చేనేత పేద కుటుంబాల్లో విద్యాకాంతులు పంచిన ప్రముఖ విద్యాదాత జొన్నాదుల రామారావు. విశిష్ట వ్యక్తిత్వం కలిగిన రామారావు మంగళగిరి గడ్డపై చెరగని ముద్రవేశారు. నిస్వార్థసేవతో నిరాడంబర జీవితాన్ని గడిపిన ధన్యజీవి. ఈ సెప్టెంబరు 30న రామారావు 54వ వర్ధంతి. ఈ సందర్భంగా అక్షర నివాళి…
పద్మశాలి సామాజికవర్గంలో అనాదిగా చేనేత వృత్తే జీవనాధారం. కాలక్రమంలో గణనీయ సంఖ్యలో స్వర్ణకారవృత్తిని చేపట్టారు. సమకాలీన పరిస్థితుల్లో జీవనం కొంతమేర మెరుగైంది. వివిధ ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య రంగాల్లోను స్థిరపడినవారు లేకపోలేదు. అయినప్పటికీ ఇంకా అనేక చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు దయనీయంగానే ఉన్నాయి. అదే ఏడు దశాబ్దాల క్రితం చేనేత సంఘీయుల స్థితిగతులు ఎలా ఉంటాయో ఊహించుకుంటే… అప్పటికి కేవలం చేనేతే ప్రధాన వృత్తి. పొద్దస్తమానం పనిచేస్తేగాని పూటగడవని పరిస్థితి. ఇక చేనేత పిల్లల్లో చదువులు కూడా అంతంతమాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో మంగళగిరి, చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని చేనేత కుటుంబాల్లో విజ్ఞాన కాంతులు వెలిగించిన మహానుభావుడు జొన్నాదుల రామారావు. ఆయన చదువుకొన్నది ఐదో తరగతే అయినా సమాజాన్ని అధ్యయనం చేశారు. వెనుకబడిన వర్గాల్లో వెనుకబాటుతనం తొలిగిపోవాలంటే అందుకు చదువొక్కటే చక్కటి పరిష్కారం అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి రామారావు. చేనేత సంఘీయులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలన చేసిన ఆయన మన తర్వాతి తరానికైనా చక్కటి భవిష్యత్తును కల్పించాలనే సంకల్పంతో ఎన్నో చేనేత కుటుంబాల్లోని పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించడమేకాకుండా అందుకయ్యే ఖర్చులను కూడా ఉదారంగా అందించి విద్యాదాతగా పేరొందారు.
జొన్నాదుల రామారావు నేపథ్యం..
సాధారణ చేనేత కుటుంబ నేపథ్యం ఉన్న జొన్నాదుల తిరుపళ్లి, కనకమ్మ దంపతులకు 1924లో రామారావు జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. పెద్దన్నయ్య చిక్కయ్య.. చింతక్రింది కనకయ్య రైస్ మిల్లులో భాగస్వామిగా వ్యాపారం చేసేవారు. చిన్నన్నయ్య రామకృష్ణులు పొగాకు వ్యాపారం చేసేవారు. రామారావు తన చినమామ అయిన గోలి గోపాలరావుతో కలిసి 1943 నుంచీ 1960 వరకు చేనేత వ్యాపారం చేశారు. తదనంతర కాలంలో బ్యాంకు రుణం పొంది సొంతంగా చేనేత మగ్గాలు నేయించారు. 1945లో రామారావుకు తాడేపల్లి వాస్తవ్యులైన గోలి సుబ్బయ్య కుమార్తె దమయంతితో వివాహమైంది. రామారావు దంపతులకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్దకుమారుడు బాబూ శివప్రసాద్ (బాబ్జీ), చిన్న కుమారుడు వెంకట సత్యనారాయణ (బుజ్జి).
చేనేత నాయకులకు ఆత్మీయుడు…
విజయవాడలో రాష్ట్ర చేనేత సహకార సంఘం ఉండేది. బోర్డు మీటింగులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చేనేత కాంగ్రెస్ నాయకులకు, మంగళగిరిలో చేనేత సభలు, సమావేశాలకు హాజరయ్యే నాయకులకు ఆతిథ్యం.. జొన్నాదుల రామారావు నివాసంలోనే. ఈ క్రమంలో రాష్ట్ర చేనేత కాంగ్రెస్ నాయకులు అక్కల కోటయ్య, ప్రగడ కోటయ్య తదితర ప్రముఖులతో విస్తృత పరిచయాలు, సంబంధాలు ఏర్పడ్డాయి. పేరొందిన చేనేత నాయకులతో అనుబంధం ఉన్నా… చేనేత కార్మికులతోనూ ఆప్యాయంగా ఉండేవారు. సమతా భావం ఆయన సుగుణాల్లో ఒకటి. చిన్నవయస్సులోనే ఆయన వ్యవహారశైలి మిన్నగా ఉండేది. మాస్టర్స్ వీవర్స్ సంఘంలో సభ్యుడైనప్పటికీ చేనేత కార్మికుల మజూరీల విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరించేవారు. మొదటి నుంచి ఆయనకు నిరుపేద చేనేత కార్మికులంటే అమితమైన అభిమానం. చేనేత వృత్తితో లభించే ఆదాయం అంతంతమాత్రమే కావడంతో.. కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించేందుకు ఫీజులు కట్టి ప్రోత్సహించేవారు. అలాగే చదువుకున్న వారికి ఉద్యోగావకాశాలు కల్పించడంలోనూ ఎంతో సహాయకారిగా ఉండేవారు. తనకున్న పలుకుబడితో గుంతకల్లు, రాజమండ్రి, చీరాల వంటి ప్రాంతాల్లోని సహకార నూలు మిల్లుల్లో అనేకమందికి ఉద్యోగాలు ఇప్పించి వారి కుటుంబాలలో వెలుగులు నింపారాయన.
వీవర్స్ కాలనీ ఏర్పాటులో…
చేనేత నాయకుడు దామర్ల రమాకాంతారావుతో జొన్నాదుల రామారావుకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. రమాకాంతారావు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో వీవర్స్ కాలనీ మంజూరైంది. ఈ కాలనీ క్రమబద్ధమైన నిర్మాణంలో రామారావు కృషి ఎంతో ఉంది. అలాగే వెంకటేశ్వర, గోపాలకృష్ణ సినిమా ధియేటర్లు కూడా రామారావు పర్యవేక్షణలోనే నిర్మాణాలు జరిగాయి.
ఆదర్శనీయుడు రామారావు
రామారావు చిన్ననాటి నుంచి ఆదర్శనీయంగా ఉండేవారు. నిస్వార్థ సేవాగుణంతో గాంధేయవాదిగా జీవనప్రస్థానం కొనసాగించారాయన. తన విస్తృత పరిచయాలనెప్పుడూ వ్యక్తిగతానికి వినియోగించుకోలేదు. అంతటి గొప్ప మానవతావాది అయిన రామారావు చిన్న వయస్సులోనే తన 42వ ఏట (1966 సెప్టెంబరు 30) మరణించారు. ఆయన మృతితో చేనేత వాడ దిగ్భ్రాంతికి లోనైంది. వేలాది మంది అశ్రునయనాల నడుమ ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. ఎన్నో నిరుపేద చేనేత కుటుంబాల్లో జొన్నాదుల రామారావు వెలిగించిన విద్యాకాంతులు దేదీప్యమానంగా వెలుగొందుతూనే ఉన్నాయి.
రామారావు వారసత్వం…
జొన్నాదుల రామారావు పెద్దకుమారుడు బాబూ శివప్రసాద్ (బాబ్జీ) తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. తండ్రి గాంధేయవాద భావాలకు భంగం కలగకుండా కార్యదక్షతతో వ్యాపారం చేసి కుటుంబాన్ని నిలబెట్టారు. సేవాభావాన్ని వారసత్వంగా అలవర్చుకున్న బాబ్జీ .. నిరుపేద చేనేత కుటుంబాల్లోని పిల్లల్లో విద్యను ప్రోత్సహించేందుకు 1983లో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభించడంలో తనవంతు పాత్ర పోషించారు. మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఏటా లక్షలాది రూపాయల స్కాలర్ పిప్పులు అందజేస్తూ… చేనేత నిరుపేద కుటుంబాల్లో విద్యావ్యాప్తికి దోహదపడుతున్నారు.