సినిమాలో పాటలుంటాయి. సినిమా విజయానికి సంగీతమూ పాటలూ చాలా ముఖ్యం. ఈ విషయానికి 60-80 దశకాల్లో చాలా ప్రాముఖ్యత వుండింది. రాను రాను ఈ ప్రాముఖ్యతను, సంభాషణలూ, సన్నివేశాలు పంచుకున్నాయి. సినిమాలో పాట వుండటం సరే, ఒక వేళ పాటలోనే సినిమా వుంటే? బాలీవుడ్ చిత్ర సీమలో ఇలాంటి కొన్ని పాటలు వచ్చాయి.
ఒక చిత్రం లో ఆ పాటను లేకుండా వూహిస్తే చిత్రమే కనుమరుగై పోతుంది. దీన్నే ఆ సినిమాకి సిగ్నేచర్ సాంగ్ అనొచ్చు. ఒక చిత్ర విజయం మొత్తం ఒక పాట మీద అధార పడి వుండటం అన్నది బాలీవుడ్ లో కొన్ని సినిమాల విషయం లో జరిగింది. ఇందులో గొప్పతనమేమీ లేదు. కానీ ఆ పాట కోసం అహం వల్ల కానీ, మరేదైనా కారణంగా కానీ నిర్మాతా/దర్శకులు, తార స్థాయి హీరో, హీరోయిన్లు కరాఖండీగా తీసుకున్న నిర్ణయాల తో రాజీ కి రావడమన్నది కళ ల కున్న శక్తిని సూఛిస్తుంది.
బాలీవుడ్ సినీ జగత్తులో బి.ఆర్. చోప్రా మకుటం లేని మహరాజు. 60, 70 దశకాల్లో బి. ఆర్ ఫిల్మ్ స్ బానర్ కింద నయాదౌర్ (1957), గుమ్రాహ్ (1963), వక్త్ (1965), హమ్రాజ్ (1967) లాంటి గొప్ప హిట్ చిత్రాలు వచ్చాయి. సంగీత పరంగా కూడా ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి. అయితే బి. ఆర్. చోప్రా సినిమాల్లో ప్రఖ్యాత గాయకులు మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడిన పాటలు చాలా తక్కువ. ఈ సినిమాల్లో మేల్ వాయిస్ కి మహేంద్ర కపూర్ ను, ఫిమేల్ వాయిస్ కి ఆషా భొస్లే లను వుపయోగించటం జరింగింది. అప్పట్లో తారస్థాయి గాయకుడిగా వెలుగుతున్న రఫీ ని బి. ఆర్. చోప్రా కావాలనే తన చిత్రాల్లో పాడించొద్దని తన సంగీత దర్శకులకు (ముఖ్యంగా సంగీత దర్శకుడు రవీ కి) సూచన లిచ్చినట్లు దాఖలాలున్నాయి.
బి. ఆర్. చోప్రా తీసిన సినిమాల్లో, నయా దౌర్ (1957, సంగీతం ఓ.పి.నయ్యర్), లో అన్ని పాటలకు మేల్ వాయిస్ మహమ్మద్ రఫీ యే) కానీ ఆ తరువాతి బి. ఆర్. చోప్రా సినిమాల్లో మహమ్మద్ రఫీ పాటలు దాదాపు లేనట్లే. దీనికి సినీ జనాలు రెండు కథనాలు చెబుతారు.
ఒక కథనం ప్రకారం, బి ఆర్ చోప్రా రఫీ ని తన సినిమాల్లో మాత్రమే పాటలు పాడాలనీ, వేరే ప్రొడక్షన్సు లో పాడకూడదని అంక్ష పెట్టి, ఈ మేరకు ఒక కాంట్రాక్టు సంతకం చేయమన్నాడట . దీనికి రఫీ ఒప్పుకో లేదు. “అయితే నా సినిమాల్లో నువ్విక పాడటానికి వీల్లేదు. నేను రెండొ రఫీ ని సృష్టిస్తాను” అని, రఫీ తో తన సినిమాల్లో పాటలు పాడించ వద్దని సంగీత దర్శకులకు సూచనలిచ్చాడట. బి. ఆర్. చోప్రా.
మరో కథనం ప్రకారం, ఒక పాటను మహమ్మద్ రఫీ, మహేంద్రకపూర్ తో కలిసి పాడాల్సి వచ్చింది. వీరిద్దరి సంబంధం గురు శిష్యుల అనుబంధం. మహేంద్రకపూర్, రఫీ ని గురువుగా తలచే వాడు. ఈ పాట గురించి మహమ్మద్ రఫీ సంగీత దర్శకుడు రవి తో “మా ఇద్దరి గొంతుకలు దాదాపు ఒకే రకంగా వుంటాయి. మేమిద్దరం కలిసి ఒక పాట పాడటం మా మధ్య వున్న గురు శిష్యుల సంబంధానికి అంత మంచిది కాదు. మా ఇద్దరిలో ఎవర్నో ఒకర్ని మార్చండి” అన్నాడట . ఈ విషయం తెలుసుకున్న బి. ఆర్. చోప్రా, మహేంద్ర కపూర్ ముందునుంచే వున్నాడు కాబట్టి ఆయన్ని వుంచండి. రఫీ నే తొలగించండి అన్నాడట. అంతే కాదు ఇక రఫీ తో మన సినిమాల్లో పాటలు పాడించకండి అన్నాడట.
కథనం ఏదయినా, రఫీ తో తన సినిమాల్లో పాటలు పాడించ వద్దని బి. ఆర్. చోప్రా సంగీత దర్శకులకు సూచన జారీ చేసింది మాత్రం వాస్తవం. ఆ రకంగా మహమ్మద్ రఫీ బి. ఆర్. చోప్రా సినిమాలకు దూరమయ్యాడు.
మహమ్మద్ రఫీ అంటే మొదటి నించీ రవీ కి చాలా ఇష్టం. బి. ఆర్. చోప్రా సినిమాల్లో తన సంగీత దర్శకత్వం లో రఫీ తో పాటలు పాడించలేక పోవడం అతడికి చాలా బాధ గా వుండేది. ఏ మాత్రం తనకు అవకాశం దొరికినా అతడు పాటలన్నీ రఫీ తోనే పాడించే వాడు. దీనికి చిన్న ఉదాహరణ 1963 లో వచ్చిన “గుమ్రాహ్”, “ఉస్తాదోంకే ఉస్తాద” సినిమాలు. రెండింటికీ రవీ యే సంగీత దర్శకుడు. బి. ఆర్. చోప్రా దర్శకత్వం వహించిన గుమ్రాహ్ లో రఫీ తో ఒక్క పాటకూడా పాడించలేక పోయాడు రవి. అదే బ్రిజ్ దర్శకత్వం వహించిన “ఉస్తాదోంకే ఉస్తాద్” సినిమాలో వున్న ఆరు పాటల్లో రఫీ అయిదింటిలో పాడాడు. ఒక్కటి ఆశాభొస్లే సోలో.
ఇది ఇలా వుండగా 1965 లో “వక్త్” సినిమా వచ్చింది. ఇది సూపర్ హిట్ సినిమా . దీనికి నిర్మాత బి. ఆర్. చోప్రా దర్శకుడు, యాష్ చోప్రా, సంగీతం రవి.
ఈ సినిమాలో టైటిల్ సాంగ్ తప్పిస్తే మిగతా పాటలన్నీ మహేంద్ర కపూర్, ఆశాభొస్లే పాడారు. ఆ సినిమా టైటిల్ సాంగ్
“ వక్త్ సే దిన్ ఔర్ రాత్, వక్త్ సే కల్ ఔర్ ఆజ్….” అనే పాటను సాహిర్ లుధియాన్వి రాశాడు.
కాలం మనిషి జీవితం లో తెచ్చే అనూహ్యమైన మార్పులనూ, దాని శక్తిని వర్ణిస్తూ రాసిన ఈ పాట వక్త్ సినిమా ఏమిటో చెబుతుంది. ఈ పాటే సినిమాకి ప్రాణం. దీన్ని రవి చాలా కమిట్మెంటు తో స్వరపరిచాడు. రవి స్వర పరిచిన ఈ పాట మొదలు పెట్టే సాకీ,
కల్ జహా బస్తీ థీ ఖుషియా, ఆజ్ హై మాతం వహా. వక్త్ లాయాథా బహారె, వక్త్ లాయా హై ఖిజా (టూకీగా దీని అర్థం: నిన్నటి వరకూ ఎక్కడైతే సంతోషాలు వెల్లివిరిశాయో, ఈ రొజు అక్కడ శోకం అలుముకుంది. ఆహ్లాదకరమైన ఋతువుల్ని అందించిన కాలమే మండు వేసవినీ తెచ్చింది)
హెచ్చు స్థాయి లో వుంటుంది. ఈ బాణీకి రఫీ గొంతుక అయితే బావుంటుందనీ అప్పుడే పాట గాంభీర్యం నిలుస్తుందని రవి అభిప్రాయ పడ్డాడు. చివరికి తెగించి ఈ విషయాన్ని బి. ఆర్. చోప్రా తో చెప్పాడు. చాలా తర్జన భర్జన తరువాత బి. ఆర్. చోప్రా చివరి నిర్ణయం రవికే వదిలేస్తూ సంగీతానికున్న గౌరవాన్ని నిలబెట్టాడు. అతడు రవి తో “నువ్వు సంగీత దర్శకు డివి, పాటల గురించి నీకు బాగా తెలుసు, నీకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యి” అన్నాడట శుభం. పాట రికార్డు అయింది. పాటా, చిత్రం రెండూ సూపర్ హిట్ అయ్యాయి.
ఇప్పుడు పాట పాడిన మహమ్మద్ రఫీ లేడు, స్వర పరిచిన రవి లేడు, అడ్డుకునేందుకూ, అంక్షలు పెట్టెందుకూ బి. ఆర్. చోప్రా లేడు. కానీ పాట మాత్రం వుంది. కాల మహిమను విస్మరించిన వారి వెన్ను తట్టి జాగరూకం చేసే సందేశాన్ని ఇస్తూ.