(సన్నపురెడ్డి వెంకటరెడ్డి)
మిత్రులారా!
వానాకాలం ఒక్కసారి కొండల్లోకి వెళ్ళిరండి. వర్షం కురిసి వెలిసిన తర్వాత, సెలలకు వాగులకు ప్రాణం వచ్చిన తర్వాత, చెట్లన్నీ పచ్చదనపు ఐశ్వర్యంతో విర్రవీగే సమయాన ఒక్కసారి అడవి లోకి వెళ్లి రండి.
వంకల గొంతుక ఎప్పుడైనా విన్నారా? సెలయేటి పాట మాధుర్యం ఎప్పుడైనా చవిచూశారా? చెట్లు కొమ్మ కొమ్మా రెమ్మ రెమ్మా గొంతెత్తి పాడటం ఎప్పుడైనా ఆకర్ణించారా? దయచేసి అడవికి వెళ్ళి రండి. ఈ వింతలన్ని విని రండి.
నిన్నటిదాకా రాళ్ళు రప్పలు గుంతలు మిట్టలతో యాకరతోకరగా ఉన్న వంక, ఇవాళ బాహువుల్నిండా ఎర్ర నీళ్లు నింపుకుని ఎంతందంగా ఉంటుందనీ! మనం వెళ్లి గట్టున నిలబడితే మనల్ని లెఖ్క కూడా చేయదు. అమ్మ మెల్లె తీసుకొని వెంటపడితే బిత్తల పరిగెత్తే పిల్లాడిలా ఎర్రనీటిని ఒలికించుకొంటూ ఎంత హుషారుగా పరుగులు తీస్తుందనీ యీ వంక! అబ్బో… ఈ సెలయేర్లు వాయించే జలసంగీతాన్ని వర్ణించేందుకు నా వద్ద చాలినన్ని పదాలు లేవు.
మరీ విచిత్రం……
ఇక్కడ రాళ్ళు గొంతెత్తి పాడతాయి.
చెట్లవేళ్ళు సరిగమలు ఆలపిస్తాయి.
ఈ కొండవాగు బహు చమత్కారి. కోసురాళ్ళను చెట్లవేళ్ళను తంత్రులుగా చేసి, నీళ్ళ మునివేళ్ళతో మీటి ఎంతద్భుత ప్రాకృతిక సంగీతాన్ని ఆలపిస్తుందో – విని తరించాల్సిందే! వీటన్నిటికీ తోడు చెట్ల మీది ఆకు ఆకు ఒక పక్షి అయి గానం చేస్తూ ఉంటే, ఆ జుగల్బందీలో మనం కొట్టుకు పోవాల్సిందే! ఎక్కడో తేలవలసిందే!
ఎన్నేళ్ళ మౌనం తర్వాతనో, ఎంత కాలపు స్తబ్దత తర్వాతనో కొండవాక ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుని హద్దుల్లేని అల్లరితో పరుగులు తీస్తూ ఉంటుంది. పాటలు పాడుతూ ఉంటుంది. మనం సర్వేంద్రియాల్ని ప్రవాహానికి అప్పగించి ఆత్మానందాన్ని అనుభవిస్తూ కూర్చుంటే సరి. కాదని ఆ అల్లరికి అడ్డంగా నడిచామా – ఎదుర్రొమ్ము మీద చెయ్యేసి వెల్లకిలా తోసి కిలకిలా నవ్వుకొంటూ పరిగెడుతుంది. లోకం తెలియని, మంచి చెడ్డ తెలియని, ఎత్తుమతం తెలీని పిల్లచేష్టాలు దానివి. మనమే జాగ్రత్తగా ఉండాలి.
ఉన్నట్టుండి కొమ్మల్లోంచి బెట్టుడత ఒకటి అందమైన శరీరాన్ని వయ్యారంగా కదిలిస్తూ దిగి వస్తుంటుంది. చూసి ఆనందించాలి. దాన్ని ఫోటో తీసేందుకో మరో కోరికతోనో వెంటాడితే- అది సెలయేటి కన్నా అల్లరి జీవి. నిమిషంలోనే కనిపించకుండా పోతుంది. ఒక అద్భుతమైన వర్ణ చిత్రాన్ని చేతులారా మనమే చెరుపుకున్నట్లు అవుతుంది.
ఎక్కడ చూసినా నీళ్ల గలగలలు. పసరుగక్కే చెట్ల కిలకిలలు. తలస్నానం చేసి కురులు ఆరబెట్టుకొంటోన్న ప్రకృతి కన్య వయ్యారాలు. అడవి ఒక అందం. అడవి ప్రయాణం ఒక అద్భుత అనుభవం.