(చందమూరి నరసింహారెడ్డి)
తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో అనేక రచనలు, హరికథలు ,నవలలు, కావ్యాలు, నాటకాలు రచించిన కవిసార్వభౌముడు.
దేశభక్తిని ప్రబోధిస్తూ తన సాహిత్యం తో ప్రజా చైతన్యం కోసం కృషి చేసిన మహానుభావులు దుర్భాక రాజశేఖర.
దుర్భాక రాజశేఖర అక్టోబర్ 18, 1888 సర్వధారి సంవత్సర కార్తీక శుద్ధ పంచమి. వైఎస్ఆర్ జిల్లా జమలమడుగు గ్రామంలో జన్మించారు.తండ్రి దుర్భాక వెంకటరామయ్య,తల్లి సుబ్బమాంబ.ములికి నాటి శాఖీయ బ్రాహ్మణులు.
1907లో కడప ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడైనాడు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఎ.చదువుతూ మధ్యలో ఆపివేశాడు.
1904-1907ల మధ్య కందాళ దాసాచార్యులు, జనమంచి శేషాద్రిశర్మల వద్ద సంస్కృతాంధ్రాలు, నాటకాలంకార శాస్త్రాలు ను నేర్చుకొన్నారు.
1908 నుండి ప్రొద్దుటూరు లోని జిల్లా మునసబు కోర్టులో గుమాస్తాగా పనిచేసి గాంధీ ఉద్యమ ప్రభావంతో 1921లో ఉద్యోగం మానివేశాడు. ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు.
1928లో వైస్ ఛైర్మన్‌గా ఉన్నాడు.1927-1932 ల మధ్య ప్రొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. మద్రాసు సెనేట్ సభ్యుడిగా, వేదపాఠశాల కార్యదర్శిగా సేవలను అందించాడు.
చరిత్రను కథావస్తువుగా చేసుకొని, దేశభక్తిని రేకెత్తించే మహాకావ్యాలు లేని కాలంలో దేశభక్తిని ప్రబోధిస్తూ దుర్భాక రాజశేఖర శతావధాని మొట్ట మొదట రాణా ప్రతాపసింహుని చరిత్రను1912లో దుర్భాక రాజశేఖర ‘రాణాప్రతాపసింహ చరిత్ర అనే మహాకావ్యంగా మలచారు.
1912లో దుర్భాక రాజశేఖర శతావధానికి గడియారం వేంకట శేషశాస్త్రి తో పరిచయం ఏర్పడింది. అది మైత్రిగా మారింది.
20వ శతాబ్దం ఆరంభంలో ఆంధ్ర దేశంలో జంట కవిత్వం ఒక వాడుకగా మారింది. తిరుపతి వేంకటకవులు, కొప్పరపు సోదరకవులను అనుసరించి అనేక మంది జంట కవులు బయలు దేరారు.
ఆ పరంపరలో రాయలసీమకు చెందిక కవులు దుర్భాక రాజశేఖర శతావధాని , గడియారం వేంకట శేషశాస్త్రి ఇరువురూ “రాజశేఖర వేంకటశేషకవులు” పేరుతో జంటగా అవధానాలు చేయడం ,కవితారంగం ప్రారంబించారు.
ఈ కవులు ఇద్దరూ 1920-28ల మధ్య జంటగా అవధానాలు అసంఖ్యాకంగా చేశారు. వీటిలో అష్టావధానాలు, ద్విగుణిత అష్టావధానాలు, శతావధానాలు ఉన్నాయి.
కడప జిల్లా దాదిరెడ్డిపల్లె, ప్రొద్దుటూరు,జమ్మలమడుగు, నెమళ్ళదిన్నె, చెన్నూరు, కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ, అనంతపురం జిల్లాలోని గుత్తి తో పాటుగా నెల్లూరులో కూడా అవధానాలు చేశారు.
శరన్నవరాత్ర పద్యావళి, వీరమతి అనే కావ్యాలు జంటగా రచించారు. సువర్ణ కంకణాది ఘన సన్మానాల్ని అందుకున్నారు.
ఆ అవధాన జైత్రయాత్రా విశేషాల్ని స్పష్టపరిచే గ్రంథమే ‘అవధానసారం’.
ఈ జంటయాత్ర 1935 వరకూ నిరాఘాటంగా కొనసాగింది. తర్వాత వీళ్ళిద్దరూ స్వతంత్ర కావ్య రచనాభిలాష వల్ల విడిపోయారు.
రాణాప్రతాపసింహచరిత్ర,
అమరసింహచరిత్ర,
వీరమతీ చరిత్రము,
చండనృపాల చరిత్రము,
పుష్పావతి,
సీతాకల్యాణము (నాటకము),
సీతాపహరణము(నాటకము),
వృద్ధిమూల సంవాదము (నాటకము),
పద్మావతీ పరిణయము (నాటకము),
విలయమాధుర్యము,
స్వయంవరము,అనఘుడు
గోదానము,శరన్నవరాత్రులు
అవధానసారము, రాణీసంయుక్త (హరికథ),
తారాబాయి (నవల),
టాడ్ చరిత్రము,రాజసింహ
ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లంలో),
కామేశ్వరీ స్తోత్రమాలా (సంస్కృతంలో) ఇలా అనేక రచనలు చేశారు.
అనేక సన్మానాలు, సత్కారాలు అందుకొన్నారు.
కావ్యకళానిధి, కవిసింహ, అవధాని పంచానస, కవిసార్వభౌమ, మహాకవి చూడామణి, వీరకవితా వీర, అభినవతిక్కన, వీరప్రబంధపరమేశ్వర, చారిత్రక కవిబ్రహ్మ, సుకవిరాజరాజ, కవితాసరస్వతి, వీరగాధా విధాత, చారిత్రక కవితాచార్య, వీరరస రత్నాకర, మహాకవి మార్తాండ బిరుదులు అందుకొన్నారు.
వీరి భార్య లక్ష్మమ్మ వీరికి ఇద్దరు సంతానం. కొడుకు
కామేశ్వరయ్య, కుమార్తె కామేశ్వరీదేవి.దుర్భాక రాజశేఖర శతావధాని ఏప్రిల్ 30, 1957 న మరణించారు
(చందమూరి నరసింహారెడ్డి సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు గ్రామీణ జర్నలిజం అవార్డు గ్రహీత)