పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది.
సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు.
శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు.
పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
పుష్పయాగానికి మొత్తం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు నుండి 4 టన్నులు, కర్ణాటక నుండి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కలిపి ఒక టన్ను పుష్పాలు, పత్రాలను దాతలు అందజేశారు.
ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం
శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులును టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.