(పిళ్ళా కుమారస్వామి)
మహాత్రయా రా తన ప్రొజీన్థాట్స్ పత్రికలో రాసిన ఆలోచనల సమాహారమే పోస్టు చెయ్యని ఉత్తరం పుస్తకం. ఆంగ్లంలో ఉన్న ఈ గ్రంథాన్ని శాంతసుందరి తెలుగు లోకి అనువదించారు.
జీవితాన్ని సక్రమంగా నడుచుకునేట్టు చేసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనిషి అప్పుడప్పుడు పరిస్థితుల ప్రాజల్యం వల్ల మనోధౌర్భల్యం వల్ల వక్రమార్గంలోకి వెళ్ళి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటాడు. మనిషి తనజీవితాన్ని ఆనందంగా గడపడానికి దు:ఖంనుంచి బయట పడటానికి బుద్ధుడు నేర్పిన అష్టాంగ మార్గాలు అవసరమయ్యాయి. వాటిని మనకు ‘పోస్టు చెయ్యని ఉత్తరం’ లో మహాత్రయారా అందించాడు.
జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రతిక్షణం జీవిస్తూ ఉండాలని బుద్ధుడు చెప్పాడు. జీవితం మనల్ని కాల్చివేసే కొలిమికాదు. అది మనల్ని వెండిలా మెరిసేటట్లు చేసే సాధనమని రా మనకు చెపుతాడు. జీవితాన్ని వాయిదా వేయకుండా రేపే ఈరోజు ఆన్నట్టుగా జీవించాలి. అప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలం.
జీవితం అనుభవాల మయం. అనుభవం మనకు మంచి పాఠాన్ని నేర్పుతుంది. తప్పుడు నిర్ణయంతో మనకు ఒక అనుభవం వస్తుంది. అలాంటి అనుభవాలే మంచి నిర్ణయాన్ని తీసుకునే సామర్థ్యం పెంచుతాయి. ఏ అనుభవం డానికదే తప్పుకాదు. అలాచేయ కూడదనే సూత్రాన్ని నేర్పిస్తుంది.క్రింద పడటం వైఫల్యం ఎంతమాత్రంకాదు. ‘క్రిందపడ్డ ప్రతిసారి లేచినిలబడు’ అని జపాను సామెత. క్రిందపడ్డ ప్రతిసారి లేచి నిలబడి పెద్దసవాలు కోసం ఎదురు చూడాలి. వైఫల్యం ఒక గుణపాఠంగా తీసుకొని ముందుకు పోవాలి.
ప్రతిరోజును వేడుకగా జరుపుకోవాలి. తక్కువ ఉపయోగం జీవితాన్ని పొడిగిస్తుంది. ఎక్కువ ఉపయోగం దాన్ని తగ్గిస్తుంది ఎక్కువకాలం నిద్రపోవాలంటే తక్కువ కాలం నిద్రపోవాలి. ఎక్కువకాలం తినాలంటే తక్కువ తినాలి. ఎక్కువ పుస్తకాలు చదవాలంటే రోజూ కొంత చదవాలి. ఎక్కువ రాయాలంటే రోజు కొంతరాయాలి.
గతం గతః , వర్తమానమే ప్రధానం. భవిష్యత్తు ముఖ్యమైనది. అనుకోని ఘటనలు జీవితంలో మలుపులు తీసుకొస్తాయి. వైఫల్యాలను మలుపులు అనుకోవటం మంచిది. వైఫల్యాలతో భావోద్రేకావికి గురికారాదు.ఇందుకోసం మన సుప్తచేతనకు ప్రేమను, ఆనందాన్ని, సానుకూల భావాన్ని పెంచాలి. విజయాలను ఆనందంగా స్వీకరించాలి. సానుకూలమాటలు కనీసం ఐదింటిని చెప్పుకోవాలని వివరిస్తాడు రచయిత.
ప్రతి పనిని పూర్తిగా శ్రద్ధాసక్తులతో ఏకాగ్రతగా చేయాలి. మధ్యే రకంగా చేయరాదు. లేకపోతే చేయకపోవడం మంచిది. పనిపట్ల ప్రేమవల్లనే ఏకాగ్రత, సంతోషం వస్తాయి. పనిని బాగా చేస్తూ పోతే సామర్థ్యం పెరుగుతుంది. చేస్తున్న పనిని మధ్యలో వదలివేయరాదు. చివరిదాకా కొనసాగించాలి. ఆడవలసినంత సేపు ఆడాలి.చివరకు గెలుపు మీదే. జీవితం అందించే అవకాశాలను ఒడిసిపట్టుకోవాలి. పనిని పూర్తిచేసి వేచి ఉండాలి, ఇదే ప్రగతికి మార్గం. ఇలా ఎందుకు జరుగుతుంది అన్న పందేహం మన మనసులో పెట్టుకోరాదం. అప్పుడు మనం మనశ్శాంతిగా ఉండగలమని వివరించాడు మహాత్రయా. భగవద్గీతో కృష్ణుడు “కర్మేణ్యేధికారివారి స్తే మాఫలేషు కదాచన” అని చెప్పాడు. అంటే నువ్వు చేయాల్సిన పని చేయి. ఫలితం ఆశించకు అని. కాకపోతే ఇక్కడ మనం ఓపికగా నిరీక్షించాలి అంతే.
మంచి విషయాలను ఎల్లప్పుడూ అందరితో పంచుకోవాలి. మీకు తెలిసినవాళ్ళ మంచితనం గురించి పంచుకోండి. మీ తల్లిదండ్రుల గుణగణాల గురించి స్నేహితులకు చెప్పండి. మీగురువుల గురించి చెప్పండి. మీ చుట్టూ ఉన్న సామాన్య మానవులు చేసే అసాధ్యమైన పనుల గురించి చెప్పండి. అప్పుడే ఈ ప్రపంచం మంచిదిగా కనిపిస్తుంది.
గొప్ప స్వాప్నికులు కనేకలలు నిజమవుతాయి. ఒక వ్యక్తి ఏదైనా ఆలోచించి దాన్ని గురించి నమ్మగలిగితే దాన్ని సొదించగలడు.కలలు కనేవాళ్ళు ఒక ప్రశ్న వేసుకుంటారు ఎప్పటిలోగా నేను చేయగలనని.
మనం చేస్తున్న పనుల నాణ్యతను పెంచాలి. దాని పరిమాణాన్ని పెంచాలి. మనకున్న శక్తి సామర్థ్యాలను మునుపటికన్నా మెరుగ్గా ఉన్నాయని భావించాలి. పరిమాణాన్ని పెంచడమే ప్రగతికి నిదర్శనం. శిఖరాన్ని చేరుకోవడానికి సులభమార్గాలేమీ ఉండవు
వేణువు తయారవ్వాలంటే వెదురుకు గాయాలు తప్పనిసరి. ఒక శిల శిల్పంగా మారాలంటే వులిదెబ్బలు తప్పనిసరి, బంగారం ఆభరణంగా మారాలంటే కొలిమిలో కావాల్సిందే. మనకు ఉన్నత వ్యక్తిత్వం రావాలంటే ఎన్నో పరీక్షలకు గురికావాల్సి ఉంటుంది. జీవితంలో వంకరా, మలుపులూ లేకపోతే అది జీవితమెలా అవుతుంది?ఎదురు దెబ్బలు తగలకుండా ఎవరూ ఉన్నతులు కాలేదు కదా.
మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీలేదు. ఒక గొప్ప నమ్మకం మనిషిని నడిపిస్తుంది. మనిషి తన శక్తిసామర్థ్యాలను సరిగ్గా గుర్తించుకున్న రోజున తననుకున్న లక్ష్యం చేరగలడు. ఒక ఇనుపగుండు వెల రూ.250/- డాన్ని ఒక పొడుగాటి కడ్డీగా మారిస్తే రూ.1000 సూదులుగా మారిస్తే రూ.10,000/-, చేతిగడియారాల్లో బ్యాలెన్స్ స్ప్రింగులుగా మారిస్తే రూ.1,00,000/-. అలాగే మీసొంత విలువ మీరేమిటీ అన్నదాన్ని బట్టికాదు. మీరు ఎంత మారారు, మీరెలా తయారవుతారు అన్నదాన్ని బట్టి ఉంటుందని సోదాహరణంగా నిరూపించారు మహాత్రయా.
బుద్ధుడు ఇలా చెప్పాడు
“మనం ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుదాం. ఈరోజు ఎంతో కొంతనేర్చుకున్నాం కదా! నేర్చుకోలేకపోయిఉంటే రోగాలు రాలేదు కదా! ఒక వేళ జబ్బు చేసి ఉంటే మరణించలేదు గదా! అందుకని ఈరోజు ధన్యవాదాలు తెలుపుదాం!”
ఇలా ప్రతిరోజూ మనకు సాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి.సంక్రాంతి ప్రకృతికి ధన్యవాదాలు చెప్పే పండుగ.అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే కూడా ఇలాంటిదే.
పుస్తకాన్ని చదువుతున్నంత సేపూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్లు భావిస్తాం. అయితే వాటిని ఆచరించితేనే మనం జీవితంలో ముందుకెళ్ళగలం, మనల్ని మనం మార్చు కోగలం.మనకు ఎవరైనా చెప్తే మనం వినం.కాని పుస్తకం లో రచయిత చేపితే దానిని అర్థం చేసుకొని మనం మారతాం.అందుకే మీరు మారాలంటే ఈ పుస్తకాన్ని చదివి ఇందులో మీకు నచ్చిన విషయాలను ఆచరిస్తే జీవితంలో మంచి ఉన్నతిని సాధించగలరు.
(పిళ్లాకుమారస్వామి,రచయిత, విమర్శకుడు)