మచిలిపట్నానికి 6 లైన్ల రహదారి, నిమ్మకూరు, అవనిగడ్డల్లో రక్షణ మంత్రిత్వసంస్థ కార్యాలయంలు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఇది భాజపా చిత్తశుద్దిగా పేర్కొన్నారు.
ప్రధాని రాజధాని శంకుస్ధాపనకు పుణ్యనదుల నుంచి నీరు తెచ్చి వెళ్లిన అరగంట నుంచి తీవ్ర విమర్శలు చేసినా భాజపా ఏం మాట్లాడలేదన్నారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించాలని భాజపా తీవ్రంగా ఉద్యమిస్తుందని భరోసా ఇచ్చారు.  2024లో భాజపాకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఊహించని విధంగా అభివృద్ది చేస్తామన్నారు. రాజధానిని అయిదేళ్లలో రూ.5 వేల కోట్లతో అద్బుతంగా నిర్మిస్తామని, రూ.2 వేల కోట్ల నిధులతో అతిసుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
9 వేల ఎకరాల్లో పార్కులు, వ్యవసాయ, విద్యాసంబంధ సంస్థలు అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు. భాజపా అన్నీ చేసి చూపిస్తోందని, ముఖ్యమంత్రి జగన్‌లా ఎక్కడికీ పోవడపం లేదన్నారు. భాజపా ఉద్యమకారులతోనే ఉందని  అన్నారు.
ఈ ప్రభుత్వం చట్ట వ్యతిరేకచర్యలకు పాల్పడుతోందని రైతులు, మహిళలపై ఎస్సీఎస్టీ కేసులుపెడితే భాజపా సహించదని మండిపడ్డారు. భాజపా రైతాంగంతో ఎల్లవేళలా ఉండే పార్టీగా భరోసా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా రాజధానిని అమరావతిలోనే నిర్మిస్తామన్న జగన్‌ ఇప్పుడు సిఎం హోదాలో  బాధ్యతతో రైతులను పిలిచి వారితో మాట్లాడాలని సూచించారు. భాజపా రైతుల పక్షాన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.
అమరావతి రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని, వారి తరపున ఉద్యమం చేసి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కిసాన్‌ సంఘ్‌ జాతీయ కార్యవర్గసభ్యులు కుమారస్వామి, రాష్ట్ర ఉపాద్యక్షులు చంద్రశేఖరరెడ్డి, రైతులు కొమ్మినేని సత్యనారాయణ, జి.స్వరాజ్యరావు, జె.కిరణ్‌, ఉప్పలపాటి సాంబశివరావు, ధనేకుల రమణ, చిలకా బసవయ్య, కంతేటి బ్రహ్మయ్య, కె.గోవిందమ్మ, మార్త నరేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *