ఆధునిక సాహిత్య విమర్శకుడికి ప్రాపంచిక జ్ఞానం చాలా అవసరం: ఆచార్య మేడిపల్లి

22-10-22 న విడుదలవుతున్న పిళ్లా కుమారస్వామి రచన  ‘విశద’  ముందుమాట

దిశానిర్దేశం చేస్తున్న దిశలో…

(ఆచార్య మేడిపల్లి రవికుమార్)

అనుకుంటాం గాని, కావ్య సృజన కంటే కావ్య విమర్శ ఎప్పుడూ కష్టమే. ఆధునిక యుగం ఆవిర్భవించాక సృజన సాహిత్యం అనేక ప్రక్రియలకు విస్తరించింది. సృజనాత్మకత విభిన్న రూపాలు పొందే కొద్దీ విమర్శ కూడా పోను పోనూ జటిలమవుతూ వచ్చింది. అందుకు కారణాలు మనందరికీ తెలిసినవే.
సృజనకారుడికి ఎంచుకున్న వస్తువు పట్ల సంపూర్ణ అవగాహన ఉండాలి. ఎంపిక చేసుకున్న ప్రక్రియ పట్ల పరిపూర్ణ అధికారం కావాలి. ఈ రెండిటినీ సమన్వయించడంలో శిల్పపరమైన నేర్పు ఉండాలి. అప్పుడే సాహిత్య కళాసంబంధమైన సమాధి వాతావరణంలో ఆ రచన సాకారం పొందుతుంది.ఆ రచన అస్తిత్వం ఆయా రచయితల సృజనాత్మక సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది.
ఒక్కొక్కసారి రచయిత స్వీకరించిన వస్తువులో జీవం ఉన్నప్పటికీ అది పాఠకుల దగ్గరకు చేరలేదు. వారి ఆదరణ పొందలేదు. మరొకప్పుడు ప్రక్రియ ఏదైనా పాఠకుల్ని ఆకర్షిస్తాయి. మళ్లీ మళ్లీ చదివిస్తాయి. ఇంతకూ రచయిత ఈ రచనలో ఏమి చెప్పాడని ప్రశ్నించుకుంటే పాఠకునికి జవాబు దొరకదు. వీటి వెనుక అనేక కారణాలున్నాయి. అక్కడ వస్తువు ఉన్నప్పటికీ రూపం అస్పష్టంగా ఉండటం. ఇక్కడ రూపం ఉన్నప్పటికీ వస్తువును పోల్చుకోలేకుండా ఉండటంఅనేవి ఈ కారణాలలో ప్రధానమైనవి. దీనినే శిల్పం లోపించడం అంటాం. ఈవిషయం కొందరు రచయితలు గుర్తించలేరు. గుర్తించినా అందుకు కొంత కాలంపడుతుంది. ఈ అనుభవం ఆయా రచయితలకు తరువాత రచనలలో ఉపయోగపడవచ్చుగాని, ఈ రచనల వల్ల ప్రయోజనం అంతాగా కనిపించదు.చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లే.

 

రచయిత పిళ్లా కుమారస్వామి
ఈ వివరణంతా ఎందుకంటే… సృజన కంటే విమర్శ ఎంత బాధ్యతా యుతమైనదో చెప్పడానికే. సృజనకారుడికి వస్తువుపట్ల, రూపం పట్ల ఎంత సాధికారికత ఉండాలో అదంతా విమర్శకునిలోనూ ఉండాలి. వీటితో పాటుసృజనకారులకు అందని అంశాలూ, రచయితలో గుర్తించని విషయాలూ కూడా విమర్శకులకు తెలిసి ఉండాలి. స్థలకాలాల స్వభావాలు, సామాజిక స్థితిగతులూ, సాహిత్య స్వరూప స్వభావాలు, వీటితోపాటు సాహిత్యంపై సమాజం మధ్య ఉండవలసిన సంబంధాలు ఒక రచన పాఠకుల దగ్గరకు ఎందుకు వెళ్లిందో, మరెందుకు చేరలేక పోయిందో వంటి అనేక విషయాలపట్ల విమర్శకునికి సాధికారికత ఉండాలి. సామాజికుల చేత మంచి రచనలను చదివించడం లోనూ, రచయితల నుంచి మంచి రచనలను రాబట్టడంలోనూ విమర్శకుడు బాధ్యత వహించాలి.
రచయితలకూ, సామాజికులకూ మధ్య విమర్శకుడు ఒక వారధిలా నిలబడాలి.అప్పుడే ఆ విమర్శకు ఒక ప్రామాణికత సంతరించుకుంటుంది. ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే ఈ విమర్శనా గ్రంథాన్ని మన ముందుకు తెస్తున్న పిళ్లా కుమారస్వామిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పడానికే.
ఈ విమర్శనా గ్రంథంలో కుమార స్వామి విమర్శకు స్వీకరించిన రచన లన్ని విభిన్న ప్రక్రియలకు సంబంధించినవి. అన్నీ ఆధునికమైనవే. ప్రాచీన కావ్యాలను విమర్శించడం వేరు, ఆధునిక సాహిత్యాన్ని విశ్లేషించడం వేరు.
ప్రాచీన కావ్య విమర్శకుడికి పౌరాణిక జ్ఞానం కావాలి. కావ్య మర్యాదలు తెలిసి ఉండాలి. లక్షణ శాస్త్రాలు పరిచయం కావాలి. ఆధునిక సాహిత్య విమర్శకుడికి వీటన్నింటితో పాటు ప్రాపంచిక జ్ఞానం కూడా అవసరం. చరిత్ర, సోషియాలజీ వంటి ఇతర సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసి ఉండాలి. ఆధునిక సామాజిక అవసరాలపట్ల అవగాహన కావాలి. కొందరికి ప్రాచీన సాహిత్యం అర్థం కానట్టుగానే, మరికొందరికి ఆధునిక సాహిత్యం అవగాహనకు అందదు.
ఆధునిక సాహిత్యం అర్థం కావాలంటే ఆధునికంగా జీవించాలి. ఆధునిక జీవితంతెలిసి ఉండాలి. వీరు మాత్రమే ఆధునిక సాహిత్యాన్ని సాధికారికంగా విమర్శించ గలరు. విమర్శ అస్తిత్వాన్ని పెంచగలదు. ఈ విషయంలో కుమారస్వామి సమర్థుడని ఈ గ్రంథంలోని చాలా వ్యాసాలు నిరూపిస్తాయి.
కథ, నవల, కవిత్వం, వ్యాసం వంటి సాహిత్య ప్రక్రియల్లాగా విమర్శ ఒక ప్రత్యేక ప్రక్రియ కాదు. అయినప్పటికీ సాహిత్య ప్రక్రియల కంటే భిన్నమైన శైలి విమర్శకు ఉంటుంది. ప్రతి విమర్శకుడికీ ఒక ప్రత్యేక శైలి ఉంటుంది.కుమారస్వామి విమర్శలోనూ కొన్ని ప్రత్యేకతలను గుర్తించగలం.

 

ఫ్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్
‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నట్లు కవులలో ఆధునిక కవులు వేరు. ముఖ్యంగా వచన కవితా ప్రక్రియను స్వీకరించిన వారిలో కొన్ని అదనపు విశేషాలు గమనించగలం.
‘ఆధునికత’ అనేది కాలానికి సంబంధించినది కాదు. అది దృక్పథానికి చెందిన అంశం. వచనంలో రాసినంత మాత్రాన ప్రతి కవీ ఆధునిక కవి అనిపించుకోడు. ఆ కవి స్వీకరించిన వస్తువు, అభివ్యక్తీకరించిన పద్ధతి, ఎంపిక చేసుకున్న పాఠకులు, ఆ కవిత ద్వారా ఆ కవి ఆశించిన ఉద్దేశం, ఆవిష్కరించిన దృక్పథం, ఆ కవితలో వినియోగించిన భాష వంటివి
ఆ కవికీ, కవితకూ సంబంధించిన ఆధునికతను పట్టి చూపిస్తాయి. ఇందుకు సంబంధించిన స్పష్టత విమర్శకునిలో లేకపోతే, ఆధునిక కవితను సాధికారికంగా అంచనా కట్టలేడు. ఈ గ్రంథంలో ఆధునిక కవిత్వాన్ని విశ్లేషించిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి. కుమారస్వామికి ‘ఆధునికత’ అనే అంశం పట్ల స్పష్టమైన అవగాహన అవసరమైనంత ఉందని చెప్పడానికి ఈ గ్రంథంలోని కొన్ని వ్యాసాలు సాక్ష్యంగా నిలుస్తాయి.
‘కత్తుల వంతనపై యుద్ధం సాగిస్తున్న మనిషి’ అనే వ్యాసంలో కుమారస్వామి ‘చం’ ప్రకటించిన ‘ ఒక కత్తుల వంతెన’ అనే సంపుటిని విశ్లేషించారు. కవులేం చేస్తారో ఆ వ్యాసంలో ఇలా స్పష్టంగా ప్రకటించారు. ‘సామాజిక సంఘర్షణ జరుగుతున్న సందర్భాలలో కవి నిశ్చబ్ధంగా కూర్చోలేడు. బరిలో ఏదో ఒక వైపు నిలబడి తన అస్తిత్వాన్ని తెలియజేయడమే గాక సమాజ గమనాన్ని నిర్దేశిస్తాడు. ‘ వర్గ సమాజంలో కవి ఎవరి పక్షం వహించాలో కూడా కుమారస్వామి ఇలా స్పష్టం చేశారు. “ నిజమైన కవి ఎప్పుడూ పీడితుల వైపే నిలబడతాడు’ (నిద్రపోతున్న ప్రపంచాన్ని తట్టిలేపే జగ్ నేకి రాత్’ అనే వ్యాసం) సడ్లపల్లె చిదంబర రెడ్డి కవిత్వాన్ని ‘జీవన ప్రవాహాన్ని దృశ్యీకరించిన కవిత్వం’ అనే వ్యాసంలో కుమారస్వామి చాలా స్పష్టంగా అంచనా కట్టారు. కవులకు ఏం కావాలో, కవులు ఏం చేస్తారో అన్న విషయాన్ని కుమరస్వామి ఈ వ్యాసంలోనూ ఇలా ప్రస్తావించారు.
కవి కవిత్వాన్ని రాయాలంటే సమాజం పట్ల ఆర్తి ఉండాలి. ప్రజల సంవేదనల్ని తన అక్షరాల్లోకి పొదిగించాలి. కవికి సమాజ బాధల పట్ల, మానవత్వం పట్ల అపారమైన సహానుభూతి ఉండాలి. కరుణ, దయ, ఆవేశం, కలిగిన కవి ప్రజలవైపు నిలబడి అక్షరాల్ని ఆయుధాలుగా మారుస్తాడు. లేదా కరుణ  రసప్లావితం చేసి పాఠకుని హృదయాలలో భావ ప్రకంపనలు సృష్టిస్తాడు’.
కవికి సంబంధించి, కవిత్వానికి సంబంధించి ఇటువంటి సాభిప్రాయాలు కుమారస్వామి మరి కొన్నింటిని ప్రస్తావించకపోలేదు. ఇవి కేవలం ఆధునిక కవికి మాత్రమే సంబంధించినవి కావు. ఇతర ప్రక్రియలలో రచనలు చేసే ఆధునిక రచయితలందరికీ ఈ మాటలు వర్తిస్తాయన్నది కూడా కుమారస్వామి అభిప్రాయంగా భావించాలి.
ఏ విషయాల పట్ల విమర్శకుడికి రాగద్వేషాలు ఉండకూడదు. విషయాన్ని స్పష్టంగా సూటిగా చెప్పగలగాలి. విమర్శకుని వివరణలు అటు పాఠకులలోతెలివిడిని పెంచాలి. ఇటు రచయితలకు అవసరమైతే దిశానిర్దేశం చేయగలగాలి.
కేవలం స్తుతులతో రచయితలను ముంచెత్తడం ఉత్తమ విమర్శకుని లక్షణంకాదు. విమర్శకుడిగా కుమారస్వామిలోని ఉత్తమ లక్షణాలను తేటతెల్లం చేసే కొన్ని వ్యాఖ్యలు ఈ గ్రంథంలో లేకపోలేదు. ‘నిద్రపోతున్న ప్రపంచాన్ని తట్టిలేపే జగ్ నేకే రాత్’ అనే వ్యాసంలో కుమారస్వామిలోని అచ్చమైన విమర్శకుణ్ణి చూడగలం.
స్కైబాబా కవిత్వాన్ని తరాజూలో తూస్తూ ఇలా తీర్పు చెప్పారు.
ముస్లిం వాడలు, హరిజన వాడలూ, ఒకే రకంగా ఉండటాన్ని,ముఖ్యంగా వారి జీవితాల్లో ఎలాంటి వెలుగూ లేకపోవడాన్ని స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు తన ‘మర్ఫా’ కవితలో ఆవిష్కరిస్తాడు. అయితే అలా ఉండటానికికారణం ఎవరో కవి స్పష్టంగా గుర్తించలేకపోయాడు.
తరతరాల దోపిడీతో పాటు,సామాజికంగా బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందనీయకుండా చేసిన పాలక వర్గాల కుట్రను కవి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది.”పై వ్యాసంలో మరో చోట కుమారస్వామి మరికొంత వివరణ ఇచ్చారు.
ముస్లింలలో ఆవేదన పడే వర్గమంతా కేవలం అల్లా కోసం ప్రార్ధన చేస్తేసరిపోదని, హక్కుల కోసం పోరాడాలని ఆయన ఉద్భోధిస్తున్నాడు. …. అయితే, ఎవరిపై పోరాడాలో చెప్పలేకపోయాడు. ఇది చెప్పకపోతే తిరిగి వారంతా అయోమయంలో పడతారు. దీంట్లో కవికి, స్పష్టత ఉండాలి. గురి ఉండాలి..కవి పోరాట స్వభావాన్ని మెచ్చుకోవచ్చుగాని, ఆ పోరాటం మత ఛాందసవాదం పైన అనీ, దానికి వత్తాసు పలికే పాలక వర్గాల పైన అనీ కాని స్పష్టం చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉంది.”
విమర్శకునిలోని నిక్కచ్చితనాన్ని, తెలియజేసే ఇటువంటి సందర్భాలు ఈ గ్రంథంలో మరికొన్ని లేకపోలేదు. ఈ గ్రంథంలో ఉన్న వ్యాసాలన్నీ అత్యుత్తమ మైనవని ధ్రువీకరించడానికి వీలులేదు. సవరించుకోవలసినవీ, గుర్తించవలసినవి అక్కడక్కడా ఒకటి రెండు అంశాలు ఉన్నాయి.
‘ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆదివాసీల భిన్న సంస్కృతులు’ అనే వ్యాసంలో ఆదివాసులకు సంబంధించిన గొప్ప సమాచారం ఉంది.
డా. రమేష్ నారాయణ రచించిన ‘గిరిజన సంస్కృతి – సాహిత్యం’ అనే గ్రంథంలోని విషయాలనే కుమారస్వామి పరిచి చూపించారు. విమర్శకుడిగా ఆయన గొంతు ఈవ్యాసంలో మసకబారింది. అలాగే ‘చైతన్యాన్ని రగిలించే’ నల్ల చేపపిల్ల కథ అనే వ్యాసం కూడా అటువంటిదే. కేవలం కథ చెప్పి ఊరుకోవడం ఉత్తమ విమర్శ లక్షణం కాదు. ఏవిధంగా, ఎందువల్ల, ఆ కథ చైతన్యాన్ని రగిలించగలిగిందో కుమారస్వామి మరికొంత స్పష్టం చేస్తే బాగుండేది.
భవిష్యత్తులో రచించబోయే విమర్శనా వ్యాసాలలో ఇటువంటి చిన్నచిన్న అంశాలను కుమారస్వామి సవరించుకోగలరని, మరికొంత అప్రమత్తంగా ఉండగలరనే ఈ సూచనలు.సుమారు 20కి పైగా వ్యాసాలున్నఈ గ్రంథంలోఆధునిక సాహిత్యానికి సంబంధించిన అనేక అమూల్యమైన అంశాలు విరివిగానే ఉన్నాయి. ఇంతటి విలువైన గ్రంథాన్ని ప్రకటిస్తున్న కుమారస్వామిని అభినందిస్తూ… భవిష్యత్తులో ఇంత కంటే విలువైన గ్రంథాలు మరికొన్ని రావాలని ఆకాంక్షిస్తున్నా.
(డా॥ మేడిపల్లి రవికుమార్, తెలుగు ఆచార్యులు, తెలుగు శాఖ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి)