భయం గుప్పెట్లో ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ గ్రామాలు…

(కెెఎస్ ఎస్ బాపూజీ)
అక్కడ ఆకు కదిలినా అనుమానమే…
చెట్టు ఊగినా భయమే.
గల గల పారేటి సెలయేటి చప్పుళ్లు కూడా ఆ గ్రామాల ప్రజల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయి…
ఒక పక్క కవాతు బూట్ల శబ్దాలు..
మరో పక్క మావోల నినాదాలు..
మధ్యలో అమాయక గిరిజనులు…
నోరు విప్పితే కేసులు.. పదం పాడెతే కేసులు..కొత్త ముఖం కనిపిస్తే బుల్లెట్ల దాడులు.. గొంతు వినబడితే అంతు చూసే చూపులు…
ఏం పాపం చేసుకున్నారో ఆ ప్రజలు నిద్రా హారాలు లేక పనులుకు వెల్లలేక, పస్తులు ఉండలేక నలిగిపోతున్నారు. ఆదరించే మనుషులు కరువయ్యారు.గోడు వినే నాధుడే కనిపించడంలేదు.. అటు ప్రభుత్వాలు గాని, ఇటు అధికారులు గాని పట్టించుకొని ఆ గిరి ప్రజల బతుకులు గాల్లో దీపాల్లా మారాయి.
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసే ఆ ప్రజల ఆసలు అడియాసలు అయిపోయి బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు. అభివృద్ధికి కి దూరంగా, అలక్ష్యానికి దగ్గరగా వున్నయి ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు గ్రామాలు. స్వాతంత్య్ర ఫలాలు అందుకోలేని ఆ గ్రామాల ప్రజలు ఇప్పుడు మావోలు, పోలీసుల మధ్య నలిగిపోతున్నారు.
ఎప్పుడు ఎవరు ఏ తుపాకి గుళ్ళకు బలైపోవలసి వస్తాదో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.  ఆ బోర్డర్ లో బతుకుతున్న ఆ జనాలు ఏ ప్రభుత్వానికి పట్టని అనాధలు.ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్న ఆ ప్రజల పరిస్థితి పై ప్రత్యేక కధనమిది.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల్లో వున్నాయి. విశాఖ జిల్లాలో అరకు, పాడేరు, విజయనగరం జిల్లాలో సాలూరు, పార్వతీపురం శ్రీకాకులం జిల్లాలో సీతంపేట, వంగర వంటి మండలాల్లో వందల గ్రామాలు సరిహద్దు ప్రాంతాల్లో వున్నాయి.
అభివృద్ధికి దూరంగా దట్టమైన అతవీప్రాంతాల్లో వున్న ఈ గ్రామాలు మావోలకు షెల్టర్ జోన్లుగా వున్నాయి. ఈ గ్రామాలన్ని రెంటికి చెడ్డ రెవడిలా మారిపోయాయి. ఈ గ్రామాలను రెండు రాష్ట్రాలు పట్టించుకోవడం మానేసాయి. దీంతో మావోయిస్ట్లు ఆ ప్రాంతాల్లో తలదాచుకొంటున్నరని పోలీసులు భావిస్తున్నారు.
రెండు రోజుల క్రితం  అంటే ఈ నెల 26 వ తేదీన ఆంధ్ర సరిహద్దుల్లో తుపాకీలు దద్దరిల్లాయి.సరిహద్దు ప్రాంతమైన తోటగుర అటవీ ప్రాంతంలో సుమారు 45 నిమషాలపాటు పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మిల్ట్రీ ప్లాటు ఇంచార్జ్ కిషోర్ మృతి చెందాడు.
కొంత మంది గ్రామస్తులు,  గాయపడ్డారు. కిషొర్ పై ప్రభుత్వం ఇదివరకే ఎనిమిది లక్షల రూపాయల రివార్డ్ ను ప్రకటించింది.  ఈ కాల్పుల ఘటనలో సుమారు పదిమంది గాయ పడ్డారని తెలుస్తుంది. ఈ ప్రాంతం నుంచి పెద్ద యెత్తున మందుగుండు, మారణాయుధాలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ ప్రాంతం లో మావోయిస్ట్ దళాధిపతి ఆర్కె తలదాచుకున్నారన్న అనుమానంతో ఈప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. అంగుళం అంగుళం గాలిస్తున్నారు.
దీంతో ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులుకు లోనవుతున్నారు. వందలాది మంది స్పెషల్ పోలీసులు ఈ ప్రాంతం లో నిత్యం తిరుగాడుతూ గిరిజనులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కొత్త ముఖం కనిపిస్తే చాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరో పక్క పోలీసులకు సమాచారం అందిస్తున్నారన్న నెపంతో కొంతమందిని మావోయిస్టులు అనుమానిస్తూ వారిని కొట్టి చంపుతున్నారు. ఇటు పొలీసులు, అటు మావోయిస్టుల మధ్య గ్రామ ప్రజలు నలిగి పోతున్నారు.
చత్తీస్ ఘడ్, ఒరిస్సా,  తెలంగాణా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలో వున్న ఈ గ్రామాల్లో నక్స్లైట్ల ప్రభావం ఎక్కువగావుంది. వీటిని అంతంచేసేందుకు ప్రత్యేక దళాలను, గ్రే హౌండ్స్ పోలీసులతో గస్తీ కాస్తున్నారు.  నక్సలిజాన్ని  అంతంచేసేందుకు ప్రత్యేక దళాలను, గ్రే హౌండ్స్ పోలీసులతో గస్తీ కాస్తున్నారు.
అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల మధ్య ఈ గిరిజనులు తీవ్ర ఇబ్బందులుకు నోచుకొంటున్నారు. ఇప్పుడు ఈ గిరిజనులకు కొంత ఉపశమనం కావాలి. ఒక ప్రశాంత  వాతావరణం నెలకొనాలని ఆ ప్రజలు కోరుకొంటున్నారు. ఆ గోడు వినే నాధుడు కోసం వారు వెదుకుతున్నారు. వారి బాధలు తీర్చే దేవుడుకోసం ఎదురుచూస్తున్నారు.
(కెఎస్ ఎస్ బాపూజీ, సీనియర్ జర్నలిస్టు, ఉత్తరాంధ్ర)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *