తెలంగాణ రాజకీయాల్లోకి పవన్… జిహెచ్ ఎంసిలో బిజెపితో పొత్తు?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపి గెలుపు కోసం కృషి చేయ బోతున్నారా? . ఆయన భారతీయ జనతా పార్టీ పొత్తుపెట్టుకుంటున్నట్లు సమాచారం అందింది.
కొద్దిసేపటిలో తెలంగాణా బిజెపి నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. జిహెచ్ ఎంసి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను నిలబెడుతుందా లేకా కేవలం బిజెపి అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తుందా అనేది ఈ సమావేశంలో తేలుతుంది.
జనసేన ఇంతవరకు ఒకే ఒక్క సారి 2019 ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.   ఘోరంగా పరాజయం పాలయింది. అపుడు ఆంధ్రలో ఒక్కరే గెలిచారు. ఆ ఒక్కరు పవన్ కల్యాణ్ కాదు. 2014లో కేవలం ప్రచారం చేసింది.
తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాలు  మొదలే కాలేదు. పోటీ చేసే అవకాశమే రాలేదు. వైసిపి జగన్ లాగే పవన్ కూడా తెలంగాణ రాజకీయాల్లో  ప్రవేశించడం లేదు.
ఇపుడు బిజెపితో పొత్తు కుదిరితే అది తెలంగాణలో జనసేన మొదటి రాజకీయ కార్యక్రమం అవుతుంది. దీని పర్యావసానమెలా ఉంటుందో వూహించడం కష్టం. పవన్ టిఆర్ ఎస్ ప్రభుత్వం మీద బిజెపి లాగా విమర్శలు గుప్పించగలరా?
జనసేనకు తెలంగాణ రాష్ట్రసమితితో చేదు అనుభవాలున్నాయి. ఒకపుడు ఆయన టిఆర్ ఎస్ తో పాటు పార్టీ అధినేతను తీవ్రంగా విమర్శించారు. అపుడు  టిఆర్ ఎస్ విమర్శల ఎదురు దాడికి భయపడే ఆయన జనసేనను ఆంధ్ర పార్టీ చేశారని చాలా  మంది భావిస్తారు. ‘‘ఆంధ్రోళ్లకు తెలంగాణలో పనేమిటి?’’ అనేది టిఆర్ ఎస్ పార్టీ ఆంధ్రపార్టీల మీద చేేసే విమర్శ.
మధ్యలో  ఒకటి రెండు సార్లు కెటిఆర్ తో కలసి పవన్ ఫోటోలు దిగినా, అది తెలంగాణలో జనసేనను ముందుకు  తీసుకు వెళ్లలేదు. ఈ రోజు సమావేశంలో ఏమవుతుందో చూడాలి.
పొత్తు సమావేశం గురించి జనసేనప్రకటన విడుదల చేసినా, భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాష్ట్రబిజెపి అధ్యక్షు డ బండిసంజయ్ పొత్తు ఉండదని, ఇప్పటికే అభ్యర్థులను ఖరారుచేశామని ప్రకటించడం ఆశ్చర్యం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *