పండిత పాత్రికేయుడు విద్వాన్ విశ్వం (తిరుప‌తి జ్ఞాప‌కాలు-5)

(అక్టోబర్ 20 విద్వాన్ విశ్వం వర్ధంతి , అక్టోబర్ 21 జయంతి)

(రాఘ‌వ శ‌ర్మ‌)
తెల్ల‌ని పంచ‌, లాల్చీ.
త‌లంతా అల్లుకుపోయిన వెండి తీగ‌లు..
నిత్యం ఒక చేతిలో కాలుతున్న సిగ‌రెట్టు..
మ‌రొక చేతిలో పొగ‌లు క‌క్కుతున్న‌ టీ ..
అజాను బాహుడు. నిండైన విగ్ర‌హం..
ఆయనే విద్వాన్ విశ్వం.
అది 1985-87 మ‌ధ్య కాలం.
తిరుప‌తిలోని టీటీడీ హుజూర్ ఆఫీసు వెనుక ఉన్న క్వార్ట‌ర్స్‌లో విద్వాన్ విశ్వం నివాసం. నేను, భూమ‌న్ , ఏ.ఎన్‌. క‌లిసి త‌ర‌చూ వారింటికి వెళ్ళే వాళ్ళం.
ఎన్ని క‌బుర్లు చెప్పే వారో! ఏ ఒక్క‌టీ ఊసుపోక చెప్పే వి కావు. అన్నీ విజ్ఞాన దాయ‌క‌మైన‌వి.
ముఖ్యంగా రాయ‌ల‌సీమ గురించి అనేక విష‌యాలు దొర్లేవి.
మా మ‌ధ్య ఉన్న నాలుగు ద‌శాబ్దాల‌ వ‌యోభేదం వారికి లెక్క‌లేదు.
వారికి చిరుతిళ్ళు అంటే ఇష్టం. మాకు పెట్టి , వారు తింటూ మాట్లాడేవారు.
విద్వాన్ విశ్వం అన‌గానే గుండె కంజెర కొట్టుకుంటూ, గొంతు కిన్నెర మీటుకుంటూ వినిపించే ‘ పెన్నేటి పాట ‘ గుర్తుకు వ‌స్తుంది.
అనంత‌మైన జ‌న‌జీవ‌న రాగాల‌ను మీటిన ‘మాణిక్య వీణ ‘ గుర్తుకు వ‌స్తుంది.
బాణుడి ‘కాదంబ‌రి ‘ , కాళిదాసు ‘మేఘ సందేశం ‘ గుర్తుకు వ‌స్తాయి.
విద్వాన్ విశ్వం క‌వి, ర‌చ‌యిత‌, పండితుడు మాత్ర‌మే కాదు, పండిత పాత్రికేయుడు, స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు, సామ్య‌వాది, విప్ల‌వ కమ్యూనిస్టు నాయ‌కుడు త‌రిమెల నాగిరెడ్డికి బాల్య మిత్రుడు.
అనంత‌పురం జిల్లా త‌రిమెల గ్రామంలో 1915 అక్టోబ‌ర్ 21వ తేదీన ఒక పండిత కుటుంబంలో ఆయన జ‌న్మించారు.
అయ‌న అస‌లు పేరు మీస‌ర గండ విశ్వ‌రూపాచారి.
మ‌నం కులాల పేర్లు, ఇళ్ళ పేర్లు ప‌డ‌వ‌లెక్కి ప్ర‌యాణం చేయ‌డానికి అల‌వాటు ప‌డ్డాం.
ఆ అవ‌స‌రం వారికి లేదు.
తాను చ‌దువుకున్న విద్వాన్ ను ఇంటి పేరును చేసుకున్నారు. ప్ర‌పంచాన్ని త‌న పేరుగా మార్చు కున్నారు.
వీరి పూర్వీకులు చిత్తూరు జిల్లాకు చెందిన వారు.
వీరి తాత గారు కార్వేటిగ‌న‌రం సంస్థానంలో సంస్క్ర‌త పండితులు.
అనంత‌పురం జిల్లా త‌రిమెల‌కు వ‌ల‌స వెళ్ళారు.
విశ్వం జీవితం రాజ‌కీయాల‌తో మొద‌లైంది. అనంత‌పురం జిల్లా కాంగ్రెస్ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు.
‘ యుద్ధం వ‌ల్ల క‌లిగే అర్థిక ఫ‌లితాలు ‘ అన్న క‌ర‌ప‌త్రం రాసి వేసినందుకు త‌రిమెల నాగిరెడ్డి తో పాటు జైలు జీవితాన్ని అనుభ‌వించారు. చివ‌రికి ప‌త్రికా రంగానికి పరిమితమ‌య్యారు.
నాగిరెడ్డి మ‌ర‌ణించిన‌ప్పుడు వారు రాసిన ‘మాణిక్య‌వీణ ‘ చదివితే క‌నీళ్ళు వస్తాయి.
‘ మీజాన్ ‘ తెలుగు దిన‌ప‌త్ర‌తిక‌తో (1945) ఆయ‌న పాత్రికేయ జీవితం ప్రారంభ‌మైంది.
ప్ర‌జాశ‌క్తి, స‌వ్య‌సాచి, ఇంటింటి గ్రంథ‌మాల‌, ఆంధ్ర‌ప్ర‌భ‌, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లలో ప‌నిచేశారు.
ఆంధ్ర‌ప్ర‌భ వార‌ప‌త్రిక‌లో ఆయ‌న ప్రారంభించిన ‘మాణిక్య వీణ ‘ ఆయ‌న మ‌ర‌ణించేవ‌ర‌కు కొన‌సాగింది.
టిటీడీ ప్ర‌చుర‌ణల విభాగంలో ప్ర‌ధాన సంపాద‌కులుగా చివ‌రి శ్వాస విడిచే వ‌ర‌కు ప‌నిచేశారు.
అందులో ప‌నిచేస్తున్న‌ప్పుడు వారికి కేటాయించిన స‌హాయ‌కుడికన్నా వారి జీతం త‌క్కువ‌!
ఏప‌త్రిక‌లోనూ నిల‌క‌డ లేని జీవితం. య‌జ‌మానుల చెప్పు చేత‌ల్లో ఇమ‌డ‌లేని వైనం.
ఆత్మాభిమానాన్ని చంపుకోలేక‌పోయారు. ఎవ‌రినీ సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోయారు.
నార్ల‌వారి ‘మాటా మంతి ‘, ‘పిచ్చాపాటి ‘ వ్యాసాల‌లోని లోపాల‌ను సైతం నీళ్ళు న‌మ‌ల‌కుండా ఎత్తి చూప‌గ‌లిగిన ధీశాలి.
విశ్వంది మాన‌వ హృద‌యం. ఊహ‌క‌న్నా, భావ‌న క‌న్నా అనుభ‌వ‌మే మూలాధారంగా వెడ‌లిన ప‌ర‌వ‌శ‌ర‌చ‌న ఆయ‌న ‘పెన్నేటి పాట’
ఇది ప్రాచీన ఆధునిక రీతుల క‌ల‌యిక‌. న‌దిలో నీరు లేక‌పోవ‌డానికి మించిన విషాధం మ‌రొక‌టి ఉండ‌దు.
ఎముక‌లు విరిగేలా క‌ష్ట‌ప‌డినా సుఖం లేక‌పోవ‌డాన్ని మించిన దారుణం మ‌రొక‌టి ఉండ‌దు.
రాయ‌ల‌సీమ క‌రువు నేప‌థ్యంగా వ‌చ్చిన తొలి కావ్యం ‘పెన్నేటి పాట‌’
జీవిత చిత్ర‌ణ‌లో, భాష‌లో, భావ వ్య‌క్తీక‌ర‌ణ‌లో రాయ‌ల‌సీమ‌కు ప్రాతినిధ్య కావ్యం ‘పెన్నేటిపాట‌’
తిప్ప తీగ‌లు, రేణిగంప‌లు, తుమ్మ‌తోపు, చిట్టీత‌, తంగేడు, ప‌ల్లేరుగాయ‌లు, గూబ‌మూల్గు, తీతువు, పాప‌ర‌కాయ‌లు వంటి జ‌న‌వ్య‌వ‌హారంలోని ప‌దాల‌ను ఈ కావ్యంలో విరివిగా వాడారు.
క‌విత్వంలో రాయ‌ల‌సీమ మాండ‌లికాల‌ను ఇంత విరివిగా వాడిన వారు మ‌రొక‌రు లేరు.
‘నా తెలంగాణా కోటి ర‌త‌నాల వీణ’ అని దాశ‌ర‌థి అంటే…
‘రాయ‌ల‌సీమ ప‌చ్చ‌ల బ‌జారు జుమ్మ‌ని మ్రోయు మించుల సితారు’ అంటారు విశ్వం.
కాళిదాసు మేఘ‌సందేశం కావ్యాన్ని అనువ‌దిస్తూ ప్ర‌వేశిక‌లో ఇలా అంటారు.
‘అల్పుడ‌ను స్వామీ! నేనింత ర‌సానుభూతిని భ‌రించ‌లేను-అందాల‌ను పంచిపెట్టి పుట్టిన వాడ‌ను కాను. అందుకే వేడుకుంటున్నాను. న‌న్ను నీ అమేయ‌మైన భావ‌నా బ‌లంతో వివ‌శుని చేసివేయ‌కు. నా పిచ్చుక గూళ్ళు న‌న్ను క‌ట్టుకోనీ’
కానీ, విద్వాన్ విశ్వం క‌ట్టిన‌వి మామూలు పిచ్చుక గూళ్ళు కావు. బంగారు పిచ్చుక గూళ్ళు.
ఆయ‌న త‌న మేఘ‌సందేశంలో కాళిదాసుకే మెరుగులు దిద్దారంటే ఛాంద‌సులు చెవులు మూసుకోక‌త‌ప్ప‌దు.
క‌విగా ‘పెన్నేటి పాట‌’, కాల‌మిస్టుగా ‘మాణిక్య‌వీణ’ ఎంత పేరు తెచ్చాయో, బాణుడి ‘కాదంబ‌రి’ అనువాదం వాటికి మించిన ఖ్యాతి తెచ్చి పెట్టింది.
ప్ర‌ప‌పంచ వాజ్ఞయంలోనే ఒకానొక విశిష్ట వ్య‌క్తిత్వంతో నిలిచిపోయిన ‘కాదంబ‌రి’ అంటే విశ్వంకు ఎంతో ఇష్టం.
త‌న కుమార్తెకు ‘కాదంబ‌రి’ అని పేరు కూడా పెట్టుకున్నారు.
బ్రిటిష్ సైనికుల దురాగ‌తాన్ని ఎదిరించి ప్రాణాల‌ర్పించిన హంప‌న్న అనే వీరుడి గాథ ‘ఒక‌నాడు’ కావ్యంగా వెలువ‌రించారు.
ర‌ష్యాని ప్రేమించారు. ఫ్యాసిజాన్ని ద్వేషించారు. చెహోవ్‌ని , గోర్కీని అనువ‌దించారు.
లెనిన్ మీద‌, స్టాలిన్ మీద పుస్త‌కాలు రాశారు.
ర‌జ‌నీపామీద‌త్ రాసిన ఇండియా టుడే ని నేటి భార‌తంగా ఆంధ్రీక‌రించారు.
తాను న‌మ్మిన సిధ్ధాంతాల కోసం న‌వ్వుతూ న‌లిగిపోయారు.
పాండిత్యంతో పాటు సృజ‌నాత్మ‌క శ‌క్తి, తార్కిక‌త‌, విమ‌ర్శ‌నా దృష్టి క‌ల‌గ‌లిసిన విద్వాన్ విశ్వం లాంటి మ‌రో వ్య‌క్తి ప‌త్రికారంగంలో లేరంటే అతిశ‌యోక్తి కాదు.
త‌న ఆత్మ‌క‌థ‌ను ఆంధ్ర‌జ్యోతిలో ప్ర‌తి ఆదివారం రాయ‌డం మొద‌లు పెట్టారు.
1987, అక్టోబ‌ర్ 20 వ తేదీ ఆదివారం నాల్గ‌వ భాగం వ‌చ్చింది.
ఆరోజే తుది శ్వాస విడిచారు. అది అసంపూర్ణంగా మిగిలిపోయింది.
వారి అంత్య క్రియ‌ల‌కు వేళ్ళ‌పైన లెక్క పెట్ట‌గ‌లిగినంత మంది కూడా హాజ‌రు కాలేదు.
విద్వాన్ విశ్వం మ‌ర‌ణ వార్త ఆనాడు ఆంధ్ర‌జ్యోతిలో నేను రాయాల్సి వ‌చ్చింది
వారు ఆద‌ర్శ ప్రాయులు, చిర‌స్మ‌ర‌ణీయులు.

(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ వివిధ పత్రికల్లో, వివిధ జిల్లాల్లో పనిచేశారు. ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, వర్తమానం, వార్త, సాక్షి పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేసి ఏడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు .తిరుపతి, విజయవాడ, హైదరాబాదు, నెల్లూరు, ఏలూరు, కాకినాడ ప్రాంతాలలో పని చేశారు. వివిధ పత్రికల్లో రాజకీయ, సాహిత్య, సామాజిక అంశాలపై అనేక కథనాలు రాసారు . చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)