గ్రేటర్ లో సెటిలర్ల తీర్పు ఎపి బిజెపికి చెంప పెట్టు!

(వి.శంకరయ్య)
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ తీరు – ఫలితాలు తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చాల మంది తల రాతలను తిరగ రాస్తున్నాయి. ఆంధ్ర మూలాలు గల ఓటర్లు కట్టగట్టు కొని టిఆర్ఎస్ కి ఓటు వేసి గ్రేటర్ ను బిజెపి చేతికి దక్కకుండా చేయడంతో కొంత మేర కీలక పాత్ర పోషించారు. ఇదొక ముఖ్యమైన సంఘటన.
ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి అనుసరిస్తున్న దుర్మార్గానికి గట్టి నిరసన. ఇక – ఫాం హౌస్- ప్రగతి భవన్ గడప దిగని ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఈ ఎన్నికలు బజారు కీడ్చాయి. ఇంత బతుకు బతికి మేయర్ ఎన్నికకు దూరంగా వుండాలని భావించాల్సిన దుస్థితి కల్పించాయి.
అంటే మజ్లిస్ పార్టీతో దూరంగా వుండటమే.ఒకప్పడు నైజాంను కీర్తించిన కెసిఆర్ ఈ నిర్ణయం అపూర్వమే. ఆంధ్ర ప్రదేశ్ మూలాలు గల ఓటర్లు టిఆర్ఎస్ గెలుపొందిన కొన్ని డివిజన్లలో బిజెపి వేపు మొగ్గు చూపి వుంటే గ్రేటర్ ను బిజెపి హైజాక్ చేసే అవకాశాలు వుండేవి. ఇది తలకిందులైంది. కెసిఆర్ లాగే పరిపాలన సాగిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల ఫలితాలు కనువిప్పు కలిగించి వుండాలి.
మచ్చుకు కొన్ని మాత్రమే. తెలంగాణ ఉద్యమం రోజుల్లో ప్రజల మధ్య నిత్యం గడిపిన కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఏడు కొండల వెంకటేశ్వరునిలాగా ప్రగతి భవన్ మెట్లు దగగక పోవడంతో తెలంగాణ ఓటర్లు చుక్కలు చూపించారు. అనేక కారణాల్లో ఇదొకటి కావచ్చు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రోజుల్లో జాగో బాగో అని తరమ గొట్టినా ఆంధ్ర మూలాలు గలవారు కెసిఆర్ పరువు కాపాడారు. టిఆర్ఎస్ మీద అభిమానం కన్నా బిజెపి యెడల వ్యతిరేకతతో ఓటు వేశారని చెబుతున్నారు. మరో వేపు ఈ పరిణామం బిజెపిలో కల్లోలం సృష్టించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ప్రభుత్వోద్యోగులూ కెసిఆర్ కు చుక్కలు చూపించారు.
అదే సమయంలో ఈ తీర్పు ఎపి ముఖ్యమంత్రికి గుణపాఠాలుగా మిగుల్తున్నాయి. . పాదయాత్ర సందర్భంగా చేతుల్లో చేయి వేసి ప్రజల మధ్య నడచిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత క్యాంపు కార్యాలయానికి పరిమిత మయ్యారు. ఒక విధంగా ప్రజలతోనే కాకుండా నేతలు కార్య కర్తలతో కూడా సంబంధాలు తెగి పోయాయి. పార్టీ శ్రేణులకు ఉత్సవ విగ్రహాలే దిక్కు అయ్యాయి. మరోవైపు నవ రత్నాలకు నిధులు వున్నాయి గాని తమ దాకా వచ్చే సరికి ఆర్థిక దుస్థితి చెప్పడాన్ని సగటు ప్రభుత్వోద్యోగి జీర్ణం చేసుకోలేకున్నారు.ఈ రోజు నోరు విప్పలేక పోవచ్చు. స్లీపింగ్ సెల్స్ బలంగానే వున్నాయి. మున్ముందు దీని పరిణామాలు ఏలా వుంటాయో తేల వలసి వుంది.
ముఖ్యమంత్రుల గొడవ ఇలా వుండగా గ్రేటర్ హైదరాబాద్ ను అమాంతం హైజాక్ చేసేస్తామని కలలు కన్న కమల నాథులకు గ్రేటర్ లోని ఆంధ్ర మూలాలు గల ఓటర్లు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చారు.
ఆంధ్ర మూలాలు గల ఓటర్లు ఎక్కువగా వుండే డివిజన్లలో బిజెపి అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడి పోయారు. తెలంగాణ వారు ఎక్కువ ఓటర్లు గల ప్రాంతాల్లో బిజెపి హవా సాగింది. ఈ ఓటింగ్ ప్రభావం తెలంగాణకే పరిమితం కావడం లేదు.ఇందుకు ప్రాతిపదిక ఆంధ్రలో కూడా వుంది. గ్రేటర్ లో బిజెపి ఓటమి ఎపి బిజెపి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.
దేశ వ్యాప్తంగా బిజెపి బుల్ డోజర్ రాజకీయాలకు తల పడుతోంది. పార్లమెంటు సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్ కు హామీ ఇవ్వబడిన ప్రత్యేక హోదాను నాన బెట్టి తుదకు ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రకటించి అదికూడా ఎగనాం పెట్టింది. సాక్షాత్తు ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ వచ్చి పునాది రాయి వేసిన అమరావతి రాజధానికి ఎసరు పెట్టింది.నాలుకకు నరం లేదన్నట్లు బిజెపి నేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు.
రాష్ట్రం నడి బొడ్డున ఆరని చిచ్చు రగలేసింది. చట్ట బద్దంగా పోలవరం ప్రాజెక్టు కేంద్ర నిధులతో నిర్మించి ఇవ్వవలసి వుండగా సవా లక్ష కొర్రలు వేసి ప్రాజెక్టును అటకెక్కంచింది. తమకు రాజకీయ ప్రయోజనం లేనిదే పైసా విడ్చేందుకు సిద్ధం కావడం లేదు. ఇన్ని దురాగతాలకు తలపడి పైగా సెంటిమెంట్ – మత పరమైన రాజకీయాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను నమ్మించాలని కేంద్ర రాష్ట్ర బిజెపి నాయకత్వాలు తంటాలు పడుతున్న పూర్వ రంగంలో అనుకోకుండా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల రావడంతో దిమ్మ తిరిగే అనుభవం ఎదురైంది.
ప్రప్రధమంగా గ్రేటర్ లో నివసించే ఆంధ్ర మూలాలు గల ఓటర్లు(సెటిలర్స్) బిజెపిని చావు దెబ్బ కొట్టారు. తమ మాతృ భూమికి బిజెపి చేస్తున్న ద్రోహానికి ఓటు ఆయుధంతో జవాబు చెప్పారు. రేపు అంత కన్నా ఎక్కువ ప్రతీకారం తీర్చుకొనేందుకు ఎపి ప్రజలు సిద్ధంగా వున్నారనేందుకు గ్రేటర్ సెటలైటర్ల తీర్పు నిదర్శనంగా వుంది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ శ్రేణుల దుందుడుకు చర్యలతో గ్రేటర్ లో నివసించే ఆంధ్ర మూలాలు గల ఓటర్లు కొన్ని ఇబ్బందులు పడినా ఆంధ్ర ప్రదేశ్ కు బిజెపి చేస్తున్న అపకారమే పైచేయి సంపాదించినదని చెబుతున్నారు.
టిఆర్ఎస్ కు అనుకూలంగా ఓటు వేశారని చెప్పడం కన్నా బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పడం సబబుగా వుంటుంది.ఏ కారణం చేతనైనా ఆంధ్ర మూలాలు గల ఓటర్లు ఎక్కువగా వున్న డివిజన్లలో బిజెపి సగం స్థానాలు గెలుపొంది వున్నా గ్రేటర్ ను బిజెపి హైజాక్ చేసివుండేది. వాస్తవంలో ఆంధ్ర మూలాలు గల ఓటర్లు ఈ ప్రమాదం తప్పించారు.
2024 నాటి ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పాగా వేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ఎపి బిజెపి నేతల ఆశలపై గ్రేటర్ లో నివసించే ఆంధ్ర మూలాలు గల ఓటర్లు తొలి దెబ్బ తీశారు. అంతేకాదు మున్ముందు ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లకు గ్రేటర్ లోని ఆంధ్ర మూలాలు గల ఓటర్ల తీర్పు కర దీపిక కానున్నది. కొన్ని రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ కు ఓట్లు వేయించారనే ప్రచారం నిజమైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు కొంత మేరకైనా బిజెపికి లాభించి వుండాలి.
తెలుగు దేశం పార్టీకి అంత తక్కువ ఓట్లు వచ్చి వుండేవి కావు. అందుకే నిన్న మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నేతల ప్రసంగాల్లో గుళ్లు గోపురాల ప్రస్తావన వుంటే హఠాత్తుగా గుంటలు పడిన రోడ్లు ప్రజల సమస్యలు ఇప్పుడు వ్యక్త మౌతున్నాయి.
తెలంగాణలో ఆంధ్ర ప్రదేశ్ మూలాలు గల ఓటర్లను ప్రభావితం చేయ లేని జనసేనాని ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు సాయపడతాడంటే ఏలా నమ్మ గలం? రాష్ట్ర బిజెపి నేతలు ఎన్ని ఫీట్లు చేస్తున్నా పక్క రాష్ట్రంలో వచ్చిన తీర్పు ఎపి బిజెపి నేతలనే కాకుండా జాతీయ నేతలను గంగ వెర్రులెత్తిస్తోంది.
(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *