(KSS Bapuji)
కొన్ని ఊరి పేర్లు చాలా విచిత్రంగా వుంటాయి..
కొన్ని ఊరి పేర్లు చాలా సరదాగా వుంటాయి…
ఉత్తరాంధ్రాలో వున్న ఒక ఊరిపేరు దీపావళి.
అవునండి నిజం ఆ ఊరిపేరు దీపావళి. పేరు ఎంత కాంతివంతంగా ఉందో. కాని, అభివృద్దికి ఆమడదూరంలో, నిత్యం చీకట్లతో అలరారుతున్న ఆ దీపావళి గ్రామం శ్రీకాకుళం జిల్లా గార మండలంలో వుంది.
అదొక చిన్న గ్రామం. జిల్లా కేంద్రం అయిన శ్రీకాకుళానికి 15 కిలోమీటర్లు, మండల కేంద్రమైన గార గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వుంది. సుమారు రెండువేల మంది జనాభా వున్న ఈ గ్రామ విస్తీర్నం 143 హెక్టార్లు. పేరు దీపావళి అయినా ఈ గ్రామంలో నిరక్షరాస్యత, పేదరికపు చీకట్లు మాత్రం అలుముకొనేవున్నాయి. 2011 సెన్స్ ప్రకారం అక్షరాస్యత కేవలం 54.47శాతం, ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.02 శాతం కంటేచాలా తక్కువ. ఇంక మహిళల అక్షరాస్యత కేవలం 46.44 శాతమే.
తుఫాన్లు వంటి బీభత్సాలకు ఎక్కువగా గురయ్యే ఈ గ్రామం అభివృద్దికి ఆమడదూరాన్నేవుండిపొయింది. అయితే ఆఊరిపేరు వెనక ఒక కధవుంది… ఆ గ్రామస్తులు చెప్పే ఆ కధ ఇదిగో..
చాలా సంవత్సరాల క్రితం ఓ ముస్లిం రాజు కళింగపట్నంలో తన పనులను ముగించుకొని ఇదే ప్రాంతం గుండా వెళ్తుండగా అక్కడ అతను అస్వస్థకు గురయ్యాడు.
అక్కడి ప్రజలు అతని ఓ గడి దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకి వైద్యాన్ని అందించి అతను కోలుకునేలా చేసారు. అస్వస్థత నుండి బయటకు వచ్చిన ఆ రాజు ఇది ఎం ప్రాంతమని అడిగాడట.
అప్పుడు దీనికి అసలు పేరు లేదని వారు చెప్పుకోచ్చారట. ! ఈ సంఘటన దీపావళి రోజున జరగడంతో ఆ ఊరికి దీపావళి అని నామకరణం చేసాడని, అప్పుడు ఈ గ్రామానికి దీపావళి అనే పేరు వచ్చిందని చెప్పుకొస్తున్నారు ఇక్కడి గ్రామ ప్రజలు..
పండగ పేరుతో గ్రామం ఉండడంతో అక్కడి ప్రజలు చాలా గర్వంగా చెబుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సాధారణంగా అందరు ఒకరోజు, లేదా రెండు రోజులు దీపావళి జరుపుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఐదురోజులు దీపావళి జరుపుకుంటారు.
(బాపూజీ సీనియర్ జర్నలిస్టు, రచయిత)