(తెలంగాణ నుంచి వచ్చి తిరుపతిలో స్థిరపడిన ప్రముఖ జర్నలిస్టు,రచయిత ఆలూరు రాఘవ శర్మ తన తిరుపతి జ్ఞాపకాలను షేర్ చేస్తున్నారు.)
(రాఘవశర్మ)
తిరుపతి-తిరుచానూరు మధ్య ఏడాది గడిచిపోయింది.
అది 1974 వర్షాకాలం. డిగ్రీ లో చేరడానికి నేను బాపట్ల వెళ్ళిపోయాను.
కపిలతీర్థం సమీపంలోని ఎన్‌జీఓ కాలనీకి మేం ఇల్లుమారాం.
నాలుగు రోజులు సెలవు దొరికతే చాలు, తిరుపతిలో వాలిపోయేవాణ్ణి.
రైలు రేణిగుంట దాటితే ఉత్సాహం ఉరకలెత్తేది.
కరకంబాడి వైపు నుంచి పచ్చని శేషాచలం పర్వత పంక్తులను చూసుకుంటూ మనసు ఇంటి వైపు పరుగులు తీసేది.
నేనప్పటికి సాధరణ భక్తుణ్ణే.
కార్తీక మాసపు స్నానాల కోసం తెల్లవారు ఝామునే కపిల తీర్థానికి నడుచుకుంటూ వెళ్ళేవాడిని.
ఆరోజుల్లో అయ్యప్ప భక్తుల తాకిడి లేదు. వాళ్ళు ఎక్కడా కనిపించిన దాఖలా లేదు. కపిల తీర్థంలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండేవో!
ఆకాశం నుంచి దూకుతున్నట్టు తిరుమల కొండపైనుంచి జాలు వారే జలపాతం.ఆ జలపాతం కింద నిలుచుంటే తలపై రాళ్ళుపడినట్టు ఉండేది.
కింద కోనేరులో పడ్డ నీళ్ళు పొంగి తూర్పున కాలువగుండా బైటికి ప్రపహిస్తాయి. ఆ రోజుల్లో కపిల తీర్థం నిత్య ప్రవాహమే.
నేను కూడా కపిలతీర్థం లోకి దూకేవాణ్ణి. అలిసిపోయేవరకు ఈదేవాణ్ణి. ఈత ఎంత అనుభూతినిచ్చేదో!
ఈత అయిపోగానే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంటి ముఖం పట్టేవాణ్ణి.
కపిల తీర్థం నావరకు నాకు బోధి వృక్షమే.
ఒక సారి పై నుంచి తీర్థం లోకి దూకేసరికి జంజం కాస్తా నీళ్ళలో జారిపోయింది.
నాలో ఆలోచన మొదలైంది. జంజం అవసరమా!? అవసరమే అయితే ఎందుకు జారిపోయింది!?
అది అవసరమే అయితే జారిపోకుండా భగవంతుడే ఆపి ఉండవచ్చు కదా!?
ఎంత ఒత్తిడి వచ్చినా మళ్ళీ జంజం వేసుకోలేదు.
బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు, కపిల తీర్థంలో నాకు తొలిసారిగా జ్ఞానోదయం అయ్యింది.
బాపట్ల డిగ్రీ కాలేజీలో చేరడం నా ఆలోచనా పరిధిని పెంచింది. తిరుపతి జ్ఞాపకాలలో ఆ విషయాలు ప్రస్థావించడం లేదు.
మా ఇంటి ముందు చిన్న ఏరు ఉండేది. ఎర్రటి మట్టి, చిన్న చిన్న కొండ రాళ్ళతో ఆ నిండి ఉండేది.రాత్రి వర్షం పడితే చాలు తెల్లారేసరికి ఆ ఏరు ఉదృతంగా ప్రవహించేది!
ఎంతసేపైనా సరే ఆ ప్రవాహాన్ని చూస్తూ అలా గడిపేయాలని పించేది.
ఈ ఏరు ఎక్కడి నుంచి వస్తోంది!?
ప్రవాహానికి ఎదురుగా వెళితే, కపిల తీర్థానికి సమాంతరంగా ఉన్న చిన్న జలపాతం అది.కపిల తీర్థానికి పడమటి వైపు తిరుమల కొండ పై నుంచి జాలువారుతోంది.
దాని పేరు మాలవాడి గుండం.స్వాతంత్రానికి పూర్వం అనుకుంటా, కపిల తీర్థంలోకి దళితులను అనుమతించేవారు కాదు. ఆ జలపాతంలో స్నానం చేసి, తిరుమల కొండకు దణ్ణం పెట్టుకుని దళితులు వెళ్ళిపోయేవారు!
అందుకునే, ఆ జలపాతం పడే నీటి గుండానికి మాలవాడి గుండం అని పేరు వచ్చింది. కపిల తీర్థం లోకి దళితుల ప్రవేశానికి ఇప్పుడు అభ్యంతరం లేకపోయినా, మాలవాడి గుండం అన్న పేరు అలా నిలిచిపోయింది.
ఒకప్పుడు తిరుమల కొండెక్కడానికి కూడా దళితులను అనుమతించేవారు కాదు. అలిపిరి మెట్ల దారిలో వచ్చే తొలి మండపాన్ని పాదాల మండపం అంటారు.
ఆ మండపం దాటగానే మాలదాసు, అతని ముగ్గురు భార్యలు దేవుడిముందు సాష్టాంగం చేస్తున్నట్టు నేలపైన చెక్కిన విగ్రహాలు కనిపిస్తాయి.
అక్కడి వరకే దళితులను అనుమతించేవారు.
భగవంతుడికి మాల దాసు తోలు చెప్పులు సమర్పించేవాడని ప్రతీతి.
మాలవాడి గుండం అన్న పేరైనా, మాలదాసు విగ్రహాలైనా దళితులకు కులవ్యవస్థ చేసిన మానని గాయాలకు ప్రతీకలుగా, మాయని మచ్చలుగా ఇప్పటికీ ఇలా మిగిలిపోయాయి.
మా ఇంటికి పక్కనే పార్థసారధి అనే ఆర్మీ ఆఫీసర్ ఉండేవారు.
తెల్లగా, పొడుగ్గా, తలంతా నెరిసిపోయి, తెల్లటి మీసాలతో గంభీరంగా ఉండేవారు.
పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలతో జరిగిన అనేక యుద్ధాలలో పాల్గొన్నారు. నిజానికి ఆయన కల్నల్‌గా ఉన్న రోజులలోనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేశారు.
మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళేసరికి ఒక ర్యాంకు తగ్గించి లెప్టెనెంట్ కల్నల్‌గా తీసుకున్నారట.రిటైర్మెంట్ ముందు ఎన్‌సీసీ ఆఫీసర్లుగా వేయడం వల్ల తిరుపతికి వచ్చారు.
నిన్నముళ్ళ కంపలు-నేడు ఆకాశ హార్మ్యాలు (తిరుపతి జ్ఞాపకాలు -7)
పార్థసారథి భార్య నల్లని కురులతో యువతిలా ఉండేది. తరువాత తెలిసింది ఆమె తలకు రంగువేస్తారని. తెల్ల జుట్టు నల్లగా కనిపించడానికి తలకు రంగు వేస్తారని అప్పటివరకు నాకు తెలియదు.
మా ఇంటికి నాలుగు ఇళ్ళ అవతల మా అమ్మ వయసున్న అన్నపూర్ణమ్మ ఉండేవారు. ఆమెకు పిల్లలు లేరు. ఆ ఇంట్లో ఆమె, ఆమె తల్లి మాత్రమే ఉండేవారు.
తల్లీ కూతుళ్ళిద్దరూ తెల్లగా, పొట్టిగా ఉండేవారు.అన్నపూర్ణమ్మ గారి తండ్రి ఎప్పుడో పోవడం వల్ల ఆమె తల్లి గుండు కొట్టుకుని, తెల్ల చీరకట్టుకుని, తలపై చీర కొంగు కప్పుకునేది.
భర్త మరణించిన మహిళలు గుండుకొట్టించుకుంటే తప్ప బ్రాహ్మణ కుటుంబాలలో పండగలు, తద్దినాలలో మడికట్టుకుని వంట చేయడానికి అనుమతించేవారు కాదు.
జట్టు తీసేసి, తెల్ల చీర కట్టుకున్న మహిళను చూడడం అదే చివరి సారి.
మా చిన్నప్పుడు వనపర్తిలో ఆవకాయమామ్మ అనే ఒక పెద్దావిడ ఉండేది.
ఆవిడ కూడా బోడిగుండుతో తెల్లచీరో, ఎర్రచీరో మాత్రమే కట్టుకునేది.
ఆ మధ్యనే అన్నపూర్ణమ్మ భర్త పోయారు. కానీ తల్లిలా జట్టు తీయలేదు. బొట్టు, గాజులు మాత్రమే తీసేశారు. ఒకే ఇంటిలో తరానికి, తరానికి మధ్య తేడా!
తలలు బోడులైన తలపులు బోడులౌనా !? అన్నవేమన వేసిన ప్రశ్న పాపం వీళ్ళు తరువాత గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసులో మెదిలేది.
వేమన అప్పుడెప్పుడో 17వ శతాబ్ధంలో ఈ ప్రశ్నవేస్తే ,ఇరవయ్యవ శతాబ్దంలో కూడా కొందరికి తలకెక్క లేదంటే ఎంత బాధేస్తుందో!
ఆడ శిశువు పుట్టినప్పుడు సహజంగా పదకొండవ రోజు వరకు బొట్టు పెట్టరు.
పందకొండవ రోజు మాత్రమే తల్లీ బిడ్డలకు నీళ్ళు పోసి, శిశువుకు బొట్టు పెట్టి, గాజులు తొడిగి, బుగ్గన దిష్టి చుక్కపెట్టి, పేరు పెడతారు.
బొట్టు , గాజులు భర్తతో వచ్చినవి కావు కదా! భర్త పోయినప్పుడు వీటినెందుకు తీసెయ్యాలనేది సంప్రదాయ కుటుంబాలలో 20వ శతాబ్దం చివరలో, 21వ శతాబ్ధం తొలినాళ్ళలో వచ్చిన ఆలోచన.
కపిల తీర్థం రోడ్డు లోంచి అన్నారావు సర్కిల్ దాటాక టౌన్‌లోకి వస్తుంటే రోడ్డు పక్క చిన్న నీటి మడుగు ఉండేది. ఆ నీటి మడుగులో తామర పూలు కనువిందుచేసేవి.
అక్కడికెళితే ఇప్పటికీ ఆ తామర పూల మడుగే గుర్తుకు వస్తుంది.
ఎవరు కబ్జా చేశారో తెలియదు.నగరంగా తిరుపతి మారుతున్న దశలో తామర పూల మడుగు అదృశ్యమైపోయింది.
(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ వివిధ పత్రికల్లో, వివిధ జిల్లాల్లో పనిచేశారు. ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, వర్తమానం, వార్త, సాక్షి పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేసి ఏడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు .తిరుపతి, విజయవాడ, హైదరాబాదు, నెల్లూరు, ఏలూరు, కాకినాడ ప్రాంతాలలో పని చేశారు. వివిధ పత్రికల్లో రాజకీయ, సాహిత్య, సామాజిక అంశాలపై అనేక కథనాలు రాసారు . చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)