నిన్నముళ్ళ కంప‌లు-నేడు ఆకాశ హార్మ్యాలు (తిరుప‌తి జ్ఞాప‌కాలు -7)

(తెలంగాణ నుంచి వచ్చి తిరుపతిలో  స్థిరపడిన  ప్రముఖ జర్నలిస్టు,రచయిత ఆలూరు రాఘవ శర్మ తన తిరుపతి జ్ఞాపకాలను షేర్ చేస్తున్నారు.)

(రాఘ‌వ శ‌ర్మ‌)

పెరుమాళ్ళ‌ప‌ల్లె నుంచి మేం తిరుప‌తి వ‌చ్చేశాం.
ఇటు తిరుప‌తికాదు, అటు తిరుచానూరు కాదు. అదొక త్రిశంకు స్వ‌ర్గం.

రెండు ఊర్ల మ‌ధ్య అంతా ఖ‌ళీనే.
క‌రెంట్ ఆఫీస్‌ దాటితే పెద్ద‌గా ఇళ్ళు లేవు.

ఇప్పుడది ప‌ద్మావ‌తీ పురం అయిపోయింది. పెద్ద పెద్ద భ‌వ‌నాలు వెలిశాయి.
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వంటి ప్ర‌ముఖులు నివ‌సించే ఖ‌రీదైన ప్రాంత‌మైపోయింది.

నిత్యం ప్ర‌జ‌ల‌తో కిట‌కిట‌లాడిపోతోంది.
రోడ్డు మ‌ధ్య‌లో గ‌రుడ‌వార‌ధి అన్న‌ ఫ్లై ఓవ‌ర్ నిర్మిస్తున్నారు.

అది 1973 అక్టోబ‌ర్ నెల‌
పెరుమాళ్ళ‌ప‌ల్లెలో మూడు నెలల ముచ్చ‌ట త‌రువాత మేం ఆ ప్రాంతంలోకి వ‌చ్చాం.
కానీ, ఆ రోజుల్లో అదంతా బంగ‌రు బైలు.

పైగా చౌడు నేల‌. మొక్క‌లు పెద్ద‌గా వ‌చ్చేవి కావు.
ఎక్క‌డ చూసినా ఒత్తుగా పెరిగిన‌ ముళ్ళ కంప చెట్లు.

తెల్ల‌టి పంచ‌ లాల్చీ ధ‌రించి తెల్ల‌గా, పొట్టిగా ఉండే ఒక పెద్దాయ‌న తిరుప‌తి నుంచి రోజూ ఆ దారిలో న‌డుచుకుంటూ వెళ్ళే వారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకుని వ‌చ్చేవారు; పొద్దున సాయంత్రం. ఎంత ఓపిక అనుకునేవాణ్ణి.

ద‌శాబ్దాలు గ‌డుస్తున్నా ఆయ‌న‌లో మార్పు లేదు.
ఆ న‌డ‌క‌లో మార్పు లేదు. అదే వేగం, అదే చురుకు ద‌నం.

జీవితంలో చివ‌రి అంకం పూర్తి కావ‌చ్చే వ‌ర‌కు న‌డుస్తూనే ఉన్నారు.
దాదాపు తొంభై ఆరేళ్ళు జీవించిన ఆయ‌న ఎస్వీ యూనివ‌ర్సిటీ మాజీ సిండికేట్ స‌భ్యుడు బ‌ల‌రామిరెడ్డి అని చాలా కాలం వ‌ర‌కు తెలియ‌దు.

ఆ ప్రాంతంలో నాలుగు దిక్క‌ల‌కు విసిరేసిన‌ట్టుగా దూర‌దూరంగా నాలుగే నాలుగు ఇళ్ళుండేవి.
తిరుప‌తి-తిరుచానూరు న‌డి మ‌ధ్య‌లో రోడ్డు ప‌క్క‌న ఒకే ఒక మిద్దిల్లు ఉండేది.

ఆగ్నేయాన దూరంగా క‌నుచూపు మేర‌లో మ‌రొక ఇల్లు.
ఈశాన్యం వైపు ఒక‌ పూరిల్లు. ఈ మూడిళ్ళ‌కు మ‌ధ్య‌లో మా ఇల్లు.

ఆ ఇంట్లో ఫ్యాను వేసిన పాపాన పోలేదు.
కిటికీ త‌లుపు తెరిస్తే చాలు, రివ్వున వీచే గాలులకు అక్క‌డ పెట్టిన‌ కొబ్బ‌రి నూనె సీసా, పౌడ‌ర్ డ‌బ్బా ఎగిరిపోయేవి.

ఇంటి ద‌గ్గ‌రే చేద బావి. ప‌ది ప‌దిహేను అడుగుల్లో నీళ్ళుండేవి.
కావ‌ల‌సిన‌న్ని నీళ్ళు. అవ‌స‌రానికి మించిన‌ గాలి!

దూరంగా రోడ్లో అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌ను మోసుకెళుతున్నబ‌స్సులు, టెంపోలు!
తిరుచానూరు నుంచి టౌన్‌లోకి వ‌చ్చిపోయే జ‌నం.

ఒక‌ర‌కంగా ఆ నాలుగు ఇళ్ళ వాళ్ళూ ఏకాంత వాసమే!
ఇరుగు పొరుగు లేకుండా ఎవ‌రి లోకంలో వాళ్ళు.

ఎమ్మెల్యే క‌రుణాక‌ర‌రెడ్డి ఇంటికి వెళ్ళే మ‌లుపున‌కు ఎదురుగా ఆరోజుల్లో మేమున్న‌ప్పుడే ఒక టూరింగ్ టాకీస్ వెలిసింది.
అది ఎక్కువ కాలం న‌డ‌వ‌లేదు. దాన్లో ఒక‌టి రెండు సినిమాలు కూడా చూశాను.

పూరి గుడిసెలో ఒక ముస్లిం కుటుంబం జీవించేది.
తిరుప‌తిలోకి ప్ర‌వేశిస్తున్న ప్రాంతంలో వారికి ఒక‌ మెకానిక్ షెడ్ ఉండేది.

న‌లుగురు అన్న‌ద‌మ్ములు.
వారిలో ముగ్గురు మెకానిక్ షెడ్‌లో ప‌నిచేసేవారు. చివ‌రి వాడు చ‌దువుకుంటున్నాడు.

ఏ త‌గాదాలు లేకుండా అమ్మ‌ బూబ‌మ్మ ఒక్క మాట‌పైన ఆ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది.
వ‌సారాలో పిల్ల‌ల‌తో, మ‌నుమ‌ల‌తో స‌ర‌దాగా క‌బుర్లాడుతూ కూర్చునేది.

ఓ ఆదివారం ఉద‌యం వాళ్ళింటికి వెళ్ళాను.
న‌డివ‌య‌స్కుడైన‌ పెద్ద కొడుకును కూర్చోబెట్టుకుని ఒళ్ళంతా నూనె రాసింది.

త‌రువాత త‌లంటి పోసింది. ఒళ్ళు రుద్ది నీళ్ళు పోస్తోంది.
” ఏం బూబ‌మ్మా.. నీకు పెద్ద కొడు కంటే అంత ఇష్ట‌మా! ” అని అడిగాను స‌ర‌దాగా.

” పొద్దున వెళితే ఏ రాత్రికో వ‌స్తాడు నాయ‌నా మా మ‌స్తాన్.
వాడు క‌ష్ట‌ప‌డిన‌ట్టు ఈ నా కొడుకులు యాడ‌ క‌ష్ట‌ప‌డ‌తారు. మ‌ధ్య‌లో దొబ్బుకుని వ‌స్తాండ్లా!

షెడ్‌లో ప‌నిచేసి చేసి మ‌స్తాన్ కు ఒళ్ళంతా మ‌డ్డిప‌ట్టి ఉంటుంది.
ఈ పిల్లోడికి ప‌ని చేయ‌డం త‌ప్ప, ఒళ్ళు రుద్ది నీళ్ళు పోసుకోవ‌డం కూడా తెలీదు ” అంది కొడుకు త‌ల పైన ఒక మొట్టికాయ వేస్తూ.

ముసిముసి న‌వ్వులతో మ‌స్తాన్ త‌లొంచుకున్నాడు.
ఆ మాట‌ల‌కు బూబ‌మ్మ కోడ‌ళ్ళు, మ‌స్తాన్ భార్య‌, త‌మ్ముళ్ళు, అత‌ని పిల్ల‌లు కూడా ప‌క ప‌కా…

బూబ‌మ్మ రెండ‌వ‌ కొడుకు బాషా అప్పుడ‌ప్పుడు మా ఇంటికి వ‌చ్చేవాడు.
” ఏం బాషా ఎక్క‌డ నేర్చుకున్నారు ఈ మెకానిజం ” అని అడిగాను.

” మా నాయ‌న షెడ్డు పెట్టినాడు. ఆయ‌న ద‌గ్గ‌ర మాయ‌న్న నేర్చుకున్నాడు.
మేం పిల్ల‌ప్పుడే మా నాయ‌న చ‌నిపోయినాడు. మా అన్నే మాకంతా షెడ్‌లో నేర్పించినాడు” అన్నాడు.

“లారీని ఎట్లా రిపేరు చేస్తావ్ ?” అని అడిగాను.

“వాళ్ళేదో చెపుతారు; ఇది ప‌నిచేయ‌డం లేదు, అది ప‌నిచేయ‌డం లేదు అని.
వాళ్ళు చెప్పింది విని ఇంజ‌నంతా ఊడ‌పీకి పెడ‌తాము. మ‌ళ్ళీ బిగిస్తాము.

బిగించేట‌ప్పుడు క‌రెక్టుగా ఉందా లేదా చూసుకుని బిగిస్తాము.
లారీ ప‌నిచేస్తుందా లేదా? అంతే. మేం చూసిండేది. డ‌బ్బులిచ్చేది. పోతా ఉండేది.” అన్నాడు.

మేం అక్క‌డ ఉండ‌గానే తిరుచానూరు అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రిగాయి.
చివ‌రి రోజు చక్ర‌స్నానం. దాన్నే పంచ‌మి తీర్థం అంటారు.

అమ్మ‌వారి కోనేరంతా ఇసుక వేస్తే రాల‌నంత‌గా జ‌నం.
ఎలా ఉంటుందో చూద్దామ‌ని నేను కూడా వెళ్ళాను.

బాషా, బాషా భార్య కూడా పంచ‌మి తీర్థానికి వ‌చ్చారు.
వేద‌పండితులు అమ్మ‌వారి చ‌క్రాన్ని నీళ్ళ‌లో ముంచే స‌మ‌యానికి కోనేరులో దిగిన భ‌క్తులంతా ఒక్క‌సారిగా కోనేరు నీళ్ళ‌లో బుడుంగున మునిగారు.

బాషా, బాషా భార్య కూడా మునిగారు.
నాకు ఆశ్చ‌ర్యం వేసి అడిగాను. “మీరు ముస్లింలు క‌దా, అమ్మ‌వారి ఆల‌యానికి రావ‌డ‌మేమిటి? కోనేరులో మున‌గ‌డ‌మేమిటి? ” అని.

” చక్రాన్ని కోనేరులో స్వాములు ముంచిన‌ప్పుడు మ‌నం కూడా ఆ నీళ్ళ‌లో మునిగి ఏమైనా కోరుకుంటే అది అయ్యి తీరుతుంది ” అన్నాడు బాషా.

నువ్వేం కోరుకున్నావ్ అన్నా. “నా భార్య ఒక‌టి కోరుకుంది, నేనొక‌టి కోరుకున్నా” అన్నాడు.
వాళ్ళ కోర్కెలు మాత్రం చెప్ప‌లేదు.

కానీ, నేను ఎన్ని సార్లు వెళ్ళినా ఎప్పుడూ ఆ కోనేరులో మున‌గ‌లేదు.

మ‌రొక విష‌యం కూడా గుర్తుకు వ‌చ్చింది. వ‌న‌ప‌ర్తిలో పీర్ల‌పండుగ జ‌రుగుతుంటే నేను కూడా వెళ్ళి చూశాను. చాలా మంది హిందువులు కూడా వ‌చ్చారు.

అప్పుడే రియ‌ల్ ఎస్టేట్ మొగ్గ‌తొడుగుతోంది. ముళ్ళ కంప‌ల స్థానంలో కాసి రాళ్ళు మొలుచుకొస్తున్నాయి .
ఒక‌రొక‌రు ప్లాట్లు కొంటున్నారు, అమ్ముతున్నారు.

ఒరియంట‌ల్ కాలేజి లెక్చ‌ర‌ర్‌ రాజు మా ఇంటికి స‌మీపంలో ఇల్లు క‌ట్టుకున్నారు.
గృహ‌ప్ర‌వేశానికి చే్బ్రోలు సుబ్ర‌మ‌ణ్య శ‌ర్మ వ‌చ్చారు. మా ఇంటికి కూడా వ‌చ్చి చాలా సేపు మా నాన్న‌తో మాట్లాడారు.

ఆ త‌రువాత పాతికేళ్ళ‌కు కానీ నాకు తెలియ‌దు, ఆయ‌నొక ప్ర‌ముఖ సాహితీ వేత్త‌ని, గొప్ప‌ సంస్కృతాంధ్ర పండితుల‌ని .

ఎప్పుడో తొంభై ఏళ్ళ క్రితం కోన సీమ నుంచి తిరుప‌తి వ‌చ్చారు.
సంస్కృత అధ్యాప‌కులుగా ఇక్క‌డ ఓరింయంట‌ల్ కాలేజీలో చేరారు. ప్రిన్సిపాల్ అయ్యారు.

సంప్ర‌దాయ సాహిత్యాన్ని బాగా చ‌దువుకున్నారు.
గొప్ప‌ పండితులు. సంస్కృతం, తెలుగులో చాలా పుస్త‌కాలు రాశారు. మంచి అధ్యాప‌కులు.

పాత మెట‌ర్నిటీ ఆస్ప‌త్రి రోడ్డులో బాల మందిర్ ఎదురుగా ఉన్న వారిల్లు ఒక‌ప్పుడు సాహిత్య చ‌ర్చా కేంద్రం.
విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌, దేవుల‌ప‌ల్లి కృష్ణ శాస్రి , శ్రీ‌శ్రీ వంటి సాహితీ దిగ్గ‌జాలంతా ఆ ఇంటికి వ‌చ్చేవారు.

చెట్ల‌తో నిండిన వారి ఆవ‌ర‌ణ‌లో తిన్నెల‌పైన కూర్చుని సాహిత్య చ‌ర్చ‌లు చేసేవారు.
చేబ్రోలు సుబ్ర‌మ‌ణ్య శ‌ర్మ నాటిన మామిడి చెట్టు చుట్టూ ఇప్పుడు వారి పిల్ల‌లు పెద్ద పెద్ద ఇళ్ళు నిర్మించారు.

కానీ, వారి జ్ఞాప‌కార్థం ఆ చెట్టును మాత్రం కొట్ట‌కుండా ఇప్ప‌టికీ అలాగే కాపాడుతున్నారు.
ఒక గ‌దిలో ఆ చెట్టు మొద‌లు ఉంది. మ‌రొక గ‌ది గోడ‌ల నుంచి చెట్టు కొమ్మ‌లు బైటికి వ‌చ్చాయి.
రెండ‌త‌స్తుల మేడ పై నుంచి మామిడి చెట్టు కొమ్మ‌లు విస్త‌రించాయి.

ఆ రోజుల్లో రేణిగుంట నుంచి తిరుప‌తిలోకి ప్ర‌వేశిస్తుంటే రోడ్డుకు ఇరువైపులా మెకానిక్ షెడ్‌లే స్వాగ‌తం ప‌లికేవి.
పూర్ణ‌కుంభం స‌ర్కిల్ లేదు. ఓవ‌ర్ బ్రిడ్జి క‌ట్ట లేదు.

ఆ ర‌హ‌దారి ఎప్పుడూ వాహ‌నాల రాక‌పోక‌ల‌తో క‌ళ‌క‌ళ లాడుతుండేది.

ఎదురుగా అంకాళ‌మ్మ దేవాల‌యం.
ఆల‌యానికి ఇరువైపులా ద్వార‌పాల‌కుల్లా కూర్చుని ఉన్న పెద్ద పెద్ద శ్రీ‌దేవి, భూదేవి రాతి విగ్ర‌హాలు.

ఈ ఆల‌యం చాలా పురాత‌న‌మైంది.
తొలుత ఈ గ్రామ దేవ‌త‌ను తిరుప‌త‌మ్మ అనేవారు.

అలమేలు మంగ‌మ్మ ఇక్క‌డే కొలువై ఉండేద‌ని, ఇక్క‌డి నుంచే తిరుచానూరు వెళ్ళి స్థిర‌ప‌డింద‌ని ఆ నాటి భ‌క్తుల న‌మ్మిక‌.
ఆమె వెళ్ళిపోయాకే ఈ దేవ‌త‌కు అంకాళ‌మ్మ అని నామ‌క‌ర‌ణం చేశార‌ని చెప్పారు.

అంకాళ‌మ్మ ఆల‌యం నుంచి తిరుచానూరు వెళ్ళే దారిలో కొంత దూరం వ‌ర‌కు రోడ్డు పైన ఎండ ప‌డేది కాదు.
ఇరువైపులా పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవి. ఇప్పుడు వాటిలో చాలా చెట్ల‌ను కొట్టే శారు.

తిరుచానూరు అస‌లు పేరు తిరుచొక్క నూరు.
త‌రువాత అదే తిరుచానూరు అయ్యింది.

ఈ ఊరు తిరుప‌తి కంటే పురాత‌న‌మైనది.
తిరుచానూరు ముందొచ్చిన చెవుల‌ని, తిర‌ప‌తి త‌రువాత వ‌చ్చిన కొమ్ముల‌ని అనిపిస్తుంది.

తిరుచానూరును అలివేలుమంగాపురం అని కూడా అంటారు.

అంకాళ‌మ్మ ఆల‌యం నుంచి కుడివైపున‌కు తిరిగితే, వ‌చ్చే రైల్వేగేటు తిరుప‌తికి ముఖ‌ద్వారంలాంటిది.
గేటు ఎప్పుడు చూసినా మూసే ఉండేది. అప‌క్క‌నే రైల్వే స్టేష‌న్ క‌నుక‌, వ‌చ్చే రైళ్ళు పోయే రైళ్ళు. గేటుకు అటు ఇటు వాహ‌నాలు బారులు తీరేవి.

ఇప్పుడే కాదు, అప్పుడు కూడా త‌గిన‌న్ని రైల్వే ప్లాట్‌ఫారాలు లేవు.
ఖాళీ లేక చాలా రైళ్ళు ఔట‌ర్‌లోనే ఆగిపోయేవి. రైల్వే గేటు ఉన్నా పెద్ద‌గా ఉప‌యోగం ఉండేది కాదు.

This image has an empty alt attribute; its file name is ammavaru.jpg

ఓవ‌ర్ బ్రిడ్జి క‌ట్టాక కూడా కొంత కాలం తిరుచానూరుకు ఈ రైల్వే గేటు నుంచే రాక‌పోక‌లు సాగేవి.
ఇప్పుడా రైల్వే గేటు శాశ్వ‌తంగా మూత‌ప‌డింది. ఆ ర‌హ‌దారి అంతా మూగ‌బోయింది.

ఇప్ప‌టికీ ఆ దారిలో ఆటోమొబైల్ షాపులు, మెకానిక్ షెడ్లు అలాగే ఉన్నాయి.
మేం ఆ ప్రాంతానికి వ‌చ్చేట‌ప్ప‌టికే అప్పుడే అక్క‌డ కొత్త‌గా వెంక‌టేశ్వ‌ర టాకీస్ వెలిసింది.

ఇప్పుడు బ‌స్టాండు ఉండే ప్రాంతం అంతా ఒక పెద్ద మురుగు చెరువు.
ఊళ్ళో ఉన్న డ్రైనేజీ అంతా అక్క‌డికే వ‌చ్చేది. అలాగే శ్రీ‌నివాసం ఉండే ప్రాంతం కూడా.

తిరుప‌తి మున్సిపాలిటీ చాలా కాలం ఆ ప్రాంతాన్ని చెత్త డంపింగ్ యార్డు గా వాడుకుంది.

కాలంతో పాటు ఎన్నో మార్పులు వ‌చ్చాయి.
బ‌ళ్ళు ఓడ‌లు, ఓడ‌లు బ‌ళ్ళు అయిన‌ట్టు, ఒక వెలుగు వెలిగిన వెంక‌టేశ్వ‌ర టాకీస్‌ ప్రాంతం ఇప్పుడు ఆ ప్రాభ‌వాన్ని కోల్పోయింది.
ఒక‌ప్పుడు ముళ్ళ కంప‌ల‌తో నిండిన తిరుచానూరు, తిరుప‌తి మ‌ధ్య ప్రాంతం ఇప్పుడు ఆకాశ‌హార్మ్యాల‌తో నిండిపోయింది.

(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ వివిధ పత్రికల్లో, వివిధ జిల్లాల్లో పనిచేశారు. ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, వర్తమానం, వార్త, సాక్షి పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేసి ఏడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు .తిరుపతి, విజయవాడ, హైదరాబాదు, నెల్లూరు, ఏలూరు, కాకినాడ ప్రాంతాలలో పని చేశారు. వివిధ పత్రికల్లో రాజకీయ, సాహిత్య, సామాజిక అంశాలపై అనేక కథనాలు రాసారు . చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *