బిజెపి ప్రభుత్వ”రైతు వ్యతిరేక” బిల్లును తిరస్కరించండి: నవీన్ కుమార్ రెడ్డి

భారతదేశ రైతుల ప్రయోజనాల కోసం అని బిజెపి ప్రవేశపెట్టిన బిల్లు రైతుల పాలిట శాపంగా మారుతుందని చెబుతూ వాటిని తిరస్కరించాలని  చిత్తూరు జిల్లా ఐఎన్ టియుసి నేత , కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతు బిల్లు ముసుగులో తన బాధ్యతల నుంచి తప్పుకోవడం దుర్మార్గమని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు “పెద్ద నోట్ల రద్దు” “జిఎస్టి” కారణంగా ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది! ఇపుడు మొత్తం వ్యవసాయరంగాన్ని సంక్షోొభంలోనెడుతున్నదని ఆయన అన్నారు.
 ఆయన ఇంకా ఏమన్నారంటే…

1) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పోస్టల్,టెలికాం, రైల్వేస్ లాంటి దేశ ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు!
2) బిజెపి తొందరపాటు నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వెలవెలబోతున్నాయి కార్పొరేట్ రంగ సంస్థలు కళకళలాడుతున్నాయి!
3) కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు పండించిన పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించేది అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగితే ప్రభుత్వం అన్ని విధాలా రైతుని ఆదుకునేది!
4) భారతదేశంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయం ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళితే దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగ సంస్థలు సిండికేట్ గా ఏర్పడి రైతుల శ్రమను దోచుకుంటారు!!
5) చిత్తూరు జిల్లాలోని చక్కెర ఫ్యాక్టరీ,పాల డైరీ లు మూతపడుతున్నాయి ప్రైవేట్ రంగ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారు!
6) రైతు పండించిన పంటను ప్రైవేటు ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తే సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు ప్రకృతి వైపరీత్యాలకు నష్ట పరిహారం ఇవ్వడం లేదు రైతు బిల్లు కారణంగా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రైతులు ఎదుర్కోవాల్సి వస్తుంది!
7) కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు చెల్లిస్తున్న జీఎస్టీ రుసుం తిరిగి చెల్లించకపోవడం చట్ట ఉల్లంఘన అని “కాగ్” తప్పు పట్టడం కేంద్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం!
8) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లును వ్యతిరేకిస్తున్న హర్యానా పంజాబ్ రైతులను స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో రైతులు బిజెపి నిర్ణయాన్ని వ్యతిరేకించాలి!