( పిళ్లా కుమారస్వామి)
‘రాశికి రావాలంటే విశేషమేదో వుండాలి’ అంటూ ఎంతో వాసి, రాసి, విశేష ప్రజ్ఞగల సినారె జ్ఞానపీఠాన్ని అధిరోహించారు. ఆయన 1954లో ఆధునికాంధ్ర కవిత్వం – సంప్రదాయములు – ప్రయోగాలు పై సిద్ధాంత గ్రంథాన్ని రాయడం ద్వారా సాహిత్య రంగంలోకి ప్రవేశించారు.ఆయన మార్గం ప్రగతిశీలం.ఆయన గీతం అద్వితీయం. ఆయన గాత్రం మాధుర్యం. ఆయన పలికిన పలుకులు సమాజాన్ని వెన్నుతట్టిన చరుపులు.
సినారెగా ప్రసిద్ధుడైన డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి కరీంనగర్ లోని హనుమాజిపేట గ్రామంలో 1931 జూలై29న బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే హరికథలు,బుర్రకథలు, జంగం కథలువిని వాటితో ప్రేరణ పొందారు.సాహిత్యలోకంలోకి అడుగుపెట్టాక గజళ్ళు, వ్యాసాలు, అనువాదాలు, కవిత్వం, రాశారు. విశ్వంభర,నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, మట్టి-మనిషి- ఆకాశం, మంటలు-మానవుడు, మధ్యతరగతి మందహాసం, భూమిక మొదలైన కావ్యాలు వెలువరించారు.
విశ్వంభర కావ్యం ద్వారా ఆయన దేశంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠాన్ని అధిరోహించారు. నూతన ఒరవడితో ప్రపంచపదులు రాయడమే గాక వాటిని అలాపనచేసి ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించారు.ఆయన రాసిన సినిమా పాటలు ఇప్పటికీ ప్రజల మదిలో మార్మోగుతున్నాయి.
సినారె సాహిత్యం ద్వారా ఒక బుద్ధుని ఒక వేమనను, ఒక గురజాడను చూడగలం. ఆయనకు సమాజంపై ప్రేమ వుంది. అవినీతిపై ధర్మాగ్రహం వుంది. సమాజంలో దుర్లక్షణాలపై ఆయన కవితాగ్రహం ప్రకటించారు.అందులో భాగంగానే ప్రపంచ పదులు వచ్చాయి.పద్యం నాలుగు పాదాలలో వుంటుంది.
వేమన ఆటవెలదుల్లో సమాజాన్ని మేల్కొలిపారు. ఆయన పద్యంలో మూడోపాదం లోకోక్తులుగా కూడా మారాయి. సినారె కూడా తన భావాలను, తనదైన శైలిలో ఐదు పాదాలలో రాశారు. గురజాడ మాత్రఛందస్సులో ముత్యాలసరాలుగా రాశారు. ఇలాంటి మాత్ర ఛందస్సును తన ప్రపంచపదులకు తీసుకొన్నారు.
బుద్ధుడు తన ధర్మాలకు దేవుని బదులు మనిషిని కేంద్రంగా చేసుకున్నారు. వేమన అంతే. గురజాడ అంతే, శ్రీశ్రీ అంతే. సినారె కూడా దాన్నే అనుసరించారు. ఆయన సాహిత్యరంగంలో ప్రవేశించేనాటికి ‘అభ్యుదయ సాహిత్యం పరవళ్లు తొక్కతోంది. మాసప్పుడే నా సంగీతం అంటున్నారు. జాషువా విశ్వకవిగా రూపొందారు.విశ్వమానవ సౌభ్రాతృత్వం, సాహిత్యంలోకి వచ్చేసింది. స్వాతంత్య్రం సిద్ధించిన కాలంలో ఉందిలే మంచి కాలం ముందు ముందున’ అని ఆలపిస్తున్నారు ప్రజలు.నూతన యుగానికి తెరచాపలెత్తి సాగుతున్న సాహితీ నౌకలో సినారె సహజంగానే భావుకత నిండిన అభ్యుదయాన్ని ఆశ్రయించారు. మనిషిని, సమాజాన్ని కేంద్రం చేసుకొని లోకరీతులను సంపూర్ణంగా అవలోకనం చేసుకుని ప్రపంచ పదులను వెలువరించి గానం చేశారు.
ఒక నిర్దిష్ట గేయగతిలో అయిదు పాదాలతో సాగిపోయే మాత్రాఛందస్సుతో వున్నదాన్ని పంచపది అన్నారు. వస్తుపురీత్యా లోకరీతులకు సంబంధించినది కాబట్టి దీనిని ప్రపంచపదులు అన్నారు సినారి. వీటిని రాగయుక్తంగా ఆలపించి కల్వకోట మధుసూదనరావు సహకారంతో ‘యూట్యూబ్ ‘ లో కూడా ప్రజలకు అందించారు.
ప్రపంచపదులలో సామాజిక వికాసాన్ని కలిగించేవి, వ్యక్తి వికాసాన్ని ప్రబోధించేవి, జీవిత లక్ష్యాన్ని నిర్దేశించేవి ఉన్నాయి. వేమన ‘బుద్ది చెప్పువాడు గుద్దితేనేమిరా’ అంటూ గుద్దినట్లు చెపితే, సినారె వీపు చరుపులతో మనిషిలోని
అంతరంగిక శక్తిని తట్టిలేపుతాడు. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, మధ, మాశ్చర్యాలను పరిహరించు కోవాలని హితబోధ చేస్తాడు.
సామాజిక వికాసం:
అపూర్వ సృష్టిని జరపని అహంకారమది వ్యర్థం
అందంతో శృతి కలవని అలంకారమది వ్యర్థం
చాటింపుల వెనుకనున్న సరుకెంతో తెలుసునులే
అరుదైన ప్రతిభకివ్వని పురస్కారమది వ్యర్థం
ఆత్మశుద్ధితో చేయని నమస్కారమది వ్యర్థం
అంటూ… వర్తమాన ప్రపంచంలో జరుగుతున్న లోకరీతులను సున్నితంగా చెప్పుతారు. దాన్ని మార్చవలసిన అవసరాన్ని గుర్తించేటట్లు చేస్తున్నారు సినారె. కులాభిమానంతో, ప్రలోభాలతో పురస్కారాలు అందుతున్న వారెందరో వున్నారు.
వినియోగవస్తువుల మాయాజాలం టీవీలో వచ్చే ప్రకటనల ద్వారా జరుగుతోంది. హార్లిక్స్, బోర్నవిటా, బూస్ట్ లు పిల్లవాని ఎత్తు పెంచుతాయని, బలవంతున్ని చేస్తాయని, మేధావిని చేస్తాయని చెపుతాయి. వాస్తవమెంతో అందరికీ తెలిసిందే.
నల్లనివారు తెల్లగైపోతారని ఫెయిర్ అండ్ లవ్లీ ప్రచారం చేస్తోంది. కానీ వాటి ప్రయోజనం కూడా అందరికీ తెలిసిందే. ఇలా సమాజంలో జరుగుతున్న వాటిని ఈ ప్రపపంచపదిలో చెప్పారు సినారె.
నింగిలోతును చూడబోతే నీటి చుక్కను కలుసుకో
రత్నతత్వం చూడగోరితే రాతి ముక్కను కలుసుకో
అణువునడిగితే తెలియదా… బ్రహ్మాండమంటే ఏమిటో…
మౌన శిల్పం చూడగోరితే మంచు గడ్డను కలుసుకో
మనిషి మూలం చూడగోరితే మట్టి గడ్డను కలుసుకో
సమాజానికి కేంద్ర స్థానం మనిషి, ఆ మనిషి మూలం తెలుసుకోవాలంటే అతనికి మట్టితోనున్న బంధాన్నితెలుసుకోవాలి. ‘వాడికి మట్టి మట్టే నాకు మట్టి కవిత్వం’ అంటాడు శివారెడ్డి. మట్టి కొంత మందికి వ్యాపార వస్తువు.మట్టంటే రైతుకు ప్రాణం. మనుషులు ఎంతో మంది వుంటారు. వారిలో ఆత్మీయతలు, అనురాగాలు, ఆసుబంధాలు
వుండవు. కొంత మందిలో అవన్నీ పుష్కలంగా వుంటాయి. అణువులో బ్రహ్మాండమున్నట్లు మనిషి మాటలో, ప్రవర్తనలో మనిషి తత్వం తెలుస్తుందని చెపుతారు సినారె పై ప్రపంచ పదిలో.
మనిషి వాక్కు పెరుగుతుంది అనుకరణంలోనే
మనసు గొంతు వురుముతుంది అనురణనంలోనే
అనివార్యం ఎప్పుడో ఒకప్పుడు అనుసరణం
సైన్యం గతి కుదురుతుంది సహచరణంలోనే
సంఘం స్థితి ఎదుగుతుంది సహమననంలోనే
ప్రకృతిని అనుకరిస్తాడు మనిషి. అందుకే ప్రకృతికనుకరణమే కవిత్వం అన్నారు. మన భాష పలుకులు అనుకరణ ద్వారానే నేర్చుకుంటాం. ఇద్దరు కలిసి పాడితే అది యుగళగీతం.పది మంది కలిసి పాడితే అది బృందగీతం. వేలగొంతుకలు ఒక్కటైతే అది శంఖానాదం, ఢంకానాదమవుతుంది. ఉమ్మడితత్వం, సహకారతత్వం ప్రకృతిలోనే
ఇమిడి వుంది. దీన్ని గుర్తించిన సినారె సైన్యం కదంతొక్కాలన్నా, సమాజంలో ప్రజలు సరైన రీతిలో సాగాలన్నా సహకారం లేకుండా సాగలేమని చెపుతున్నారు. అటు సమిష్టితత్వాన్ని, ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే తత్వాన్ని,సహకారతత్యాన్ని పెంపొందించుకోవాలని ఈ ప్రపంచపదిలో విశదపరిచారు. సినారె విశాలదృష్టి, అభ్యుదయకర దృక్పథం మనకు ఇందులో కనిపిస్తుంది.
పూలపైన విహరించే పిల్లగాలికి తుమ్మ ముల్లంటే జడుపుంటుందా ?
గోపురాలపై మెరసే సూర్యకాంతికి పెంటకుప్పలంటే వెరవుంటుందా ?
మైదానంలో సాగే ఏటి నీటికి మాగాణి బీడు ఒకటే
గుండెలోన పొరలులేని మనిషికంటికి కులంపైన గురివుంటుందా?
మానవతను పూజించే మంచి మనసుకు ఒకే మతంపైన బరి వుంటుందా ?
ఈ ప్రపంచపదిని వింటుంటే బుద్ధుడు,
వేమన, బ్రహ్మం, అన్నమయ్య,గురజాడ ఒక్కసారే తళుక్కుమంటారు. వీరంతా మానవతకు పీఠం వేసినవారు. అదే కోవలోనే సినారె మానవతను పూజించే మంచి మనసుకు ఒక మతం పైనే బరి వుంటుందా అని ప్రశ్నిస్తాడు.
నేడు మతవిద్వేషాలు రెచ్చిపోతున్న సందర్భంలో ఈ గీతానికి ఎంతో విలువుంది. కులవిద్వేషాలతో, సమాజంలో విభిన్న పోకడలు పోతున్నప్పటికీ గుండెలోన పొరలు లేని మనిషికి కులంపైన గురివుంటుందా ? అంటూ ప్రశ్నిస్తాడు సినారె. సూర్య, చంద్రులకు వివక్షలేదు. గాలికి ఎలాంటి కులమత భేదాలు లేవు. మనిషి మాత్రం కుల,మత, లింగ వివక్షలతో, రాగద్వేషాలతో బతకడం శోచనీయం. దీన్నేసినారె ఈ ప్రపంచపదిలో వ్యక్తం చేస్తున్నాడు.
ఎంతటి సత్యానికైన ఏవో కల్లల బాధలు
ఎంతటి దేశానికైన ఏవో ఎల్లల బాధలు
బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో
ఎంతటి శీలానికైన ఏవో ధూర్తుల బాధలు
ఎంతటి సింహానికైన ఏవో దోమల బాధలు
సమాజంలో ఉన్నతంగా ఎదుగుతున్న వారిని ఓర్వలేక ఏదో ఒక రాయి విసురుతుంటారు. సత్యం వీధిలోకి వచ్చేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. సమాచార సాధనాలు పెరిగిన నేటి తరుణంలో ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఇంతకాలం పాకిస్తాను తో ఎల్లల గొడవ వుండేది. ఇప్పుడది నేపాల్, చైనాలతో కూడా వచ్చింది. ఇలాంటి బాధ అమెరికాకు మెక్సికోతో వుంది. ఇలా బాధలు లేని దేశం లేదు. అలాగే శీలవంతుడైన
మనిషిపై ఎన్నో నిందలు వేస్తారు. ఏదో ఒకటి కల్పించి ప్రచారం చేస్తుంటారు. అందుకే బాధలు లేనిదెవరికంటూ మృగరాజు సింహానికి కూడా దోమలతో బాధలు వుంటాయి గదా అంటూ చక్కని ఉపమానంతో మనకు బాధల స్వరూపాన్ని తేటతెల్లం చేస్తాడు.
కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది ?
కత్తులు నాటిన గుడిలో భక్తి ఎలా పుడుతుంది ?
అంతా భద్రం అంటూ ఎంత కాలం ఈ సూక్తులు ?
వంచనచేరిన ఇంట్లో మంచి ఎలా బతుకుతుంది?
నాగులు చేరిన నోట న్యాయం ఏం పలుకుతుంది ?
నేటి సామాజిక వ్యవస్థపై విసిరిన ఒక కవితాగ్రహం ఈ కవిత. సంక్షుభిత సందర్భంలో వున్నామిప్పుడు.ప్రశ్నించే గొంతుకలను జైళ్లలో ఉంచుతున్నారు. వంధిమాగధులు మాత్రం స్వేచ్ఛా వీధులలో తిరుగుతున్నారు.నిరంకుశతత్వం రాజ్యమేలుతున్నప్పుడు అలల పైన అక్షరాల పైన నిత్యం నిఘా వున్నప్పుడు ఏ గొంతుక పాడుతుం
దంటారు సినారె.జాషువా చెప్పిన హైందవవాదం కసిరి బుసకొడుతున్నప్పుడు న్యాయం ఏం పలుకు తుందంటారు సినారె. ఇలా నడుస్తున్న నేటి చారిత్రక సందర్భంలో ధర్మాగ్రహంగా ముందుకొచ్చి నిలదీస్తోందీ ప్రపంచపది.అలాగే మరో ప్రపంచపదిలో ‘ఏది పలికినా శాసనమైతే ఎందుకీ జనవాక్యం’ అంటూ ప్రశ్నిస్తారు.
వ్యక్తిత్వ వికాసం
సమాజంలో వ్యక్తి వికసించటమంటే స్వీయ అభివృద్ధి చెందడం, సామాజిక వికాసమంటే సమాజం మొత్తం అభివృద్ధి చెందడం. ప్రస్తుత సమాజంలో వ్యక్తిత్వ వికాసంపై దృష్టి ఎక్కువగా వుంది. సమిష్టితత్వం కొరవడింది.అయినప్పటికీ కృష్ణుడు అర్జునునికి కర్తవ్యబోధ చేసినట్లు సినారె నేటి యువతరానికి వారి వ్యక్తిత్వ వికాసానికి తన
ప్రపంచపదుల ద్వారా ఎన్నో విజయరహస్యాలను కవిత్వీకరించారు. వీటి పఠనం వల్ల, నిత్యం మననంవల్ల యువతరం ప్రగతిపథంలోకి దూసుకెళ్లగలదు.
ఎదురీదే చేతులుంటే ఏరుదారి ఇవ్వక ఏం చేస్తుంది ?
పయనించే చేతులుంటే బాట చేతులెత్తక ఏం చేస్తుంది ?
చూపుసాచే కంటికి శూన్యం శిరసొగ్గక ఏం చేస్తుంది ?
పిడికిలి పిండే మనిషికి ఎడారి అలలెత్తక ఏం చేస్తుంది ?
వేమన ‘ పట్టుపట్టరాదు, పట్టి విడువరాదు’ అంటూ ఒక పనిని సాధించడానికి పట్టుదల ముఖ్యమంటాడు.అలాగే సినారె ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకున్న వ్యక్తి ఏటికి ఎదురీదితే సాధించిన దేముంది? అంటూ ప్రశ్నిస్తాడు. దీనికి మార్గాన్ని కూడా సూచించాడు. తగిన పరికరాలను, తన ఆలోచనలను సమన్వయం చేసుకోవాలంటాడు. అప్పుడు లక్ష్యం చేరడం పెద్ద విషయం కాదంటాడు. ఇప్పుడు కరోనా కాలంలో కరోనాకు టీకాను కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారు తప్పకుండా విజయం సాధిస్తారు. కరోనాను అంతం చేయగలుగుతారు.ఎంతో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని మనిషి అధిరోహించగలిగాడు. బీహార్ లో ఒక వ్యక్తి కొండను ఒక్కడేరెండు చేతులతో తొలిచాడు. మనిషి అంతరిక్షంలోకి ఎగసి రోదసీలో నడిచాడు. ఎడారిలో పూలు పూయిస్తున్నాడు. ఇలా
పిడికిలి పిండే మనిషికి ఎడారి కూడా దాసోహమవు తుందని చెపుతాడు సినారె. వ్యక్తి సమాజంలో ఒక ఉన్నత ఆశయంంతో జీవించాలి. ఏ ఆశయం లేకుండా జీవించడమంటే అడవిలో జంతువుకు మనకు తేడాలేనట్లే. ఏదో ఒక ఆశయంతో వున్న వ్యక్తి మాత్రమే తన లక్ష్యాన్ని ఏనాడో ఒక రోజు
సాధించగలడు. నేర్చిన చదువుకు సార్థకత లభిస్తుంది. ఈ ప్రపంచపదిని వింటే మనకు లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన కలుగుతుంది.
పక్షి రెక్కలకు మబ్బుల గొడుగులు కట్టినప్పుడే సార్థక్యం
పారే ఏటికి పైరుగొంతులో పారినప్పుడే సార్ధక్యం
ఏ లక్ష్యానికి కట్టుబడక బతుకీడ్చుకుపోతే ఏం లాభం ?
నేర్చిన చదువుకు జాతి జాతకం మార్చినప్పుడే సార్థక్యం !
కట్టు బానిసకు సంకెళ్లు మట్టిగరచినప్పుడే సార్థక్యం !
కలలు కనండి,సాకారం చేసుకోండని ‘కలాం’ చెప్పినట్లు ఒక లక్ష్యాన్ని గమ్యాన్ని పెట్టుకోకపోతే జీవితానికి అర్థం ఏముంది?, పరమార్ధమే ముందంటారు సినారె. నేర్చుకున్న విజ్ఞానాన్ని పరులకోసం వినియోగించినప్పుడే ఆ చదువు సార్థకమవుతుందంటారు సినారె.మనం చేసే ఒక చిన్న పని ఇతరుల అభివృద్ధికి దోహదం చేస్తే సమాజం అభివృద్ధి చెందుతూ వుంటుంది.
సినారె ప్రపంచవదులు దైన్యాన్ని పొగొట్టి ధైర్యాన్నిస్తాయి. నిరాశను పారద్రోలి ఆశను చిగురింపజేస్తాయి.”నైరాశ్యం ఒక జాడ్యం, లేలే లేవోయ్ మ్రోగె నగరా’ అంటాడు కృష్ణశాస్త్రి. అలా సినారె నగారాను మ్రోగిస్తాడు తనప్రపంచ పదుల్లో.
కొంతమంది లక్ష్యం పెట్టుకొని కొంత కాలం కాగానే వెనుదిరిగి పోతారు. ఆ లక్ష్యాన్ని చేరలేమను కుంటారు.మరికొంత మంది లక్ష్యం మరచి వ్యర్థంగా సమయాన్ని వెళ్లబుచ్చుతారు. ఇలాంటివారి కోసం ఈ ప్రపంచపదినందించాడు సినారె.
కలవరపడి వెనుదిరిగితే కాలం ఎగబడుతుంది
కదనుతొక్కి చెలరేగితే కాలం భయపడుతుంది
కర్మయోగి ఏనాడూ కాలాధీనుడు కాదు
కనురెప్పలు మూతపడితే కాలం జోకొడుతుంది
కంఠమెత్తి తిరగబడితే కాలం జోకొడుతుంది
మరొక గీతం ఇలాంటిదే…
కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది ?
చెక్కవనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది ?
ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా ?
మరగనిదే మబ్బు రూపు ఎలాకడుతుంది ?
నలగనిదే అడుగు ఎలా రక్తికడుతుంది ?
పై రెండు ప్రపంచ పదుల్లోనూ శిఖరాగ్రానికి చేరుకునేవాడు అట్టడుగునుంచే ప్రారంభించి వుంటాడని, మధ్యలో దారితప్పక,వెనుదిరగక కష్టనష్టాలకోర్చి అలాగే కొనసాగించి శిఖరాన్ని చేరివుంటాడని మనకు విశదం చేయడానికి సినారె అనేక ప్రతీకలతో, భావచిత్రాలను ఉపయోగించి మనకు దృశ్యమానం చేశాడు.’కర్మయోగి ఏనాడూ కాలధీనుడు కాదు’ అన్నది ఒక లోకోక్తిగా మిగిలే వాక్యం. నిరంతరకృషీవలుడే ప్రపంచానికి ధృవతారలుగా నిలిచారు. ఒక మదర్ థెరిస్సా, ఒక గాంధీ, ఒక మండేలా ఇలా ఎందరో మహానీయులు
తమ జీవితాలను కొవ్వొత్తులా త్యాగాలు చేయడం ద్వారానే ప్రపంచం ముందుకుపోతోందని ఆయన భావం.
ఒక లక్ష్యం సాధించడానికి ఉపక్రమించాక మధ్యలో అలసిపోవడమో నిరాశచెంది మనికిది సాధ్యంకాదనిఆగిపోవడమో చేస్తారు కొందరు. దీన్ని గుర్తించిన సినారె ఇలా చెపుతాడొక ప్రపంచవదిలో…
ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత వున్నదా ?
ఎంత వురికినా ఏటికి ఎప్పుడైనా నలత వున్నదా?
అంతలోనే వుసూరంటూ అలసిసొలసి పోతున్నానా ?
ఎంత ఎగసినా నింగికి ఎప్పుడైన కొరత వున్నదా ?
ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కోతవున్నదా ?
అలసిసొలసి పోవడమేగాక కొంత మంది జీవితం పట్ల లక్ష్యంపట్ల నిర్లక్ష్యంగా వున్నవారు, అనేక మూఢవిశ్వాసాలు వున్నవారు కాలంకలసి రాలేదనో, జూతకం బాగలేదనో, ఎవరో తమను అడ్డుకున్నారనో చెప్పుతూ కాలం వెళ్ళబుచ్చు తుంటారు. వీరిని చూసిన సినారె…
చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు
నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు
ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే
చేయిజారిపోతుంటే జీవితాన్ని నిందించకు
కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు
అంటూ తన ప్రపంచపదిలో హెచ్చరిస్తాడు. అంతేగాక “దారి అడ్డుపడుతుంటే నీ దమ్ము సరిచేసుకో” అంటూ ఒక ఉత్తేజపూరిత ధైర్యవచనాన్ని అందిస్తాడు.’ఓటమిలో నిట్టూర్చక వురికొచ్చేదే జీవితం’ అని చెపుతాడు.ఓటమిని, నైరాశ్యాన్ని అవరోధాలను దాటుకుని లక్ష్యశిఖరం చేరినప్పుడు పండుగవుతుందని చెపుతూ ఈ
ప్రపంచపదిని గానం చేశాడు సినారె.
పాటల రొదతో వాడల చెవులను బద్దలుకొడితే పండగా ?
మనసును కడగక కొత్త బట్టలను తనువుకు చుడితే పండగా ?
మనిషికి పండగ తన లక్ష్యశిఖరం పై పడినప్పుడే
కరిగేవయసు పెరగాలంటే కవితలు చెబితే పండగ
ముగిసిన బతుకులకు మూర్తులు కట్టి ముడుపులు కడితే పండగ.
జీవితంలో అత్యున్నత శిఖరం అధిరోహించిన సినారెను నేడు కీర్తిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ పరుల కోసం పాటుపడుతూ ముందుకు పోవాలంటాడు. మనిషి మరణించినా, అతనిని సమాజం గుర్తించుకునే విధంగా ఏదోఒక మంచి ఆశయంతో పనిచేయాలని తన ప్రపంచపదుల ద్వారా చైతన్యాన్ని నింపాడు సినారె.
సామాజిక వికాసం, వ్యక్తిత్వ వికాసంతో పాటు తాత్విక ధోరణలు కూడా కొన్ని ప్రపంచపదుల్లో పరిచారు సినారె. అవి కబీరు, బ్రహ్మం, వేమన తత్వాలకు సంబంధించినవి వున్నాయి. అంతేగాక ప్రతి మనిషిలో అరిషడ్వర్గాలుఏదో ఒక రూపంలో వుంటాయి. వాటిని తొలగించుకోవడానికి బుద్ధుడు పంచశీలను అష్టాంగమార్గాలను బోధించాడు.సమాజం మారుతున్న కొద్దీ సమాజాన్ని నడిపే ధర్మాలుగా మానవతా విలువలు ముందుకొచ్చాయి. ప్రతి ఒక్కరిపట్ల సమభావాన్ని కలిగి వుండటం స్నేహంతో ప్రేమతో గౌరవించడం, పరస్పర నమ్మకం కలిగి వుండటం, ఆప్యాయత,అనురాగాలు కలిగి వుండటం లాంటి మానవతా విలువలు ఆధునికభావాలుగా ముందుకు వచ్చాయి.
ఇలాంటి భావాలు పెంపొందించుకోవాలంటే మనిషిలో అంతర్లీనంగా వున్న లోభం, స్వార్థం, అసూయ,సంపద పై వ్యామోహం లాంటివాటిని పరిహరించుకోవాల్సి వుంటుంది. వీటిపై దృష్టి పెట్టిన సినారె తన ప్రపంచపదుల్లో వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.జీవితంలో నీతికి కట్టుబడి వుండాలంటాడు సినారె ఒక ప్రపంచపదిలో. ‘ప్రలోభాలు పైబడినా నీతికి పడిచచ్చేదే జీవితం’ అంటూ నీతివంతమైన జీవితమే సరైన జీవితంగా వర్ణించాడు. లోభం మనిషిని ఎంతకైనా తెగింపజేస్తుంది. నమ్మిన వేస్తాన్ని (బ్రూటస్ లాగా) వెన్నుపోటు పొడిపిస్తుంది.అది సరైంది కాదని సినారె నిశ్చితాభిప్రాయం. అందుకే…
“పంటలెన్నో ఇంట వున్నా పరిగె లేరిస్తుంది లోభం
నమ్మిన నేస్తం స్నేహం పొదుగును కుమ్మితే నరకం”
అంటూ లోని పొరలను చీల్చకుంటే ఆ లోభతత్వం పోదని హెచ్చరిస్తాడు.లోభంలాగే స్వార్థం కూడా మనిషిని పతనం చేస్తుందంటాడు మరో ప్రపంచపదిలో.
తోడుగ సాగే నీడను కూడా వాడుకుంటుంది స్వార్థం
ఆపైవాన్నే పాచికచేసి వాడుకుంటుంది స్వార్థం
మనిషిలోని ఆ చీకటి కోణం మార్చేవేషాలెన్నో
చిటికెడు పేరుకు నీతిని చీల్చివేస్తుంది స్వార్థం
మూరెడు గద్దెకు జాతిపరువునే ఆరవేస్తుంది స్వార్థం
స్వార్థంతో రగిలే మనిషి ఎంతకైనా తెగిస్తాడు. దేశరహస్యాలు శత్రువులకు అందజేస్తాడు. దైవం పేరు చెప్పి ప్రజలకు శఠగోపం పెట్టడం మనం నిత్యం చూస్తున్నాం. స్వార్థం మనిషిలోని చీకటి కోణంగా వర్ణించాడు సినారె.గురజాడ కొంత స్వార్ధం మానుకోమన్నాడు. పొరుగువానికి తోడ్పడ మన్నాడు. మనిషి స్వార్థానికి కారణం ఆస్తి
హక్కు వుండటమే నంటాడు మార్క్స్. ఈ భూమి తనదికాదు సంపద తనది కాదు. కేవలం శ్రమే తనది.
కాని మనిషి ఆరాటం అంతా ఇంతా కాదు. ఎందుకింత తపన అని సినారి పరోక్షంగా చెపుతారు. ప్రపంచపదిలో.
మనిషి మహనీయునిగా మారేది తన ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయగలిగినప్పుడే. తన సిద్ధాంతానికి కట్టుబడివుంటేఅది నిత్యా గ్రహం. త్యాగానికి నిలబడితే అది సత్యాగ్రహం. మనదేశంలో ఇలాంటివారు ఎంతో మంది వున్నారు.
అందుకే కుత్సిత గతులకు తలవంచకపోతే అది ధర్మాగ్రహం
మడములు తిప్పని త్యాగానికి తలపడితే అది సత్యాగ్రహం
అడుగులు తప్పని నిజాయితీకి నిలబడితే అది నిత్యాగ్రహం
అంటూ వీటిని అలవచ్చుకోవడానికి మనకు మార్గనిర్దేశం చేశారు సినారె.ప్రతి వ్యక్తి ఎన్నో సభలకు వేళుతుంటాడు. కానీ ఏమి నేర్చుకోడు. అందుకే ‘ఎన్ని సభలు తిరిగావని కాదు ఎంత బుద్ధిని పెంచావని’ అంటారు సినారె ఒకచోట. ‘మనసు పుటలను చదవగలిగితే అనుభవం విద్యాలయం’ అని చెపుతాడు. ఇలా ఒక వ్యక్తి తన మేధను పెంచుకోవాలని దాన్ని సమాజానికి తిరిగి పంచాలంటాడు సినారె. అప్పుడే
ఆ జీవితానికి ఒక సాధికారత వస్తుంటారు.
మంచిని వెలిగించని ఆ మతం మతం కాదంటాను
మనిషిని వెలిగించిన ఆ ధనం ధనం కాదంటాను
ఉనికిని సార్థకం కానిది ఉన్నా లేకున్నా ఒకటే
ప్రజలను పలికించని ఆ పదవి పదవేకాదంటాను
మెదడును నడిపించని ఆ చదువు చదువేకాదంటాను….
అంటూ నేటి సమాజానికి కావాల్సిన సందేశాన్ని స్పష్టం చేశారు సినారె.అందువల్లనే ఈ ప్రపంచపదులను ఆయన మారుతున్న సామాజిక విలువలకు మలుపులుగా వర్ణించారు.
సినారె ప్రపంచపదుల్లో చేసిన వెనుచరుపుల్ని, కనుమెరుపుల్ని, మేలుకొలుపుల్ని దారి మలుపుల్ని తెలుసుకుని తమ జీవితాలకు వన్నె తెచ్చుకోవాలి. ఆ వన్నెలతో యువతరం సమాజ వెన్నెల కోసం తమ వంతు తోడ్పడతారని ఆశిద్దాం….
(పిళ్లా కుమారస్వామి,రచయిత, కవి, విశ్లేషకుడు)