ఆ రోజుల్లో నేతలు ఇలా ప్రజల కోసం కష్టాలు పడేవాళ్లు

1940,1950 దశాబ్దాలలో కమ్యూనిస్టుల చాలా పెద్ద రాజకీయశక్తి. కమ్యూనిస్టులను అణచేయాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి  చేస్తూ ఉంది. దున్నేవాళ్లందరికి భూమి ఇవ్వాలని కమ్యూనిస్టులు ఆరోజు భూపోరాటాలు చేస్తున్నారు. ఇందులో నీలం సంజీవరెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి, బావ తరిమెల నాగిరెడ్డి కూడా ఉన్నారు. సంజీవరెడ్డేమో మద్రాసు ప్రభుత్వంలో బాగా పేరున్న మంత్రి.జిల్లాలో  మాత్రం కమ్యూనిస్టుల ఉద్యమంలో తమ్ముడు బావ ముందున్నారు.  మద్రాసు ప్రభుత్వం కమ్యూనిస్టుల మీద, వాళ్ల ఉద్యమాల మీద  విపరీతంగా అణచివేత చర్యలు తీసుకుంది.చాలా మందికమ్యూనిస్టునేతలను జైల్లో వేశారు.   ఇందులో తమ్ముడుబావ కూడా ఉన్నారని గత ఇక్కడ చదివాం. జైలు బయట ఉన్న వారు రహస్యంగా పార్టీ పనిచేస్తున్నారు. ఇదీ నేపథ్యం ఇక చదవండి
(విద్వాన్ దస్తగిరి, విశ్రాంత ఉపాద్యాయులు. రచయిత)
మేము కడలూరు జైలులో వున్నప్పుడే మన జిల్లాలో అజ్ఞాతవాసంలో వున్న ఐదుకళ్లు సదాశివన్ గారి నాయకత్వాన శివాయిజమా పోరాటాలు జరిగినాయి. అనంతపురం జిల్లాలో మొట్టమొదటి శివాయిజమా పోరాటం ఎగువపల్లెలో ప్రారంభమైంది.
మావూరు (గ్యాదిగకుంట) చుట్టూ అన్నీ శివాయిజమా భూములే. ఏ పదిమందికో పట్టా భూములుండేవి. పట్టా భూములన్నీ తోటలే. పట్టాభూములకయితే పండినా పండకపోయినా శిస్తు కట్టాల్సిందే. శివాయిజమాలకైతే అట్లాకాదు. పంట పెడితేనే శిస్తు.లేకుంటే లేదు. అందువల్ల పట్టాలు చేయించుకోడానికి ఇష్టపడేవారు కాదు. అందువల్ల శివాయిజమాలుగానే సాగు చేసుకొనేవారు.
అప్పుడు  ఒక రూలు వుండేది ఏమిటంటే ఎవరికీ పట్టాలు ఇవ్వకూడదు అని. పార్టీ ఐదు ఎకరాలు పట్టా ఇవ్వాలని అర్జీలు పెట్టించింది.
అజ్ఞాతవాసంలోవున్న సదాశివన్ గారు శివయిజమా పోరాటం చేయించినారు. గ్యాదిగకుంట, వెంకటాపురం,ఎగువ పల్లె, పిచ్చిరెడ్డి కొట్టాల మొదలగు చోట్ల రైతులను సమీకరించి సభలు జరిపినారు.సదాశివన్ గారే ప్రత్యక్షంగా నాయకత్వం వహించి పోరాటాలు చేసినారు. రహస్య సమావేశాలు జరపడం,ప్లాను వేయటం, భూములు ఆక్రమించటం అన్నీ సదాశివన్ నాయకత్వంలోనే జరిగినాయి. 30 ఎకరాలు పైన వున్న రైతు భూములు మాత్రమే ఆక్రమించాలని  మొదట రైతులను ఒప్పించటం,వారు వదలిన భూములను ఆక్రమించటం – అట్లా ఎగువపల్లెలో కొందరు రైతులు వదలినారు –  ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఆక్రమించటమే. భూములకోసం పేద రైతులలో చైతన్యం పెరిగింది.వారు  ఇన్నాళ్ళు కూలీలుగా, కౌలుదార్లుగా, జీతగాళ్ళు గా వున్నారు.
ఈ పోరాటాల వల్ల వాళ్ళు భూమికి స్వంతదార్లు అయినారు. పోలీసులు 144 సెక్షన్ పెట్టినారు 30, 40 కేసులు పెట్టినారు. ధర్మవరం, పెనుగొండ, హిందూపురం కోర్టుల వెంబడి నెలల తరబడి కేసు వాయి దాలకు తిప్పినారు. సద్దులు కట్టుకొని తిరిగినారే కానీ పోరాటం వదలి పెట్టలేదు.  ఈ పోరాట కాలమంతా మా యింట్లోనే వున్నారు సదాశివన్ గారు. డిటెన్యులను విడుదల చేయాలని ఆందోళనలు జరిగినాయి.
చలిచీమల ముత్యాలప్ప
కడలూరు జైలులో రెండుసార్లు కాల్పులు జరిగి నాయి. 1950 ఫిబ్రవరి 11న  సేలం సెంట్రల్ జైలులో ఖైదీలపైన కాల్పులు జరిగినాయి. కమ్యూనిస్టులు, కిసాన్ సభ, అగ్రికల్చర్ యూనియన్ నేతలు 22 మంది చనిపొయినారు.  ఇందులో ఒక తెలుగు ఖైదీ ఉన్నాడు. ఆయన పేరు షేక్ దావూద్.

కమ్యూనిస్టు ఉద్యమంలో చలిచీమల ముత్యాలప్ప -5

కమ్యూనిస్టు ఖైదీలను ఎక్కువమందిని ఒకచోట లేకుండా అక్కడ కొంతమందిని,ఇక్కడ కొంతమందిని అంటే వేరు వేరు జైళ్లలోకి సర్దుబాటు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది.
దీనికి వ్యతిరేకంగా ప్రతి జైల్లోనూ నిరసన పోరా టాలు జరిగినాయి. కడలూరు జైల్లో మేము 18 రోజులు నిరాహారదీక్ష చేసినాము.అనారోగ్య కారణాలతో మినహా యింపబడినవారు తప్ప, అందరం నిరాహార దీక్ష చేసినాము.
నిర్ణీత కాల వ్యవధులలో గ్లాసెడు నిమ్మరసం తీసుకొనే వారం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అదే సమయంలోనే అనమర్ల పూడి సీతారామయ్య – రైతు సంఘ నాయకులు కృష్ణా జిల్లా –ఆయన ఖైదీలకు సంబంధించిన రేషన్ తెచ్చి యిచ్చే బాధ్యత నెరవేర్చుతున్నాడు. ఒకనాడు జైలరు,సూపరెంటెండు, అకస్మాత్తుగా వార్నింగు కూడా ఇవ్వకుండా  కాల్పులు జరిపినారు. నిర్దాక్షి ణ్యంగా. “వీళ్ళంతా మామీద దాడి చేయాలని చూస్తున్నారు”  అనే నెపం మోపినారు.  జైళ్లలోకూడా పోరాటం చేయాలనే ఒక సర్కులర్ మాకు అందింది. మా దగ్గర ఏమున్నాయి రాళ్ళు తప్ప? ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి జైలును ఒక యుద్ధరంగం చేసినాము. ఈ నిర్ణయం ఒక చర్చనీయాంశమే.  కానీ అప్పుడు అమలు పరచాల్సిందే. మేము ఒడిలో రాళ్ళునింపుకొని దడి కట్టుకున్నాము. చేతుల్లో కట్టెలు పట్టుకొని యుద్ధరంగంలో సైనికులు మాదిరి వరసలలో నిలబడినాము.జైలు గేటు దగ్గర పోలీసులు తుపాకులతో.ముందుకు రావడానికి మొదట పోలీసులు భయ పడినారు. వాళ్ళు చుట్టూ మొహరించి కాల్పులు జరుపుకుంటూ వచ్చినారు. మేము వెనక్కే వెనక్కే పోతూ అంతా ఒక చోటికి చేరుకున్నాం. చుట్టూ గోడ. పోలీసులు రావాల్లంటే రెండే చోట్ల అవకాశం.ముందుకు రావాల్లంటే  వాళ్ళకీ భయమే.పోలీసులు పైకి కాల్పులు జరుపుకుంటూ మా దగ్గరకు వచ్చినారు. మేము ఒక దావ దగ్గర కొంతమందిమి, మరోచోట కొంతమందిమి ఉన్నాము. నా పక్కన అటెండరు ఖైదీ వున్నాడు. ఖైదీలకు చిన్న చిన్న పనులలో సహాయం చేయడానికి కొందరు అటెండర్లను నియమిస్తారు. వాళ్ళను మేము కామ్రేడ్స్ అనే పిలుస్తాము.నా పక్కనున్నతను క్లాసులకు హాజరయ్యేవాడు. చైతన్యవంతుడు. అతను గోడచాటు నుండి తొంగి చూసినాడు. బులెట్ తగిలింది. చనిపాయ. నేను కొంచం పక్కకు జరిగినాను. వెంట్రుకవాసిలో నాకు తప్పింది కానీ,అదే వరుసలో వున్న తెలంగాణా కామ్రేడ్ రాఘవయ్యకు తగిలింది. ఆయనా  చనిపాయ. తాతినేని వెంకటేశ్వరరావు చేతి మణికట్టుకు తగిలింది. జి.రామకృష్ణకు కంటికి తగిలింది. కనుచూపు పోయింది. అంతకుముందే ఎ.కె.గోపాలన్, నేను, గణే నాయక్ ఇంకా కొందరు మొత్తం 10 మందిమి అన్యాయమైన డిటెన్ షన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేసినాం. మమ్ములను పోలీసులు డిల్లీ సుప్రీంకోర్టు కోర్టుకు హాజరుపరచినారు. ఎ.కె.గోపాలన్ మా తరపున వాదించి నాడు. అయితే కోర్టు మా అభ్యర్థనను తిరస్కరించింది. 1951 డిసెంబరు లో నన్ను విడుదల చేసినారు.
మా కుటుంబంలో నన్నుఉద్యమం నుంచి వెనక్కు లాగినవారులేరు. కుటుంబసభ్యులందరూ  సహకరించినారు. నేను లేనపుడు అజ్ఞాతవాసకాలంలో సదాశివన్ గారు మా ఇంట్లోనే రక్షణ తీసుకున్నారు. ఆయనకు అన్ని సహకారాలు  అందజేసి నారు మా కుటుంబ సభ్యులు. ఒకసారి పోలీసుల దాడి జరిగినప్పుడు మా మామ సల్లాడం, రుమాలు చుట్టుకొని, కంబడి వేసుకొని, చిక్కం చేతిలో పట్టుకొని  గొర్లోనిమాదిరి  వెళ్ళిపొయినాడు.  ఇంట్లో వాళ్ళంతా భయపడినారు. ఇన్నాళ్ళు కాపాడినదంతా వృథా అయిందే అనుకున్నారు. మా ఆమ్మకు బాగా లేకపోతే సదాశివన్ గారే  వైద్యం చేయించినాడు.
సదాశివన్ గారు పేదరైతులందరినీ సమీకరించి మడకలు కట్టించినాడు. మా దగ్గర బంధువు భూములూ ఆక్రమించినారు. ఇది మా మేనమామకు ఇష్టం లేకపోయినా వ్యతిరేకంగా ఏమి చేయలేదు. వెంకటాపురంలో చిన ముత్యాలప్ప –పార్టీ సభ్యుడు –శివాయిజమాభూముల ఆక్రమణకు నాయకత్వం వహించినాడు. గ్యాదిగకుంటలో బొమ్మయ్య, ముత్యాలప్ప ఇంకా కొంతమంది ఎగువపల్లి, ముత్యాలంపల్లి, పిచ్చిరెడ్డి కొట్టాల, గ్యాదిగకుంట, వెంకటా పురం రైతులను సమీకరించి శివాయిజమా పోరాటం చేసినారు. మొదట 300 ఎకరాలు స్వాధీనం చేసుకొని మడకలతో దున్నినారు. ఇది 1948లో జరిగింది. దాదాపు1600 ఎకరాల పంపకం జరిగింది.. కల్యాణదుర్గం, అనంత పురం తాలూకాలలో భూపోరాటాలు జరిగినాయి కుంటిమద్ది,న్యామద్దెల,పులేటిపల్లి, మేడాపురం గ్రామాలలో కూడా భూపోరాటాలు జరిగినాయి. కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం లోనే ఈ పోరాటాలన్నీ జరిగినాయి. పోలీసులు నూర్ల మంది పైన  కేసులు పెట్టి, కదిరి,హిందూపురం, పెనుగొండ కోర్టుల చుట్టూ తిప్పినారు. నేను జైలునుండి వచ్చిన తరువాత వేపకుంట,తగరకుంట, మేడాపురం, పులేటిపల్లి భూ పోరాటాల్లో పాల్గొన్నాను.
ఈ శివాయిజమా పోరాటాల వల్లనే కమ్యూనిస్టుపార్టీ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది. పార్టీ  ప్రతిష్ట పెరిగింది. ఈ ప్రభావం వల్లనే 1955 ఎన్నికలలో తరిమెల నాగిరెడ్డిని గెలిపించడానికి పోరాట ప్రభావమున్న అన్ని గ్రామాల నుండి ఎవరూ పిలుపు యివ్వకుండానే వారంతకు వారే   సద్దులు కట్టుకోని పుట్లూరుకు వచ్చినారు.
1955 ఎన్నికల తరువాత అంతర్గత చర్చలలో చానా సతమతమయింది పార్టీ.  పార్టీ పెరుగుదల తగ్గింది .నిర్మాణ పరంగా చాలా మార్పులు వచ్చినాయి.హోల్ టైమర్ లను స్వయం పోషకంగా వుండి పని చేయమన్నారు చైనా యుద్ధం వచ్చింది. పార్టీ చీలిక స్పష్టమైంది.
పార్టీ రెండుగా విడిపోవడానికి ముందు అన్ని స్థాయిల శాఖలలో ను చర్చలు బాగా జరిగినాయి. మా ప్రాంతంలోనూ ఈ గ్యాదిగకుంట లో పాఠశాల ఆవరణంలో సమావేశం జరి గింది. సదాశివన్ గారు హాజరైనారు. ఆయనా మాట్లాడినాడు. నేనూ మాట్లాడినాను. దాదాపు అందరూ మార్క్సిస్టు పార్టీ వైఖరినే బలపరచినారు. నేను మార్క్సిస్టు పార్టీ లో చేరినాను.
అయితే తరిమెల నాగిరెడ్డి(నీలం సంజీవరెడ్డి బావ) గారు మరలా చీలిపోయి నక్సల్బరీ ఉద్యమ నేత చారు మజుందార్ గ్రూపులో చేరినారు. (ఒక దశలో ఆయన అసెంబ్లీ జరుగుతున్న తీరును చూసి విస్మయం చెంది. ఇది ప్రజాసమస్యల పరిష్కారానికి పనికిరాదకి  రాజీనామా చేసి  పూర్తిగా విప్లవ కమ్యూనిస్టుగా మారిపోయారు. తర్వాత ఆయన చారుమజుందార్ తో కూడా విబేధించి సొంతంగా ఉద్యమం నడిపారు. ఆయన పార్టీపేరు యుసిసిఆర్ ఐ (ఎం ఎల్) అంటే Unity Centre of Communist Revolutionaries of India Marxist Leninist).నీలం రాజశేఖర్ రెడ్డి మాత్రం చివరి దాకా సిపిఐలోనే కొనసాగారు.)
అప్పటినుండి నేను ఏ కమ్యూనిస్టు పార్టీ లోను లేను. కమ్యూనిస్టుఉద్యమ సానుభూ తి పరుడుగా వున్నాను. నా ఆరోగ్యం కూడా సహకరించడం లేదు.సి.పి.ఐ.; సి.పి.యం పార్టీలకు నాకు తోచిన రీతి లో ఆర్థికంతో సహా సాయపడే వాన్ని. ఇప్పటికి నా అభిప్రాయ మేమంటే కమ్యూనిస్టు ఉద్యమం ఏకమై పని చేస్తేనే ఏమైనా ప్రజకు మేలు జరుగుతుంది. మంచి అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను ఉపయోచుకొని పని చేస్తే ప్రజా ప్రయోజనాలు సాధించగలం అనే నా ధృడమైన విశ్వాసం.
పార్టీలు వేరు కావచ్చు. కాని ఇరు పార్టీలలో గొప్ప నిజా యితీ పరులు, త్యాగవంతులు వున్నారు. అందరినీ నేను గౌరవిస్తాను.నాకు సదాశివన్ పట్ల గౌరవం ఎక్కువ. అయ న నుండి చానా నేర్చుకున్నాను. నిర్మాణం, వ్యక్తిగత ప్రవర్తనలు ,ప్రజలతో ఎట్లా మెలగాల?ఎట్లా సమీకరించల్ల అనే విషయాలు ఆయన నుంచే నేర్చుకున్నాను.  ఇప్పటికీ  సదాశివన్ గురించి ఇక్కడ చానా మంది అడుగుతూనే వుంటా రు.
నాకు గుండె ఆపరేషన్ జరిగింది. ఫేస్ మేకర్ అమర్చినారు.ఆ సందర్భంగా హైదరాబాదులో మఖ్దుం భవన్ లో వుండగా నన్ను చండ్రరాజేశ్వరరావు ఇంటికి పిలుచుకొని పోయినాడు సదాశివన్. అక్కడ రాజేశ్వరరావురావు గారిని చూడగానే కన్నీళ్ళు వచ్చినాయి. అంత త్యాగధనుడు ఎంత సింపుల్ గ వున్నాడు! అయన పేరిట పార్టీ వృద్దాశ్రమం నిర్మించడం చానా మంచి నిర్ణయం.
పార్టీఉద్యమంలో ఎన్నో పొగొట్టుకొని,ధనము,కాలము,కుటుంబము ఇలా ఎన్నో పోగొట్టు కొని, ఏమిలేక మిగిలిన కామ్రేడ్స్ కు పునరావాస కేంద్రంగా చండ్ర రాజేశ్వరరావు భవన్ ను ఏర్పాటు చేయ డం నాకు చానా సంతోషాన్ని కలిగించింది.
పార్టీలో పనిచేసినన్నాళ్ళు ఎవరిదీ ఏ కులమో తెలీదు. ఆర్థిక స్థాయి తెలీ దు. ఇప్పటికీ చానా మంది ఏకులం వాళ్ళో తెలీదు. కలుపుగోలుగా పనిచేసే వాళ్ళం.  పార్టీ సభ్యు లకు ఏదైనా ఇబ్బందులు వస్తే పార్టీ అండగా వుండేది.  నాకు తెలిసినంత వరకు ఒక్క అనంతపురం తాలుకాలో తప్ప మిగత చోట్ల నాయకత్వ పో టీ  సమస్య ఎదురు కాలేదు.
నేను జిల్లా కమిటీలో వున్నాను.నాయకత్వ సమస్య అనంతపురం తాలుకాలో ముఖ్యం గా గోపాలకృష్ణ వల్లనే వచ్చింది. కల్యాణదుర్గం శాఖలోను కొన్ని సమస్యలు వచ్చినాయి. చీలిక తరువాత చానా గ్రామాల్లో నిర్మాణాలు పోగొట్టుకున్నాము. ఈ అంశాన్ని మనం తీవ్రంగా ఆలోచించాలి. జనం అంతా కమ్యూనిస్టు పార్టీల వైపు చూస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు అలోచించుకావాలి. వారిదే బాధ్యత. (అయిపోయింది)
Vidwan Dastagiri

(విద్వాన్ దస్తగిరి, రచయిత, విశ్రాంత ఉాపాధ్యాయుడు. చలీచీమల ముత్యాలప్పతో ఇంటర్వ్యూ చేసి ఆయన మాట్లల్లోనే రాసిన నాటి కమ్యూనిస్టు ఉద్యమ విశేషాలు)

చలిచీమల ముత్యాలప్ప జ్ఞపకాలు 4వ భాగం ఇక్కడ చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/peasant-movements-in-anantapur-district/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *