ప్రజానాట్యమండలి తొలి తరం కళాకారుడు, ప్రముఖ సంగీత, నేపథ్య గాయకుడు బొడ్డు గోపాలం 16వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు అక్షర నివాళి…
ఆత్మాభిమానం ఆయన్ని సినిమారంగం నుంచి మంగళగిరికి వెనక్కిపంపించింది. ఇదే ఆయన్ని వూరికి ఇంటికి కట్టేసింది.అందుకే ఎంతో మంది స్నేహితులున్నా, ఎంతో నమ్మదగిన సంగీత దర్శకుడయినా గోపాలం సినిమాల్లో ఉండలేకపోయారు. దీనితో సినిమా ఒక మంచి సంగీత దర్శకుని కోల్పోయింది. ఆయన చనిపోయాక చాలా రొజులకు గాని అభిమానులకు తెలియదు. అలా ఒక సంగీత దర్శకుడిజీవితం నిశబ్దం ముగిసింది.
1952లో తానినేని ప్రకాశరావు ‘పెల్లెటూరు’చిత్రం తీస్తున్నారు. దానికి ఘంటసాల సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అపుడు ప్రకాశ రావు దగ్గిర నుంచిపిలుపు వచ్చింది. దానితో ఆయన ఘంటసాల బృందంలో చేరారు. ఘంటసాల దగ్గిర మరొక రెండు సినిమాలకు తోడు దొంగలు, జయసింహాలలో టివి రాజు దగ్గిర సహాయకుడిగా పనిచేశారు. అపుడే నాగభూషణం దేశమంతా ప్రదర్శిస్తున్న ‘రక్తకన్నీరు’సంగీతం సమకూర్చారు. కొన్ని సినిమాలలో పాటలు కూడా పాడారు. బిఎన్ రెడ్డితో ఆయన కు చిత్రమయిన స్నేహం ఉండేది. ఆయన చిత్రాలకు సాలూరు రాజేశ్వరావే సంగీతదర్శకుడిగా ఉండాలనే వారు. అయితే ఆయన ఎపుడొస్తారో తెలియదు. అందువల్ల ఒక స్టాండ్ బై అవసరమని భావించేరు. అలా గోపాలం ‘ రంగుల రాట్నం’, బంగారుపంజరాలలో రాజేశ్వరరావు తో కలసి పని చేశారు.
గోపాలం గురించి ఒక సారి రావి కొండలరావు ఒక సారి ఆసక్తికరమయి విషయాలు చెప్పారు. “గోపాలంగారు సంగీత దర్శకుడిగా, గాయకుడిగా నిలదొక్కకున్నా,చొరవ లేనికారణంగా ఎక్కువ చిత్రాలకు పనిచేయలేకపోయారు. ఎవరినీ అడిగే వారు కాదు,ఎవరైనా అడిగితే కాదనే వారూ కాదు,” అని రావికొండలరావు ఆయన గుర్తు చేసుకుంటూ ఒక చోట రాశారు.
మొత్తంగా పద్నాలుగు చిత్రాలకు గోపాలం పనిచేశారు.ఇందులో మూడింటిలో ఆయన సహసంగీత దర్శకుడు. ఈ రంగుల రాట్నం( 1966) లో ఆయన పాడిన పాట
శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఆయన అల్లురామలింగయ్యకు పాడిన పాట వినండి
గోపాలం గుంటూరు జిల్లా తుళ్లూరులో 1927వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి రామదాసు సంగీతకళాకారుడే కాకుండా హరికథలు కూడా చెప్పేవారు. వారసత్వంగా సంగీతం పట్ల మక్కువతో చిన్నవయస్సులోనే గోపాలం విజయవాడలో ప్రముఖ వయెలిన్ విద్వాంసులు వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్లలో ప్రజానాట్యమండలిలో చేరిన గోపాలం.. కమ్యూనిస్టు యోధుడు వేములపల్లి శ్రీకృష్ణ రాసిన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి గలవోడా’, పులుపుల శివయ్య రాసిన ‘పలనాడు వెలలేని మాగాణిరా’ గేయాలను అద్భుతంగా పాడి నాటి సభలలో ప్రజలను ఉర్రూతలూగించేవారు. ఆకాశవాణిలో పాటలు పాడే సమయంలో గాయని రేణుకతో ఏర్పడిన పరిచయంతో ఆమెను వివాహం చేసుకున్నారు. 1951 చివరలో దర్శకులు తాతినేని ప్రకాశరావు ఆహ్వానం మేరకు మద్రాసు వెళ్లిన గోపాలం మధురగాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు వద్ద సహాయకునిగా చేరారు. పల్లెటూరు, బతుకుదెరువు, పరోపకారం సినిమాలకు పనిచేసిన గోపాలం.. ఘంటసాలతో ఏర్పడిన సాన్నిహిత్యం కడదాకా కొనసాగింది.
సంగీత దర్శకునిగా…
నలదమయంతి, బికారిరాముడు, మునసబుగారి అల్లుడు, రౌడీ రంగడు, పుణ్యభూమి కళ్లు తెరిచింది, పెద్దలు మారాలి, విముక్తి కోసం, స్వాతంత్ర్యం మా జన్మహక్కు, ఒక అమ్మాయి కథ వంటి పలు చిత్రాలకు గోపాలం సంగీత దర్శకత్వం వహించారు. పలు కన్నడ, తమిళ, హిందీ సినిమాలకు, డబ్బింగ్ సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరరావుతో కలిసి రంగులరాట్నం, బంగారు పంజరం, సంగీత దర్శకులు జోసఫ్ తో కలిసి కరుణామయుడు సినిమాలకు సంగీత దర్శక భాగస్వామ్యం వహించారాయన.
ఇవి కూడా చదవండి
తిరుమల పవిత్రతను ఈస్టిండియా కంపెనీ ఎలా కాపాడిందంటే…
తిరుమల వెంకన్న గుడి ఈస్టిండియా కంపెనీ పాలన కిందికి ఎలా వచ్చింది?
రంగుల రాట్నం సినిమాలోని ‘నడిరేయి ఏజాములో స్వామి నిను చేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో’, కరుణామయుడులోని ‘దావీదు తనయా హోసన్నా’, ‘కదిలింది కరుణ రథం’ వంటి పలు పాపులర్ సాంగ్స్ కు చక్కటి బాణీలు అందించారాయన. సంగీత దర్శకత్వంతోపాటు ప్లే బ్యాక్ సింగర్ గా… శోభన్ బాబు, హరనాథ్, చలం, కన్నడ రాజ్ కుమార్, చంద్రమోహన్ తదితరులకు పాటలు పాడారు. అనేక భక్తి గీతాల క్యాసెట్లకు సంగీతం సమకూర్చారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ, కళారంగంలో సేవలందించిన గోపాలం… తన బంధువులు మంగళగిరిలో ఉండడంతో 1995లో మద్రాసు నుంచి ఇక్కడి వచ్చేశారు.
చరమాంకం మంగళగిరిలో…
1995లో మంగళగిరి వచ్చిన గోపాలం.. నిరాడంబర జీవితాన్ని గడిపారు. నిగర్వి, సౌమ్యుడు, చిరునవ్వే ఆభరణంగా ఉండేవారు. స్థానిక వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో సూపరింటెండెంట్ గా పనిచేసిన కళాకారుడు బొడ్డు విద్యాసాగర్ తో అనుబంధం ఉండేది. స్థానిక కళాకారులకు చేదోడుగా ఉండేవారు. ఆయా సంస్థలు నిర్వహించే సభలు, సమావేశాలకు ప్రత్యేకాకర్షణగా నిలిచారు గోపాలం. తన మధురమైన గాత్రంతో కళాకారులు, సంగీత అభిమానులను అలరించిన గోపాలం 2004 సెప్టెంబరు 22న కాలధర్మం చేశారు.
‘కళ కళ కోసం కాదు- కళ ప్రజల కోసం’ అని నినదించిన ప్రజానాట్యమండలి అడుగుజాడల్లో ఆరు దశాబ్దాలపాటు ప్రజోద్యమాల సైదోడుగా నిలిచిన ప్రజాగాయకుడు బి. గోపాలం… చిరస్మరణీయుడు.
మరిన్ని విశేష వార్తలు