కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శుక్రవారం తిరుమల వసంత మండపంలో శ్రీ రాధా దామోదర పూజ ఘనంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల ఈ పూజా కార్యక్రమం జరిగింది.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ రాధాకృష్ణుల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేశారు.
ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ రాధ, కృష్ణుడు(దామోదరుడు) సకలసృష్టికి మూలకారకులని చెప్పారు.
ప్రకృతి స్త్రీ స్వరూపమని, సమస్త జీవరాశులు క్షేమంగా ఉండేందుకు రాధా దామోదర పూజను టిటిడి నిర్వహించిందని వివరించారు. స్వామి, అమ్మవారి అనుగ్రహంతో వ్యాధిబాధలు తొలగుతాయన్నారు.
ముందుగా కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి ప్రార్థనా సూక్తం, విష్ణుపూజా మంత్ర పఠనం చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ రాధాకృష్ణులకు తిరువారాధన చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ ఎన్ఎకె.సుందరవదనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.