అవి స్వాతంత్రోద్యమ కాలపు తొలిరోజులు. లండన్లో 1931లో రెండవ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ లో గాంధిజి పాల్గొనడం ఇష్టంలేని చర్చిల్ ఆయన్ను ‘అర్ధ దిగంబరపు సన్యాసి (హాఫ్ నేకెడ్ ఫకిర్) అని తృణీకారభావంతో వెక్కిరించాడు. అంతేకాక ‘ఆయన నిరాహారదీక్ష చేసినప్పుడు పట్టించుకోకండి, చనిపోయినా మంచిదే’ అని కూడా దారుణంగా వ్యాఖ్యానించాడంటారు.
ఒక్క చర్చిల్, ఆయన అనుయాయులేకాదు, బ్రిటిషు పౌరుల్లో అధికభాగం ఆరోజుల్లో భారతీయులను ఒక తక్కువజాతిగా పరిగణించి, హింసద్వారా భారతదేశాన్ని దోపిడీ చేయడానికి ఒక యోగ్యమైన ప్రదేశంగా భావించేవారు.
అలాంటిది అదే బ్రిటిష్ పార్లమెంటు ఆవరణలో 2014 లో గాంధిజీ విగ్రహం ఎంతో గౌరవంతో నెలకొల్పబడి నివాళులందుకోబడుతోంది. ఇది అణచివేయబడి దోపిడికి గురి అవుతున్న ఒక బలహీనమైన జాతి చేసిన ఆదర్శనీయమైన శాంతియుత తిరుగుబాటుకి, సాధించిన విజయానికి ఒక చిహ్నం, ప్రపంచానికి ఒక విలువైన సందేశం.
ఒకప్పుడు ‘అర్ధ దిగంబర సన్యాసి’ అని హేళన చేయబడిన గాంధిజీ ఈరోజు ప్రపంచంలో అణగదొక్కబడి, అహింసామార్గాల్లో పోరాడుతున్న ప్రజాసమూహాలకు ఒక మార్గదర్శి. అంతేకాదు, ఆదర్శజీవితాన్ని అభిలషించేవాళ్లండరికీ ఒక అనుసరించదగ్గ మహాత్ముడు.
చరిత్రలో స్పార్టకస్ లాంటివాళ్లతో మొదలై మొన్నటి మార్టిన్ లూథర్ కింగ్ (జూ), నెల్సన్ మండేలా వరకు పీడిత ప్రజల పక్షాన పోరాడిన అసంఖ్యాకమైన గొప్ప నాయకులున్నారు. వీళ్లు సామాన్యమైన నాయకులు కాదు, కొన్ని సిద్ధాంతాలతో, ఆదర్శాలతో నిబద్ధత, అవగాహన కలిగిన ధీరులు.
ఐనా గాంధీజీ వీళ్లందరికంటే ఉనతమైన స్థాయిలో ఇలాంటి నాయకులకే మార్గదర్శిగా పరిగణింపబడుతున్నారు.
గాంధిజీకి సంబంధించిన అనేక వస్తువులను సేకరించి పెట్టుకుని, ఆయన పద్ధతిలోనే ఉద్యమం నడపడమేకాక “గాంధిజీయే నాకు ఆదర్శం, నేనెప్పుడైనా ఇండియా వెళ్తే అది ఒక యాత్రికుడిగానే వెళ్తాను” అని మార్టిన్ లూథర్ కింగ్ (జూ) అంతటి గొప్ప నాయకుడు ప్రకటించడమే దీనికి తార్కాణం.
ఒక స్వాతంత్రోద్యమ ప్రజానాయకుడిగా తన ప్రస్థానం ప్రారంభించిన గాంధిజీ ఇంత ఉన్నతస్థాయికి చేరడానికి కారణం వివిధ కోణాల్లో ఎదిగిన ఆయన బహుముఖ విస్తృత వ్యక్తిత్వం. ఆయన తన వ్యక్తిత్వపు పరిధిని చేధించుకుని బయటపడి, వివిధ వర్గాల ప్రజల అవమానాలతో, దుఖాలతో, ఆలోచనలతో, ఉద్యేగాలతో, విశ్వాసాలతో, ఆశలతో మమైక్యం చెంది ఆ సమూహాలన్నీ కలసి ఒక వ్యక్తిగా అవతరించినట్టుగా ఆయన ఎదిగారు.
గాంధీజీ ఒక వ్యక్తికాదు, ఒక సమూహపు ఆత్మ. ఆయన ఎవరికీ చెందరు, అందర్నీ ప్రతిబింబిస్తారు. దీన్ని బాగా అర్థం చేసుకున్నవాళ్లకే ఆయన అర్థం అవుతారు.
ఇది సాధ్యమయ్యే విషయమేనా అని అనిపించవచ్చు. కానీ ఇది ఈతరం కళ్లెదుట జరిగిన విషయం. దీన్ని బట్టి చరిత్రలోని కొందరు గొప్ప నాయకులు అంతగొప్పగా ఉండి ఉండడం సాధ్యమేనన్నది ఈతరంవారు నమ్మవచ్చు. రాబోయే తరాలవారు నమ్మాలంటే బహుశా అలాంటి మరో నాయకుడు ఉద్భవించాలి కాబోలు.
ఆయన మరణించినప్పుడు “ఇలాంటి ఒక వ్యక్తి ఈ భూమ్మీద నడిచాడంటే ముందుతరాల వారికి నమ్మశక్యంగా ఉండదు” అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ వ్యాఖ్యానించడం దీనికి నిదర్శనం.
గాంధిజీకున్న మరో అదనపు విశేషం ఆయన బహుముఖ అవగాహన. ఈ అవగాహన కూడా అన్నివర్గాలకూ స్థానం కలిగి విశాలంగా ఉంటుంది. అందుకుకూడా ఆయన బహుసమూహపు ఆత్మ అనవచ్చును. ఒక్క స్వాతంత్ర్య పోరాటనికి సంబంధించినదే కాదు.
ఆయన అవగాహన సామాజికమైన ఎదుగుదల, దేశనిర్మాణం, ఆర్థిక ప్రగతి, అణగారిన వర్గాల ఉన్నతి, స్త్రీల విముక్తి, శిశు సంక్షేమం, మతసహనం, కుటుంబం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, కార్మికోద్ధరణ, గ్రామీణ స్వయంపాలన, వైఙ్ఞానిక ప్రగతి లాంటి అనేక విషయాల్లో భారతదేశంలాంటి పేద, బహుజనసమూహ దేశాలకు ఉపయోగపడేవిధంగా, సంప్రదాయ ఆధునికతల మేలుకలయికతో, ఎంతో విశిష్టంగా ఉండేది. అవి ఇప్పటికీ ప్రపంచవాప్తంగా అధ్యయన విషయాలుగా ఉన్నాయి.
ఐతే విచారించదగ్గ విషయమేమంటే అలాంటి వ్యక్తి మనదేశంలోనే పుట్టి పెరిగి ప్రపంచానికే ఒక మార్గదర్శిగా ఎదిగినా ఆయన్ని అర్థంచేసుకోవడానికిగాని, ఆయన సూచనల్ని, ఆలోచనల్ని పరిశీలించి ఆచరణలో పెట్టడానికిగాని మనదేశంలోనే పెద్దగా ప్రయత్నాలు జరగలేదు.
గాంధీజీ మతవిశ్వాసం ఆదర్శప్రాయంగా ఉన్నప్పటికీ ఆయన హిందూమతాన్ని విశ్వసించాడని కొందరు, ఇతర మతాల్ని గౌరవించాడని మరికొందరు, ఆశను తగ్గించుకొని తమ ఆస్తులకు తాము దర్మకర్తలుగా మాత్రమే ఉండమన్నాడని కొందరు, హింసామార్గం వద్దన్నాడని ఇంకొందరు, రాజకీయాల్లో నైతికత, అధికార వికేంద్రీకరణ, గ్రామీణ స్వావలంబన ఉండాలన్నాడని కొందరు, ఆయన ఆదర్శాలు పాటిస్తే ఇతరులుకూడా బాగుపడతారని మరికొందరు మొత్తం మీద ఎవరికివాళ్లు ఆయన చెప్పినవాటిల్లో తమకు మాత్రమే పనికొచ్చేవి ఏవీ లేవని ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది.
ఐతే మనం మర్చిపోవాలని ప్రయత్నించినా ఆయన భారతీయుల మానసిక ప్రపంచంలో ఒక మార్గదర్శిగా స్థిరనివాసముండి ఎప్పటికీ హెచ్చరిస్తూనే ఉంటాడు. ప్రపంచపు అసంబద్ధత, స్వార్థం, అమానవత్వం, నైరాశ్యం దెబ్బకొట్టిన ప్రతిసారీ ఆయనను ఆశ్రయిస్తూనే ఉంటాం.
ఎందుకంటే గాంధీజీ ఒక వ్యక్తికాదు, ఒక శాశ్వత భారతీయ సామూహిక ఆత్మ.