ట్రైమెక్స్ నుంచి రు.1269 కోట్ల జరిమానా వసూలు చేయని ఆంధ్ర ప్రభుత్వం:ఇఎఎస్ శర్మ

(EAS Sarma)
రాష్ట్రప్రభుత్వం ఖజానాలో నిధులు క్షీణించిన కారణంగా కొవిడ్ నియంత్రణ కార్యక్రమంలో అతి ప్రమాదకరమైన పరిస్థితులలో కష్టపడి పని చేస్తున్న వైద్య సిబ్బందికి, ఆసుపత్రులలో మునిసిపాలిటీలలో, పంచాయితీలలో, వారి వారి కుటుంబాలకు ముప్పు ఉన్నా, ఉత్సాహంతో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు, సకాలంలో వేతనాలు చేరడం లేదని, మీడియా రిపోర్టుల ద్వారా స్పష్టమవుతున్నది. గతంలో ఈ విషయాన్ని మీదృష్టికి ఎన్నోమాట్లు తీసుకువచ్చినా, ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు.

కొవిడ్ నియంత్రణలో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగిని ప్రోత్సహించడం, ప్రస్తుతం  ప్రభుత్వానికి ఉన్న ప్రప్రథమమైన బాధ్యత. సకాలంలో వేతనాలు ఇస్తూ, కొవిడ్ నుంచి పరిరక్షించే సౌకర్యాలను కల్పించడమే కాకుండా, తెలంగాణా ప్రభుత్వం ఆదేశించినవిధంగా వేతనమే కాకుండా 10% బోనసు కూడా ఇవ్వాలని కొన్నినెలల ముందు మీకు విజ్ఞప్తి చేసాను. ఇంతవరకు మీ ప్రభుత్వం ఆ విషయం మీదకూడా స్పందించకపోవడం చాలా బాధాకరం.
ఒక విధంగా చూస్తే, ప్రస్తుతం ఉన్న క్లిష్టమైన ఆర్ధిక సమస్యలకు ముందున్న ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి.
ప్రస్తుతం ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే, ప్రభుత్వం చేస్తున్న నిధుల ఉపయోగంలో పొదుపు పాటించాలి.

 

రావలసిన ఆదాయాన్ని ఎలాగ పూర్తిగా రాబట్టు కోవాలనే విషయాన్ని పరిశీలించాలి. నా ఉద్దేశంలో, మీ ప్రభుత్వం అటువంటి ప్రయత్నాలను చిత్తశుద్ధితో చేపట్టడంలేదని అనిపిస్తున్నది.

EAS Sarma
ఉదాహరణకు, 2016 లో రాష్ట్ర విజిలెన్స్ డైరక్టరేట్ వారు శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీరంలో ఇసుకను త్రవ్వి అతి విలువైన అణు ఖనిజాలను విదేశాలకు తరలించి లాభాలను ఆర్జిస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీ వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వం ఆమోదించిన మైనింగ్ ప్రణాళికకు విరుద్ధంగా, ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఖనిజాలను త్రవ్వి విదేశాలకు తరలించిన కారణంగా ఆ కంపెనీమీద చర్యలు తీసుకోవాలని తమ రిపోర్టులో సూచించింది.
పేజీ 13, విజిలెన్స్ కమిషర్ ఎస్ వి ప్రసాద్ సమర్పించిన నివేదిక (LR No 1150/VC.AB.1/ 2016-3, dt 20.05.2016)
పైగా ఆ కంపెనీమీద 1295 కోట్ల రూపాయల జరిమానా వేయాలని కూడా తమ రిపోర్టులో తెలియ చేసింది. ఆ రిపోర్టును అప్పటి ప్రభుత్వం పూర్తిగా ఆమోదించి అందుకుఅనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పేజీ 13, విజిలెన్స్ కమిషర్ ఎస్ వి ప్రసాద్ సమర్పించిన నివేదిక (LR No 1150/VC.AB.1/ 2016-3, dt 20.05.2016)
అయినా అప్పటి ప్రభుత్వంకాని, మీప్రభుత్వంకాని  ముందుకు పోలేకపోవడం వలన రాష్ట్రానికి రావలసిన 1295 కోట్ల రూపాయల రాబడి రాలేదు. అప్పటినుంచి ఈరోజు వరకు వడ్డీ లెఖ్ఖపెడితే, ఈ రోజు కంపెనీ నుంచి సుమారు 2230 కోట్ల రూపాయలను వసూలు చేయాలి. ఈ రోజువరకు ఆ జరిమానాను వసూలు చేయడంలో మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరం.
అటువంటి జరిమానాను వసూలు చేయాలంటే కంపెనీ ఆస్తులను, స్టాక్ లను భవిష్యత్తులో జప్తు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పోగొట్టుకోకూడదు.
అయినా 16-7-2020 న ప్రభుత్వ ఖనిజశాఖ 22,982 టన్నుల అతివిలువైన కంపెనీ ఖనిజ స్టాకులను ఇంకొక కంపెనీకి తరలించవచ్చని ఉత్తరువులు ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
నేను కేంద్ర ప్రభుత్వానికి ఆ ఉత్తరువులను ఆపాలని విజ్ఞప్తి చేసాను. కాని తొందరలో మీ అధికారులు ఆ ప్రైవేట్ కంపెనీ 7 వేల టన్నుల కు పైగా బయటకు తరలించడంలో సహకరించారని  తెలుస్తున్నది.
అంటే మీ ఖనిజ శాఖ అధికారులు కంపెనీతో కుమ్మక్కు అయి, ప్రభుత్వానికి రావలసిన రాబడి రాకుండా చేశారని అర్థమవుతున్నది. ఇది ఎంతవరకు సమంజసం?
ఈ నేపథ్యంలో లో కొవిడ్ నియంత్రణ పనులలో నిమగ్నమై పనిచేస్తున్న సిబ్బందికి సరిగ్గా వేతనాలు ఇవ్వకపోవడం మీద మీ ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వగలదు?
ఇప్పుడైనా మీ ప్రభుత్వం ఈ విషయంలో, లాభాలు ఆర్జించే ప్రైవేట్ కంపెనీలమీద తగిన చర్యలు తీసుకొని, ప్రభుత్వానికి రావాలిన జరిమానా ఆదాయాన్ని రాబట్టుకుని, కొవిడ్ కార్యక్రమాలలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు, బోనసులను సకాలం లో  అందిస్తారని ఆశిస్తున్నాను.
ప్రభుత్వానికి, వచ్చే మూడు సంవత్సరాలు రావలసిని ఆదాయం వివరాలను, అయ్యే ఖర్చుల వివరాలను, ప్రభుత్వం చేస్తున్న అప్పుల రుణ భారం వివరాలను, ఒక  శ్వేత పత్రం ద్వారా ప్రజలముందు ఉంచాలనికూడా విజ్ఞప్తి చేస్తున్నాను.
( డాక్టర్ ఇఎఎస్ శర్మ 14.11.2020న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ నుంచి)
(Dr EAS Sarma, former secretary, Government of India)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *