అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నేత జేసీ పవన్ కుమార్ రెడ్డి చేపట్టిన బైక్ ర్యాలీ వివాదానికి దారి తీసింది. ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం మొదలై ఉద్రిక్తత నెలకొంది. తర్వాత పవన్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అనంతపురంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు. పవన్ కుమార్ను అదుపులోకి తీసుకుని, స్టేషన్ తరలించే క్రమంలో తెదేపా కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసు జీపును తెదేపా కార్యకర్తలు అడ్డగించారు.
అయినప్పటికీ పవన్ కుమార్ను రెండో పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరరం విడుదల చేశారు.
ర్యాలీ నిర్వహణకు పోలీసులను అనుమతి కోరినా ఇవ్వలేదని జేసీ పవన్ చెప్పారు. వైకాపా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామనే భయంతోనే తమకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి కేసులు ఎన్ని బనాయించిన భయపడేది లేదన్నారు. అధికారపక్షానికి ఒకలా ప్రతిపక్షాలకు మరోలా పోలీసులు నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శించారు