కోనసీమ మండువా ఇళ్లు…

(త్రిభువన్)
కోనసీమలో మండువా ఇళ్లు చూద్దామని మూర్తితో పాటు రాజమండ్రిలో ఉదయమే బయల్దేరాను.
కారు రావులపాలెం దాటి కొత్తపేట లో ప్రవేశించి ఒక పెద్ద మురుక్కాలవ పక్కనుంచి వెళ్తూంటే “ఇది కౌశికి నది” అన్నాడు మూర్తి.
“ఇది నదా?” అని ఆశ్చర్యంగా చూసిన నన్ను చూసి దాన్నిగురించి చెప్పడం మొదలుపెట్టాడు.
పూర్వం గౌతమి గోదావరి నది కొత్తపేట దగ్గర చిన్న పాయగా విడిపోయి కోనసీమంతా మెలికలు తిరిగి మరోవైపున వశిష్ట గౌతమి నదిలో కలసిపోయేది.
నది సన్నగా, నీళ్లు స్వచ్చంగా ఉండి స్నానపానాలకు అనుకూలంగా ఉండడం వల్ల కోనసీమ అగ్రహారాలన్నీ కౌశికి ఒడ్డున యేర్పడ్దాయట. ఆ మధ్యన గోదావరికి గట్లు పెంచినప్పుడు దీన్ని మూసేశారట.
అప్పట్నుంచి ఇది పెద్ద డ్రైనేజి కాలవైపోయిందిట. అదీ దాని కథ.
కారు మరికొంతదూరం వెళ్లాక అంబాజిపేటకు ముందు చిన్న బ్రిడ్జిమీదనుంచి వెళ్లింది. దానికి కిందవున్నదికూడా కౌశికి నదేనని మూర్తి చెప్పాడు. నీళ్లు తక్కువగావున్నా అక్కడ కాస్త నయంగా ఉంది. రెండుగట్ల వెంబడీ కొబ్బరి తోటలతో అందంగా ఉంది.
అసలు కోనసీమ అందమే వేరు. ఎటుచూసినా ఒక చదరపుఅడుగుకూడా ఖాళీ లేకుండా చెట్లు, వరిపైర్లు, కొబ్బరి, అరటి తోటలు. ఈ పచ్చదనంకూడా అదే జిల్లాలోని మిగతా ప్రాంతాలకంటే చాలా చిక్కగావుంటుంది.
ఫోటో కర్టసీ: మన కోనసీమ అందాలుhttps://www.facebook.com/manakonaseemaandalu
అంబాజీపేట దాటాక రెండుమూడు మలుపులు తిరిగి ఒక అగ్రహారం చేరుకున్నాము. వీధి మొదట్లో కారాపి దిగి నడిచాము. ఆ వీధిలో ఇళ్లన్నీ పాత పెంకుటిళ్లే కొన్నిట్లో ఎవరూలేక మూతపడివున్నాయి. ప్రతి ఇంటికీ గుమ్మానికి రెండువైపులా పెద్ద అరుగులతో వసారాలు. ఎదురెదురు ఇళ్లల్లోవున్నవాళ్లు అరుగులమీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి వీలుగావుంది. ప్రస్తుతం వీధి చాలావరకూ నిశ్శబ్దంగావుంది.
వీధిమధ్యలోని ఒక ఇంటికి తీసుకెళ్లాడు మూర్తి.
“ఈ అరుగులమీద పూర్వం ప్రతిరోజూ పొద్దున్నే వేదపఠనం, సాయంత్రం శాస్త్రచర్చలు జరిగేవట. ఇప్పుడదంతా చాలావరకు పోయింది. గోడల్లో నిక్షిప్తమైన శబ్దతరంగాలను వెలికితీసే యంత్రాలు కనుక్కుంటే అప్పటి వేదపఠనం, చర్చలు మళ్లీ వినొచ్చు” అన్నాడు మూర్తి.
వసారాలో ఇంటి ఆసామి స్వామిగారు మాకోసం ఎదురుచూస్తున్నారు. ఆయన దగ్గర్లో స్కూలుటీచరుగా చేసి రిటైరయ్యారు. ఆయన, ఆయన భార్య ఇద్దరే ఉంటార్ట. పిల్లలు హైదరాబాదులో, బెంగుళుర్లో ఉంటారు అప్పుడప్పుడూ వచ్చి చూసెళ్తూంటారు.
పరిచయాలయ్యాక “మండువా చూడ్డానికొచ్చాం” అన్నాను స్వామిగారితో.
ఆయన నవ్వి “పూర్వం ఇంటిని మూడు భాగాలుగా చూసేవారు. కేవలం భౌతికంగా కాదు, వ్యావహరికంగా, మానసికంగా కూడా. మండువా ఇంట్లోని మధ్య భాగం”, అని వసారాను, అరుగులనూ చూపిస్తూ “ఇది ముందు భాగం. ఇది బయటివాళ్లతో, వీధిలోనివాళ్లతో గడిపే సామాజిక భాగం. మధ్యనున్న మండువా ఇంట్లోవాళ్లందరూ ఎవరిపనులు వాళ్లు చేసుకుంటూ మధ్యమధ్యన అందరూ కలసి గడిపే స్థలం, ఇక మూడోది వెనకభాగం వంటిల్లు ఆవెనక పెరడు. ప్రకృతితో గడపడం, శుభ్రపరచుకోవడం, వంట, తినడం ఇలాంటివాటికి”
మాట్లాడుతూనే వసారా దాటి లోపలికెళ్లాం. అది పెద్ద హాలు. మంచి వెలుతురుతో ఉంది.
“ఇదే మండువా” అన్నాడు మూర్తి.
హాలు మధ్యలో పదడుగుల పొడవు, పదడుగుల వెడల్పు చతురస్రాకారంలో పైకప్పు లేదు. సూర్యుడి వెలుతురు నేరుగా హాల్లోకొస్తోంది. ఆ చతురస్రానికి నాలుగు మూలల్లో నాలుగు చెక్క స్థంబాలున్నాయి. పైభాగంలో ఒక అడుగు వెడల్పుతో చెక్క స్తంభాలను కలుపుతూ పైకప్పువరకూ నగిషి చెక్కిన చెక్కలు అమర్చివున్నారు. చుట్టూ పైకప్పున్న వరండా వుంది. మరొకరకంగా చెప్పాలంటే మధ్యలో చతురస్రాకారపు ఖాళీ స్థలాన్ని వదిలేసి చుట్టూ నాలుగు పెంకుటిళ్లు కలిపి కట్టారన్నట్టుగా ఉంది ఆ మండువా హాలు. వరండాలు పైకప్పులు ఎత్తుగా ఉన్నాయి. దానివల్ల శీతోష్ణాలు సమంగా ఉంటాయట.
హాలుకవతలివైపు వంటిల్లు గట్రా ఉన్నాయి. కుడిఎడమల్లో రెండువైపులా పడకగదులున్నాయి.
photo credit:https://www.facebook.com/manakonaseemaandalu
మండువా మధ్యలొ పైకప్పు లేకుండా, సూర్యరశ్మి సోకే చతురస్రాకార భాగం నేల ఒకడుగు కిందికివుంది. కడప బండలు పరచివున్నాయి. పైన్నుంచి వర్షం పడితే ఆ నీళ్లు ఇంటి పక్కవైపు పెరట్లోకి పోవడానికి నేలలోపల ఏటవాలుగా సొరంగంలాంటి కాలవ ఏర్పాటువుందిట. ఆ ఏటవాలుకోసమే మండువాయిళ్లు నేలమీదినుంచి నాలుగైదు అడుగుల ఎత్తులో కడతారు.
మండువా మధ్యభాగంలో తులసికోటవుంది. చుట్టూ కుండీల్లో పూలమొక్కలున్నాయి. చెక్క స్తంభాలకు కూడా నగిషీలున్నాయి. వాటికి పూలతీగల్ని పాకించారు. ఆ హాలు సహజమైన వెలుతురుతో చాలా అందంగా, ఈస్తెటిక్ గా ఉంది. మండువా వల్ల ఇంటికే కళవచ్చింది.
వరండాల్లో పూర్వకాలం కుర్చీలు, బల్లలు, ఒక పుస్తకాల బీరువా, ఒక నవారు ఉయ్యాల ఉన్నాయి.
“వర్షాకాలంలో మాత్రం కొంచెం ఇబ్బందే. వరండాల్లోకి జల్లులొస్తాయి. పిల్లలకైతే పండగనుకోండి” అన్నారు స్వామిగారు నవ్వుతూ.
“ఇంటి మూడుభాగాల్లోనూ మనుషులు ప్రకృతికి దగ్గరగా, భావస్పోరకంగా ఉండేట్టుగా ఈ ఏర్పాట్లు. ఇంటిచుట్టూ, మధ్యలో ఖాళీ స్థలాలు, అందులో చెట్లు కూడా ఇంట్లో భాగమే అని భావించేవారు. ఇదే దక్షిణదేశంలో ఐతే ఈ మండువాలు దీర్ఘచతురస్రాకారంలో పొడవుగావుండి, ఎక్కువ స్తంభాలతో పెద్దగా ఉంటాయి, మీరు సినిమాల్లో చూసేవుంటారు. రాయలసీమలో కూడా అంతే” అని చెప్పారు స్వామిగారు.
ఇల్లు, పెరడు అన్నీ తిరిగి చూసాము. స్వామిగారి శ్రీమతి చేసిచ్చిన టీ తాగాము.
ఫోటో కర్టసీ: మన కోనసీమ అందాలు https://www.facebook.com/manakonaseemaandalu
“ఈ పక్కింట్లో మరోరకమైన మండువావుంది చూద్దాంరండి” అని తీసుకెళ్లారు స్వామిగారు. ప్రస్తుతం ఆయింట్లో ఎవరూ లేరు, తాళాలు స్వామిగారి దగ్గరే ఉన్నాయి.
ఆయింటి మండువాకూడా అలాగే ఉందిగాని మండువా మధ్యలో ఒక పెద్ద గరాటులాంటి రేకు నిర్మాణం ఉంది. ఆకాశం కనబడ్డం లేదు గాని పైన నాలుగువైపుల్నుంచి కొంత సూర్యకాంతి వస్తోంది. పైన్నుంచి పడిన వాన ఆ గరాటులోంచి నేలమీదికి అక్కడినుంచి సొరంగం ద్వారా బయటికెళ్లే ఏర్పాటుంది.
ఊళ్లల్లో కరెంటొచ్చాక లైట్లొచ్చి సూర్యరశ్మి అవసరం తగ్గి, వర్షాలవల్ల ఇబ్బంది లేకుండా ఈ గరాటు ఏర్పాటు జరిగిందని చెప్పారు. ఆ ఇల్లూ చూసాక బయటికొచ్చాం.
“ఇవన్నీ ఎంతో ఆలోచించి నివాసంలోకూడా మనిషి ప్రకృతికి దగ్గరగా ఉండాలని చేసిన డిజైన్లు. ఇప్పుడు ఈప్రాంతంలో ఇలాంటి ఇళ్లు కట్టేవాళ్లు తగ్గిపోయారు. కేరళలాంటి చోట్ల కాంక్రీటు వాడినా కొత్తయిళ్లు కొన్నైనా తిరిగి ఇదే డిజైన్లో కడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏదైనా మండువా పాతబడి కూలిపోతే అక్కడ కాంక్రీటు డాబా వెలుస్తోంది. ఎన్నిగజాల స్థలమున్నా అంతా ఇల్లే కట్టేస్తారు, చెట్లుండవు” అన్నారు స్వామిగారు కొంతవిచారంగా.
స్వామిగారికి ధన్యవాదాలు, వీడ్కోలు చెప్పి బయలుదేరాం.
తిరుగుప్రయాణంలో మరోవూళ్లో ఒకే ఇంట్లో ఒకటికంటే ఎక్కువ వరస మండువాలున్న ఇల్లువుంది, చూపిస్తానని తీసుకెళ్లాడు మూర్తి.
ఆయిల్లు చాలాపొడవైంది, ఒకవీధిలో మొదలై మరోవీధివరకూ ఉంది. ఇంటిఎత్తు ఐదడుగులకంటే ఎక్కువ. ముందువైపు విశాలమైన అరుగులతో వసారా, ఎనిమిదడుగుల ఎత్తున వీధితలుపులు ఉన్నాయి. పూర్వం ఆ యిల్లు మోతుబరులైన రాజుగార్లదట, ఇప్పుడు అంతపెద్ద యింట్లో ఒక వైపున రెండు కుటుంబాలే అద్దెకు ఉంటోంది.
లోపలికెళ్లి చూశాం మొదట హాల్లోనే పెద్ద మండువా ఉంది. ఇక్కడకూడా గరాటు ఆకారంలో రేకు నిర్మాణం ఉంది. వెనక తలుపు తెరుచుకుని వెళ్తే అక్కడ వంటిల్లుకి బదులుగా ఇలాంటిదే మరో మండువా హాలుంది. ఆతరువాత మరొకటి, ఆపైన మరొకటి. మొత్తం నాలుగు మండువాలు. వరసగావున్న మండువాలకిరువైపులా గదులు, వంటిళ్లు, పక్కపెరళ్లు. ఇప్పుడు మొదటి, చివరి మండువాల పక్కన గదుల్లో ఆ రెండు కుటుంబాలు ఉన్నాయి. మండువాలతో సహా మిగతా రూములన్నీ ఖాళీ.
అప్పుడు ఆ రాజుగార్లది నలుగురన్నదమ్ముల ఉమ్మడికుటుంబమని, అందుకే అలా కట్టుకున్నారని, ఈతరం వాళ్లంతా ఉద్యోగాల నిమిత్తం సిటీలకు వెళ్లిపోవడం వల్ల ఆయిల్లు అలా ఖాళీగా ఉండిపోయిందని చెప్పారు.
బయటికొచ్చేముందు ఆ అద్దెయింటాయన మమ్మల్ని ఒక గదిలోకి తీసుకెళ్లి ఒక చమత్కారం చూపించాడు. ఆ గది గోడలకానించి మంచి టేకు చెక్క బీరువాలున్నాయి. ఆగదిలో ఒకచోట కుర్చీల్లో మమ్మల్ని కూర్చోబెట్టి ఎదురుగావున్న బీరువా తలుపు తెరిచాడు. అందులో ఒక నిలువుటద్దం ఉంది. మమ్మల్ని దానిలో చూడమని ఆయన పక్కగదిలోకి వెళ్లి అక్కడ మరోకుర్చీలో కూర్చున్నాడు. అద్దంలో చూస్తే తెరచిన తలుపులోంచి ఆయన మాకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. పక్కకు తిరిగి ఆరూమువైపు చూస్తే ఆయన కనబడ్డంలేదు, తలుపు తెరచివున్నా గోడ అడ్డంగావుంది.
“ఆకాలంలో రాజుగార్లకు ఘోషాగదండీ, పెళ్లిచూపులప్పుడు ఆడపిల్లల్ని నేరుగాకాకుండా ఇలా అద్దంలో చూపించేవారట” అన్నాడాయన.
పూర్వం సుల్తానుకు తన భార్యను అద్దంలో చూపించిన రాజపుత్రరాజు కథ మాకు గుర్తొచ్చింది. ఆయనకు ధన్యవాదాలు చెప్పి మా తిరుగు ప్రయాణం కొనసాగించాం. మేము చూసినవేకాక వేరేరకాలుగా కట్టిన మండువాలు ఇంకా కొన్నిచోట్లవున్నాయని చెప్పాడు మూర్తి.
‘మండువాలు ఒక ప్రత్యేకమైన నిర్మాణాలేకాదు, ప్రకృతికి దగ్గరగా, అప్పటి జీవనవిధానానికి అన్నివిధాలా అనుకూలంగా ఉండేటట్టు ఎంతో ఆలోచించి చేసిన నిర్మాణాలని మాకు అర్థమైంది. కాలం మారినా, ఆధునిక వస్తువులను వాడుతున్నా ఆ డిజైన్లు మాత్రం ఎప్పటికీ పాతబడవు. కొత్తభవనాలు నిర్మించేవాళ్లల్లో కనీసం కొంతమందైనా ఈ డిజైన్లు ఉపయోగిస్తే బావుండునుగదా’ అనుకున్నాం.

(featured image source: Krishna Prakash Gallery)