శేషాచలం అడవిలో త్రిశూల తీర్థానికి ట్రెక్

(భూమన్)
దీనిని త్రిశూల ధార లేదా త్రిశూల తీర్థం అంటారు. తిరుపతి నుంచి కుక్కలదొడ్డి దాక వెళ్లి అక్కడి నుంచి బాలపల్లి చేరుకోవాలి.అక్కడి నుంచి త్రిశూల ధారకి చేరుకోవడం సులభం.
ఇదే దారి గుండా అడవిలోకి ఏడెనిమిది కిలో మీటర్లు ప్రయాణంచి ఏడమవైపు ఉన్న లోయలోకి దిగితే కలివిలేటి కోన అనే ప్రాంతం చేరుకుంటాం. అక్కడి నుంచి ఎడమ వైపు దారి బట్టి కొద్ది దూరం వెళ్లితే త్రిశూల ధారకు చేరుకోవచ్చు. ఈ దారి గుండా యాత్ర ఆమోఘం. చాలాసార్లు కలివిలేటికోన దాకా వచ్చినా త్రిశూల ధార గురించి తెలియనే తెలియదు.
ఈ మధ్యే ఎవరో చెబితే, అది తప్పకచూడాలని ఈ యాత్ర చేపట్టాను. త్రిశూల ధారలో ఉన్న గుండం చాలా పెద్దది. తల కోన శిరోధార లో ఉన్న గుండం కన్నా ఇది చాలా పెద్దది. ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టమే. ఈ లోయ అంచునుంచి ప్రయాణమంతా సాగుతుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న సర్రున జారి రాళ్లమీద, బండల మీద పడి దొర్లుకుంటూ గుండంలో పడిపోతాం. మాకు అటవీ శాఖ సిబ్బంది సాయం చేయడంతో సులభంగా త్రిశూల ధారకు చేరుకోలిగాం.
ఇక్కడికి చేరుకోగానే జలపాతం మీకు కనువిందుచేస్తుంది.  ఎంత అందమయిన జలపాతమో ఇది. మాటల్లో చెప్పలేం. చూసి తీరాలి. జలపాతంలోకి వెళ్లడం, దూకుతున్న నీళ్లలో జలకాలడటం, మడుగులో ఈదులాడటం… గొప్ప అనుభూతి. మా బృందంలో  16  మంది ఉన్నా, సాహసంతో లోయలోకి దిగి జలపాతం,  గుండం దాకా వెళ్లగలిగింది కొందరమే.  ఆరేడు మంది రాలేక పైన కొండమీదే ఉండిపోయారు. ఇందులో డెబ్బైయేళ్ల పైబడిన వ్యక్తిని నేనే.మిగతా వాళ్లంతా 50 నుంచి 55 యేళ్ల వాళ్లు. 75 యేళ్ళ పైబడిన వాడినైన నేనిలా అడవులు,  కొండలు గుట్టలను ఎక్స్  ప్లోర్ చేస్తూ వంటే ఉత్తేజం పొంది  ‘మేమూ వస్తాం సర్ ’ అని నాతో కలసి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.
శేషాచలం అడవుల్లో ఉన్న మరొక అద్భతమయిన గుండమిది.  ఇలాంటి ప్రకృతి సౌందర్యాన్ని తిలికించేందుకు పరిమిత సంఖ్యలోనైనా అటవీ శాఖ వారు ట్రెకర్స్ ను అనుమతించాలి. ఎందుకంటే ఇది చాలా సాహసోపేతమయిన ట్రికింగ్ . గొప్ప అనుభవం. ప్రకృతి ప్రేమికులు తప్పక ఈ అందమయిన ప్రాంతాన్ని ఇష్టపడతారు.  ఇక్కడ ఎన్ని రకాల పక్షులను చూడవచ్చో చెప్పలేం. వాటి కిలకిలా రావాలు మనసును చాలా తేలికపరుస్తాయి.  చాలా మంది యువకులు ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. నిజానికి ఇక్కడ కొద్దిగా జనసంచార మొదలయితే స్మగ్లింగ్ కూడా ఆగిపోతుంది. ప్రభుత్వానికి రాబడి కూడా వస్తుంది.  ఇది నా మొదటి యాత్ర.  అయితే, మళ్లీ మళ్లీ చూడాలనిపించే అరుదైన ప్రదేశం.

(భూమన్ ప్రకృతి ప్రేమికుడు, అలుపెరగని అన్వేషకుడు. తిరపతి కాలేజీలో ప్రొఫెసర్ గా రిటైరయ్యారు. గొప్ప వక్త, అంతకు మించి ఉత్తేజకరమయిన  టీచర్.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *