రాయలసీమకు మరోసారి ద్రోహం చేయడానికి సిద్దమైన పార్టీలు 

(యనమల నాగిరెడ్డి)
తరాలు మారినా, అధికారంలోకి ఎన్ని పార్టీలు వచ్చినా, తమతమ స్వార్థ ప్రయోజనాల కోసం  పలుకుబడి ఉన్న నాయకులు పుట్ట గొడుగుల్లా ఎన్ని పార్టీలు స్థాపించినా, అందరు ముక్త కంఠంతో వెనుకపడిన ప్రాంతాల ప్రజల కష్టాలపై  మొసలి కన్నీరు కారుస్తూ అన్ని రంగాలలో పూర్తిగా అభివృద్ధి చెందిన బలమైన ప్రాంతాలకే మద్దతు పలుకుతారనేది చారిత్రిక సత్యం.
కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వాపపక్ష పార్టీలు  గతంలో మద్రాస్ నుండి విడిపోయి ఆంద్ర రాష్ట్రం ఏర్పడినపుడు క్రిష్ట్న-పెన్నార్, సిద్దేశ్వరం ప్రాజెక్టులకు అడ్డుపడి నాగార్జున సాగర్ కు మద్దతుగా నిలిచి సీమ  సాగునీటి ఆశలతోపాటు, అన్ని రంగాలలో  రాయలసీమకు సరిదిద్దలేని అన్యాయం చేశారు.
ప్రస్తుతం కూడా అదే అజెండాతో ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని 
టీడీపీ, ఈ పార్టీతో పాటు సిపిఐ, సీపీఎం , టీడీపీ ఆగర్భ శత్రువు కాంగ్రస్, జనసేన  ప్రస్తుతం ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని నినాదంతో ఏకమై తమ ఉమ్మడి శత్రువు వైసీపీ ని ఎదుర్కోవడానికి సిద్దమై రాయలసీమ ప్రయోజనాలకు మంగళం పాడుతున్నాయి.   ఇక బీజేపీ మాత్రం గతంలో చంద్రబాబు అమలు చేసిన  రెండుకళ్ల సిద్ధాంతాన్ని రాజధాని విషయంలో భుజానికి ఎత్తుకున్నది. ఇకపోతే ఈ పార్టీల అధినాయకులంతా (అత్యధిక శాతం) చంద్రబాబు (చిత్తూర్) టీడీపీ, నారాయణ, (నెల్లూరు), రామక్రిష్ట్న(కర్నూల్&అనంతపూర్) సిపిఐ, శైలజానాథ్ (అనంతపూర్) తులసిరెడ్డి (కడప)  కాంగ్రెస్ లాంటి మహామహులు రాయలసీమ వాసులే. ప్రస్తుతం వీరంతా సీమ ఆశలకు సమాధి కడుతుంటే సీమ వైసీపీ నాయకులు మాత్రం “అంతా జగనే చూసుకుంటాడని నిమ్మకు నీరెత్తినట్లుంటూ సీమ కు జరిగే అన్యాయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు”. 
ఘనకీర్తి కలిగిన  రాయలసీమ నాయకులు, గతంలోను, ప్రస్తుతం ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారంతా తమ, తమ ప్రయోజనాలకోసం మౌనం పాటిస్తూ ఈ ప్రాంత ప్రయోజనాలను ఫణంగా పెట్టడం శోచనీయం. ఏతావాతా రాయలసీమలోని ప్రతిపక్ష, పాలకపక్ష నాయకులంతా కలిసి ‘తమ నిష్క్రియా పరత్వంతో’ రాయలసీమ ఆశలకు శాశ్వతంగా సమాధి కట్టడానికి సిద్దమైనారు. 
ఇది కూడా చదవండి

మేడా సోదరుడిపై హత్యా యత్నం కేసు, రచ్చకెక్కిన రాజంపేట వైసీపీ వర్గ పోరు 

గత అనేక దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు, నాయకుల చేతుల్లో రాయలసీమ దారుణ వంచనకు గురైంది.  కోస్తా నాయకుల తాబేదారులుగా మారిన సీమ నాయకులు గతంలోనూ, ప్రస్తుతం కూడా ఈ “రాయలసీమ నాశన క్రీడలో” ప్రధాన పాత్ర పోషిస్తుండటం అత్యంత దారుణం. 
2014 రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వెనుకపడిన ప్రాంతాలను అసలు పట్టించుకోలేదు. రాయలసీమకు అనేక పధకాలు మంజూరు చేశామని, సీమలో ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేస్తున్నామని, పట్టిసీమను పూర్తి  చేసి అందువల్ల మిగిలే 45టీఎంసీల నీటిని  సీమకు తరలిస్తామని, పులివెందులకు, కుప్పంకు నీళ్లిచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేశామని ప్రకటనలపై, ప్రకటనలు గుప్పించారు. రాయలసీమలో ఉన్న తెలుగు తమ్ముళ్లు “ఆహా, ఓహో” అంటూ బాబు భజన సాగించారు. జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే క్వాలిఫికేషన్ గా ముందుకు పోయారు తప్ప చంద్రబాబు ముందు ప్రాంత ప్రయోజనాల కోసం నోరు విప్పలేదు. అన్ని రంగాలలో అభివృద్ధిని హైదరాబాదులో కేంద్రీకరించడం వల్లనే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపందుకొని రాష్ట్ర విభజన జరిగిందని అందువల్ల అధికార కేంద్రీకరణ వద్దని శ్రీ క్రిష్ట్న కమిటీ చెప్పినా బాబుగారు పట్టించుకోకుండా మొత్తం (ప్రభుత్వ, ప్రైవేటు) వ్యవస్థలను రాజధాని పేరుతొ కోస్తాలోని కేంద్రీకరించారు. 
1956 కు ముందున్న ఆంద్ర రాష్ట్రం 2014లో ఏర్పడిందని, శ్రీభాగ్ ఒప్పందం మేరకు రాయలసీమకు రాజధాని ఇవ్వాలని సీమ ఉద్యకారులు తమ శక్తి మేరకు ఘీ పెట్టినా బాబు పట్టించుకోలేదు. అలాగే చివరకు హైకోర్టు అయినా కేటాయించాలన్న సీమ వాసుల ఆక్రందనలు పట్టించుకోకుండా కోస్తాలోనే హైకోర్టు కూడా స్థాపించారు.  హైకోర్టు బెంచి అయినా ఇవ్వాలన్న న్యాయవాదుల కోరికను తుంగలో తొక్కారు. 
టీడీపీ నేతలు తమ నాయకుడి భజనతో తృప్తి చెందుతుండగా, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమై “ఎవరు ఏది అడిగినా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చేస్తామని” ఒకే ఒక హామీ ఇస్తూ కాలం వెళ్లదీశారు. 
ఇక ప్రస్తుతానికి వస్తే జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని అందులో శ్రీభాగ్ ఒప్పందం ప్రాతిపదికగా న్యాయరాజధానిని కర్నూల్ లో ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఆమేరకు చట్టం చేశారు. 
ఆనాటి నుండి టీడీపీ, అందుకు అనుగుణంగా పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వారుస్తున్న టీడీపీ అనుకూల మీడియా నానా యాగీ చేస్తున్నాయి. కోర్టులలో కేసులు వేసి పేరుపొందిన న్యాయవాదులను నియమించి ఈ విభజనలో జగన్ ను ఒక్క అడుగు కూడా వేయనీయకుండా  అన్ని రకాల అడ్డుకుంటున్నాయి. అదే సమయంలో వైసీపీ నాయకుల భజనకు మాత్రమే పరిమితమైన సాక్షి పత్రిక ప్రజల అవసరాలను, ఆఖాంక్షలను ఎత్తి  చూపడంలోను, ప్రభుత్వ ధ్యేయాన్ని ఆధార సహితంగా వివరించడంలో పూర్తిగా విఫలమైంది. 
2019 ఎన్నికలలో చతికల పడిన టీడీపీ “కిందపడినా తనదే పైచేయి కావాలన్న తపనతో” మిన్ను, మన్ను ఏకం చేస్తూ జగన్ ను అడ్డుకుంటున్నామన్న పేరుతొ  అన్ని రకాల ఎత్తుగడలను ఉపయోగిస్తూ సీమ ప్రయోజనాలకు గండి కొడుతున్నది. 
“అయ్యలారా, రాయలసీమ నేతలారా! మీ ప్రాంతం ఉంటెనే  మీరున్నారు. మీరు ప్రజలు మద్దతు పొందితేనే పార్టీలు మిమ్ములను గుర్తించి టికెట్లు ఇస్తున్నాయి. ఈ  ప్రజలు మద్దతు పలికితేనే  మీరు ఎన్నికలలో గెలిచి నాయకులౌతున్నారు. అలాంటి మీరు మీ ప్రాంత ప్రయోజానాలను వదలి అభివృద్ధి చెందిన ప్రాంతాల  ప్రయోజనాల కోసం పోరాడి మీరు  పుట్టి పెరిగిన ఊరికి ఉరి వేయవద్దని సీమ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు”.  సీమకు జరుగుతున్నఅన్యాయాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు .
            (యనమల నాగిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు, కడప)