(సిఎస్ సలీమ్ బాషా)
అవును, క్రికెట్లో వన్డే లు మొదలుపెట్టడానికి కారణం వర్షం తో పాటు 46 వేల మంది ప్రేక్షకులు కూడా కారణమే. ఆస్ట్రేలియా ఇంగ్లండ్ జట్ల మధ్య మెల్బోర్న్ లో1970 డిసెంబర్ 31 నుండి 1971 జనవరి 5 దాకా ఐదు రోజుల పాటు జరగాల్సిన న్యూ ఇయర్ టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. దాంతో నిర్వాహకులు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి జనవరి 5వ తారీఖున ఒక నలభై ఓవర్ల ఒక్కరోజు మ్యాచ్ ను ఆడించాలని నిర్ణయించారు.
ఇంగ్లాండ్ కెప్టెన్ రే ఇల్లింగ్ వర్త్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్నుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు 39.4 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ఎడ్రిచ్ 119 బంతుల్లో 82 పరుగులు చేశాడు. 191 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 34.6 ఓవర్లలో( అప్పుడు ఓవర్ కి ఎనిమిది బంతులు వేసేవారు) ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. అలా 40 ఓవర్ల ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ జట్టును ఓడించి మొదటి వన్డే మ్యాచ్ ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో మొదటిసారిగా ఓడిపోయిన జట్టులోని( ఇంగ్లాండ్) బ్యాట్స్ మన్ ఎడ్రిచ్ తాను చేసిన 82 పరుగులకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం విశేషం!
ఈ మ్యాచ్ తర్వాత లెజెండరీ బ్యాట్స్ మన్ డాన్ బ్రాడ్మన్ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ” మీరు ఒక చరిత్ర సృష్టించబడడం చూశారు” అని చెప్పడం విశేషం. తర్వాత అది ఎంత చరిత్ర సృష్టించిందో ఆయనకు తెలియకపోయినా మనకు తెలిసింది.
అంతటితో అయిపోలేదు. అనూహ్యంగా మ్యాచ్ ను తిలకించడానికి 46 వేల మంది ప్రేక్షకులు స్టేడియంలోకి రావడం నిర్వాహకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది, ఏదో సరదాకి ఆడించిన ఒక రోజు మ్యాచ్ కి ఇంతమంది రావడం, పైగా ఆనందించడం వారిని ఆలోచనల్లో పడేసింది. కానీ ఒక్క విషయం మాత్రం వారికి అర్థమైంది.
ఐదు రోజుల పాటు(ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ లు ఆరు రోజుల పాటు జరిగేవి మధ్యలో ఒకరోజు రెస్ట్ డే ఉండేది. చాలా కాలం క్రితమే దాన్ని తీసేశారు) సుదీర్ఘంగా సాగే మ్యాచ్ లు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదని తెలిసింది.
ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల వన్డే మ్యాచ్ క్రికెట్ లోకి ప్రవేశించి ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ ని దాదాపుగా వెనక్కి నెట్టేసింది. దరిమిలా 1975 లో వన్డే ప్రపంచ కప్ మొదలైంది. అలా యాభై ఏళ్ళ క్రితం మొదలైన వన్డే క్రమంగా మరింత కొత్త రూపాన్ని సంతరించుకొని T 20 గా మరింత కుదించబడి క్రికెట్ రూపాన్ని మార్చేసింది.
భారత జట్టు తన మొదటి వన్డే మ్యాచ్ ను జూలై 13, 1974 లో ఇంగ్లాండుతో ఆడింది. రెండు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఢిల్లీలో హెడింగ్లీ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ భారత్ ను
నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 53.3 ఓవర్లలో (అప్పుడు వన్డే మ్యాచ్ అంటే అరవై ఓవర్లు)265 పరుగులు చేసింది.
అప్పటి డాషింగ్ బ్యాట్స్ మన్ బ్రిజేష్ పటేల్ 78 బంతుల్లో 82 పరుగులు చేయడం విశేషం. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 51.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ వన్డే మ్యాచ్ రెండు రోజులపాటు(జూలై 16-17) జరగడం విశేషం!
(సిఎల్ సలీమ్ బాషా స్పోర్ట్స్ జర్నలిస్టు, క్యమూనికేషన్ స్కిల్స్ కోచ్)