కామన్వెల్త్ లెజిస్లేటివ్ కౌన్సెల్ కు ఎన్నికైన తొలి ఆసియా మహిళ ఎవరో తెలుసా?

(చందమూరి నరసింహా రెడ్డి)
ఈమె పేరు వినగానే, చూడగానే గవర్నర్ గా గుర్తుపడతారు. అయితే ఈమె గవర్నర్ కంటే ముందు రచయిత్రి, కాలమిస్టు, న్యాయవాది. ఎన్నికల కమీషన్ కు తొలిమహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్. ఈమె కామన్వెల్త్ అసోసియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సెల్ (CALC) అధ్యక్షులుగా ఎన్నికైన నా తొలి ఆసియా దేశస్థురాలు.కర్ణాటక తొలి మహిళా గవర్నర్‌ రమాదేవి.
తెలుగు వారు గర్వించే విధంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన ఈమె పలువురికి ఆదర్శమూర్తి.రమాదేవి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం చేబ్రోలులో జనవరి 15 , 1934లో జన్మించారు. రమాదేవి తల్లితండ్రులు వి.వెంకట సుబ్బయ్య, వి వెంకట రత్నమ్మ. తన విద్య ఏలూరులోని సెయింట్‌ థెరిసా, సీఆర్‌ ఆర్‌ కళాశాలల్లో ఇంటర్‌ దాక చదివారు. తరువాత హైదరాబాద్‌ లో ఎమ్‌ఎ, ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు.
విద్యానంతరం 1959లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాది గా పనిచేశారు. న్యాయవాదిగా పనిచేస్తూనే హైదరాబాదు ఆకాశవాణిలో పిల్లల కార్యక్రమంతో అందరిని అకట్టుకుంది. ఆంధ్రభూమి వార, మాస పత్రికలలో ఆమె చాలా కాలం కాలమిస్టుగా పనిచేశారు. ఆంధ్రభూమితో రమాదేవికి విడదీయరాని అనుబంధం ఉంది. గోరా శాస్ర్తీ సంపాదకత్వంలో ప్రారంభించిన విపులాచపృథ్వీ కాలమ్‌ను దీర్ఘవిరామం తరవాత ఆమె మళ్లీ కొనసాగించి రాజకీయ, సామాజిక పరిణామాలపై ఆమె తనదైన శైలిలో విశ్లేషిస్తూ అనేక సంవత్సరాలు నిర్వహించారు.
రచనల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించాలని అనేక పుస్తకాలను రాశారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై, చట్టాలపై ఆమె పలు పుస్తకాలు రాశారు. ఈమె రాసిన రాజీ నవల ఒకానొక చారిత్రక సందర్భంలో (1975-78) జాతీయ రాజకీయ సామాజిక సంక్షోభాన్ని నేపథ్యంగా రాసిన నవల. అనంతం నవల జీవితపు బహుముఖత్వాన్ని రాజీ అంతర్నేత్రం నుండి ఆవిష్కరించిన నవల.మరో నవల అందరూ మనుషులే ఓ భూస్వామ్య కుటుంబంలో పుట్టి, పెద్ద చదువు చదివి ఓ వ్యాపారస్తుడికి ఇల్లాలై, ఓ బిడ్డకి తల్లైన తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టి నాయికగా నీరాజనాలు అందుకున్న రేఖ కథ ‘అందరూ మనుషులే’ కేవలం సినిమా పరిశ్రమని మాత్రమే కాక, తనకి పరిచయం ఉన్న అనేక రంగాలనీ, భిన్న మనస్తత్వాలనీ నేపధ్యంగా తీసుకుని రాసిన నవల ఇది.
ఇలా దాదాపు తెలుగు భాషలో ఇరవైకి పైగా గ్రంథాలు, నవలలు, కథానికలు, వ్యాసాలు, నాటకాలు రచించారు. అమె రాసిన గ్రంథాలు, రచనలు అఖిల భారత రచయితల సదస్సులో ఉంచారు.స్త్రీలు-చట్టాలు అంశాలుపై అనేక వ్యాసాలు రాసారు. రచయిత్రిగా వీరిని అఖిల భారత రచయిత్రుల సదస్సులో సత్కరించారు.

 

 


తన రచనతలతో చైతన్యం చేసిన రమాదేవి గ్రూప్ ఏ ఆఫీసర్ గా కేంద్ర ప్రభుత్వంలో నియమితులయ్యారు. ఇండియన్ లీగల్ సర్వీసులో వివిధ హోదాలలో పనిచేశారు. లెజిస్లేటివ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, లా కమిషన్ మెంబర్ కార్యదర్శిగా, లెజిస్లేటివ్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. వీరు కస్టమ్స్ ఎక్సైజ్ అప్పీళ్ల ట్రిబ్యునల్ సభ్యులుగా పనిచేశారు.
ఈమె భారతదేశపు ఎన్నికల కమిషన్ కు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరుగా నవంబరు 1993 లో కొంతకాలం పనిచేశారు. నెల రోజులు గడవకముందే ఆపదవి నుంచి ఆమెను తప్పించి టి.యన్ .శేషన్ కు ఆ బాధ్యత అప్పగించారు. 1993 జూలై లో రాజ్య సభ సెక్రటరీ జనరల్ గా నియమితులై 1997 వరకు ఆ పదవిలో కొనసాగారు.
1997లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. వీరు ఈ పదవిలో 1997 జూలై 25 నుండి 01 డిసెంబరు 1999 వరకు పనిచేశారు. 1999లో కర్ణాటక గవర్నరుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటక రాష్ట్రానికి తోలి మహిళా గవర్నర్ ఈవిడే. 2002 ఆగస్టు 21 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఈమె కామన్ వెల్త్ అసోసియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు అధ్యక్షులుగా ఎన్నికైన తొలి ఆసియా దేశస్తురాలు.దీనికి అధ్యక్షురాలిగా ఉన్నారు.
వీరు ఢిల్లీ ఆంధ్ర వనితా మండలి అధ్యక్షులుగా పనిచేశారు. లా కమిషన్‌ మెంబర్‌గా విధులు నిర్వర్తించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో రమాదేవి ని సత్కరించింది.
రమాదేవి స్వగ్రామం చేబ్రోలుకు ఆరు కిలోమీటర్ల దూరంలోని కాగుపాడు కు చెందిన రామావతార్‌ను పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.
రమాదేవి 2013, ఏప్రిల్ 17 న బెంగుళూరు లో అనారోగ్యం తో మరణించారు

 

Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు,ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)