కేసీఆర్ కి వ్యవసాయ బిల్లును వ్యతిరేకించే చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీ లో ఎందుకు తీర్మానం చేయలేదు?
వరదల్లో సర్వం కోల్పోయిన రైతులని కేసీఆర్ కనీసం పరామర్శించారా?
నియంతృత్వ వ్యవసాయంతో రైతులను ఇబ్బందుల పాలు చేసింది కేసీఆర్ కాదా?
“ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగితే పోలీసుల చేత అణిచేవేయించారు. గృహనిర్బంధంలో ఉంచారు. అరెస్టులుచేయించారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆరే బంద్ కి మద్దత్తు ఇచ్చి రోడ్డుపైకి వస్తానని ఓ కొత్త నాటకంకు తెర తీశారు. మరి అధికార టీఆర్ఎస్ మంత్రులని, ప్రజాప్రతి నిధులని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగలరా ? లేదా వాళ్లకు భిన్నమైన రాయితీలు ఉన్నాయా?”, అని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
మొన్నటి వరకూ ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక చర్యలకు మద్దతు ఇచ్చిన సిఎం కేసీఆర్ ఇప్పుడు భారత్ బంద్ కు మద్దతు ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ రైతు వ్యతిరేకిగా మారిన కేసీఆర్ బంద్ కు మద్దతు ప్రకటించడం హాస్యాస్పదమని, ఇప్పుడు రైతు సమస్యపై కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని దాసోజు అన్నారు.
నిజంగా కేసీఆర్ కి వ్యవసాయ బిల్లును వ్యతిరేకించే చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీ లో ఎందుకు తీర్మానం చేయలేదని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీ లో తీర్మానం చేస్తే మోదీ తనకు సంకెళ్లు వేసి జైల్లో పెడతారని భయపడుతున్నారా ? అని ప్రశ్నించారు దాసోజు.
చరిత్రలో ఎన్నడూ లేని విదంగా వరదలు వచ్చి తెలంగాణ సమాజం మొత్తం వరద బురదలో నానా కష్టాలు పడితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోట దాటని కేసీఆర్ ఇప్పుడు తన రాజకీయం కోసం మొసలి కన్నీరు కారుస్తూ మంత్రులను, ఎమ్మెల్యేలను రోడ్ల మీదికి పంపి బంద్ విజయవంతం చేయాలని ఆదేశించారు. ఇది వింతకాదా, అని దాసోజు ప్రశ్నించారు.
దాసోజు ఇంకా ఏమన్నారంటే…
వరదల్లో సర్వం కోల్పోయిన ఒక్క బాదితుడినైనా కేసీఆర్ పరామర్శించారా?
వ్యవసాయం మొత్తం వరదపాలై దిక్కు తోచిన స్థితిలో రైతు వుంటే.. ముఖ్యమంత్రిగా వాళ్ళ కష్టం తెలుసుకునే ప్రయత్నం చేశారా?
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదు.
నియంతృత్వ వ్యవసాయంతో రైతులను ఇబ్బందుల పాలు చేసింది కేసీఆర్ కాదా?
సన్న వడ్ల కు మద్దతు ధర ఇవ్వకుండా రైతులకు నష్టం కలిగించింది కేసీఆర్ కాదా?
మద్దతు ధర ఇవ్వండని రైతులు ఆందోళన చేస్తే వాళ్ళని పోలీసులతో దాడి చేయించారు.
ఇంటువంటి నియంత పోకడలతో రైతులని అష్టకష్టాలు పెడుతున్న కేసీఆర్.. రాష్ట్రంలో రైతులను మోసగించి, దేశ రైతులకు మద్దతు అని ప్రకటించడం విడ్డూరం.