టిటిడి ఇవొగా కరోనా సమయంలో ప్రతిభావంతంగా పనిచేసిన అధికారి

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి)
తిరుమల తిరుపతి దేవస్థానాల(TTD) కార్యనిర్వహణాధికారిగా 1990 బ్యాచ్ కు చెందిన అధికారి జవహర్ రెడ్డిని  నియమించడం సముచిత నిర్ణయం.
ఆయన కార్యదక్షుడు, వివాదరహితులు కావడం జవహర్ రెడ్డి సొంతం. ఆలాంటి అధికారి ఇపుడు టిటిడికి అవసరం..
ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాదికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి డా. కెఎస్  జవహర్ రెడ్డి గారిని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.
వెటర్నరీ విద్యలో ఉన్నత విద్య నభ్యసించి ఐఎఎస్ అధికారిగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలక శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన అధికారిగా జవహర్ రెడ్డి గారు మంచి పెరు తెచ్చుకున్నారు. అలాంటి వారు టిటిడికి రావడం స్వాగతించాల్సిన విషయం. సముచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
వివాదరహితంగా విధులు నిర్వహించడం – కార్యదక్షత వారి సొంతం.
ప్రభుత్వం ఏదైనా అధికారంలో ఎవరు ఉన్న కీలక శాఖలకు అధిపతుల నియామకం చేసే ముందు ముఖ్యమంత్రికి గుర్తుకు వచ్చే కొందరిలో జవహర్ రెడ్డి ఒకరు. ఒక పార్టీ అధికారంలో ఉన్నపుడు కీలక శాఖలు నిర్వహించిన అధికారులను ప్రభుత్వం మారినప్పుడు అధినేతలు వారిని మారుస్తుంటారు. అందుకు జవహర్ రెడ్డి మినహాయింపు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వారు వృత్తి పరంగా ఎలా ఉంటారో..
కరోనా సమయంలో అత్యంత ప్రతిభావంతముగా పని చేసిన జవహర్ రెడ్డి..
జవహర్ రెడ్డి కార్యదక్షతకు కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేసిన కృషికి మంచి ఉదాహరణ. దేశంలో కరోనా సమస్యను ఎదుర్కొనడంలో మంచి కృషి చేసిన రాష్ట్రం ఆంద్రప్రదేశ్. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను అత్యంత సమర్థవంతంగా అమలు చేయడంలో వారి పాత్ర కీలకం. కరోనా సమస్యను ఎదుర్కొంనడంలో ఆంద్రప్రదేశ్ సాధించిన మంచి ఫలితాలలో జవహర్ రెడ్డి గారిది ప్రత్యేక పాత్ర.
వివాదరహితమే టిటిడిలో కీలకం. అలాంటి స్వభావం కలిగిన జవహర్ రెడ్డి అధికారిగా రావడం సముచితం
తిరుమల తిరుపతి దేవస్థానం అనేక కారణాల వలన వివాదాలకు కేంద్రంగా ఉంటుంది. ప్రతి సంస్థకు ఆర్థిక లేదా మరో సమస్యతో ఇబ్బంది పడుతుంటుంది. కానీ టిటిడికి మాత్రం వివాదం లేకుండా ఉంటే చాలు ఎలాంటి సమస్య ఉండదు. టిటిడిలో కార్య నిర్వహణాదికారి పాత్ర కీలకం అలాంటి కీలక స్థానానికి టిటిడికి అవసరమైన స్వభావం కలిగిన జవహర్ రెడ్డి గారు రావడం యాదృచ్చికమే కావచ్చు కానీ శుభపరిణామం.
కొన్ని సంవత్సరాలుగా జవహర్ రెడ్డి గారిని దూరం నుంచి పరిశీలిస్తున్న నాకు పని పట్ల అంకితభావం , ప్రభుత్వ నిర్ణయాలను సమర్థవంతంగా అమలు , వివాదాలకు దూరంగా ఉండటం వారిలో కనిపించిన ప్రత్యేకతలు. రాయలసీమకు తలమానికంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి వాతావరణం ఉండాలని తిరుపతి వాడిగా ఆశిస్తాను. రాయలసీమకే చెందిన డా. జవహర్ రెడ్డి గారు కార్యనిర్వహణాదికారిగా నియమితులయిన సందర్భంగా వారికి ఇవే మా శుభాకాంక్షలు. మంచి అధికారిని నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి,సమన్వయ కర్త,రాయలసీమ మేధావుల ఫోరం
తిరుపతి)