కాకినాడ సెజ్ పై జగన్మోహన్ రెడ్డి కన్నేయడం ఇవాల్టిది కాదు. కోన ప్రాంతాన్ని కబళించాలన్నది జగన్ 14ఏళ్ల కల. తండ్రి(2006-09)హయాంలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుందనే కక్ష. ఇప్పుడు సీఎం కాగానే మళ్లీ బినామీ సంస్థలను తెరపైకి తెచ్చి కోన ప్రాంతాన్ని కైంకర్యం చేయాలనే కుట్రలు చేస్తున్నాడు. సిబిఐ ఛార్జిషీట్లలో సహ నిందితులే బినామీలుగా భూముల ఆక్రమణలు సాగుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ 12ఛార్జిషీట్లకు గాను, తొలి ఛార్జిషీట్ లో ఏ 1 జగన్మోహన్ రెడ్డి కాగా,ఎ 2 విజయసాయి రెడ్డి, ఎ 3గా అరబిందో సంస్థ ఉన్న విషయం తెలిసిందే.జగన్ బినామీ విజయ సాయి, విజయసాయి బినామీ అల్లుడు ‘‘అరబిందో’’ రోహిత్ రెడ్డి . ఎ1 కు బినామీ ఎ2 అయితే, ఎ2కు బినామీ అల్లుడు అరబిందో. ఎ2, ఎ3ల మధ్య వియ్యం జగద్విదితమే..
ఎ1, ఎ2, ఎ3 ల మధ్య ఈ బినామీ అవినీతి లావాదేవీలు అన్నింటిపై ఇటీవల పార్లమెంటు ఆమోదించిన కొత్త బినామీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి బినామీ భాగోతాలకు ఫుల్ స్టాప్ పడేలా కేంద్రం చర్యలు ఉండాలి.
2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాకినాడ సెజ్ ప్రతిపాదించినప్పుడే కోస్తా తీర ప్రాంతం మొత్తాన్ని వైఎస్ కుటుంబం ఆక్రమించాలని పన్నాగం పన్నింది. 1,000హెక్టార్లకు (2,500ఎకరాలకు) కేంద్రం అనుమతి ఇస్తే దానిని 10వేల ఎకరాలు చేయడం, ఈ భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ 650కోట్ల రుణం తెచ్చి రైతులకు అందులో సగం కూడా ఇవ్వలేదు.
కోనప్రాంతంలో వైఎస్ కుటుంబం భూదురాక్రమణను తెలుగుదేశం పార్టీ అప్పుడే వ్యతిరేకించింది. అభివృద్ది చెందుతున్న కోన ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలన్న దుర్బుద్దిని నిరసించాం. వైఎస్ రాజశేఖర రెడ్డి, కెవిపిల ప్రయత్నాలను అడ్డుకున్నాం.
ఎకరానికి రూ లక్షా 50వేలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని అప్పట్లో చూశారు. టిడిపి అడ్డుపడి ఎకరానికి తొలుత రూ3లక్షలు ఇప్పించాం. ఆ తర్వాత కూడా టిడిపి పోరాటంతోనే రైతులకు రూ9లక్షలు ఇచ్చేలా చేశాం.
కోన రైతాంగం నోట్లో మట్టి కొట్టి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడాన్ని టిడిపి అడ్డుకుంది. రైతుల డిమాండ్ మేరకు ఎకరానికి రూ9లక్షలు ఇప్పించాం. అందులో 2వేల ఎకరాల రైతులు ఇంకా ఆ డబ్బులు పొందలేదు.
తండ్రి(రాజశేఖర రెడ్డి) హయాంలో జరిగిన భూమాయే ఇప్పుడు కొడుకు(జగన్మోహన్ రెడ్డి) పాలనలోనూ చేస్తున్నారు. కోన రైతులకు అప్పుడు జరిగిన మోసం మరిచి పోకముందే, మళ్లీ ఇప్పుడు అదే మోసానికి తెరదీయడం గర్హనీయం. అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు చేతిలో బాధితులు కోన రైతాంగమే.. తాజాగా కాకినాడ సెజ్ లో 51% షేర్ రూ2,610కోట్లకు జగన్ బినామీ విజయసాయి రెడ్డి అల్లుడి సంస్థ అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రా కొనుగోలు చేసింది.
ఇందులో మిగిలిన 49% (కెవిరావు) షేర్ కూడా రేపోమాపో కొని మొత్తం 10వేల ఎకరాలను తన బినామీలకు అప్పజెప్పడానికి జగన్ పథకం వేశారు. ఈ కొనుగోళ్ల రేటున చూస్తే మొత్తం రూ5వేల కోట్ల విలువైన కోన ప్రాంత భూములను బినామీ సంస్థల పేర్లతో జగన్ హస్తగతం అయినట్లే.
2006లో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకున్నప్పుడే, వచ్చిన లాభాల్లో సగం రైతులకు ఇవ్వాలని అప్పట్లోనే టిడిపి డిమాండ్ చేసింది. ఆ రోజు ఎకరం రూ9లక్షలు ఉన్నది ఇప్పటి ట్రాన్సాక్షన్స్ లెక్క ప్రకారం చూస్తే ధర 4రెట్లు పెరిగి ఎకరం రూ 30-40లక్షలకు చేరింది.
తనవి కాని భూములపై, 4రెట్ల లాభం బినామీల ముసుగులో జగన్మోహన్ రెడ్డి పొందుతూ, సదరు భూముల యజమానులైన రైతుల నోళ్లలో మట్టి కొట్టడం హేయం.
అటు భూములు కోల్పోయి, ఇటు ఉపాధి లేక, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతుల పరిస్థితి దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత లాభాల్లో సగం రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ఆ రోజు రూ300 కోట్లకే కొన్న 10వేల ఎకరాల భూమి విలువ ఈ రోజు రూ 5వేల కోట్లకు చేరింది. ఇంకా 2వేల ఎకరాల రైతులకు రూపాయి ప్రతిఫలం ఇవ్వలేదు.
కాబట్టి ఇప్పటి లాభాల్లో కూడా సగం రైతులకే అందజేయాలి. అంటే అందులో రూ 2,500కోట్లు రైతుల వాటాగా వాళ్లకే దక్కాలి. ఈ ప్రాంతంలో ఎటువంటి రసాయన పరిశ్రమలు పెట్టడానికి వీల్లేదని అప్పుడే షరతు విధించాం. అలాంటి చోట ఇప్పుడు బల్క్ డ్రగ్ పరిశ్రమ పెట్టి కోనప్రాంతాన్ని కాలుష్య ప్రాంతంగా మార్చడం గర్హనీయం.
దీనివల్ల కోన ప్రాంతంలో ఉన్న వందలాది హేచరీస్ అన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇక్కడ నివసించే బీసిలకు తీరని అన్యాయం జరుగుతుంది, సముద్రంలో చేపల ఉత్పత్తి ఉండదు, దానిపై ఆధారపడిన మత్స్యకారులు వలసలు పోవాల్సిందే. ఎంతో మంది బడుగు బలహీనవర్గాల వారు ఉపాధి కోల్పోతారు. దీనిని స్థానికంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది.
విశాఖ నుంచి నెల్లూరు దాకా మొత్తం కోస్తాతీరాన్ని జగన్ హస్తగతం చేసుకోడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విశాఖ సెజ్ లో జగన్ బినామీలే పాగా వేశారు. ఉత్తరాంధ్రలో భూములన్నీ కబ్జాలు, ఆక్రమణలే.. ఇప్పుడు కాకినాడ సెజ్ ను కబళించారు. ఇవాళో రేపో బందరు పోర్టు కూడా జగన్ బినామీల పరం చేస్తున్నారు. విశాఖ-నెల్లూరు మొత్తం కోస్తా తీరమంతా తన హస్తగతం కావాలన్నదే జగన్ దురాశ.
ఆంధ్రప్రదేశ్ పురోగతికి తీరప్రాంత అభివృద్దే కీలకం. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపి మారాలంటే కోస్తానే కీలకం. బీసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజల జీవనోపాధి తీరం ద్వారానే. మేలిమి బంగారం లాంటి తీరప్రాంతం మొత్తాన్ని బినామీల పేరుతో జగన్మోహన్ రెడ్డి కబళిస్తే దానిపై ఆధారపడి జీవనం సాగించే బలహీనవర్గాల కుటుంబాలన్నీ ఉపాధి కోల్పోయి రోడ్డున పడతాయి.
డిమాండ్లు:
*కాకినాడ సెజ్ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు పెట్టకూడదు
*సెజ్ విక్రయ లావాదేవీల లాభం రూ 4,700కోట్లలో సగం స్థానిక రైతులకే పంచాలి
*కోన ప్రాంతంలో ఓవరాల్ డెవలప్ మెంట్ చేయాలి కోస్టల్ కారిడార్ ను అభివృద్ది చేయాలి.
*భూములు, ఇసుక, గనులు, సహజ వనరుల దోపిడీని అడ్డుకోవాలి.