జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ విజయవాడ కార్యాలయం హోదా తగ్గించవద్దు: లోకేష్

జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డిసి) విజయవాడ ప్రాంతీయ కార్యాలయాన్ని బ్రాంచ్ కార్యాలయం స్థాయికి హోదా తగ్గించవద్దని  కేంద్ర జౌళి శాఖ మంత్రి, శ్రీమతి స్మృతి ఇరానీ కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, నారా లోకేష్ లేఖ రాశారు.
చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో ఏపీ 2వ స్థానంలో ఉందని,  రాష్ట్రంలో 3 లక్షలకు పైగా నేత కార్మికులు ఉన్నారని,  ఎన్‌హెచ్‌డిసి ప్రాంతీయ కార్యలయం విజయవాడలో కొనసాగాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ  కార్యాలయం స్థాపించిన నాటి నుంచి చేనేత ఆదాయంలో స్థిరమైన పెరుగుదల ఉందని చెబుతూ దీనిని బ్రాంచ్ కార్యాలయం స్థాయికి కుదిస్తే ప్రతిఅవసరానికి హైదరాబాద్ లో ఉన్న ప్రాంతీయ కార్యాలయం మీద ఆదారపడాల్సి ఉంటుంది, ఇది నూలు సప్లయిలో జాప్యానికి దారితీస్తుందని  ఆయన లేఖలో ఆందోళనవ్యక్తం చేశారు.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కార్యాలయాన్నికూడా బ్రాంచ్ ఆఫీస్ గా కుదించారని, అయితే, హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి జోక్యం తీసుకోవడంతో హైదరాబాద్ ను ప్రాంతీయ కార్యాలయంగానే కొనసాగిస్తున్నారని ఆయన లేఖలో గుర్తు చేశారు. అయితే, విజయవాడ ప్రాంతీయ కార్యాలయాన్ని మాత్రం బ్రాంచ్ స్థాయికి కుదించారని ఆయన చెప్పారు. విజయవాడ కార్యాలయం టర్నోవర్ బాగా ఎక్కువగా ఉన్న, సుమారు 200 సొసైటీలు  ఈ కార్యాలయం పరిధిలో ఉన్నా  ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయనఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

 

లేఖలోని అంశాలు:
★ ఇది హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంతో సంబంధం లేకుండా మార్కెట్ సామర్థ్యాన్ని బట్టి నూలు సరఫరాలో చేనేత కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది.
★ గతంలో ఉన్న బ్రాంచ్ కార్యాలయాన్ని విజయవాడ ప్రాంతీయ కార్యాలయం స్థాయికి హోదా పెంచినందున 200 కి పైగా చేనేత సహకార సంస్థలు మరియు అనుబంధ సంస్థలకు లబ్ది చేకూర్చింది.
★ తెలంగాణ ఎన్‌హెచ్‌డిసి టర్నోవర్ రూ.16కోట్ల వరకు ఉంటే విజయవాడ ప్రాంతీయ కార్యాలయం టర్నోవర్ రూ.80కోట్ల వరకు ఉంది.
★ ఇటీవల హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని బ్రాంచ్ కార్యాలయం గా కుదించినప్పటికీ మంత్రి కిషన్ రెడ్డి గారి జోక్యంతో తిరిగి ప్రాంతీయ కార్యాలయంగా కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
★ తెలంగాణ ఎన్‌హెచ్‌డిసి కంటే ఎక్కువ టర్నోవర్,ఎక్కువ నేత కుటుంబాలు ఆధారపడిన విజయవాడ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని
ఇప్పుడు బ్రాంచ్ కార్యాలయం గా కుదించడం మంచి నిర్ణయం కాదు.
★ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
★ విజయవాడ కార్యాలయం స్థాయి తగ్గించినందున సహకార సంఘాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, నూలు డిపో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
★ గత ఆరు నెలల్లో, కరోనా మహమ్మారి ఖాదీ,చేనేత రంగాన్ని నాశనం చేసింది.
★ ఉత్పత్తులు అమ్ముడుపోక తీవ్ర నష్టాల్లో ఉన్నారు.కొత్త పని లేకుండా పోయింది.
★ ఎన్‌హెచ్‌డిసి తాజా నిర్ణయం నేతన్నలు కోలుకునే అవకాశాలను మరింత దెబ్బతీస్తోంది.
★ హైదరాబాద్ కార్యాలయం విషయంలో త్వరితగతిన ఎలా అయితే నిర్ణయం తీసుకున్నారో అలానే విజయవాడ ఎన్‌హెచ్‌డిసి కార్యాలయాన్ని తక్షణమే ప్రాంతీయ కార్యాలయంగా గుర్తించాలని కోరుతున్నాను.
★ దీని వలన నేతన్నలు వారి అవసరాలకు హైదరాబాద్ కార్యాలయంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
★ సమయం వృధా కాకుండా వృత్తిని లాభదాయకంగా కొనసాగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.