దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని విశాఖ వాతావరణ కేంద్ర తెలిపింది.
ఇది నైరుతి బంగాళాఖాతం దిశగా ప్రయాణించి తమిళనాడు – పుదుచ్ఛేరి మధ్య తీరం తాకనున్నట్లు వెల్లడించింది.
దీని ప్రభావంతో ఈనెల 24, 25 తేదీల్లో ఏపీలో సాదారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించారు.
రాయలసీమ, కోస్తాలలో 24వ తేదీన ప్రారంభమయ్యే వర్షాలు క్రమేపీ రాష్ట్రం మొత్తం వ్యాపిస్తాయని తెలిపారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది కాబట్టి రైతులు, సాధారణ ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని సూచించారు.
రేపు సోమవారం నుండి కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
గంటకు 55 -75 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం వుందన్నారు.
దీంతో సముద్రం అల్లకల్లోలంగా వుంటుంది కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా వెంటనే తీరానికి రావాలని సూచించింది.