సవర గిరిజనుల సాంప్రదాయ నృత్యం తోంగ్సెంజ్ ( అందెల రవళి ) నృత్యం డాక్యుమెంటరీ ఫిల్మ్ చిత్రీకరణలో ఉన్నాను.
ముందు విషయసేకరణకై శ్రీకాకుళం జిల్లా సీతంపేట అడవుల్లోని గూడేలకు వెళ్తుండగా 100 ఏళ్ళ పైగా వున్న ఈ పెద్దావిడ ఎదురు పడింది.
ఈ వయసులో కూడా ఎవరి సహాయంలేకుండా నడుచుకుంటూ పక్క గూడెం నుంచి తన గూడేనికి వెళ్తోంది. కారు ఆపి పలకరించా. భాష అడ్డంకి కావున నా గిరిజన సహాయకులతో మాట్లాడించడం ద్వారా ఇంటర్వ్యూ చేశాను.
వయసు లో వున్నప్పుడు తొంగ్సెంజ్ నృత్యమాడానని చెప్పింది. ఇప్పుడు ఆడతావా అని అడిగితే సమాధానం గా నవ్వింది. పండు ముసలితనంలో కాళ్ళుచేతులు , చెవులు కళ్ళు చక్కగా పనిచేయడం ఎవరిసహాంలేకుండా తన పని తాను చేసుకోగలగడం ఆమె గొప్ప తనం. నిజంగా అది అడివి ఇచ్చిన అదృష్టం.
కిలోమీటరు దూరంలోవున్న షాపు వెళ్ళడానికి కూడా టూ వీలర్ తీసే మన నగర ప్రజలం ఈ పెద్దావిడ ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపించింది.
సరదాగా ఆ అవ్వను కారు ఎక్కమని కోరాను. మన్నించి ఎక్కింది. వారి గూడెంలో దించాను. చల్లగా వుండు బిడ్డా అనే భావంతో ఆశీర్వదించింది. నిజంగా అది అదృష్టం.