నాటి కమ్యూనిస్టు యోధుడు చలిచీమల ముత్యాలప్ప జ్ఞాపకాలు (2)

అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతానికి  కమ్యూనిస్టు యోధుడు ముత్యాలప్ప. గ్యాదికుంట్ల ఆయన సొంతవూరు. 1944లోనే తన స్వగ్రామం గ్యాదికుంటలో మేడే  సభ జరిపారు. ఆ రోజుల్లోనే ఈ ప్రాంత భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపారు. ఆయన జీవిత విశేషాలు…
(విద్వాన్ దస్తగిరి, విశ్రాంత ఉపాద్యాయుడు, రచయిత)
1942 క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా  గాంధీజీ అరెస్టు జరిగింది. అనంతపురంలో వారం రోజులు పెద్ద బందు పాటించినాము.వి.కె. కొట్రేగౌడ్, తిరుమల రెడ్డి(ఆదోని), వన్నూర్ రెడ్డి(కళ్యాణదుర్గం) ఆదిశేషయ్య, జీవ రత్నమ్మ,సుందరరావు( ఐదుకల్లు రాజమ్మ గారి సోదరుడు) నేను,చురుకుగా  పాల్గొన్నాము. ఈ సందర్భంగానే రైలు అడ్డగించిన మాపై లాఠీఛార్జి జరిగింది. మోకాళ్ళపైనే కొట్టినందున నేనూ, ఐ.సుందరయ్య నడవలేక పోయినాము. జీవరత్నమ్మకూ పెద్ద దెబ్బలు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో  కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా యుద్ధ నినాదం ఇచ్చింది. అప్పుడు స్టూడెంట్ ఫెడరేషన్ మీద వ్యతిరేక ప్రచారం చేస్తూ కాంగ్రెసువాళ్ళు విడిపోయి స్టూడెంట్ కాంగ్రె సును ఏర్పరచుకున్నారు.
స్టడీసర్కిల్స్ కు హాజరైన వారిని పార్టీలోకి తీసుకొనే ప్రయత్నం జరిగింది. వెంటనే పార్టీ సభ్యత్వం యివ్వరు. ఆరు నెలలు ప్రొబేషన్ పీరియడ్ వుంటుంది. ఈ కాలంలో మా కార్యకలాపాల తీరు,గుణగణాలు చూసి అర్హత పొం దినవారికి వారికి మాత్రమే పార్టీ సభ్యత్వం ఇచ్చేవారు.నాకు, గోపాలకృష్ణ,గంగప్ప, యల్.కృష్ణారావులకు సభ్యత్వం యిచ్చినారు.
నేను పార్టీ ఆఫీసులోనే వుంటూ చదువుకున్నాను. పార్టీ ఆఫీసు కమలానగర్లో రఘువీరా టాకీస్ వెనక పక్క సందులో ఎనుగోడ్ల మంగమ్మ ఇంట్లో ఒక చిన్న రూములో వుండేది.ఆఫీసులో నాతోపాటు విద్వాన్ విశ్వం కూడా కొంతకాలం వున్నాడు. విద్వాన్ విశ్వం, నాగిరెడ్డి నవ్యసాహిత్యమాల పేరుతో పుస్తకాలు వేసేవారు.ఈ వ్యవహా రం ఎక్కువగా విశ్వంగారే చూసేవారు. సాధనకు వ్యాసాలు రాసేవారు.

చలిచీమల ముత్యాలప్ప -2


SSLC పరీక్షలు అయిన తరువాత పార్టీ ఆర్గనైజరుగా నన్ను  కళ్యాణదుర్గానికి పార్టీ పంపింది. అప్పటికి భంగిఎర్రిస్వామి పార్టీలోకి రాలేదు. నేనూ,భంగి రామప్ప, ఆనందరావు కలుసుకొని గ్రామాలు తిరిగి, పార్టీ మరియు రైతు సంఘ నిర్మాణాలకు పూనుకున్నాము.
కుందుర్పి, శెట్టూరు,కంబదూరు,నూతిమడుగు మొదలగు గ్రామాలలో ప్రయ త్నం చేసినాము. గ్రామాలకు పోవడం ,దండోరా వేయడం, హాజరైన జనాలకు రైతు సంఘ సమస్యలు వివరించడం .రాజకీయపరిస్థితులు చెప్పడం జరిగేది. గొట్టిపాటి సుబ్బారాయుడు మంచి పటుత్వమున్న కవి.” కమ్రమహారాజు” అనే కమ్మకుల పత్రిక వచ్చేది.
భార్యతో ముత్యాలప్ప
చాయాపురం గ్రామస్థుడు  పత్తిపాటి రంగప్పనాయుడు ప్రచురణ కర్త. ఈ పత్రికకు గొట్టిపాటి సుబ్బరాయుడు సంపాదకుడు. అయన రచనలు చాలా పత్రికలలో వచ్చేవి.భారతి,చిత్రగుప్త సాధన పత్రికల లో వచ్చేవి. జిల్లాలో ప్రసిద్ధుడు. అయన స్వంతవూరు కోనాపురం(కనగానపల్లి మండలం)  వదలి మా ఊర్లోనే వుండేవాడు.
రంగాగారి రైతు సంఘంలో పనిచేసేవాడు.మా గ్రామంలో బాలికలకు విద్య బోధిం చేవాడు.ఆయన భారతిరంగా గారిని రప్పించి ధర్మవరం మరి కొన్ని చోట్ల సభలు కూడా జరిపినాడు. రైతులను రంగాగారి రాజకీయాల వైపు మళ్ళించడానికి చాలా కృషి చేసినాడు. ఈ సమయంలోనే బెజవాడలో  ఆలిండియా రైతు(AIKS) మహాసభ జరిగింది.పెద్దఎత్తున జరిగింది. ఈ సభకు ఎగువపల్లి,గ్యాదిగకుంట, వెంకటాపురం, గంగంపల్లి ,ఇంకా కొన్ని గ్రామాలనుండి దాదాపు 30 మంది ధనిక మోతు బరి,మధ్యతరగతి రైతులు పోయినాము.
ఆ సభలో మనవాళ్ళే ప్రత్యేకంగా కనపడినారు.రుమాళ్ళు చుట్టుకోవటం ,పంచకట్టు –ఇట్లాంటి వాటితో ప్రత్యేకంగా కనపడినారు. గొట్టిపాటి సుబ్బరాయ కవి గూడా హాజరైనాడు. రంగా గారు ఈ మహాసభను వ్యతిరేకించినాడు. ఇది రైతు సంఘం కాదు.కమ్యూనిస్టుల సంఘం.దేశవ్యతిరేకుల సంఘం. దేశ స్వాతంత్ర్యానికి వెన్నుపోటు పొడుస్తున్నా రని అని మహాసభను వ్యతిరేకించినాడు.
రంగా అనుయాయి ఐన గొట్టిపాటి సుబ్బారాయుడు వచ్చిన రైతులలో కొందరిని తీసుకొని నిడుబ్రోలుకు రంగాగారి దగ్గరకు పిల్చుకొని పోయినాడు. కానీ గ్రామాలకు తిరిగి వచ్చిన తరు వాత ఆయన వెంబడి ఎవరు పోలేదు అంతా మన రైతుసంఘం తోనే వున్నారు. అందువల్ల ఆయన రైతు సంఘానికి పోటీగా ‘గ్రామ రక్షణ సంఘం’ ఏర్పాటు చేసినాడు. విజయవాడ రైతు మహాసభలకు ముందే మేము గ్రామాలు తిరిగి రైతుసంఘాలు ఏర్పాటు చేసినాము.
మా గ్రామాల్లో ఆ రోజుల్లో భూస్వా ములు, రెడ్లే ప్రజాపీడకులు. వీరి ప్రాబల్యం ఎక్కువ, రెడ్ల కు ఏదైనా పని బడితే మొదట వారి పని చేసి –వెట్టిచాకిరి కూలి లేదు ఏమి లేదు- తరువాతనే సొంత పని చేసుకోవా ల్సి వుంటుంది. పదును అయిందనుకోండి మొదట రెడ్లకు విత్తనం వేసి తరువాత రైతులు విత్తుకోవల్ల.తలారితో గ్రామాలకు చెప్పంపేవారు ఫలానా రోజున మడకలు రావల్ల, కాన్లు రావల్ల, బండ్లు రావల్ల అని. చిన్నచితకా రైతులు బీదాసాదా వారి ఆజ్ఞలు పాటించితీరాలి. ఇట్లా వాళ్ళ పనులు చేసిన తరువాతనే రైతులు స్వంత పనులు చేసుకోవల్ల.
  రెడ్డి(గ్రామాధికారి) భూపంపకం చేస్తాడు. ఆయన కేటాయించినవారికే ఆ భూమి, సహజంగా ఆ భూములు పొంది న వారు రెడ్డి బంధువులో ఆప్తులో అయివుంటారు. సాగు చేసుకోగా మిగిలిన భూమి బంజరుగా నైనా వుండాలి తప్ప వేరేవారు కన్నెత్తి చూడ  గూడదు. గ్రామ రెడ్డే  గ్రామ మునసఫు. అంతా ఆయన చేతిలో వుండేది.ఈ రెడ్లకు వందలా ది భూములుండేవి. ఈ రెడ్ల బంధువులే  కల్లు,సారాయి అంగళ్లు చేసేవారు. ఇంకొందరు పోలీసులతో లాలూచి ఒప్పందాలు చేసుకున్నారు. ప్రజల తగాదాలను పోలీసు స్టేషన్ లో పంచాయితీలు చేసి డబ్బులు వసూలు చేసేవారు తలాయింత పంచుకొనేవారు. ముఖ్యంగా జనాన్ని భయ పడిచ్చి వారిని తమ అదుపులో వుంచుకొనేవారు.
గ్రామ రైతులకు చదువు రాదు. పట్టణాలు చూడలేదు. వెనుకబడిన గ్రామాలు. ఈ రెడ్లే పంచాయు తులు చేసేవారు, డబ్బు లు వసూలు చేసేవారు. అధికారులకు, పోలీసులకు లంచాలు ఇప్పించేవారు. దానిలో  నిర్ధా రించిన తమ వాటా తమకు దక్కేది. కొట్లాట జరిగితే వీరే పంచాయితీ చేయాలి.వాళ్ళు వాళ్ళు రాజీ పడితే కుదరదు. రెడ్డి దగ్గర పంచా యితిలోనే తెగల్ల. రెడ్డికి తప్పు (జరిమానా)  కట్టించల్ల  గ్రామాలన్ని వారి గుప్పిట్లో ఉండేవి. నసన కోటలో నసనకోట రెడ్లు, ముత్తపుకుంటలో ముత్తపుకుంట రెడ్లు, పేరూరులో పేరూరు రెడ్లు – పేరూరు,పాళ్యం, చెన్నంపల్లిలో కురవ రెడ్లు, మిగతా చోట్ల కాపు రెడ్లు- ఎవరు ఎవరైనా రెడ్డి రెడ్డే. దోపిడీ చేసేవారు.
గొట్టిపాటి సుబ్బ రాయుడు ‘కమ్ర పత్రిక’కు సంపాదకుడుగా ఉండేవాడు. హైదరాబాదులో ‘పంచాయతీ’ పత్రికకూ ఎడిటర్ గా వున్నాడు. స్థిరత్వం లేని మనిషి.కలుపుగోలుతనం వుంది. మంచి చదువరి. స్వంత ప్రయత్నం తో  విద్య సంపాదించినాడు. ఆయన రెడ్ల వైపు  చేరినాడు.
ముత్తపుకుంట చిన్నపరెడ్డి తో స్నేహం చేసి ‘గ్రామ రక్షణ సంఘం’ అనే పేరుతో సంఘాలు పెట్టినా డు. కమ్యూనిస్టు పార్టీ రైతుసంఘాలకు  వ్యతిరేకంగా  ఆయన కరపత్రాలు వేస్తే ఆ కరపత్రాలలోని అంశాలు వ్యతి రేకిస్తూ మేమూ కరపత్రాలు వేసేవారము. తరువాత ఆయన ఇక్కడినుండి వెళ్ళిపొయినాడు.
Vidwan Dastagiri
(దస్తగిరి  గ్యాదిగకుంటలో సి.ముత్యాలప్ప చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా )

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/anantapuram-communist-leader-chali-cheemala-mutyalppa-memoirs/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *