ఐపీఎల్ లో “సూపర్ అండ్ సూపర్” ఓవర్!!!

(CS Saleem Basha)
నిన్న(18.10.2020) కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ కు జరిగిన మ్యాచ్ నిజంగా అద్వితీయం. క్రికెట్ చరిత్ర లో మొట్టమొదటిసారి జరిగిన డబల్ సూపర్ ఓవర్ మ్యాచ్ ఇది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్ అటు ప్రేక్షకులను ఇటు ఆటగాళ్లను కూడా ఎంతో ఉత్కంఠకు గురి చేసింది. అవిశ్వసనీయమైన ఈ మ్యాచ్ నిజంగా ప్రేక్షకులకి పండగే. సూపర్ ఓవర్ కూడా టై అయ్యి, మళ్ళీ రెండో సూపర్ ఓవర్ ఆడిన మొదటి మ్యాచ్ ఇదే!
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రోహిత్ శర్మ త్వరగానే పెవిలియన్ కు చేరుకున్నా, క్వింటన్ డికాక్ మాత్రం అర్థ సెంచరీతో చెలరేగి పోయాడు. మిగతా బ్యాట్సమెన్ సూర్య కుమార్ యాదవ్, ప్రశాంత్ కిషన్, హార్దిక్ పాండ్యా కూడా త్వరగానే పెవిలియన్ చేరిపోయినా, కునాల్ పాండ్యా, పొల్లార్డ్ నెమ్మదించిన ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించారు. చివర్లో బౌలర్ కౌంటర్ నైల్ వేగంగా ఆడి ఇన్నింగ్స్ కు మంచి ముగింపు ఇచ్చాడు.

 

 


177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు చివరి బంతి దాకా మ్యాచ్ ను తీసుకెళ్ళింది. కేఎల్ రాహుల్ చక్కగా ఆడి 77 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ త్వరగానే వెనుదిరిగినా క్రిస్ గేల్ కాసేపు నిలదొక్కుకున్నాడు. 24 పరుగులు చేసి అతను కూడా పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చినా నికొలస్ పూరన్ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అతను కూడా 24 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ డక్అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన దీపక్ హూడ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్ళాడు. అతనికి జోర్డాన్ సహకారం అందించాడు. చివర్లో రెండు చక్కని ఫోర్ లు కొట్టిన జోర్డాన్ చివరి బంతికి రెండు పరుగులు సాధించాల్సిన సమయంలో ఒక పరుగు తీసి రెండో పరుగు కి రనౌట్ అయ్యాడు. అలా మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ అయ్యింది.
సూపర్ ఓవర్ లో పంజాబ్ జట్టు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ లను పంపింది. అటు ముంబై జట్టు బుమ్రా ను బౌలింగ్ కు ఎన్నుకుంది. మొదటి బంతికి కె.ఎల్.రాహుల్ ఒక పరుగు సాధించగా రెండో బంతికి పూరన్ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో బంతికి కూడా రాహుల్ సింగిల్ మాత్రమే సాధించాడు. తర్వాత వచ్చిన హూడ నాలుగవ బంతి కూడా సింగిల్ తీశాడు. అయితే ఐదో బంతి కి కూడా రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి బంతికి రాహుల్ రివర్స్ స్వీప్ ఆడ బోయి ఎల్ బి డబ్ల్యు అవడంతో 5 పరుగులతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు రోహిత్, డీకాక్ లను ఓపెనర్లుగా పంపింది. డీకాక్ మొదటి బంతికి ఒక పరుగు సాధించాడు. రెండో బంతికి రోహిత్ ఒక పరుగు సాధించాడు. మూడవ బంతి కూడా సింగిల్ వచ్చింది. ఇక మూడు బంతుల్లో 3 పరుగులు సాధించాల్సిన సమయంలో షమ్మీ వేసిన చక్కని యార్కర్ కు పరుగు రాలేదు. ఇక ఐదో బంతి రోహిత్ ప్యాడ్ కు తగిలి లెగ్ బై తో ఒక పరుగు వచ్చింది. ఇక చివరి బంతికి రెండు పరుగులు సాధించాల్సిన టైంలో డి కాక్ ఒక పరుగు సాధించి రనౌట్ అయ్యాడు. దీనితో సూపర్ ఓవర్ కూడా టై అయ్యి రెండో సూపర్ ఓవర్ కు తెరలేపింది!
మళ్ళీ రెండో సారి ఆడిన సూపర్ ఓవర్ లో ముంబాయి పొలార్డ్, హార్దిక్ పాండ్యా లను పంపింది. ఎందుకంటే క్రికెట్ రూల్స్ ప్రకారం ఎవరైతే మొదటి సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేశారో వాళ్లు రెండో సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేయకూడదు. అలాగే బౌలింగ్ ఎవరైతే వేశారు వాళ్లు మళ్లీ వేయడానికి కుదరదు.
ఇక రెండో సూపర్ ఓవర్ లో మొదటి బంతికి ఒక సింగిల్ వచ్చింది. రెండో బంతి కూడా సింగిల్ వచ్చింది. ఇక మూడో బంతికి పొలార్డ్ కవర్స్ మీదుగా ఒక చక్కటి బౌండరీ సాధించాడు.
ఇక నాలుగో బంతికి లాంగ్ ఆన్ వైపు కొట్టిన పొలార్డ్ రెండు పరుగులు తీయాలని చూసినా ఒక పరుగు సాధించి రెండో పరుగు కి హార్దిక్ పాండ్యా రనౌట్ అయిపోయాడు.
ఇక చివరి బంతికి పొలార్డ్ మిడ్ వికెట్ దిశగా భారీ షార్ట్ కు ప్రయత్నించినా, మయాంక్ అగ్రవాల్ అద్భుతంగా బంతిని బౌండరీ దాటకుండా ఆపాడు.
అలా నాలుగు పరుగులు ఆప గలిగాడు. చివరి బంతికి రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ముంబై రెండో సూపర్ ఓవర్లో కేవలం 11 పరుగులు సాధించింది.
ఇక 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ క్రిస్ గేల్, మయాంక్ ఓపెనర్లుగా దిగారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి బంతికే గేల్ భారీ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి గేల్ సింగిల్ సాధించాడు.
ఇక మూడో బంతికి మయాంక్ చక్కని ఫోర్ కొట్టాడు. మూడు బంతుల్లో ఒక పరుగు సాధించాల్సిన సమయంలో మయాంక్ మరో చక్కని ఫోర్ సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఆ విధంగా గా క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై తర్వాత , సూపర్ ఒవర్ కూడా టై కావటం, రెండో సూపర్ ఒవర్ ఆడాల్సి రావటం. రెండుసార్లు ఒకే జట్టు విజయం సాధించటం అన్నది వీక్షకులకు కనుల విందు చేసింది.
ఇప్పుడు క్రికెట్ లో ప్రసిద్ధి చెందిన ” చివరి బంతి వరకు మ్యాచ్ అయిపోదు”, అనే నానుడిని, ” సూపర్ ఓవర్ కు వెళ్ళినా కూడా మ్యాచ్ అయిపోదు” అని మార్చవలసి వస్తుంది.
Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)