ఎస్ పి బాలు ని దహనం చేయకుండా ఖననం చేసేందుకు కారణం?

కరోనాతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలసుబ్రమణ్యం శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం చెన్నై శివారులోని తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాంహౌజ్‌లో ముగిశాయి. ఎస్పీ చరణ్ తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సంప్రదాయబ‌ద్ధంగా వైదిక క్రతువు పూర్తి చేసి శ్రౌత‌శైవ ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలుని ఖ‌న‌నం చేశారు.
ఈ సంప్రదాయం ప్రకారం బాలుని కూర్చోబెట్టి ఖననం చేశారు. కుర్చీలో కూర్చున్నట్టుగా కూర్చోబెట్టి, కాళ్లు చాపి ఖననం చేశారు. ఈ విషయం మీడియాలో చూసిన, చదివిన చాలా మంది..ఇలా చేయటం ఏమిటి అని ఆశ్చర్యపోయారు. ఆయన బ్రాహ్మణులు కదా …ఈ ఆచారం ఏమిటనేది సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. నిజానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి మహానుభావులను ..ఇలా కులాల గాడిలో కట్టేసి చర్చలు జరపటం అనేది పద్దతి కాదు కానీ..వారి అనుమానాలు నివృతి చేయటం మంచిదదని …పెద్దల ద్వారా తెలిసిన మేరకు క్లారిఫికేషన్ సంపాదించి ఇస్తున్నాము.
ఎస్పీ బాలసుబ్రమణ్యం.. ఆరాధ్యశైవ సంప్రదాయమునకు చెందిన బ్రాహ్మణులు. ఆ శాఖవారు దహనము చేయరు. అది ఒక్కటే కారణము. ఆరాధ్యశైవము ఆంధ్రదేశమునందలి అత్యంత ప్రాచీన శైవ సంప్రదాయము. ఇది కర్నాటకకు చెందిన బసవని వీరశైవమునకన్న ముందటిది కావటం చెప్పుకోదగ్గ విషయం. దీని వ్యవస్థాపకుఁడైన పండితారాధ్యులవారు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. లింగ, భస్మరుక్షాక్షలతో శివదీక్షను పొందిన తెలుగు, కన్నడ దేశాల బ్రాహ్మణులను ఆరాధ్యులని పిలుస్తారు. అలాంటి ఆరాధ్య శైవ కుటుంబములో జన్మించిన కారణజన్ముడు బాల సుబ్రమణ్యం. కాబట్టే ఆ విధంగా ఆయన్ని దహనం చేయటం జరిగింది.
ఇక ఆగష్టు 5న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఎస్పీ.. ఎక్మో ట్రీట్‌మెంట్‌తో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు. కానీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం 01:04 గంటలకు శివ సాయిధ్యం పొందారు. దాదాపు 50 రోజులపాటు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు.