(యనమల నాగిరెడ్డి)
“Lies – Lies- Damned lies- statistics” (అపద్దాలు-అపద్దాలు- తీవ్రమైన అపద్దాలు- గణాంకాలు) 14వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లోని ఒక రాజు ప్రజలను మభ్యపెట్టడానికి ఉపయోగించిన రాజకీయ సూత్రం. ప్రస్తుతం దేశ రాజకీయాలలో ఈసూత్రాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ చెప్పిన ఆబద్దం చెప్పకుండా చెప్పి ప్రజలను మభ్యపెట్టగల ఏకైక నాయకుడు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని, రాయలసీమకు అన్ని రంగాలలో తీవ్ర ద్రోహం చేసింది ఆయనే” అని రాయలసీమ కార్మిక కర్షక సమితి. అద్ధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి,ఉపాధ్యక్షుడు రమణయ్య, ప్రధాన కార్యదర్శి వై.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.
ఇటీవల చంద్రబాబు రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తన హయాంలోనే రాయలసీమను అభివృద్ధి చేశామని, అనేక సంస్థలను స్థాపించామని, సీమ ప్రాజెక్టులకు నీళ్లిచ్చామని చెప్పడం సీమ ప్రజలు తమ జీవిత కాలంలో విన్న అత్యంత హీనమైన పచ్చి అపద్దమని వారు ఆరోపించారు. బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ రాయలసీమకు కనీసం వరద నీళ్లు కూడా కేటాయించే అవకాశం లేక పోవడానికి చంద్రబాబు పాలనే కారణమనేది పచ్చి నిజమన్నారు.
రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసింది దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్.టి. రామారావు అయితే ఆ ఆలోచనను పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నించింది కీర్తిశేషులు ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి మాత్రమేనాని వారు గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 1995-2004, 2014-2019 కాలంలో రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా సమాధి కట్టింది చంద్రబాబే అన్నది జగమెరిగిన సత్యం. అయినా చంద్రబాబు వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేయడంతో పాటు ఇంకా దారుణమైన అపద్దాలు చెప్పి జనాన్ని మోసం చేయాలనుకోవడం దారుణమని వారు తీవ్రంగా విమర్శించారు.
సీమ ప్రాజెక్టులకు ఊపిరి పోసింది ఎన్టీఆర్ – పరుగులు పెట్టించింది వైస్సార్
రాయలసీమలో నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాగా ఆ తర్వాత వీటి నిర్మాణాన్ని పరుగులు పెట్టించింది దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ మాత్రమే. ఈ మధ్యకాలంలో చంద్రబాబుతో సహా రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులెవరు పట్టించుకోలేదని వారు గుర్తు చేశారు.
1985లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మద్రాస్ కు తాగునీటిని సరఫరా చేయడానికి “తెలుగుగంగకు” పునాదిరాయి వేసి,ఈ నీటిని కాల్వల ద్వారా సరఫరా చేస్తే సీమలో కొంత ప్రాంతానికైనా సాగునీరు ఇవ్వవచ్చునని భావించి ఆ మేరకు నిర్ణయించారు. అయితే సీమ కనీస నీటి అవసరాలు తీర్చకుండా ఇతర ప్రాంతాలకు నీళ్లివ్వడం అన్యాయమని మేధావులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు “1985 నుండి 1989 వరకు పెద్ద ఎత్తున బందులు, రాస్తారోకోలు, పాదయాత్రలు, సీమ ప్రజా ప్రతినిధుల ఆమరణ దీక్షలు” నిర్వహించారని వారు గుర్తుచేశారు. ఈ ఉద్యమాల సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులలో బాషా అనే యువకుడు మరణించడం, పెద్ద ఎత్తున ఉద్యమకారులను అరెస్టు చేయడం జరిగింది. ఈ ఉద్యమం పట్ల, జరిగిన సంఘటనల పట్ల స్పందించిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగు గంగతో పాటు “గాలేరు-నగిరి, హంద్రీ-నీవా, వెలిగొండ” పథకాలను యుద్ధ ప్రాతిపదికన సర్వ్ చేయించి శంఖుస్థాపనలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల సాధన సీమ కాంగ్రెస్ నాయకుల కృషి ఫలితమే నని చెప్పకతప్పదన్నారు.
వైస్సార్ హయాంలో పరుగులు తీసిన ప్రాజెక్టులు
ఇకపోతే సీమ నీటి ప్రాజెక్టులను శరవేగంతో పూర్తి చేయడానికి కృషి చేసింది ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి. 2004లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి తన హయాంలో సీమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. అనేక రకాల విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నా ఆయన సీమతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో నీటి ప్రాజెక్టులపై ద్రుష్టి పెట్టి పనులు చేయించారు. “ఆంధ్రుల జీవనాడిగా, తనకు ఒక కన్నుగా చంద్రబాబు పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టుకు సాంకేతిక, ఆర్థిక, జలసంఘం,పాలనా పరమైన అన్నిఅనుమతులు సాధించింది వైస్సారేనని ఆ ప్రాంత రైతులు, అధికారులు ఢంఖా భజాయించి చెపుతున్నారని” వారు గుర్తు చేశారు. ఆయన సీమ ప్రాజెక్టులు సుమారు 70 నుండి 90 శాతం మేరకు పూర్తి చేసినా, 2009లో ఆయన అకాల మరణం తర్వాత గద్దెనెక్కిన ముఖ్యమంత్రులు పట్టించుకోక పోవడంతో అవన్నీ మరోసారి ఎక్కడ వేసిన గొంగడి చందంగా మిగిలాయి.
సీమ ద్రోహి చంద్రబాబే!
లక్ష్మీపార్వతిని బూచిగా చూపి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను కుట్రపూరితంగా ( ప్రచార సాధనాల సంపూర్ణ సహకారంతో) దిగదోసి చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1995 -2004 మధ్య 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన అమెరికా అధ్యక్షుడి లాంటి ప్రముఖుల పర్యటనల పైనా, హైదరాబాదు అభివృద్ధిపైనే ద్రుష్టి కేంద్రీకరించారు. “వ్యవసాయం దండగ” అని నిర్థారించుకున్న చంద్రబాబు ఎన్టీఆర్ సీమలో ప్రారంభించిన తెలుగుగంగ, గాలేరు-నగిరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించి, 9 సంవత్సరాలకు కేవలం 990 కోట్లు (సిబ్బంది జీత బత్యాలకు తగినంత) మాత్రమే కేటాయించారు. ఇదే సీమపై ఆయనకున్న కపట ప్రేమకు తార్కాణం.
క్రిష్ణా జలాల పంపిణీ కోసం ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ ముందు రాయలసీమ కరువును చూపించి అధికంగా నీళ్లు, మిగులు జలాలు వాడుకునే హక్కు సాధించిన రాష్ట్ర ప్రభుత్వం సీమ అవసరాలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కానీ బచావత్ తీర్పు2000 సంవత్సరానికి పునః సమీక్షకు వచ్చే నాటికి రాయలసీమలో మిగులు జలాల ఆధారంగా శంఖుస్తాపనలు చేసుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా బాధ్యతారహితంగా చంద్రబాబు వ్యవహరించారని, అందువల్ల రాయలసీమ ప్రాజెక్టులు బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్ధంగా నీళ్లు పొందే అవకాశం కోల్పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమలో మిగులు నీటిపై ఆధారపడి చేపట్టిన ఈ నాలుగు ప్రాజెక్టులను చంద్రబాబు తన హయాంలో పూర్తి చేసి ఉంటె 2000 సంవత్సరంలో క్రిష్ట్న నీటి పంపిణీ కోసం ఏర్పాటైన బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ 90 శాతం పూర్తైన తెలుగుగంగకు వరద జలాలలో 25 టీఎంసీ లు కేటాయించిన విధంగా మిగిలిన ప్రాజెక్టులకు కూడా కొంతైనా నీటి కేటాయింపులు జరిగి ఉండేవని అభిప్రాయ పడ్డారు.
రాయలసీమ, తెలంగాణాలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో శాశ్వత కరువు నివారణ కోసం వైస్సార్ చేపట్టిన “దుమ్ముగూడెం -నాగార్జునసాగర్ టైల్ పాండ్” గురించి విభజనకు ముందు ప్రతిపక్షనేతగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నోరు విప్పనే లేదు. తనకున్న రెండు కళ్ళను అమరావతి, పోలవరంపై నిలిపి రాయలసీమను మూడో కంటితో నాశనం చేశారు. రాష్ట్రపతి ఆరు సూత్రాల పధకాన్ని పక్కకు నెట్టి మెడికల్ సీట్లలో సీమ విద్యార్థులకు చేసిన అన్యాయం అందరికీ గుర్తుంది. ఇలాంటివి ఇంకెన్నో?
రాయలసీమ ప్రజల మద్దతుతో రాష్ట్ర, దేశ రాజకీయాలలో చక్రం తిప్పిన చంద్రబాబు రాయలసీమ నీటి పథకాలపై చూపిన నిర్లక్ష్యం, సీమకు చేసిన ఇతర ద్రోహాలు చెప్పుకుంటూ పొతే అవి కొండవీటి చేంతాడుకు మించి పోతాయి. తన పాలనలో సీమను అన్ని విధాలా దెబ్బ తీసిన చంద్రబాబు టీడీపీ హయాంలో సీమను అభివృద్ధి చేశామని చెప్పడం హాస్యాస్పదం. ఇకనైనా ఆయన ఇలాంటి అపద్దాలు చెప్పడం మానుకొని కరువు సీమను నిజంగా అభివృద్ధి చేయడానికి అడ్డుపడకుండా ప్రతిపక్షనేతగా కృషి చేయాలని వారు చంద్రబాబుకు విజ్నప్తి చేసారూ. అలాగే రాయలసీమ విషయంలో ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రకటనలలో వాస్తావాలను మాత్రమే ప్రచురించి ప్రజలను కాపాడాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాము.
(యనమల నాగిరెడ్డి సీనియర్ జర్నలిస్టు కడప)