ఉ.సా తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రచారంలో ఉన్న మాట. ఈ రెండు అక్షరాల మాట ఓ సంచలనం. సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళకు సుపరిచితం. ఉ.సా. పీడిత ప్రజల కోసం ఉదయించిన సూర్యుడు. బహుజన ఉద్యమ సారథి. బహుజన రాజ్యాధికారమే ఆయన ఊపిరి. దేశీదిశ ఆయన నిర్దేశం.
రాజీలేని పోరు ఆయన ఊరు. ఉద్యమాల ఉపాధ్యాడు అయన పేరు. ఉ.సా పూర్తీ పేరు ఉప్పుమావులూరి సాంబశివరావు. కాదు కాదు ప్రజా ఉద్యమాల సాంబశివరావు.
పంతం ఆయన సొంతం. పట్టుదలే ఆయన పెట్టుబడి. అలుపెరగని పోరాట యోధుడు. అంతు తేలేవరకు మడమ తిప్పని ధీరుడు. విజయం సాధించేవరకు పోరు సలిపే వీరుడు. ప్రలోభాలకు, బెదిరింపులకు తలోగ్గని అజేయుడు. బహుజన శ్రామిక సిద్ధాంత కర్త.
‘సిద్ధాంతం-ఆచరణ, ఆచరణే-సిద్ధాంతం’ ఆయువుగా బతికినా అసాధ్యుడు. కుల వర్గ జమిలి పోరాటాల రూప శిల్పి.అన్యాయం ఏ రూపంల ఉన్నా ప్రశ్నించుడు ఆయన నైజం. న్యాయం పక్షాన నిలబడి చట్ట పరిదిల దోషులకు శిక్ష పడేవరకూ విశ్రమించని యోధుడు. సాహసం ఆయన సొంతం. నిరంతర సమరం ఆయన ప్రత్యేకం. ఉన్ననతమైన వ్యక్తిత్వం.బహుముఖ ప్రజ్ఞాశీలి. కవి, కళాకారుడు, మేధావి, వ్యూకర్త. రాజకీయ దురందరుడు. సమ సమాజాన్ని స్వప్నిచి, బాటలు వేసిన అపర విశ్వమిత్రుడు. శోకం లేని లోకం కావాలని కలలు కన్నడు. ఆధునిక అపర కాలజ్ఞాని ఊసా. కరోనా కబలిస్తుందని తెలిసీనా కడవరకు బహుజనుల పక్షాన ఉ.సా. నిలబడ్డడు.
బహుజనుల కోసమే జీవించిండు. బహుజనుల కోసమే జీవి విడిచిండు. బహుజనులకు బాట చూపిన ఉద్యమ శిఖరం. అందుకే ఉ.సా.కు ఉ.సా నే ప్రతీక. మరెవ్వరూ కాదు పోలిక.
ఉ.సా నమ్మిన సిద్ధాంతాన్ని అక్షరాల ఆచరించిండు. చివరి శ్వాస వరకూ కృషి చేసిండు. ఆయనకు ప్రాణం తృణప్రాయం. కర్రోన కబలిస్తుందని తెలిసీ ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేసిండు. అయన త్యాగం ఉన్నతమైంది. ప్రాణత్యాగం మహోన్నతమైంది. ఉసా భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ ఆలోచనా విధానం కులవర్గ నిర్మూలన కోసం నిరంతరం పనిచేస్తుంది. కాలం చాలా గొప్పది. తప్పక విజయం సాధిస్తుంది.
ప్రజాస్వామిక విలువల పరిరక్షణ, సామాజిక తెలంగాణ, ఆంధ్ర సాధన ఊసా ఆశయం. తన జీవితమంతా తనప్రజల కోసం తపించిండు. రేయింబవళ్ళు పోరుబాటల పయనిచిండు. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం కంకణ బద్దుడైండు. ప్రజల విముక్తే ఊసాకు ప్రాణప్రదం. ప్రజల కష్టాలకు నిచ్చనమెట్ల కులవర్గ విభజన సమాజమే కారణమని భావించిండు. దాన్ని కూకటివేళ్ళతో పెకిలించాలన్నడు. శోకం లేని లోకం కావాలని కలలు కన్నడు.
ఆధునిక అపర కాలజ్ఞాని ఊసా. కులవర్గ చైతన్యంతో సమాజాన్ని విశ్లేషించే కొత్తవరవడి అలవడింది. కుల, వర్గ పోరునూ ప్రజాస్వామ్య తీరునూ ఎంచుకున్నడు. మురళీధర్ రావు కమీషన్, మండల్ కమీషన్ రిజర్వేషన్ల ఉద్యమాలు, కారంచేడు,చుండూర్, ఉద్యమాలు, బహుజన అస్థిత్వ ఉద్యమాలు ఊసా ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసినై. కులవర్గ చైతన్యంతో సమాజాన్ని విశ్లేషించే కొత్తవరవడి అలవడింది.
ఎర్రజెండా వెలిసి పోతున్న సమయాన నీలిరంగు పులిమి ఆకాశాన ఎగిరేసే వీరుడు అయ్యిండు. మార్క్సిజం, ఫూలే అంబేద్కరిజంతో ఆంధ్రప్రదేశ్ ల అస్థిత్వ పోరాటాలకు పూనుకున్నడు. జమిలి పోరాటమే బహుజనుల విముక్తి మార్గమని తీర్మానించుకున్నడు.
మార్క్స్ తో పాటు, గౌతమ బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సిద్ధాంతాలను, ఆలోచనా విధానాలను అవపోసన పట్టిండు. సునిశితంగా అధ్యయనం చేసిండు. నరనరాన జీర్నించుకున్నడు. మార్క్సిజాన్ని, బ్రాహ్మణీయ మనువాద కులవ్యవస్థను ఆకళింపు చేసుకున్నడు. 1936లనే అంబేద్కర్ లేవనెత్తిన కులవ్యవస్థపై ‘ఇండియాల ఏం చేయాలి?’ అనే ప్రశ్నకు అగ్రకుల నాయకత్వంల ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు సమాధానం చెప్పలేదు.
అంబేద్కర్ ప్రభావంతో మహారాష్ట్రలో 1970 దళిత పాంథర్ ఉద్యమం ప్రాంభమైంది. బుద్దుని “బహుజన హితాయ, బహుజన సుఖాయ’ చారిత్రక వారసత్వంగా స్వీకరించిన ఫూలే-అంబేద్కర్ ఆలోచనా విధానం, కాన్షీరాం కార్యాచరణ ప్రాముఖ్యం పెరిగింది. దేశవ్యాప్తంగా ఎందర్నో ఆకర్షించింది. దాంతో ప్రభావితం అయిన వాళ్ళల్ల ఉ.సా ఒకరు.
ఉ.సా జీవితం నల్లేరు మీద నడక కాదు. బాల్యం నుంచే ఎన్నో ఆటుపోట్లను చవి చూసిండు. విద్యార్ధి దశల నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నడు. ఆశయమే ఆయుధంగా పోరాటాన్ని ఎంచుకున్నడు. ఎమర్జేన్సిల రెండేండ్ల జైలు జీవితం ఎన్నో ఉద్యమ పాఠాలు నేర్పింది.
ఆలోచనలకు పదును పెట్టిండు. తలపండిన ఉద్యమ నేతల సహచర్యం మార్గదర్శనం చేసింది. తనను తాను కవిగా, కళాకారుడిగా, రచయితగా మలుచుకున్నడు. తన మదిల మెదిలే ప్రశ్నలకు కమ్యూనిష్టు పార్టీల జవాబులు దొరుకుతయిని ఆశపడ్డడు. 1985 కారంచేడు సంఘటనతో కమ్యూనిష్టులు ‘కమ్మ’నిష్టులని ఉ.సాకి తేలిపోయింది. సొంత పార్టీ UCCRI(ML) కారంచేడుల “హరిజనులపై భూస్వాముల దాడి” అని ప్రకటన ఇచ్చింది. దాడి చేసిన భూస్వాముల కులం దాచి, బాధితుల కులం బహిర్గతం చేయడంల మర్మం ఏమిటని పార్టీ నాయకత్వాన్ని ఉసా నిలదీసిండు. తను నాయకత్వం వహిస్తున్న తెలంగాణ రీజినల్ కమిటీ తరపున “కారంచేడు దళితులపై కమ్మ భూస్వాముల దాడిని ఖండిచండి” కరపత్రం వేసి ప్రచారం చేసిండు. పేదల పక్షాన పోరాడుతున్నామని చెప్పే కమ్యూనిష్టు నాయకుల అగ్రకులతత్వాన్ని బోనుల నిలబెట్టిండు.
అయిదు దశాబ్దాల ఉద్యమ జీవితంల ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్నడు. కష్టనష్టాలు అనుభవించిండు. అన్యాయానికి పాల్పడితే ఎంతటివారినైనా నిలదీసిండు. నిగ్గతీసిండు. తరతమ భేదం లేకుండా ఎదిరించిండు. స్వపక్షంల విపక్షం అయిండు. అనేక సంఘర్షణలకు కేంద్ర బింధువు అయిండు. విలక్షణ వ్యక్తిగా రూపు దిద్దుకున్నడు. తన మదిల మెదిలే ప్రశ్నలకు కమ్యూనిష్టు పార్టీల జవాబులు దొరుకుతయిని ఆశపడ్డడు. కానీ అనతి కాలంలనే ఆ భ్రమల నుంచి బయటపడ్డడు. 1985 కారంచేడు సంఘటన ఉ.సా ఉద్యమ జీవితాన్ని మలుపు తిప్పింది.
ఫూలే అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకు వచ్చిన బహుజన సిద్దాంత చర్చకు “ఎదురీత”ను ఎంచుకున్నడు. సంపాదక బాధ్యతలను భుజాన వేసుకున్నడు. అదో చారిత్రక అవసరమని భావించిండు. 1995 వరకు వెలువడిన “ఎదురీత” పత్రికల వచ్చిన తాత్విక, రాజకీయ చర్చ మొత్తం మారుతున్న దేశరాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబించింది.
ఆ కాలంలోనే బొజ్జా తారకం సంపాదకత్వంలో వచ్చిన “నలుపు” పత్రిక, కేజి సత్యమూర్తి సంపాదకత్వంలో వెలువడిన “ఏకలవ్య”, దరకమే నిర్వహించిన “గబ్బిలం” పత్రికలు కులాధిపత్యనికి వ్యతిరేకంగా చర్చా వేదికలైనై. ప్రొఫెసర్ కంచ ఐలయ్య, బొజ్జా తారకం, కత్తి పద్మారావు, కేజి సత్యమూర్తి మరెందరో మేధావులతో, సిద్ధాంతకర్తలతో సమఉజ్జీ అయిన ఉసా(ఉ. సాంబశివరావు), ఎన్నో ప్రశ్నలు లేవనెత్తిండు. చర్చలు, విశ్లేషణలు చేసిండు. అవి మరెంతో మంది మేధావులను, ఉద్యమకారులను ఆలోచింపజేసినై.
ముఖ్యంగా మారోజు వీరన్న ఉసా ప్రభావం ప్రబలంగా పడింది. వీరన్నకు మేధోపరమైన సలహాలు, సహకారం అందించిన వాళ్ళలో ఉసా అగ్రగణ్యుడు. మారోజు వీరన్న నాయకత్వంల 1998 డిసెంబర్ 25న ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ(బహుజన శ్రామిక విముక్తి)గా ఆవిర్భవించింది. ‘ఇండియాల ఏం చేయాలి?’ అనే సిద్ధాంత గ్రంథాన్ని రాసి అందించిండు ఉసా.
దాంతో మారోజు వీరన్న మార్క్సిజం, ఫూలే అంబేద్కరిజంతో అస్తిత్వ పోరాటాలకు శ్రీకారం చుట్టిండు. కులచైతన్యంతో హక్కుల పోరాటాలు మొదలు పెట్టిండు. మాదిగల ‘దండోర’, గొల్లకురుమల ‘దోలుదెబ్బ’, రజకుల ‘చాకిరేవు దెబ్బ’, లంబాడీల ‘నంగారా భేరి’, గౌండ్ల ‘మోకుదెబ్బ’, మాలల ‘గుతుప దెబ్బ’, ఎరుకల ‘కుర్రు’, ఆదివాసిల ‘తుడుం దెబ్బ’, తదితర బహుజన కులాలు నూతన చైతన్యంతో ప్రజాస్వామ్య హక్కుల సాధనా సంఘాలు ఏర్పాటు చేసిండు. అతిమంగా బహుజన రాజ్యాధికారం వైపు పోరాటాలు ఎక్కుపెట్టిండు వీరన్న. అస్తిత్వ పోరాటాలతోనే ఆగిపోలేదు. వీరన్న తెలంగాణ ఉద్యమానికీ ఉపిర్లు పోసిండు. కొత్త నాయకత్వాన్ని అందించిండు. తన మాటలతో జనాలను ఆలోచింప చేసిండు. పాటలతో మేలుకొల్పిండు. చేతలతో కదిలించిండు. శత్రువుపై గురిచూసి మాటల ఈటెలు విసిరిండు. వీరన్న అగ్రకులవర్గ పునాదులను, ఆంధ్రవలసవాద దోపిడిని కుదిపేసిండు. అది ఉసా నెరపిన శిష్యరికమే.
తను నమ్మిన కులవర్గ సిద్ధాంతం మీద ఉసాకు దృఢ విశ్వాసం. సడలని పట్టు. మొక్కవోని ధైర్యం. మొహమాటం అసలే లేదు. స్పష్టమైన వైఖరి. కటువైన, బలమైన వ్యక్తీకరణ ఆయన సొంతం. స్వేచ్చా ప్రియుడు. విప్లవకారుడు నిర్బంధాన్ని సహించడు. త్యాగాలు చేయలేక కాదు. శత్రువుకు భయపడీ కాదు. ప్రజల మధ్య ఉండి, ప్రజా ఉద్యమాలకు చేరువగా ఉండాలనుకున్నడు. బహుజన శ్రామిక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలనే బహిరంగ జీవితాన్ని కోరుకున్నడు. సామాన్య ప్రజలంటే అమితమైన ప్రేమ. ఆ ప్రజలకోసం రేయింబవళ్ళు పోరు బాటల పయనిచిండు. తన జీవితాన్ని సార్థకం చేసుకున్నడు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. అమరుల ఆశయం తెలంగాణల బహుజన రాజ్యం. సమసమాజ స్థాపన. సామజిక తెలంగాణ ఉద్యమంతోనే అది సాధ్యం. తెలంగాణ అమర వీరులందరికీ నిజమైన నివాళి. భౌగోళిక తెలంగాణ వచ్చింది. కానీ దొరల పాలైంది. దుర్మార్గపు గడీల పాలన పునరావృతం అయింది. అంబేద్కర్ అన్నట్టు చిన్న రాష్ట్రాలల్ల అభివృద్ధి ఫలాలు అందరికి అందుతాయని, బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని చాలామంది నమ్మిండ్లు. కానీ ఉసా మాత్రం నమ్మలేదు. సామజిక ఆంద్ర, సామజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా బహుళ, బహుజన ఉద్యమాలకు పురుడు పోసిండు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజన రాజ్యస్థాపనే లక్ష్యంగా మహాజన పార్టీ నెలకొల్పిండు. దాంతో తెలంగాణల అణగారిన వర్గాలల్ల కొత్త ఆశలు చిగురించినై. అయితే తెలంగాణాల రాష్రంల అగ్రకుల దురాహంకారం అనేక రూపాల్ల బసులు కొట్టింది. అనేక సంఘటనల్ల దళితులు బలి అయినారు. బాదితులకు న్యాయం జరిగే వరకు, బాధ్యులకు శిక్ష పడేవరకూ అలుపు ఎరగని పోరు చేసిండు.
రెండు తెలుగు రాష్ట్రాల్ల సామాజిక తెలంగాణ, సామజిక ఆంద్ర తిరుగుబాటు జెండాలు ఎగురుతున్నై. సామజిక న్యాయమే సమన్యాయం అని ఉసా నమ్మిండు. తన జీవితమంతా తన ప్రజలకోసం రేయింబవళ్ళు పోరు బాటల పయనిచిండు. చివరి శ్వాస వరకు చిరునవ్వే చిరునామాగా జీవించిండు. ధైర్యాన్ని దరహాసంగా ప్రదర్శించిండు. మహా యోధుడు ఉసా. అమరత్వం రమణీయం. కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని ప్రసవిస్తుంది. ఉసా కోరుకున్న సమసమాజాన్ని ప్రసాదిస్తుంది. సామజిక తెలంగాణాను, సామజిక ఆంద్రను సాధిస్తుంది. జ్ఞాపకాలు పదునెక్కిన ఆయుధాలు కావలి. ఉసా తలుసుకొని తరించి పోవద్దు. దండేసి దండం పెట్టి పరవశించి పోవద్దు. ఉసాపేరు చెప్పుకుంటూ పొట్ట పోసుకోవద్దు. ఉసా ఆశయ సిద్ది కోసం పోరాడాలే.సమసమాజ నిర్మాణ కోసం ఉసా లాగా పోరుచేయాలె. లేకపొతే మనం దొరల తెలంగాణల బానిసల్లగా బతుకుడే. బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్ర భ్రమల కొట్టుక పోవుడే. మరి జనాభా లేక్కలకే పనికొస్తం. గట్లయితే హో-చి-మిన్ అన్నట్టు “బానిసత్వం కన్నా చావే మేలు”. అందుకే వీరుల స్పూర్తిగా ఈ రోజే పోరుజెండాలు పడుదాం. దొరలను పొర్లు దండాలు పెట్టిద్దాం. “ఉన్నత ఆశయం కోసం ఊపిర్లు కోల్పోయిన శరీరం శవం కాదు, శత్రువు పాలిట మృత్యు శాసనం అని నిరూపిద్దాం. ఉసా ‘అమర్ రహే’ అని నినదిద్దాం. ఉసా ఆశయాలు సాధించినప్పుడే ఆయనంకు నిజమైన నివాళి.
(*ప్రొఫెసర్. ప్రభంజన్ యాదవ్, ఐఐఎస్. చైర్మన్ సామాజిక తెలంగాణ సాధన సమితి )