“మా ఊరు కవిటం”

( పరకాల సూర్యమోహన్)
అప్పిచ్చువాడు వైద్యుడు
ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమ!
ఈ పద్యం చిన్నప్పుడు మనమంతా చదువుకుని వుంటాం. కచ్చితంగా కంఠతా పట్టి వుంటాం. బుర్ర పెద్దగా వికసించని బాల్యం అది.
ఓహో, వైద్యుడు మందులతో బాటు అప్పులు కూడా ఇస్తాడన్నమాట.ఇదేదో బాగానే వుందే అనుకునే వాడిని.
ఆ తర్వాత తెలిసింది అప్పిచ్చువాడు తర్వాత (,) comma వుండాలని. అంటే అప్పిచ్చేవాడు, వైద్యుడు, సమృద్ధిగా నీరు, బ్రాహ్మణుడు మొదలైనవి దొరికే ఊళ్ళోనే ఉండాలి అని కవి చెబుతున్నాడు. అవి లేని ఊళ్ళో ఉండరాదు అని అర్ధం .
సరిగ్గా ఈ లక్షణాలు అన్నీ పుణికి  పుచ్చుకున్న ఊరు మా ఊరు
కవిటం!
పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలో పచ్చని పైర్లతో, కొబ్బరి తోటలతో , గుత్తులు గుత్తులుగా వేలాడే మామిడి చెట్లతో… ప్రకృతి లోని అందాలన్నీ ఇక్కడే వెలిసాయా అనిపిస్తుంది ఎవరికైనా మా వూరు కవిటంలో అడుగు పెట్టగానే.
అటూ ఇటూ గుబురుగా వున్న చెట్ల మథ్యలో ప్రవహించే నిడదవోలు కాలువ
సుమతి శతకంలో చెప్పినట్టుగా నిండుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే నిడదవోలు కాలువ ముందుగా స్వాగతం పలుకుతుంది.
అంతేకాదు, మా వూళ్లో అప్పు ఇచ్చేవాళ్ళు, వైద్యులు, శుభ, అశుభ కార్యాలు నిర్వహించే బ్రాహ్మణులు, హైస్కూలు, ప్రముఖ దేవాలయాలు, కళ్యాణ మండపం సుమతి శతకకారుడు చెప్పినవే కాదు, చెప్పనివీ ఉన్నాయి –వీటన్నింటితో మావూరు శోభాయమానంగా, ఎంతో సందడిసందడిగా
కనువిందు చేస్తూవుంటుంది.
మా కవిటం ఏదో సాదా సీదా గ్రామం కాదండోయ్! ఎంతో విలక్షణమైన వూరు. దీనికి వున్న ప్రత్యేకతలు అన్నీఇన్నీకావు:
అనేక రంగాలలో ప్రత్యేకతని సాధించుకున్న వూరు మా వూరు. అనేక రంగాలలో రాణించిన ప్రముఖులకు మా వూరు పుట్టిల్లు. సంఘ సేవకులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, దేశరక్షణ సేవలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న యోధులకు, మహిళాభ్యుదయానికి అహర్నిశలు సేవ చేసిన మహిళలకు, ఉత్తమ ఉపాధ్యాయులకు, పాత్రికేయ రంగంలో రాణించిన వారికి, వివిధ ప్రభుత్వ సంస్థలలో విశిష్ట సేవలందించిన వారికి మా కవిటం కాణాచి.
కవిటం హైస్కూల్
పేద హరిజన కుటుంబంలో జన్మించి, వైద్య రంగంలో విశ్వ విఖ్యాతి గాంచిన డాక్టరు బుడత స్వామి మా గ్రామ వాసి.
1934 లోనే ఆయుర్వేద వైద్యంలో డిప్లొమా పొంది, ఎంతో హస్తవాసి వున్న వైద్యునిగా పేరు గడించి ఉచితంగా వైద్య సేవలందించిన పరకాల వెంకట సూర్య నారాయణ ఇక్కడి వాడే.
కేంద్ర సమాచార శాఖలో కీలక పదవిలో పనిచేసి, సైన్సు కథలను సులభ శైలిలో రాసి పాఠకుల్ని ఆకట్టుకోవడమే కాక, పంజాబు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన తొలి ఆంధ్రుడు వేమరాజు భానుమూర్తి మావూరి వారే.
ప్రముఖ సినీనిర్మాతగా పేరుప్రతిష్టలు ఆర్జించి, జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షునిగా, ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర మండలికి అధ్యక్షునిగా విశిష్ట సేవలందించిన డివిఎస్ రాజు ఎక్కడి  వాడనుకుంటున్నారు. మా వూరిలో పుట్టి పెరిగిన వారే.
కోడిగుడ్డు పై చిత్రలేఖనం చేసి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన సిద్థాని వీరమల్లు, హైకోర్టు లో రిజిస్ట్రార్ గా పనిచేసిన సుబ్బరాజు, నర్సాపురం పార్లమెంట్ నియోజక వర్గానికి రెండు సార్లు ప్రాతినిథ్యం వహించిన దాట్ల బలరామ రాజు , వైద్య శాస్త్రం లో ఉన్నత విద్య అభ్యసించి పొరుగూరు పోడూరు లో కొంతకాలం వైద్య సేవ చేసి తదనంతరం నేతాజి సుభాష్ చంద్ర బోస్ నాయకత్వాన ఏర్పడిన అజాద్ హింద్ ఫౌజ్ లో చేరి , బ్రిటీషు పాలకులచేతిలో అరెస్టు అయి జైలుశిక్ష అనుభవించిన కల్నల్ డి.ఎస్. రాజుగారు… అంతా ఈ ప్రాంత వాసులే.
కవిటం మాజీ సర్పంచ్ శ్రీ కర్రి వెంకట రెడ్డి
 అంతేనా, కాదు, ఇంకా చాలా ఉంది. విజయవాడ, మద్రాసు నగరాలలో సినిమాల విస్తృత ప్రచారానికి సాయపడే సినీలితో వర్క్స్ ను ప్రారంభించిన కర్రి నర్సిరెడ్డి, ఆయుర్వేద మందుల తయారీకి నాందీ వాచకం పలికిన గాదె బాలకృష్ణ మూర్తి , గ్రామ మహిళల అభ్యున్నతి, సాధికారత కోసం కవిటం గ్రామంలో మహిళా సంఘాన్ని ఏర్పరిచి విశేష కృషి చేసిన శ్రీమతులు మేడపాటి సుబ్బమ్మ, గోపరాజు సీతాదేవి , పరకాల సుశీలా దేవి, పరకాల అహల్యాదేవి,పరకాల శేషావతి, వేమరాజు లక్ష్మీకాంతమ్మ, కర్రి లక్ష్మీనరసమ్మ, మేడపాటి బులి వెంకమ్మ ఈ వూరివారే.
గోపరాజు సీతాదేవి, పరకాల సుశీలా దేవి
ప్రముఖ స్వాతంత్యోద్యమ సారథులు పరకాల పట్టాభి రామారావు, పరకాల రమణ రావు, అనేక దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తి లో ఎంతోమందిని భావి భారత పౌరులుగా తీర్చి దిద్దిన పరకాల సుశీలా దేవి, పశువైద్య వృత్తిలో విశేష సేవలందించిన పరకాల రామచంద్ర మూర్తి, సైనిక స్కూల్ లో చదువుకుని, నౌకా దళంలో చేరి కమడోర్ పదవికి చేరుకుని దేశరక్షణ కోసం పాటుపడిన పరకాల సుధీర్, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేట్ సంస్థ లలో పనిచేస్తూ ఉన్నత స్థితికి చేరుకున్న పరకాల రథాంగ పాణి, పరకాల పేర్రాజు, పరకాల రమేష్, ఇక్కడ పుట్టి పెరిగిన వారే.
భారత నౌకా దళంలో కమడోర్ పదవి అలంకరించిన పరకాల సుధీర్
వైద్యులు అనగానే… మల్లెపువ్వులాంటి తెల్లని దుస్తుల్లో,  మందహాసంతో డాక్టర్ పోడూరు కృష్ణమూర్తి గారు కళ్ళముందు ప్రత్యక్ష మవుతారు.ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా మా వూరిలో వైద్య సేవలు అందిస్తున్నారు. చికిత్స కోసం వచ్చే వారి వద్ద నామ మాత్రం ఫీజు తీసుకునే డాక్టర్ కృష్ణమూర్తి గారు. మంచి హస్తవాసి వైద్యునిగా ఈ ప్రాంమంతా పేరు. కవిటం లోనూ, చుట్టు పక్కల గ్రామాలలోనూ ఆయన తెలియని వారు వుండరు. పరకాల కుటుంబీకులకు అత్యంత ఆప్తులైన డాక్టరు గారు పరకాల ట్రస్ట్ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొంటూ అముల్యమైన సహకారాలు అందిస్తూ వుంటారు.
“గాంధీజీ రాక”
1929 ఏప్రిల్ 27 వ తేదీన మహాత్మా గాంధీ, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా , స్వాతంత్య్ర సముపార్జన ఉద్యమంలో భాగంగా , మా వూరు  కవిటం సందర్శించారు.

కాలువ అవతల గాదె వెంకట్రామయ్యగారి మిల్లు కళ్ళం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో గాంధీజీ ప్రసంగించారు.

కాలువ గట్టు పక్కనే వున్న బోదె కాలువ మీద రాత్రికి రాత్రి సర్వే బాదులతో వంతెన కట్టారు. గాంధీ గారి కారని సరాసరి మిల్లు కళ్ళం దాకా తీసుకువచ్చారు.  కారు వెనుక సీటులో కూచుని గాంధీజీ పది నిముషాలు ప్రసంగించారు. ఉప్పు సత్యాగ్రహం సన్నాహాలలో భాగమే గాంధీజీ సందర్శన. గాంధీజీ విరాళాల కోసం విజ్ఞప్తి చేయగానే ఎంతో మంది మహిళలు తమ వొంటిమీద వున్న బంగారు ఆభరణాలను తీసి స్వయంగా గాంధీజీ చేతులలో పోసారట.
చుట్టుపక్కల గ్రామాలనుంచి ఎన్నడూ గుమ్మం దాటి బైటికి రాని క్షత్రియ మహిళలు గాంధీ గారిని చూడటానికి , ఆయన ప్రసంగం వినడానికి రావడం, వొంటి మీద వున్న నగలన్నీ తీసి ఇవ్వడం ఆ రోజుల్లో ఎంతో విశేషంగా చెప్పుకునేవారట.
కవిటంతో పరకాల వారి అనుబంధం
నాకు లభ్యమైన సమాచారం ప్రకారం, మా నాన్నగారు రాసిన పుస్తకాల్లో వున్న సమాచారం ప్రకారం దాదాపుగా 200 ఏళ్ళ క్రితం మెదటి సారిగా పెనుగొండ, ఆ తర్వాత కవిటం ప్రాంతాలకు తెలంగాణా వరంగల్ జిల్లా పరకాల అనే గ్రామం నుంచి మా పూర్వీకులు వలస వచ్చారు.
ఎంతో సస్య శ్యామలమైన ఈ ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పర్చుకోడానికి మా పూర్వీకులు ఇక్కడికి తరలి వచ్చినట్టు చెబుతారు.
మా వంశ వృక్షం ఆధారంగా చూస్తే కొండయ్య, వీర్రాజు, సూరన్న గార్ల పేర్లు కనిపిస్తున్నాయి . అంటే కవిటం గ్రామంలో మొదట ఈ ముగ్గురూ స్థిర పడి వుండవచ్చు. వీరు ఇక్కడికి వచ్చిన కొత్తల్లో కవిటం గ్రామ వాసులు వీరిని వుద్దేశించి” పరకాల నుంచి వచ్చిన వాళ్ళు” అని అనే వాళ్ళట. కాలక్రమేణా మాకు పరకాల అనే ఇంటి పేరు వచ్చివుండొచ్చు.
మరొక కథనం ప్రకారం, నైజాము నవాబు పాలన సర్కారు జిల్లాలకు వ్యాపించి నప్పుడు, అక్కన్న, మాదన్న మంత్రులు గా వుండగా ఆరువేల కుటుంబాలకు గ్రామ కరణీకాలు ఇచ్చారు. కరణికాల నిమిత్తం కొంతమంది గోదావరి డెల్టా ప్రాంత గ్రామాలకు  వచ్చి వుండొచ్చు. మా పూర్వీకులు అందులో భాగమై కూడా ఉండవచ్చు.
ఏదేమైనా వీరు క్రమేపీ ఆ గ్రామ జన జీవన స్రవంతిలో కలిసిపోయి గ్రామ అభ్యున్నతికి తమ వంతు తోడ్పాటు అందించారు. మా మొదటి తరం వారు కవిటంలో స్థిర పడే సమాయానికి   కాలువలు రాలేదు. అన్నీ వర్షాధార పంటలే. కానీ పంటలు బాగా పండేవిట.
సర్వే కూడా లేకపోవడంతో అప్పట్లో ఎవరు ఎంత దున్నుకుంటే అంత భూమి వాళ్ళదే. ఆ తర్వాత పన్నులు కట్టలేక చాలా మంది భూములు వదులుకునేవాళ్ళట.
మా పూర్వీకుల మొదటి తరం వారి కింద వంద ఎకరాలపైనే వుండేదని చెబుతారు. అప్పటికి ఇనాము భూములుగా పట్టాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ గ్రామానికి  వచ్చిన కొంత కాలానికి, నాటి  వూళ్లో నాలుగు వీధుల మధ్య ప్రదేశంలో పెద్ద మండువా లోగిలిని మా పూర్వీకులు నిర్మించుకున్నారు.

Like this story? Share it with a friend!

ఆ తర్వాత కాలువలు రావడంతో కవిటం కాలువ ఓడ్డునే 1920లో మా తాతగారు పరకాల సూర్యనారాయణ గారు 12 గదులతో భవనం నిర్మించారు .సరిగ్గా ఆ సంవత్సరంలోనే మా నాన్న గారు పరకాల పట్టాభి రామారావు జన్మించారు.
పరకాల భవంతి
కవిటం గ్రామ అభివృద్థి క్రమంలో అడుగడుగునా పరకాల వారి ముద్ర కనిపిస్తుంది.తరతరాలు గడుస్తున్నా సేవా తత్పరత  పరకాల కుటుంబీకుల రక్తం లో ప్రవహిస్తూనే వుంది.
కవిటం గ్రామంలో శివాలయం నిర్మించింది పరకాల కుటుంబీకులే. దానికి శివలింగ ప్రతిష్టాపన జరిపింది పరకాల వంశస్తులే.  అక్కడి దేవుడు సోమేశ్వరస్వామి.
కవిటంలోని ప్రసిద్ధ శివాలయం
పరకాల కుటుంబీకులు ఆ దేవాలయానికి 30 ఎకరాల మాన్యం ఇవ్వడమే కాక వెండి పూజా సామగ్రి కూడా బహూకరించారట. అందుచేత, ఇప్పటికీ ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి ఆఖరి సోమవారం నాడు ఆ శివాలయంలో పూజారులు పరకాల ఇంటిపేరుతో అర్చనలు, విశేష పూజలు జరుపుతారు. ప్రస్తుత తరానికి చెందిన పరకాల కుటుంబీకులు ఆ పూజా కార్యక్రమాలకు హాజరవుతూవుంటారు.
పరకాల శేషావతారం
1925 డిసెంబరు ఒకటవ తేదీన కవిటంలో జన్మించిన మరో ఆణి ముత్యం పరకాల శేషావతారంగారు. ఆయన విద్యార్థి దశలోనే పరకాల పట్టాభి రామారావు ప్రోత్సాహంతో జాతీయోద్యమంపట్ల ఆకర్షితులైయ్యారు. క్విట్ ఇండియా  ద్యమం సమయంలో  పాల్గొని 1943 మార్చిలో ఎండగండి వద్ద అరెస్టు అయ్యారు. అల్లిపురం జైలులో ఆరు నెలలు శిక్ష అనుభవించారు.
పరకాల శేషావతారం
ఆ విధంగా శేషావతారంగారి రాజకీయ జీవితం ప్రారంభమైనదనే చెప్పాలి. 1948 లో శేషావతారంగారు భారత జాతీయ కాంగ్రెస్ నుంచి  1962, 1972 లలో రెండు సార్లు అసెంబ్లీకి  ఎన్నికయ్యారు.1976-78లో రాష్ట్ర పంచాయితీశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1978లో ఇందిరా కాంగ్రెస్  లో చేరారు. స్వాతంత్య్ర సమరయోధు నిగా ఎంతో ప్రసిథ్ది చెందిన పరకాల శేషావతారంగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన సన్నిహితులతో కలిసి ప్రదర్శించిన తిండి కోసం, ఆహుతి నాటికలు ఆ రోజులలో ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ రంగంలో పరకాల శేషావతారం గారికి విశిష్ట స్థానం ఉంటుంది. కవిటంగ్రామానికి ఎంతో వన్నె తెచ్చిన వారిలో ఆయన ప్రముఖుడు.గ్రామం నుంచి  తొలి మంత్రి ఆయనే. అలా ఆయన కవిటానికి ఆంధ్ర దేశ చరిత్రలో శాశ్వత స్థానం కల్పించారు.  ఆయన కుమారుడు డాక్టరు పరకాల ప్రభాకర్ ఆంధ్ర పదేశ్ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్తి నిర్మాలా సీతారామాన్, పరకాల ప్రభాకర్ సతీమణి.
పరకాల ట్రస్టు ఆవిర్భావం
విద్యార్థి దశనుంచే జాతీయోద్యంలో ఎంతో క్రియాశీలంగా పాల్గొన్న పరకాల పట్టాభి రామారావుగారికి సమాజాభివృద్థికి తన వంతు దోహదం కూర్చాలన్న కోరిక ఎంతో బలీయంగా వుండేది. “ప్రపంచాగ్నికి నేను సైతం సమిథనొక్కటి ఆహుతిచ్చాను”అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు పరకాల పట్టాభి రామారావు, పిత్రార్జిత ఆస్తుల పంపకంలో తనకు వచ్చిన వాటాలో “పరకాల ట్రస్ట్” ఏర్పాటు చేసారు.
పరకాల ట్రస్టు భవనం
అక్కగారు గోపరాజు సీతా దేవి, ఆయన సోదరులు పరకాల రమణారావు, పరకాల రామచంద్ర మూర్తి, ఇంకా ఎంతో మంది సన్నిహిత బంధువులు అందించిన అమూల్యమైన సహాయ సహకారాల ఫలితంగా ఒకనాటి పరకాల భవంతిలో “పరకాల ట్రస్ట్” ఆవిర్భవించింది.
పరకాల ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, స్వాతంత్య్ర యోథులు, సీనియర్ పాత్రికేయులు పరకాల పట్టాభి రామారావు.
సేవా కార్యక్రమాలు నిర్వహించడం దీని ప్రధాన లక్ష్యం. దీనికి బంధవర్గంలోనే కాదు కవిటం గ్రామ వాసుల నుంచి విశేష ఆదరణ లభించింది.

పార్లమెంట్ సభ్యుల MPLADS నుంచి , శాసన సభ్యుల నియోజవకర్గ అభివృద్ధి నిధుల నుంచీ విరాళాలు అందాయి. అంతేకాదు, ట్రస్ట్ ఉదాత్త లక్ష్యాలకు ఉత్తేజం పొందిన బంధువులు, హితులు, సన్నిహితులు భూరి విరాళాలను అందించారు.

ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, కీలక అంశాల మీద సదస్సులు, సమావేశాలు జరిగాయి.
ఆ తరం గడిచిపోయినా, ఈ తరపు పరకాల కుటుంబీకులు పరకాల ట్రస్ట్ ముందుకు తీసుకువెళ్తున్నారు. ట్రస్టు  గురుతర బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకుని, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో వినూత్న సేవా పథకాలను అమలు జరుపుతూ ట్రస్ట్ కు విశేషా ఖ్యాతిని తీసుకు వస్తున్నారు.
ప్రతి ఏటా ట్రస్ట్ కమిటి సభ్యులు రిపబ్లిక్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూంటారు. ఆ సందర్భంగా ఎంతోమంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరాలు, నిరుపేద మహిళలకు దుస్తులు పంపిణీ చేస్తూవుంటారు.
కవిటం గ్రామ అభ్యున్నతికి పరకాల వంశీయులు తరతరాలుగా అందిస్తున్న సేవకు గుర్తింపుగా గ్రామ పంచాయితీ వారు, వూర్లోని Canal street ని  “పరకాల వారి వీధి” గా మార్చాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసారు.

పరకాల వంశస్తుల చరిత్రలో అదొక ఉజ్వల ఘట్టం . కవిటం వంతెనకు దిగువన , కాలవ ఒడ్డున పరకాల వారి వీధిని  కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామాన్ , ఆమె భర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్.పరకాల ప్రభాకర్ ఆవిష్కంచారు.పైనున్నశిలాఫలకం ఆ ఆవిష్కరణదే.
అంతేకాదు, కవిటం మహిళా సంఘ భవన నిర్మాణానికి 20లక్షల కేంద్ర నిధులు సమకూర్చి భవన శంకుస్తాపన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆ విధంగా శ్రీమతి నిర్మలా సీతారామాన్ రెండుసార్లు కేంద్ర మంత్రిగా కవిటం సందర్శించారు. ఒక కేంద్రమంత్రి రెండుసార్లు రావడం ఒక గ్రామ చరిత్ర లోనే ఒక ముఖ్యఘట్టం అవుతుందికదా?
కవిటం గ్రామం పేరు చెప్పగానే మేడపాటి వారు, పరకాల వారు, కర్రి కుటుంబీకులు, పెద్ది రెడ్డి వారు జ్ఞాపకం వస్తారు.
దాదాపుగా 8 వేల జనాభాతో, 87 శాతం అక్షరాస్యులతో, 2100 గడపలతో 755 హెక్టార్ల వైశాల్యం లో, ప్రకృతి సోయగాలతో, పంటపొలాలతో, పంటకాలువలతో, పచ్చని చెట్లతో అలరారే వూరే మా ఊరు కవిటం.

ఈ వ్యాసం చదివిన తరువాత , మా వూరు చూడాలని పిస్తే
నా కృషి కొంతవరకూ ఫలించినట్టే. మా వూరితో బాటు చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు ఇంకా ఏన్నో వున్నాయి.
పెనుగొండలో కొన్ని కోట్ల ఖర్చుతో నిర్మించిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం,.పాలకొల్ల లో క్షీరారామ ఆలయం , పాలకొల్లు దాటి ముందుకు వెడితే నర్సాపురం సమీపంలోని ప్రఖ్యాత అంతర్వేది, భీమవరంలో సోమారామం ఇంకా ఎన్నెన్నో సందర్శనీయ ప్రదేశాలు వున్నాయి.
ఒకసారి మావూరు కవిటం సందర్శించి, అక్కడి ప్రకృతి సోయగాలను ఆస్వాదించమని ఆహ్వానిస్తున్నాను.
పరకాల సూర్యమోహన్

 

(పరకాల సూర్యమోహన్, సీనియర్ పాత్రికేయుడు, చెన్నై)